కరోనాపై కదనం - ఏప్రిల్‌, 27 పోటీ ఫలితాలు

  • 1677 Views
  • 22Likes
  • Like
  • Article Share

ప్రథమ బహుమతి
రైతును బతికించండి!
ఆకలికి అన్నమవడం తప్ప
అన్యాయం, అబద్ధం చేతగానివాళ్లం
సాగుబడిని కళ్లాల్లోంచి ఆకొన్న నోళ్లలోకి
నేరుగా సాగనంపలేని నాగేటిసాళ్లం
ఆరుగాలం కష్టాన్ని అయిదుకి కొన్నవాడు
అరగంటలో పదికమ్మి పందికొక్కవుతూంటే
గిట్టుబాటు ధర కోసం గీపెట్టి అరచేవాళ్లం
అరచీ... అరచీ పిడచకట్టిన నోళ్లం
మాయదారి పురుగేదో ఇప్పుడు
మనుషుల్ని పంజరంలో బంధించింది
చెట్టూ చేమను ఆప్యాయంగా తడిమే చేతులు
నీళ్లతో కడిగి కడిగి వేళ్లకు మొలకలొస్తున్నాయి
నిత్యం పచ్చదనాన్ని ఆస్వాదించే చూపులు
గడియారం ముళ్లను నెట్టలేక అలసిపోతున్నాయి
మూగ జీవాలను ప్రేమగా పిలిచే పిలుపులు
మూతికి బట్ట కట్టుకొని మూగబోయినాయి
ధరలేక నేలపాలవుతున్న కూరగాయలు
మనసును కోసిన మాయని గాయాలు
ఎండకు అలవాటైన కష్టం నీడ ఇష్టం లేదంటోంది
మసలకుండా కూర్చుంటే మనిషికే కాదు
మనసుకూ చెదలు పట్టేటట్టుంది
కాలు ఆగిపోయి కాలమాగినట్లయి
బతుకు ఆగమైపోతుందనే భయం
భయం గుప్పిట్లో చీకటి ముసిరిన ప్రపంచం
చీకటి భయం వేకువ రేకలు విచ్చేవరకే
పురుగు భయం మందో మాకో వచ్చేవరకే
గుప్పిట విప్పగానే బతుకు బట్ట కట్టడానికి
గుప్పెడు గింజలమై పట్టెడన్నం పెట్టడానికి
తొలకరికి పరవశించి పులకరిస్తాం
చేను చెల్కను ఎప్పటిలా పలకరిస్తాం
పురుగు పుట్రను దాటుకుంటూ పులి పొదలో తలపెట్టి
సాలు సాలును తడిపే స్వేదమవుతాం
అలకబూనని అమ్మలమవుతాం
కమ్మని అన్నం ముద్దలమవుతాం
పంజరం తెరిచాక యుద్ధం గెలిచాక
పశ్చాత్తాపంతో ప్రపంచం మారిపోతుందంటున్నారు
ఇకనైనా రైతు బతుక్కి భరోసా ఇవ్వండి!
ఉరి పోసుకుంటున్న జాతికి ఊపిరి పోయండి!
- దాసరి వెంకటరమణ, హైదరాబాదు 9000572573
ఈ కవితను వినాలనుకుంటే...


