కరోనాపై కదనం - ఏప్రిల్‌, 28 పోటీ ఫలితాలు

  • 1266 Views
  • 9Likes
  • Like
  • Article Share

ప్రథమ బహుమతి
రోడ్లు చిగురించాలి
వీధిలో ఉన్న యాచకుడు
కూడా తలుపు తెరచుకోవాలని
రెండు కళ్లూ కొవ్వొత్తులు జేసి
ఎదురుచూస్తున్నాడు
మనిషి నాలుగు
చక్రాలై రోడ్డెక్కితేనే కదా
నాలుగు మెతుకులై
నాలుగు వేళ్లు నోట్లోకి వెళ్లేది
పసివాళ్లంతా పానీపూరి
బండిచుట్టూ తేనెటీగలైతేనే కదా!?
బతుకు రోడ్డు కోటి వ్యాపారాల కూడలి
మనషన్న వాడికి
రోడ్డే జీవనాధారం
ఫుట్‌పాత్‌ మీద చిల్లులుపడ్డ గొడుగు
గొడుగు కింద బడుగు
అతగాడి ఉనికేదిప్పడు!?
నాలుగు పాదాలకు
పాలిషైతేనే కదా కుటుంబం కడుపునిండేది,
ఇప్పుడు ఇంట్లో
దారాన్ని పెనవేస్తున్నాడు రేపటి
తెగిన చెప్పుకోసం!
మనకు కనిపించదు కానీ
రోడ్ల మీద కూడా బతుకు మొలుస్తుంది, చిగురిస్తుంది
కొబ్బరిబొండాల కొట్టు
రంగునీళ్ల సాయిబుగారు
బత్తాయి రసం బామ్మగారు
ఇప్పుడు వాళ్లంతా ఏరి?
వాళ్లకు విశ్రాంతి దినం కావచ్చు
కడుపునకు ప్రశాంతత ఏది?
ఇప్పుడు బువ్వకాదు వాళ్లకు పనికావాలి 
నిద్రపోతున్న రోడ్డును తట్టిలేపాలి!
వాళ్లకిప్పుడు పాటు కావాలి, పాట కూడా కావాలి!
గంట మోగగానే తాతా ఐస్‌
తాతా పాప్కాన్‌... బుడ్డోడికి కాలునిలవదు
వీడు ఏడిస్తేనే వాడు నవ్వేది
నాకు వాడి నవ్వు కావాలి!
రోడ్డును తట్టిలేపే మొనగాడు
నాలుగు చక్రాల బండబ్బాయి
పాత ఇనుముకి ఉల్లి గడ్డలు
పాతపేపర్లు, ఖాళీ సంచులు
అవే వాళ్ల బతుకు దారులు
రిజర్వ్‌బ్యాంకైనా రూపాయితోనే మొదలవుతుంది 
వందపైసల రూపాయి
రోడ్డువార డబ్బుల చెట్టుకే చిగురిస్తుంది!
రండి మళ్లీ మనం తలుపులు తీశాక
మిక్చరుబండి దగ్గరో! టీ బంకుదగ్గరో
తప్పక కలుసుకుందాం! 
తలుపులు తీసేదాకా 
నాలుగు రోడ్లకూడలిని కలగంటూ ఉందాం!!
- దుగ్గినపల్లి ఎజ్రా శాస్త్రి, ఒంగోలు, 8096225974
ఈ కవితను వినాలనుకుంటే...


ద్వితీయ బహుమతి
అమ్మ చెప్పిన కథ
బిడ్డా వింటున్నావా! 
నీకో కథ సెబుతాను
నువ్వు భూమ్మీదకు 
రావడానికి కొద్దీ రోజులే ఉన్నాయ్‌...
తొందరపడబోకు 
కాస్త మునగడ దీసుకు బజ్జో...
ఆకలేస్తుందని కాలెత్తి
డొక్కల్లో పొడిసేయకు...
ఆరుబయట అంతా సీకటే బిడ్డా...
నిన్ను సేరదీసే మనుషులే లేరిక్కడ 
కరోనా గాలి గట్టిగా వీస్తంది బిడ్డా...
తాకితే చాలు తనువెల్లా విషమైపోయే 
జబ్బొకటి దారికాసింది ...
నాకు తెల్వట్లేదే బిడ్డా 
ఏ మడిసి నడిసే వైరస్సో ..
నా బొడ్డు నుంచి వచ్చేస్తానని 
అట్టా మారాం సేసేయకు...
