కరోనాపై కదనం - ఏప్రిల్‌, 29 పోటీ ఫలితాలు

  • 1268 Views
  • 20Likes
  • Like
  • Article Share

చెమట చుక్కలు
నువ్వు చెమట చుక్కవై
సూర్య కిరణాలు సోకుతున్నప్పుడు
ఆ పనిముట్లను సర్దుకుంటూ ఉన్నప్పుడు
మా బద్ధకం మేలుకునేది
కళ్లద్దాలు సవరించుకొని నువ్వు పనికి వెళ్తుంటే
సమరానికి వెళ్తున్న సిపాయిలా ఉండేది
నువ్వు పలుగువై పారవై సమ్మెటవై
రంగంలోకి దిగినప్పుడల్లా
స్వేద బిందువులు పరవశించిపోయేవి
నీ కాయకష్టంలో ఇంకిన కడుపులోంచి
ఆకలితనం బయటపడటం
ఎంత రక్తాన్ని పిండిన కళ..
నీ కోసం కుటుంబ కుసుమాలు ఎదురేగి
చల్లని గాలిని పరిమళాలుగా మలచడం
ఎంత వాత్సల్యం..
చీకట్లలో మగ్గుతున్న లోకం కోసం 
విరామం లేకుండా వెలుగుతున్న కాగడావి
ఎవరన్నారు నిన్ను మరిచారని?
సమాజం నీకు రుణపడే ఉంటుంది
నువ్వు చెమట గనివై 
లోకానికి ఆదరువై విస్తరించి
మమ్మల్ని అక్కున చేర్చుకోవడం 
ఇప్పుడు గతమే కావచ్చు
నువ్వు పరచిన బాట మాత్రం
మా జీవితాలను ఉత్ప్రేరకం చేసి
మండుతున్న కొలిమిలా రగిలే జ్వాలలా
మార్చడం గుర్తుంది
కుటుంబాలను చూసినప్పుడల్లా
నువ్వు పనిముట్లను 
ఆప్యాయంగా పలకరిస్తున్నట్లుగానే ఉంది
నువ్వు చేసిన చెమట చుక్కల స్నేహం
కరోనా చీకట్లలో దూరమైంది
పనిముట్ల బతుకంతా కనికట్టైంది
కండలు కరగక కడుపులు నిండక
పస్తుల కుస్తీలతో కాలం వెళ్లదీత
అంతిమ సమరం ముగిశాక
నిప్పు రవ్వలు ఎగశాక
చెమటలు చిందేస్తూ 
పనిముట్లు దరువేస్తూ ఉంటే
శ్రామిక లోకానికి బతుకుతెరువు
శ్రమైక జీవన సౌందర్యానికి కల్పతరువు..
(మేడే సందర్భంగా కార్మిక లోకానికి అంకితం)
- మల్క జనార్దన్, నిజామాబాద్‌, 9866159005
ఈ కవితను వినాలనుకుంటే...


ద్వితీయ బహుమతి
మహాప్రస్థానం...
గాజుకళ్లు పొలిమేరలై
ఎన్నో రోజులైంది
గుండెను నేలపై ఆనించి
ఆ పాదాల చప్పుళ్లకోసం
కొసరి ఆశల్ని ఎదురంపుతున్నాను
సూర్యుడిలా వెలుగై
పొద్దుపొడుస్తాడని ఆశపడ్డాం
అలసిసొలసి అస్తమయానికైనా చేరతాడని
చీకట్లో వెతుకులాడ్డం
కలత నిద్దరలో
ఆకలి కాళ్లు గుండెలపై
నడుస్తుంటే వెక్కివెక్కి ఏడ్వటం
కంచాల్లో కరవు ఖాళీలేకుండా
తిష్ట వేసుక్కూర్చొనుంటే...
ఆకాశహర్మ్యాల అందాలలోకంలో
పచ్చతోరణాల్లాంటి పనులు..