ద్వితీయ బహుమతి
టార్చిలైట్‌
ఎంత ఫ్రెండ్లీ అన్నా ఎందుకోగానీ 
ఎవరమూ ఏనాడూ కనెక్ట్‌ కాలేకపోయాం 
పక్క పక్కనే ఉన్నా 
కనిపించని నాలుగో సింహాన్ని చూసి 
కారణం లేకున్నా కలలోనూ భయపడ్డాం 
నాయకుడు గెలిచినా 
వినాయకుడు ఊరేగినా, పీర్లు లేచినా 
పాత నగరంలో కర్ఫ్యూ 
టాంక్‌బండ్‌ మీద బందోబస్తయినా 
అంతటా నువ్వే కనిపిస్తావ్‌ 
అర్ధరాత్రయినా, అపరాత్రయినా 
వృత్తి నిర్వహణలో నిలిచి ఉంటావు 
సినిమాలకి వెళ్తున్నప్పుడో 
భార్యతో షికారుకు వెళ్లినప్పుడో 
నిన్ను నిత్యం చూస్తున్నా 
ఎందుకో తెలియదుగానీ
కనెక్ట్‌ కాలేకపోయాం... 
రోజూ ఏదో సందర్భంలో
ఎదురెదురుగా తారసపడ్డా 
ఎందుకో మనసువిప్పి 
మాట్లాడుకోలేకపోతాం 
కారణాలు ఎన్నయినా కావచ్చు 
కనెక్ట్‌ కాలేకపోతున్నాం 
అప్పటిదాకా 
మా కళ్లముందే ఉండి 
తెల్లారకముందే అమరుడవై 
పత్రికల్లో పతాక శీర్షికైనప్పుడు 
రెండు కన్నీటిబొట్లు విడిచాం 
నాలుగు మాటలు మాట్లాడుకున్నాం 
ఎందుకో తెలియదుగానీ
కనెక్ట్‌ కాలేకపోయాం... 
కరోనా కాలం నీ గస్తీ కష్టాల్ని 
కళ్లకు కట్టినట్టు చూపిస్తుంటే
కఠినంగా కనిపించే 
నీ పట్ల సహానుభూతి ఉన్నా 
ఇప్పుడు కూడా ఎందుకో 
దగ్గర కాలేకపోతున్నాం 
ప్రపంచమంతా ముసుగుతన్ని 
నిద్రపోతున్న క్షణాన 
నువ్వు ఒంటరి యుద్ధం చేస్తూ 
మమ్మల్ని మా క్షేమం కోసం 
గడపదాటకుండా ఉండేందుకు 
రోడ్డు మీద టార్చిలైటై..
కాపలా కాస్తున్నావు 
మరణం వైశ్విక భాషై 
నినదిస్తున్న గడ్డుకాలంలోనూ 
నువ్వు పహారా గీతమైనావు 
అన్నీ తెలిసి కూడా 
ఏమాత్రం ఓపిక పట్టలేకున్నాం 
ఇప్పుడు కూడా 
కనెక్ట్‌ కాలేకపోయాం... 
- డా।। పత్తిపాక మోహన్, సిరిసిల్ల, 9966229548
ఈ కవితను వినాలనుకుంటే...


తృతీయ బహుమతి
మనసు ఆవరణలోకెళ్లు
నిన్ను ఏ అచ్చుల్లోకో పోనీయకు
ఏ మందల్లోకో తోలనీయకు
ఇంటిపట్టున ఉండేందుకు నిన్ను నువ్వే మళ్లించుకోవాలి
కనిపించని జీవి కోసం పోరాడమనో ఉద్బోధించమనో
గతి తప్పిన ఆర్థిక సూత్రాలను గర్హించమనో
రెక్కలపైన చైతన్యాన్ని మోసుకురమ్మని గాలికి చెప్పమనో
ఎదలను కొట్టుకుంటూ నేలకొరిగే ఆ అసహాయతలని.. 
అంగలార్పులను అక్కున చేర్చుకోమనో
గాయపడిన భావాల కోసం
నిన్నే గేయంగా చేసుకోమనో
చేయిచాచి అడిగిన చేతుల్లోకి
నిన్నే దానంగా చేసుకోమనో
నిన్నడిగేదెవరు..?
నీ హృది లోగిలంతా వెతుక్కో
జాలి జాడలున్నాయేమో
ఆ పొరలంతా తవ్వి చూసుకో.. గుండె తడుందేమో
ఐసోలేట్‌ అయ్యి.. క్వారంటైన్‌లో చిక్కుకున్న
దేహాలను చూడు
నువ్వూ ఓ కారణం కాదంటావా..?
సామాజిక బాధ్యత లేనప్పుడు
సాటి మనిషికి నువ్వు లేనప్పుడు
నువ్వు మనిషినని ఎలా చెప్పుకోగలవు..?
మనిషితనం అసలు రుంగును
నీ చేతల అద్దమే చూపుతుంది కదా
అలమటించే ఆకలి డొక్కల కోసం
ఎగసిపడమని నీకొకరు చెప్పాలా
ఎవరి గాయాలనైనా తడిమినప్పుడో
మనిషితనపు ఆనవాళ్లు నీలోనూ మిణుకుమంటాయ్‌
బాధలు ముంచెత్తిన ప్రతిసారీ
మనసు వెక్కిళ్లు పెడుతుందేమో.. పెట్టనీ
నిన్ను నువ్వు బాగుచేసుకోవాలంటే
నీ డొల్ల భావాలపై విరుచుకుపడటం నేర్చుకోవాలి కదా
కలలోనైనా గెలుపు గుర్రాన్నెక్కు
మెలకువలో అది నిన్ను వెంటాడొచ్చు
నువ్వే ఒక ఆశ.. ఆశయాల పరిణామమై
ఒక గెలుపు గీతంగా మలచబడితే
ఎన్నిసార్లు పడగొట్టబడినా.. తిరిగి లేస్తావు
కరోనాను మట్టుబెట్టేందుకు
గురి గెలిపిస్తూనే ఉంటుంది
చెదరిన ప్రతిసారీ నిలబెడుతూనే ఉంటుంది
అందుకే నీ మనసు ఆవరణంలోకి
మళ్లీ మళ్లీ వెళ్లు
మొక్కవోని ధైర్యాన్ని తెచ్చుకుందుకు
- దారల విజయ కుమారి, తిరుపతి, 9177192275
ఈ కవితను వినాలనుకుంటే...