ఒంటరి ద్వీపంలో 
ఇప్పుడు నిన్ను మోసుకెళ్తున్న
ఒంటరి దీపాన్ని నేను...
ఇంటున్నవా 
నడిసి పోతానే ఉంటా
పొరపాటున తొందర పడి
నా తొడల మధ్య నుంచి 
జారొచ్చేయమాకే..
నే కళ్లు తిరిగి పడిపోతే 
ఏ పాజిటివ్‌ చేతిలో పడి 
నా రొమ్ములు సీకకుండానే
నా తొమ్మిది నెలల కష్టానివి
అందకుండా పోతావోననే భయం...
ఇదివరకు బాధపడినప్పుడల్లా
వెన్నుతట్టి బి-పాజిటివ్‌ అనేవారు
ఇప్పుడు 
బి-నెగటివ్‌ వ్యక్తి కోసం గాలించాల్సిన
స్థితి దాపురించిందే...
పోగాలం అంటే ఇదేనేమో బిడ్డా...
దారమ్మట పోతానే ఉంటా 
కుక్క ముట్టిన రొట్టెనైనా
మరో పక్క కతుకుతా 
కానీ మనిషి ముట్టినదాన్ని 
మాత్రం ముట్టను నీ కోసం...
కొద్ది రోజులు చల్లంగా 
ముడుసుకోవే బిడ్డా నా కోసం...
నే నడిసినంత మేరా ఏ వైరస్‌ 
సోకకుండా దారంతా
రైతునై పురుగు మందు జల్లుతా పోతా...
అలసిసొలసి ఆగినప్పుడల్లా
మనలాంటి దారీతెన్నూ 
లేని బతుకుల ముచ్చట్లను
బడిలో టీచరమ్మలా సెబుతా పోతా...
బతుకు భాషను విడమర్చి సెపుతూ 
కరోనాకు సిక్కి శల్యమైన కళేబరాల 
గాథల్ని లెక్కగట్టి సెపుతూ సైనికురాలిగా
నీకు ధైర్యాన్ని నూరిపోస్తూ పోతా 
నువ్వు బయటికొచ్చే సమయానికి
నీ కోసం ఒక పచ్చని పల్లెను
అందులో నీ నవ్వులకే విచ్చే అందమైన 
పూలతోటను పెంచిస్తా...
నీ స్వప్నాలను
ఏ వైరస్‌ తాకని చక్కని గాలిని నీకు కానుకిస్తా..
- అమూల్యచందు కప్పగంతు, విజయవాడ, 9059824800
ఈ కవితను వినాలనుకుంటే...


తృతీయ బహుమతి
కాలం గల్లా పట్టుకుని..
ఆశనిరాశల నడుమ ఊగుతున్న
ఆత్మవిశ్వాసపు ఊయల
సుఖదుఃఖాల నడుమ కొన్ని రోజుల్నుండి
సుఖంగా సేదదీరుతున్న సమయాభిలాష..
సగం నిద్ర, సగం మెలకువ
సగం అహం, సగం అణకువ
సమ్మోహిత అర్ధనిమీలిత నేత్రాలు,
వాటిలో భయవిహ్వల చిత్రాలు..
అదే గదిలో పాత నులకమంచం
టేబుల్‌ పై అదే అన్నం కంచం
మనసులో బింకం, మది మూలన సంకోచం..
మరీ తేడాలేకుండా రాత్రీ పగలూ ఒకేలా ఉన్నాయి 
చీకటి వెలుతురులు కూడా అలానే
అవే పరిసరాలు, అదే పాత లోకం
అవే జ్ఞాపకాలు, అదే నూతన శోకం..
నా ఆస్థానమిదే, నా సంస్థానమిదే
ప్రస్తుతానికి నా ప్రస్థానమిదే
పొద్దస్తమానం శైశవావస్థలోనే జీవనం
ఆలోచిస్తూనే సందిగ్ధావస్థలో అవలోకనం..
దురవస్థ, నిద్రావస్థ
ప్రస్తుత జీవితం సుషుప్తావస్థ 
మనసు స్థిమితపడక, మధ్యస్థంగా
ఉండక అటూఇటూ ఊగిసలాడుతోంది.
ఈ హృదయం తటస్థంగా ఉండక
అనిశ్చల అస్థిర స్థితిలో ఊగిసలాడుతూ
మానసిక అస్వస్థతతో మరుగుతూ
ఆరోగ్య సందేహ సంస్థాపనం చేస్తోంది..