పండగలాంటి పచ్చనోట్లు చూసి
ఈ అమ్మ అర్ధాకలి
పూరిద్దామని వలసెళ్లాడు బిడ్డ పాపం..
ఒక అదృశ్యపురుగు తనలానే
అన్నీ అదృశ్యమైపోవాలని శపిస్తే
వెళ్లిన పనులకూ కరువొచ్చి
భూమి గుండ్రం గురుతుచేస్తూ
కాశీయాత్రలాంటి తిరుగుటపాలో
నెత్తిన బరువు మూటతో
తూలుకొంటూ ఆకలి ఆపుకుంటూ
సముద్రమంతటి దూరాలు
భారంగా తరుగుతుంటే...
అమ్మఊరికి మరలొచ్చేస్తున్నాడు నా బిడ్డడు
ఊరు చేరగలిగితే...
ఆ తృప్తికైనా కడుపు నిండుతుందన్న ఆశతో
మా ఊరికోటలో కాలంటూ మోపితే
కలోగంజో కలిసే తాగుతాం కానీ...
దారిలో ఆకలి చావుల అనాథశవం
కాకుండా కాయండయ్యా మారాజుల్లారా
మా బిడ్డడు ఎర్రోడయ్యా
బుక్కెడు తిండికోసం ఆశపడ్డాడంతే
అందలాలెక్కాలని రాజ్యాలేలాలని రాలేదు
కూలిపన్లు తప్ప గోలపన్లు ఎరగనోడు
కనబడితే...
ఓ రూపాయో రొట్టెముక్కో
ఇచ్చి ఆదుకోండయ్యా
ఆ దేహాన్ని ఈ తల్లిగుండెకు
ప్రాణాలతో చూపండయ్యా...
- భీమవరపు పురుషోత్తం, రాజమహేంద్రవరం, 9949800253
ఈ కవితను వినాలనుకుంటే...


తృతీయ బహుమతి
హామీపత్రం
ఫలితాలొచ్చాకే ముగిసే 
వింత పరీక్ష ఇది! 
రేపో మాపో పూర్తైపోయాక 
ఎదురైన ప్రశ్నల్ని, రాసిన జవాబుల్ని 
గాలికొదిలెయ్యకుండా గుర్తుంచుకుంటానని 
తలుపులు కళ్లు తెరవగానే 
కళ్లెం తెంచుకున్న కలల్లా 
పరిగెత్తకుండా పద్ధతిగా అడుగేస్తానని 
గొంతెమ్మ కోర్కెల బుట్టని గట్టుమీదే పెట్టి 
దోసెడు నవ్వుల్ని ఆశగా వెతుక్కుంటానని 
అలసి సొలసి పోయిన వలస పక్షులకి 
చెమట చిందందే రోజు గడవని ఆశలకి 
గంపెడు ఓదార్పుతో ఎదురెళ్తానని 
సతమతమైన సాటి మనిషిని 
గతాన్ని తవ్వకుండా భేదాల్ని వెతక్కుండా 
సాధ్యమైన సర్దుబాట్లతో స్వాగతిస్తానని 
అంతో కొంతో ఆయువు పెంచుకున్న 
సహజ వనరుల గొంతు నలిపేయకుండా 
తోబుట్టువులా నిలిచి రాఖీ కడతానని 
కాస్తో కూస్తో అవగాహనతో 
అయోమయంలో అడుగేస్తున్న చిన్నారి భవితకు 
మింగుడుపడని పరిస్థితులు జీర్ణమయ్యేలా 
కొత్త సిలబస్‌ కోసం నడుం బిగిస్తానని 
ఈ భారం ఈ నేరం నీదంటే నీదంటూ 
ఇరుగూ పొరుగుజెండాలపై రంగు జల్లకుండా 
కుంటుపడిన కాలాశ్వానికి కొత్త రెక్కలు తొడిగి 
అభివృద్ధి ఆకాశంలో స్వారీ చేస్తానని 
అక్షరం వదలకుండా చదివిన కరోనా పుస్తకాన్ని 
పాఠం మరచి అటకెక్కించకుండా 
రేపటి గ్రంథాలయంలో ముందు వరసలో ఉంచుతానని 
ఆరిన దివ్వెల జ్ఞాపకాలను స్మరిస్తూ 
కాలిన చేతుల మహోన్నతను ముద్దాడుతూ 
మానిన గాయాల ప్రకృతికి భరోసానిస్తూ 
గుండె పేజీపై రాసుకున్న హామీపత్రంతో 
గుమ్మం దగ్గర సిద్ధంగా ఉన్నాను !!