ప్రోత్సాహక బహుమతి (1)
వలస పాదాలు
ఆ పాదాలు జల్లెడలా తూట్లుపడ్డాయి
కాస్త వెలుగును తెచ్చి రాయండి
దుఃఖనదిని దాటుతున్న 
వాళ్లకో పడవై ఎదురెళ్లండి
సముద్రమంత గాయమైన చోట
పిల్లవాగంత పసరైనా పూయండి
నీ ఇంటికి పునాదయ్యి
నీ తోటకు పువ్వులయ్యి
నీ గేటుకు రక్షణయ్యి
బతుకు పోరులో వలసొచ్చి
కరోనా వలలో చిక్కి
చిట్లిన పాదాలు
గతంలో వెనకబడ్డవి
వర్తమానంలో వెనకబడ్డవి
భవిష్యత్తు అంధకారమైనవి
వెన్నెముక విరిగిన
ఆ పాదాలనిప్పుడు
భుజాలమీదికెత్తుకొని
నడిపించాలి
ఊపిరాడకుండా అయిన
ఆ పాదాలకిప్పుడు
ప్రాణవాయువై
తోడు నిలవాలి
జర యాదిల బెట్టు
నీ పాదాల ఉనికి
ఆ పాదాలదే
జర సోచాయించు
అడుగు ముందుకు పడేది
పాదం ఉంటేనే
- తండ హరీష్‌ గౌడ్, గూడూరు, 8978439551


ప్రోత్సాహక బహుమతి (2)
నిశ్శబ్ద చిత్రం
సముద్రం ఒంటరైపోయింది
అలల అందాలు ఆవిరైపోతున్నాయి
సూర్యచంద్రుల్ని ఏదో వింత రోగం మింగేసింది
జనం చూపులు కంటపడక కెరటాలు
నిశ్శబ్దాన్ని భుజాన ఎత్తుకొని
ఎగరలేక వెల్లకిలా పడుతున్నాయి
గాలి అపసవ్యంగా తుల్లెళ్లిపోతోంది
అధిరోహణల తోరణాలు తొలగించుకొని
ఆకాశమంత ఎత్తులో ఎవరెస్టు దిక్కులు చూస్తోంది
మేఘాలను ఆలింగనం చేసుకొని
హిమాలయాలు నిశ్శబ్ద జలపాతాలుగా నిలిచిపోయాయి
అడుగుజాడగా వెంటనడుస్తున్న వెలుతురు
విజయపథంగా ప్రవహించే కాలంతో పరుగు తీయలేక
స్వీయనిర్బంధంలో చిక్కుకుపోయింది
మాలిన్యమైపోతున్న ప్రాణవాయువు శుభ్రతకు
శుద్ధ జలాలు ఎండిపోయి బీటలువారాయి
గాయపడ్డ మనసులకు చికిత్స చేయడానికి
అనంత ఆకాశం నుంచి ఏ అనురాగం దిగిరావడం లేదు
ముఖాన్ని మాస్కులతో మూసేసిన తర్వాత
మనిషి తెరల లోపల బందీ అయ్యాడు
ఎంత అరచినా ఏ చెవికీ ప్రతిధ్వనులు చేరడం లేదు
ఎంత పిలిచినా ఏ కనులూ చూడటం లేదు
వసంతం లేని వెన్నెల మైదానాల్లో
ఎవరి నీడతో వాళ్లే మాటలల్లుకుంటున్నారు
ఎవరి దేహాల్ని వాళ్లే కనురెప్పలు తెరచి చూసుకుంటున్నారు
ఎవరి భాషనువారే మౌనంగా ఆలపించుకుంటున్నారు
ఇంతలోనే ఎవరి పెదాలను వాళ్లే 
కుట్టేసుకొని నిశ్శబ్దమైపోతున్నారు
నేను ఈ మౌనంలో ఏకాంతాన్ని వెతుక్కొని
నిశీధి మీద నిఘా వేసి స్వప్నలోకంలోకెళ్లిపోతాను
తెలతెలవారే మబ్బు తెరల్ని తెంచుకొని
అరుగంతా అరుణోదయాన్ని ఆరబోస్తాను
ఒక్కసారిగా ఇంటి నుంచి పరుగుదీసి
ఊరి చివర పొలిమేరలు చూసొస్తాను
జీవితాన్ని ప్రేమిస్తూ జీవిస్తూ ఎగురుతున్న
పంట పొలాల మీది పక్షుల్ని పలకరించి వస్తాను
చీనా ఊరి నుంచి మా ఊరి వరకు అడుగడుగునా
ఆనందం ఎలా మృత్యు ముఖమేసిందో
చాటింపు వేసొస్తాను
మనస్సులు కలిసే చోటుల్లో ఉద్వేగాన్ని పంచొస్తాను
రేపటి ఉల్లాసాన్ని ఉత్సాహంగా విసిరొస్తాను
- డా।। జి.కె.డి.ప్రసాద్, విశాఖపట్నం, 9393111740