వెన్నెల నెచ్చెలి చేయి పట్టుకుని
సరసాలాడుతూ చంద్రుడొస్తున్నాడు
వేలాది ఆశాకిరణాల్ని నాకై మోసుకుంటూ
సూర్యుడొస్తున్నాడు
రాత్రొస్తోంది, పగలొస్తోంది 
జీవితమంతా ఇలానే గడచిపోతోంది..
సందేహాల కారుమబ్బుల్ని, సంకోచాల నీలినీడల్ని 
పటాపంచలు చేస్తూ
కాలం గల్లా పట్టుకుని నిలదీస్తూ
ఆత్మస్థైర్యపు ఆశాదీపంతో పరిస్థితుల్ని 
పునఃస్థాపనం చేస్తూ ముందడుగు
వేస్తున్న నేను..
(హోమ్‌ క్వారంటైన్‌ గురించి..)
- సర్ఫరాజ్‌ అన్వర్, హైదరాబాదు, 9440981198
ఈ కవితను వినాలనుకుంటే...


ప్రోత్సాహక బహుమతి (1)
పునశ్చరణ
ఎవరికి వారం నాగలితో దున్నుకుందాం
ఏళ్ల తరబడి పేరుకుపోయిన మట్టిని పెకలిద్దాం
పెరిగిన కలుపును అగ్గికి ఆహారం చేద్దాం
లాక్‌డౌన్‌ జెండా ఎగిరినన్నాళ్లు
ఇంటి చుట్టూ, ఊరి చుట్టూ గీసుకుందాం లక్ష్మణరేఖ
ఇన్నాళ్లూ పని, పైసా పరవశంలో
ఇంట్లో పెరిగిన హద్దుల గోడలు
పేకమేడలవుతుంటే నిండిన ఆనందాల చెరువు
పునశ్చరణ తరగతులకు చిక్కిన సమయం
పల్లెల్ని చిన్నబుచ్చిన నగరాలకు వలసలు
తెలిపాయిప్పుడు పల్లె చెలిమి పండుగ కథనాలు
నగరాల కోవిడ్‌ రెడ్‌ జోన్లలో చిక్కుకున్న పక్షులు
చేతులు చాస్తున్నాయి తప్పని తపనతో
ఎక్కడికక్కడ కట్టుకున్న భయం అడ్డుగోడలు
ఈర్ష్య పడుతున్నాయవి నేడు
పల్లె చెట్టుపై గూడుకట్టుకున్న స్వేచ్ఛ ఆక్సిజన్‌ చూసి
దుకాణాలు ఎన్నో దుఃఖ గీతాలు పాడుతుంటే
నిత్యావసర సత్యాలు అశరీర వాణులయ్యాయి
శ్రమజీవుల కాళ్లు చేతులకు తెగని భయం సంకెళ్లు
కాయకష్టం బతుకును నమ్ముకొని వచ్చిన వలసలు
పని పాతరేయగా సొట్టలు పడ్డ బువ్వతల్లి జీవనం
డొక్కలెండిపోకుండా ఎముకల్లేని దాతల చేతులు
ఎండాకాలం ఉండే నీడ సీజన్‌పై వడగళ్లలా కరోనా
కుమ్మరి కుండలకు చిల్లులు
అతుక్కోని దారం పోగులు చేనేతలు
కుల వృత్తుల కుంపటిలో రేగిన బూడిద
ఎండల గొంతార్పని పండ్లు, చెరకు రసాలు
రోడ్డెక్కక ముందే కరిగిపోయిన ఐస్‌ క్రీములు
తాగు నీళ్లతో కడుపు చల్లబడని కూజాలు
ఫుట్‌పాత్‌ వ్యాపారాల పుట్టలో చేరిన పాము
ముట్టించని బట్టీల బూడిద కింద హోటల్‌ కార్మికులు
చమురంటిన పాత బట్టలు విడువని మెకానిక్‌లు
బతుకు బండి గీరకు కరువైన కందెన
బాధల కాడి మోస్తూ లాగలేకపోతున్న ఇంటెద్దులు
కాన్వాసులకెక్కని జీవన సిత్రాలు రోడ్డుపై
ఎన్ని కాగితాలు అక్షరాలు పంచినా
కమిలి మిగిలిపోతున్న అనేక పార్శ్వాలు
లెక్కలేనన్ని తొర్రలతో పిండి జల్లెడ బతుకులు
బతుకు చెట్టు ముందు బాధలన్నీ పిల్లకాయలే
తాత ముత్తాతలు చూసిన గత్తర, ప్లేగు పాఠం