- నితిన్‌ లకమళ్ల, హైదరాబాద్, 9052416162
ఈ కవితను వినాలనుకుంటే...


ప్రోత్సాహక బహుమతి (1)
తపస్సు నుంచి ఉషస్సు వైపు
లాక్‌డౌన్‌ తపోసమయంలో ముక్కు మూసుకున్న
మునిపుంగవుడిలా నా లోలోపలి జ్ఞాపకాల్లో
సంచారం చేస్తూ మానవ చరిత్ర వికాస గతిలో
వెనకకి వెళ్లొచ్చాను మళ్లీ ఒకసారి 
నాగరికత నడిచొచ్చిన దారిపొడవునా
మనిషి ఎగరేసిన విజయ పతాకాలను చూశా
వెలిగించిన జ్ఞానదీపాల కాంతిలో కరిగిపోయిన
మూఢనమ్మకాల క్రీనీడల జాడలు కనిపెట్టా 
ప్రాభవాల వైభవదీప్తుల మధ్యనే..
పరాభవాల పరంపరకి కారణాలు కనుగొన్నాను
గోడల బుగ్గలమీద జారిన కన్నీటి చారికల
తడినొకసారి తడిమి చూసుకున్నాను
పాదముద్రల మధ్యన మచ్చకట్టిన
పాపపు నెత్తుటి మరకలు చూస్తూ
పశ్చాత్తాపపు లెంపలేసుకున్నాను
మానవ చరిత్ర ముఖబింబాన్ని
మనసు అద్దంలో మరోసారి చూశా
సగం ప్రకృతి.. సగం వికృతి
ఆగకుండా తిరుగుతున్నా
భూమి నడకలో బెదురు వినబడుతోంది
ఆరకుండా వెలుగుతున్నా
సూరీడి ముఖంలో దిగులు కనబడుతోంది
హృదయంలో మరణాల శోకం మెదులుతున్నా
ఉదయంలో కిరణాల కాంతితో ఆశా దీపం వెలిగిస్తున్నా
తనని తాను సరిదిద్దుకునే సరైన సమయం ఇదే మనిషికి
అలుపెరగని అనంత యానంలో ఈ ఆపద ఒక మజిలీ 
సగం గుండు గీసిన కొండకి దండంపెట్టి
నదిలో పారే మురికి నీటిని కన్నీటితో కడిగి
చెట్టు మొదట తల్లివేరు దగ్గర తలానించి
క్షమాపణా గీతాన్ని పాడదాం
తప్పొప్పుల పట్టికను తయారు చేసుకుని
రేపటికొక ప్రణాళికని ప్రేమతో రాసుకుందాం
సకల జీవరాసుల సమ్మేళన సహజీవన వనంగా
అవనిని తీర్చిదిద్దుకుని ఆరోగ్యాన్ని ఆహ్వానిద్దాం
తనని తాను ప్యూపా దశలోకి తోసుకునైనా మనిషి
రంగుల రెక్కలు విప్పుకు సీతాకోక చిలుకలా
తిరిగొచ్చి పుడమంతా ఎగిరే 
ఒక సుందర దృశ్యాన్ని స్వప్నిస్తున్నానిప్పుడు
మదినిండా వెదజల్లిన మానవతా పరిమళంతో
కొత్త శిశువులా మళ్లీ పుట్టిన మనిషిని
ఒడిలోకి తీసుకు చనుబాలనిచ్చి లాలించే
ప్రకృతి మాత వాత్సల్యాన్ని కలగంటున్నాను
మనిషి ఖాతాలో మరో విజయాన్ని జమ చేస్తూ
కాలం చూపుడు వేలు చూపిస్తూనే
జాగ్రత్తలు చెప్పి రేపటివైపు దూసుకుపోతోంది
కరోనా స్మారక స్థూపం మీద మరో విజయ కేతనం
పునరుజ్జీవన సంకేతమై రెపరెపలాడుతుంది.
