ఓ పిట్ట‌క‌థ‌, ప‌లాస - స‌మీక్ష‌లు

  • 643 Views
  • 1Likes
  • Like
  • Article Share

కారుమబ్బులు వీడిపోతున్నాయి. చలనచిత్రాలు తిరిగి ‘తెలుగు బాట’ పడుతున్నాయి. మన పలుకుల తియ్యందనాన్ని పంచుతున్నాయి. ఇటీవల వచ్చిన చిత్రాల్లో పరచుకున్న తెలుగు వెన్నెల ఇది...!
చిక్కుముడుల చిట్టికథ..

ఉత్కంఠ కలిగించే ప్రేమకథ ఈ పిట్టకథ. కథానాయికని ప్రేమించేది ఒకరు, ఆ ప్రేమికుడిని తప్పించి ఆమెని దక్కించుకోవాలని మరొకరు ప్రయత్నిస్తుంటారు. చివరికి ఆ అమ్మాయి ఎవరికి దక్కిందనేది కథ. సరదాగా సాగే ప్రథమార్థ సన్నివేశాలకు తగిన సంభాషణలు దర్శకుడు చెందు రాసుకున్నవే.
      ‘ఇది సాయికోటి.. ఇందులో సాయి పేరు కోటిసార్లు రాస్తే పాసైపోతాం’ అనేంత అమాయకత్వం కథానాయికది. పాసవ్వకపోతే అని అడిగితే.. ‘పాసయ్యేదాక రాయడమే’ అంటుంది. 
      ‘మంచోడిగా ఉంటే మంచోడు అనిపించుకోవడం తప్ప ఇంకేం మిగల్దు..’ అనే తత్వం కథానాయకుడిలో అసలు కోణం. మోసాలకు పాల్పడుతూ ‘అంతా మిడిల్‌క్లాస్‌ సైకాలజీరా. డబ్బులుపోతే పోనీ.. అమ్మాయి ఇంటికి సేఫ్‌గా వచ్చేసిందిగా అనుకుంటారు’ అంటూ సరళంగా రాసిన సంభాషణలు కథకు తగ్గట్టు ఉన్నాయి.
      శ్రీజో సాహిత్యంలో ‘ఏదో ఏదో..’ పాటలో ‘కనులలో మెరిసె కల ఏదో వాలుజడై ఒలికె కళ ఏదో పిలుపులో చిలిపి చనువేదో.. చెప్పెనేదో’ అంటూ సాగే కొత్త వ్యక్తీకరణలు యువతను ఆకట్టుకుంటాయి. మరో పాట ‘ఏమైపోతానే మనసిక ఆగేలా లేదే..’లో నా జగమంటూ.. నీ సగమంటూ.. వేరుగ లేదంటే.. అదిరే గుండెల చుట్టూ కావలి కాస్తూ ఊపిరినివ్వాలే అన్న ప్రేమతత్వం బావుంది. 


జీడిపలుకుల యాస.. పలాస!
జాతి వైషమ్యాల నేపథ్యంలో సాగే కథ పలాస 1978. తక్కువ కులస్థులుగా కథలో చిత్రించిన పాత్రలు మోహన్రావు, రంగారావు. వీళ్లు గజ్జెకట్టి ఆడే కళాకారులు, అన్నదమ్ములు. వీళ్లను అవసరాలకు తగ్గట్టు రెచ్చగొట్టి వాడుకున్న పెద్ద కులస్థులుగా పెదషావుకారు, చినషావుకార్లు కనిపిస్తారు.
       కథకు బలాన్నిచ్చేలా రాసుకున్న సంభాషణలు ప్రతి సన్నివేశానికీ సహజత్వాన్ని అందించి రక్తికట్టిస్తాయి.  
‘మేము గజ్జెలు కట్టుకోవడం మానేసి కత్తులు పట్టుకున్నాము.. బురదలోన దిగిపోయినాము. కాళ్లు కడుక్కోడానికి నీళ్లు సరిపోవు..’ అంటాడు  జానపద కళాకారుడు మోహన్రావు నిరాశలో కూరుకుపోయిన గొంతుతో. ‘కత్తి సేసినోడిదికాదు బావా తప్పు.. ఆ కత్తి పట్టుకున్నోడిది..’ అంటుంది అతడి  భార్య. తమ్ముడి వైఖరిని చూసి ‘మనము కళాకారులమురా. రౌడీలము కాము. ఆళకోసం మనము రౌడీలయినాము. మనము జెండాలు కడితే ఆళు లీడర్లయినారు..’ అని బాధపడతాడు రంగారావు. ప్రతినాయక పాత్రధారి ‘సొంత తమ్ముణ్ని సంపాలంటే ఆలోచనవస్తాది. తప్పులేదు. కాని.. మనం ఎదగడం కోసంసేసే ఏ పని కూడా తప్పుకాదు..’ అంటూ ఒకవైపు రెచ్చగొడుతుంటే, ‘మీ మనుషులె ప్పుడైనా గెలిసినారా.. ఆల్లెప్పుడూ మా గడప దగ్గర కుక్కలే. కాకపోతే ఆళు మెడకు బెల్టు లేని కుక్కలు. నీలాంటి పోలీసోల్లు మెడకి బెల్టులున్న కుక్కలు..’ అంటూ గురుమూర్తి అహంకారం ప్రదర్శిస్తాడు. ‘భయానికి బలమెక్కువ.. ముందు పలాసలో భయాన్నిపోగొట్టేస్తే షావుకారి కేసులో సాక్ష్యం చెప్పడానికి ఎవ్వళూ బయపడరు..’ అంటూ ఎస్సైతో చెప్పించడం సందర్భోచితంగా ఉంది.
      పాటల్లో ‘బావొచ్చాడోలప్పా బావొచ్చాడు’ జానపదం సామాజిక మాధ్యమాల్లో హుషారుగా వినపడుతోంది. ‘ఎడంకాలికేసినాడు ఎర్రటి జోటు.. ఆడు కుడికాలికి ఏసినాడు కర్రిటి జోడు..’ అంటూ సాగే సరదా సాహిత్యం గిలిగింతలు పెడుతుంది. పలాస ఊరి విశేషాలన్నీ రంగరించిన భాస్కరభట్ల సాహిత్యం ‘ఏ ఊరు ఏ ఊరే ఒలె భామా.. నీది ఏ ఊరే..’. ఇందులో బుడబుక్కల దరువుతో జీడితోటల సింగారాలు, ఎగిరే కొంగల కోలాటాలూ పలాసా విలాసాలన్నీ కళ్లముందు కనిపిస్తాయి. దర్శకుడు కరుణకుమార్‌ రాసిన పాట.. ‘సింత సెరువులోన కప్పల మంద బెకాబెకామన్నాది. ఎర్రసెరువుగట్టు ఎద్దుల మంద పదాపదామన్నాది.. సూరీడెల్లి సందురుడొచ్చే రాతిరి పూటల్లో.. ఎన్నెల పాటే ఇనిపించింది ఏకువ జాముల్లో..’ సంగీత ప్రియులకు కానుక.


 


వెనక్కి ...

మీ అభిప్రాయం