వారు సాధించిన విజయం ఇప్పుడు ఆదర్శం
వాళ్లు నేర్పిన సంప్రదాయం వేదం
శాస్త్రీయ విజ్ఞానం పాలు తోడేసుకొని
వైద్యం, పోలీసు, పారిశుద్ధ్యాల చెత్రి కింద
రక్షణ వలయాల్ని అంచెలంచెలుగా పెట్టుకున్నాం
ఇక అదృశ్యరూపాలకు అదరంబెదరం
కరోనా కనికట్టుకు విరుగుడు ఇళ్లలోనే
మందు లేని రోగానికి మనోధైర్యం మందు
- కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట, 9848005676


ప్రోత్సాహక బహుమతి (2)
నిర్విరామ సేవాకవచం
నా మనసిప్పుడు ఒక అనివార్యంగా
ప్రపంచంలాగే కల్లోలిత ప్రాంతమైపోయింది
ఎంత వారించినా
నేలకు రాలుతున్న పువ్వుల్లాంటి
శరీరాల చుట్టూ
అగరుపొగల ధూమం గూడుకట్టుకుంటోంది
శ్వాసకు అడ్డుపడుతోంది
నెరవేరని ఆశలన్నింటినీ
ఓ విషాద గీతం చేసి
విశ్వాంతరాళంలో ఆలపిస్తోంది
వర్తమానంలోని క్షణాలన్నీ
జ్ఞాపకాల్లోకి జారుకుంటున్నకొద్దీ
చరిత్ర మనసును ఓదారుస్తోంది
రోజూ పూలు కోల్పోతున్నా
చిరుగాలికి అల్లరి చేస్తూ
ఎదురుగా నిలబడ్డ చెట్టొకటి
చిరునవ్వుతో మనసును పలకరిస్తోంది
అప్పటిదాకా ఏమీ ఎరగనట్టు
అమాయకంగా ప్రశాంతత నటించి
ఒక్కసారిగా అల్లకల్లోలమై
సైకత తీరాన్ని ఛేదించి
అన్నింటినీ ముంచేసి
మళ్లీ యథాస్థానంలో కూర్చున్న
సముద్రం నేర్పిన పాఠమూ గుర్తుకొచ్చింది
నన్ను నేను కొంచెంకొంచెంగా
సాంత్వన పరచుకుంటూ
కాగితాలదొంతర ముందేసుకుని
కవిత్వానికి సాగిలబడ్డాను
సాష్టాంగంగా ప్రణమిల్లాను
ఇప్పుడు నా ఎదురుగా
ముగ్ధమనోహర రూపంగా కవిత
అక్షరాక్షతలతో అర్చించి వేడుకున్నాను
దిగుళ్లన్నీ తన ఇంద్రజాలపు మాయలో
నా మనసు పరిధినుంచి దూరంచేసింది
మనసునిండా ఓ వెలుగుకిరణాన్ని చొప్పించి
ప్రపంచాన్ని చూపించింది
దేహాలకు పత్తిపూలు పూయించుకున్న
దేవదూతలంతా ఏకమై
నమక చమక సహితంగా
ఆరోగ్యమస్తుగా దీవిస్తూ కవాతు చేస్తున్నారు
ఒక నిర్విరామ సేవాకవచాన్ని
బాధితుల చుట్టూ బిగించారు
బంధమూ బంధుత్వమూ అవసరమేలేదు
ఉన్నదల్లా మనిషితనమే
ఆ సందేశమే
మన కృతజ్ఞతా సుమమాలికగా
ఆకాంక్షించారు
నిజమే కదా
మన కవిత్వ నీరాజనం వారికే కదా
- కొంపెల్ల కామేశ్వరరావు, హైదరాబాదు, 8985971198


ప్రోత్సాహక బహుమతి (3)
శ్వేత సైనికులు
మీకు మనసెట్లా ఒప్పింది!?
పాలూ నీళ్లను వేరు చేసినట్లు
ప్లాస్మాను వేరుపరచి
ప్రాణాలను కాపాడే తెల్ల హంసలు వాళ్లు
ఈ కరోనా కల్లోల యుద్ధంలో
ఆసుపత్రి ఆలివ్‌ కొమ్మను గుండెకు కరచుకుని
ఆరోగ్య శాంతిని ప్రసాదించే
తెల్ల పావురాలు వాళ్లు
మీకు మనసెట్లా ఒప్పింది!