- గరిమెళ్ళ నాగేశ్వరరావు, విశాఖపట్టణం, 9381652097


ప్రోత్సాహక బహుమతి (2)
ఎడారిలో ఒయాసిస్సవుదాం
మండే కడుపును 
నిండుగా నింపడానికి 
రెక్కలు సరిచేసుకుని 
ఎండను ఎదపై మోసే 
ఎడారి దేశాన వాలి 
నాలుగు గింజలు వెనకేసుకుని 
కిలకిల రవాలు చేస్తూ 
సొంత గూటికి చేరే 
కొన్ని వలస పక్షులకు 
కరోనా గ్రహణం తగిలి 
పంజరాన బంధించిన చిలకలై 
విలవిల రాగాలతో 
విషాద గీతిని పాడుతూ 
నిశీధి వైపు చూస్తున్నాయి 
బతుక్కి మెతుకులు చల్లే కార్ఖానా 
చేతులకు శానిటైజర్‌ 
రాసుకునే పనినంటగడుతూ 
ఆకలిని అదిమిపెట్టడానికి 
మూతికి మాస్కుతో 
మూత వేయమంటూ 
సామాజిక దూరంతో 
సలహాలిస్తుంటే 
పగుళ్లుబారుతున్న బతుకులు 
అతుకుల కోసం 
అల్లాడుతున్నాయి 
రేపో మాపో 
రెక్కలు తెగిన కాయంతో 
ముక్కలైన గుండెకాయతో 
పురుడోసుకున్న గడ్డపై ఎగిరిపడే 
మన గూటి పక్షులను 
గుండె నెత్తుకుని 
సాంత్వన పరచే 
మాటల మలాము పూద్దాం 
నలిగిన ఆశల కొమ్మకు 
ఆపన్నహస్తపు అంటుకట్టి 
చేవనిచ్చే బట్టచుట్టి 
కొత్త చిగుళ్లతో 
గుబురుగా ఎదగనిద్దాం 
మనుషులమని నిరూపిద్దాం 
(గల్ఫ్‌ దేశాలకు ఉపాది Åకోసం వెళ్లిన భారతీయ కార్మికులకు చేయూతనివ్వాలని కోరుతూ..)
- గుండేటి రమణ, బొమ్మెన, జగిత్యాల, 9949377287


ప్రోత్సాహక బహుమతి (3)
దేశం నిలదొక్కుకుంటుంది
కాశ్మీరు నుంచి కన్యాకుమారిదాకా
స్తంభించిన జనజీవనస్రవంతి
నిర్భయ ఉషోదయాన్ని కాంచేలా
వీధులన్నీ మునుపటి కళతో సందడి చేసేలా
దండేనికి తగిలించిన జీవనాధారం భుజంపైకెక్కేలా
మన దేశం నిలదొక్కుకుంటుంది
అది యుద్ధమైనా సరే, యుద్ధంలాంటి విపత్తైనా సరే
పోరాటాలు నేర్పిన పాఠాలున్నాయి
పంట పండినట్టు ఈ దేశంలో దేశభక్తి పండుతుంది
చేతులు కలపడం కలపకపోవడమనేది ఒక యుద్ధ వ్యూహం
యుద్ధానికి తగిన సన్నద్ధం
ఈ దేశాన్ని నిలబెడుతుంది
మనిషి సుఖశాంతులు కోరుకున్నట్టే
ఈ దేశం శాంతిని, సమానత్వాన్ని కోరుకుంటుంది
ఏ కంటి అస్తిత్వం ఆ కంటిదైనా
ఏ కంటిచూపు ఆ కంటిదైనా
దేశానికి రెండు కళ్లూ ఒక్కటేననే సంస్కృతిపై