ప్రోత్సాహక బహుమతి (3)
కొత్త కావ్యం రాయాలి
కొత్త కావ్యమొకటి రాయాలి..!
వలస బతుకులపై పంజా విసిరి
లాక్‌డౌన్‌ పులి చేసిన తడియారని గాయాలను..
సొంత గూటికి పయనమై
నెత్తురోడుతున్న పాదముద్రలను
చెరిగిపోకుండా ముద్రిస్తూ..
అలసటకూ ఆకలి తుపానులకు
నేలకొరగని ఆత్మవిశ్వాసపు వటవృక్షాల చరిత్రలను..
ఆరుగాలపు శ్రమ చేతికందకుండా పోయినా
కుంగిపోని అన్నదాతల గుండె ధైర్యపు గేయాలనూ..
కావ్యంగా లిఖించాలి..!
రంగులు మార్చే రాజకీయం వర్ణహీనమై
ప్రజారక్షణలో పునీతమైన శ్వేతవర్ణంతో గీసిన
ప్రజాస్వామ్య చిత్రాలనూ పొందుపరచాలి..!
ఆకలి కడుపులతో మలిగే దీపాలను
అరచేతులడ్డుపెట్టి కరుణతో కాచిన
ఆపద్భాంధవుల సాయాన్ని..
స్వేదవేదమాలపించే శ్రమజీవులకు
చేయూత నందించిన చైతన్యమూర్తుల 
చిరునామాలనూ లిఖించాలి..!
జనం కోసం మనం అనే నైజాన్ని
సంపన్నుల్లో, సామాన్యుల్లో కలిగించిన
కరుణ రసాత్మక స్ఫూర్తి గాథలను
ప్రతి ఉదయం పఠింపచేసిన
అక్షర సైనికుల అంకిత భావాన్ని లిఖించాలి..!
తిమిరమెప్పుడూ శాశ్వతంగా ఉండదని
ప్రభాత సూర్యుని రాకతో ప్రతి ఉదయం వెలుగుతుందని
ఆశావహ గీతికను ఆలపిస్తూ
సాంత్వన కూర్చిన అపర ధన్వంతరులకు..
పగలూ రేయీ పహారా కాసిన ఖాకీ దేవుళ్లకు..
పురుగు సోకకుండా లక్ష్మణరేఖను గీసిన పారిశుద్ధ్య కార్మికులకు..
గడప గడపనూ జల్లెడ పట్టిన ఆశామూర్తులకూ..
ఈ కావ్యాన్ని అంకితమీయాలి..!
నిర్బంధపు గడప లోపల బలపడిన బంధాల తొలిపలుకులతో ..
క్వారంటైన్, ఐసోలేషన్లలో
కొత్త ఆశల చిగుళ్లు తొడిగిన జీవితానుభవాల ముగింపుతో..
ఉన్నంతలో ఉదారత చూపాలని..
ప్రకృతి కనుసన్నల్లో మెలగాలని..
కర్తవ్య నారాయణులను నిత్యం కొలవాలని..
గొప్ప సందేశాన్నిచ్చేలా కరోనా కావ్యాన్ని రచించి
భావితరాలకు భద్రంగా అందించాలి..!!
- చల్లా దేవిక, ఒంగోలు 9848965188