ఆరడుగుల నేలకు చిక్కకుండా
ఈ లోకమంతా 
మూడడుగుల దూరం పాటిస్తుంటే
ఇంటినీ, ఇల్లాలినీ
ముక్కుపచ్చలారని పసివారినీ
చూపులతోనే పలకరిస్తూ
కన్నీళ్లతోనే వీడ్కోలు చెబుతూ
కదన రంగానికి బయలుదేరిన
తెల్ల కోటు జవానులు వాళ్లు
మృత్యుశయ్యపై మునగదీసుకున్న
మిమ్మల్ని మాత్రం అభయహస్తాలై అల్లుకుపోయే వాళ్లు
వారిపైన నోరు పారేసుకోటానికి
అద్దె ఇంటిలోంచి పంపించటానికి
మీకు మనసెట్లా ఒప్పింది!?
వధ్యశిల మీద తలపెడుతున్నామని తెలిసీ
మృత్యు తల్పం మీది రోగులని కాపాడే
స్టెతస్కోపు ఖడ్గవీరులు వాళ్లు
వారిపై చేతులెత్తటానికి
మీకు మనసెట్లా ఒప్పింది!?
వాళ్ల ప్రాణాలను నీటి బుడగల్ని చేసి
మీ ఊపిరి బూరలకు ప్రాణవాయువునెక్కించే
సూది మందు వాళ్లు
వాళ్లొక్క క్షణం ముఖం చాటేస్తే
శ్వేత కవచం మూలన పడేస్తే
శవాల దిబ్బలు మీ జీవితాలు
గడ్డిపోచలు కూడా మొలవని
కరోనా సమాధులు మీ బతుకులు
అట్లాంటిది
కరోనా కదనరంగంలో 
ప్రపంచాన్నే గెలిపిస్తున్న శ్వేత సైనికుల్ని
నిత్యం మీకోసం బతికి చస్తున్న
మానవత్వం నిండిన మనుషుల్ని
మీకు ప్రాణ జలం పోసి
తాము శవాలవుతున్న ఈ త్యాగుల్ని
శ్మశానాల నుంచి తరిమేయటానికి
దహనసంస్కార తృణీకరణతో
అవమానించటానికి
మీకు మనసెట్లా ఒప్పింది!?
- చిత్తలూరి, హైదరాబాదు, 9133832246


ప్రోత్సాహక బహుమతి (4)
దేశమంతా వాళ్ల ఊరు
అవును వాళ్లు నడవాలి
తల ఒక చోట
మొండెమొక చోట విసిరేసినా
జానెడు పొట్ట కోసం
రెండు కాళ్లను అతికించుకుని
అప్పుడూ ఇప్పుడూ ఎప్పుడూ
వాళ్లు నడవాలి
పెను ఉప్పెనలు ముంచేసినా
కరవులు కొండచిలువల్లా చుట్టేసినా
తళుకులీనే నగరాలను
తమ రక్తపుచుక్కలతో మెరిపించిన
కష్టజీవులకు తల దాచుకునే
జాగా లేదని నిర్దయగా తరిమేస్తే
బొబ్బలెక్కిన కాళ్లను
దారెంబడి చావులను లెక్కచెయ్యకుండా
విలువ లేవని తేల్చేసిన తమ ప్రాణాలను
తమ సొంత గెడ్డలో ఖననం చెయ్యడానికైనా
వందలు వేల మైళ్ల దూరం నడవాలి
విశ్వాసం లేని నాగరిక సమాజాలు
తలుపులు మూసేసినప్పుడు
నడకే వారికిప్పుడు ప్రాణాధారం
నడకే వారికిప్పుడు జీవబలం
మెరిసిపోయే రోడ్లు..