భారతదేశం నిలబడుతుంది
భీతావహ వృద్ధ నయనాలు చెమర్చకుండేలా
వణుకుతున్న ఆ గొంతులు కోలుకునేలా
కరోనాతో వృద్ధ జంటలు విడిపోయి
ప్రశ్నార్థకంగా ముడిపడిన కనుబొమలు
ఆసుపత్రి గదుల్లో కొడిగట్టక ముందే
మన దేశం కోలుకుంటుంది
మళ్లీ పెళ్లిసందళ్లు, పచ్చటి తోరణాలు, పారాణి పాదాలు
పండగలు పబ్బాలు చుట్టపు చూపులతో
విరళకాంతి సితకాంతి అవ్వాలనుంది
బడివిడిచిన పిల్లలు కన్నవారి కౌగిట్లోకి పరుగున చేరాలనుంది
పంజరాలొదిలిన పక్షుల్లా ప్రజలు విహరించేలా
ఈ దేశం నిలదొక్కుకుంటుంది
అంకెలు రాసినంత అలవోకగా
కడతేరిన నిండుప్రాణాల ఆరోహణం!
కరోనాను ప్రపంచ పొలిమేరలు దాటించేలా
ఏ శాస్త్రవేత్తో ఆపద్బాంధవుడవుతాడు
మనం పాడుకుంటాం స్వేచ్ఛా గీతాలను
మన దేశం నిలదొక్కుకుంటుంది
ఈ దేశం కళ్లలో....
ఆశలు సజీవంగానే ఉన్నాయి
మంచిరోజుల్ని స్వప్నిస్తూ.
- శాంతయోగి యోగానంద, తిరుపతి, 9110770545


ప్రోత్సాహక బహుమతి (4)
స్విఫ్ట్‌ పక్షివై...
ఆకాశంలో చుక్కల్ని లెక్కపెట్టడం కన్నా,
రోజురోజుకూ
అంతిమ శ్వాస తీసుకుంటున్న మనుషుల్ని
లెక్కించడం కష్టతరమవుతోందిప్పుడు..
మనిషి వెంట మనిషి ప్రవహిస్తూ 
జీవనదిలా సాగిపోవాల్సింది పోయి
అంతుపట్టని రోగానికి భయాన్ని కలుపుకు తిని
అదృశ్యమై పోతుంటే,
ఊరుకన్నా రుద్రభూమే పెద్దదైపోతోందిప్పుడు... 
మనిషి సముద్రాన్ని ఈదాల్సి వచ్చినప్పుడల్లా
భయం తన ముఖంలో తుమ్ములు మొలిపిస్తూనే
ఉంటుంది..
ప్రయాణాన్ని మొదలవ్వనీకుండా లంగరేస్తూనే
ఉంటుంది..
వివేకాన్ని ఎగసే అలల కింద ఆరేస్తూ,
ధైర్యాన్ని అగాధాల అంచుకు కట్టేస్తుంది...
గ్రహణం పట్టిన సూర్యునిలా
ఆశల జాడల్ని తననీడలో కలిపేస్తూ
దేహాన్ని మొత్తం ఆవహిస్తుంది...
కానీ
మనిషి ఒక్కసారి ఆలోచిస్తే ఏం జరుగుతుంది..?
ప్రగతిని పొదిగే చక్రమేదో తయారవుతుంది 
అదే సుదర్శన చక్రమై చీకటిని తురుముతూ పోతుంది.
తనను తాను నమ్మగలిగితే ఏం నిర్మితమవుతుంది..?
భూమ్యాకాశాలను కలిపే నిచ్చెన తయారవుతుంది..
తెల్ల ఏనుగు కిందకొచ్చి వ్రతాన్ని పూర్తి చేయిస్తుంది..