ప్రోత్సాహక బహుమతి (4)
మానవ వృక్షం  
మట్టి ఒడిలో మొలకెత్తిన
పచ్చని అడవిలో మానవ వృక్షం ఒకటి
ఎన్నో రేయింబవళ్లను దాటి
లోతుగా వేళ్లూనుకొని బలపడింది
శాఖోపశాఖలుగా విస్తరించింది
రుతువులు వయ్యారంగా వచ్చి పలకరిస్తే
ఆ చెట్టు చిరునవ్వులు విరబూసేది
తనలో గూడు కట్టుకున్న పక్షులు
రాగాలాపన చేస్తుండేటప్పుడు
ఆ చెట్టు శ్రమను గతంలోకి నెట్టేసి
వర్తమానాన్ని మనసారా ఆస్వాదించేది
గాలి వీస్తే ఊయలలూగేది
వర్షం వస్తే తలస్నానం చేసేది
ఓ రోజు అకస్మాత్తుగా పెనుగాలి వీచింది.
ఎండుటాకులు, పండుటాకులు రాలిపోయాయి
చిగురుటాకులూ రాలిపోతున్నాయి
చెట్టుకు లీలగా అర్థమయింది
ఇది పెనుగాలి కాదు పీడగాలి అని
ఆకులకు చెప్పింది బలంగా ఉండమని
లేకపోతే రాలిపోతారని
కొమ్మలకు చెప్పింది దగ్గరవ్వవద్దని
రాపిడి జరిగితే నిప్పు రేగుతుందని
జాగ్రత్తగా ఉండమని హెచ్చరించింది
చెట్టు మాట వినని కొన్ని నిర్లక్ష్యపు కొమ్మలు
దగ్గరగా ఊగి నిప్పును రేపాయి
నిప్పు దావానలమై చెలరేగింది
అడవిలో పచ్చదనం
అమావాస్య చంద్రుడయ్యింది
మనోనిబ్బరంతో నిలిచిన మోడు
మట్టితల్లిని క్షమించమని
కన్నీటి బొట్లు నేలకు విడిచింది
మళ్లీ పచ్చగా చిగురించాలని
పచ్చదనానికి పూర్వ వైభవం
బహుమతిగా ఇవ్వాలని
వసంత రుతువును ఆహ్వానించింది
కొన్నాళ్లకు మానవ వృక్షం మళ్లీ చిగురించింది
నిర్లక్ష్యపు నీడ నివురుగప్పిన నిప్పు అని
బాధ్యత గల నడక భావితరాలకు భాగ్యపురాశి అని
అడవిని, పచ్చదనాన్ని కాపాడమని బోధించగా
కొత్త చిగుళ్లు చైతన్యరథం అధిరోహించాయి
- గొట్టాపు శ్రీనివాసరావు, సాలూరు, విజయనగరం జిల్లా, 7013757285


ప్రోత్సాహక బహుమతి (5)
ఇంట్లో పొయ్యి వెలగాలి
నిర్బంధం నీడలో
నాలుగు గోడల మధ్య
పిల్లల చూపు తల్లివైపు
ఆమె చూపు అతనివైపు
అందరిచూపు వెలగని పొయ్యివైపు
ఈ చూపులు కలవని
అశుభపు వేళ
ఆకలి ఆర్తనాదాల్ని
ఎలా ఆస్వాదించాలో తెలియక
స్వేద పరిమళాలకి అలవాటుపడ్డ
అమాయకపు దేహాన్ని
సుఖపెట్టి తాను కష్టపడుతూ
తనపని తాను చేసుకుపోతున్న
గడియారం వైపు
పేజీలు మార్చుకుంటున్న
కేలండర్‌ వైపు
పదేపదే పరీక్షగా చూస్తూ
కాలంపెట్టిన పరీక్షకు
సమాధానాలు వెతుక్కొంటున్న అతడు
సహనంతో నిరీక్షిస్తున్నాడు..
రాబోయే తొలకరికైనా
తానే తొలిపొద్దునవ్వాలని..
పుడమితల్లిని ముద్దాడి
పులకరించిపోవాలని..
ఆరుగాలం శ్రమించయినా
అన్నపూర్ణ సేవలో
తరించిపోవాలని..
అలవాటులేని సుఖాన్ని
అవతలకు నెట్టేసి
మట్టివాసనల మాధుర్యంలో
మమేకమైపోవాలని..
రెక్కల్ని నమ్మేసుకుని
శ్రమను అమ్మేసుకొని
స్వేదంలో తడిసి తడిసి
ముద్దయిపోవాలని..
తాను రోజుకూలీనైనా
రాజులా బతికెయ్యాలని..
మళ్లీ ఇంట్లో పొయ్యి వెలిగితే
కుతకుతలాడుతూ ఉడికే అన్నంలో
తన ఆలుబిడ్డల ఆనందాన్ని చూసుకోవాలని..
- ఎం.ఎస్‌.రాజు, భీమవరం, 9502032666 


 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  అధికార భాష