మాయచేసే మిద్దెల పునాదుల మీద మొలిచిన
నేల నెర్రలు బారకుండా
వారి కాళ్లల్లో రక్తపు చుక్కల
పువ్వులను మొలిపించాలి
ఆకలి నరనరాలను నమిలి మింగేస్తున్నా
జానెడు బట్ట ఖరీదు
వారి జీవితాలను వెక్కిరిస్తున్నా
పేదరికం సూదిమొనతో గుండెెెెెను కుట్టుకోవడానికైనా 
వాళ్లు నడవాలి
అనాది కాలం నుంచీ
నడక వారి సొంతం
పెట్టుబడి లంగరేసి మరీ
వారి బతుకుల్ని మింగేసినా
కడుపులోకి ముడుచుకుపోయిన కాళ్లను
పేదరికం నిట్టాడుకు కట్టెయ్యడానికైనా
వాళ్లు నడవాలి
నడక నేర్పిన భూజాత నాలుగుకాలాలు 
పచ్చదనాన్ని పూయించడానికైనా
వాళ్లు నడవాలి
స్తంభించిపోయిన ప్రపంచం
మున్ముందుకు సాగాలంటే
వాళ్లు నడుస్తూనే ఉండాలి
వాళ్లు నడుస్తున్నప్పుడు మీకు తారసపడితే
మట్టి పిడతతో మంచినీళ్లిచ్చి
నులకమంచమేసి సేదతీర్చి
గుక్కెడు గంజి పోసి ఆకలి తీర్చి
ఆ పగుళ్ల కాళ్లకి చెప్పులు తొడిగి
మన కోసం చిందించిన చెమట చుక్కల రుణం తీర్చుకోండి
వారికి చేసే సేవ దేశానికి చేసే సేవ
వారికి ఇచ్చే ప్రేమ దేశానికి చూపించే ప్రేమ
దేశానికే నడత నేర్పించగల
వాళ్ల నడక ఏనాడూ హద్దు దాటి
ఇవతలకు రాలేదు
మనుషులంతా మనసుకు కట్టుకు తిరుగుతున్న 
అంతస్తుల హద్దులు చెరిపేస్తే చాలు
దేశమంతా వాళ్ల ఊరు అయిపోగలదు!
- వైష్ణవి శ్రీ, విజయవాడ, 8074210263


ప్రోత్సాహక బహుమతి (5)
బతుకు చిత్రాలు
మరలో నలుగుతున్న గుండె
కన్నీళ్లు కన్నీళ్లుగా పిండి అవుతోంది
క్షమించండి కవులారా
నేనిప్పుడు ప్రతీకలు పదచిత్రాలు వెతుక్కోలేను
ఎడబాటుకు ఆకలి తోడై
ఛిద్రమైన బతుకులే నా పదచిత్రాలు
ఉరికెక్కిన పూరి గుడిసెలే ప్రతీకలు
వలసవెతల చీకటి దారుల్లో
ఆకలి కత్తిమొనకు గుచ్చుకొని
నింగిన చుక్కలు అవుతున్నారు
అడుగు బయటపెడితే జీవితకట్టెకు చెదలెక్కుతుంది
కానీ లాక్‌ డౌన్‌ రోజువారీ కూలీల వీపుపై
కొరడా అవుతుంది
ఎక్కడికెళ్లినవాళ్లు అక్కడే 
పారని నదులయ్యారు
దూరతీరాల్లో.. భారమైన మనసుతో..
భార్యాభర్తలు.. తల్లీకొడుకులు..
నీరెండిన తటాకాలవుతున్నారు
నిరంతర నిజాల లోతులను
వెతుకుతూ ఉపద్రవాలకు
వెనకడుగు వెయ్యని అక్షరసైనికుల్లారా..
కొండచరియలు ఎప్పుడు దొర్లుతాయో తెలియదు..
అయినా..
మమ్మల్ని ఇంట్లో భద్రం అంటూ..
మీరు నిజనిర్ధారణ యోధులై
మైకాయుధంతో తిరుగుతున్నారు
స్ఫూర్తి కోసం సెలబ్రిటీల చీపురులు చూపిస్తున్నారు మంచిదే
పైసలు పీల్చేసిన ఆకలి చావులను రీప్లే వేయండి
ఆఖరిచూపు నోచుకోక
కంట్లో ముళ్లు గుచ్చుకున్న నెత్తుటిచారికలు
మళ్లీ మళ్లీ చూపించండి
ఇప్పటికే చాలా గుండెలు కరిగి అన్నపు చేతులవుతున్నాయి
చేతులనింకా పెద్దవి చేద్దాం
కరోనా కోరలు... ఆకలి కన్నీటి చారికలు...
రెండూ పంటను తింటున్న చెద పురుగులే
ద్వయమైన సమస్యలకు
అద్వితీయమైన పరిష్కారాలు
వెతికేందుకు వేగంపెంచడంలో
మీరే వారికిప్పుడు ఆపద్భాందవులు
- శ్రీధర్‌బాబు అవ్వారు, నెల్లూరు, 8500130770


 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  అధికార భాష