తాను లిఖించిన చరిత్రను తాను మరోసారి తిరగేస్తే,
ఏం గోచరిస్తుంది...?
సాధించిన విజయ పతాక రెపరెపలు కనిపిస్తాయి..
గెలుపు పిలుపులు అప్పుడే వినిపిస్తాయి...
ఓ మనిషీ..!
మరెందుకు కురుస్తున్న భయంలోనే ఇంకా తడుస్తూ,
ముద్దై ముడుచుక్కూర్చున్నావ్‌..
పడిన చోటే అస్తమించేందుకు ఉపక్రమిస్తున్నావెందుకు..?
లే... లేచి నిలబడు..
ధైర్యమే ఆయుధంగా కలబడు..
జారిపోతున్న ఊపిరిని కొసపెట్టి గుంజుకో...
నీ స్వచ్ఛతా అడుగులతో ఆ పురుగు అంతంచెయ్‌...
భయం లంగరేసిన నీ బతుకు నావను విడిపించుకో
నీవే చుక్కానివై విజయ తీరాలు చేరేవరకు...
అలుపెరగని స్విఫ్ట్‌ పక్షిలా పయనించు... 
- జగన్నాథం రామమోహన్, నెల్లూరు, 9494505636


ప్రోత్సాహక బహుమతి (5)
భావి తరాలకు బోధిస్తా!
చీకటి క్రిమిని తరిమి
వెన్నెల సేవ చేసిన
నేల చందమామలే నా డాక్టర్లంటా!
క్వారంటైన్‌ గోపురాన
కదల్లేని కపోతాలకు కొత్త రెక్కలిచ్చిన
కొంగొత్త దేవుళ్లే నా వైద్యులని నినదిస్తా!
రేయింబవళ్లకు మధ్య గీత చెరిపి
కర్తవ్య కిరణాలు కోరి మోసిన సూర్యులే
నా పోలీసులని పాఠాలుగా చెబుతా!
విరుల దారులు పరచి
భ్రమర బాటసారులకు
స్వేచ్ఛా మకరందాలు తాపిన పచ్చని చేతులే
పారిశుద్ధ్య కార్మికులని పాటగట్టి చెబుతా!
పురిటి నొప్పులు పడుతున్న
పంట తల్లికై పరితపించు
మట్టి మనిషి తపనే నా రైతని రెట్టిస్తా!
పరీక్షించు తెరువుల్లో
పాదాల కుంచెను పొడిగిస్తూ
దూరాల చిత్రాలు గీచిన
ఎండమావి మిత్రులే వలస కూలీలని వివరిస్తా!
ఆకలి పొరల మధ్య ఆక్రందించే
బతుకు విత్తుల నోటికి
ముద్ద మొలకలందించిన వారే
నా దాతృత్వ దధీచీలని చాటిస్తా!
కడలి కుటీరాలలో
కన్నీటి సుడిగుండాలు మింగి
కదలని అలల స్నేహితులే మేమని మరి మరి చెబుతా!
కలాల నాగళ్లు పట్టి పత్రికా క్షేత్రాన
దీన గాథల సేద్యం చేసిన
అక్షర హాలికుల కథలు కొత్తగా అల్లుతా!
కడకు మిగిలిన
మూడడుగుల దూరాన్ని
శిరోధార్యంగా పాటించామని ఆర్తిగా చెబుతా!
ప్రజల ప్రాణాలే
ప్రణవ నాదాలుగా గానం చేసిన
సేవామూర్తుల కీర్తులను శ్లాఘిస్తా!
ప్రకోపించకుండా
ప్రకృతి పాదాలు నిత్యం కడిగి
మనిషిని మనిషిగా ప్రేమించండని
భావి తరాలకు బలంగా బోధిస్తా!
- నల్లు రమేష్, పోలిరెడ్డి పాళెం, నెల్లూరుజిల్లా, 9989765095 


 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  అధికార భాష