కరోనాపై కదనం - చివరి రోజు (ఏప్రిల్‌, 30) పోటీ ఫలితాలు

  • 1607 Views
  • 8Likes
  • Like
  • Article Share

ప్రథమ బహుమతి

ప్యార్‌ కరోనా...

అగుపించని శత్రువుతో
ఆయుధం లేని యధ్ధమంటే
కత్తి మీది సామే
నీడలా వెంటాడే
భయం గుప్పెట నలుగుతూ
జీవన్మరణాల హద్దులు ఎంత
సరిచూసుకుంటున్నా
సాగనివ్వక సర్దుకుపోనివ్వని జీవితం
దారులన్నీ మూసుకుపోయినా
మది గది తలుపులు తెరుచుకొని
పేరు తెలియని మరణాలకు కన్నీరవుతున్నాం
ఖండాంతర కల్లోలాలకు కలవరపడుతున్నాం
మానవహారాలకు బలమైన దారాలు పేనుతూ
పలవరించేదొక్కటే... బతుకూ.. బతికించూ
ఇప్పుడు కలుసుకునే కళ్లు కత్తులు దూయట్లేదు
నోళ్లు మాట్లాడుతున్నా నొసళ్లు వెక్కిరించట్లేదు
మనసు పొరుగు పచ్చదనాన్ని కోరుతోంది
ప్రేమ మధువుని పూసుకుని 
పెదాలు నిండుగా పలకరిస్తున్నాయి
ఆలింగనాలు లేకున్నా
ఆపన్నహస్తాలు ఆసరాగా నిలుస్తున్నాయి
నిన్నువలె నీ పొరుగువారిని
ప్రేమించమంటున్నాయి.
ఇప్పుడు మండు వేసవిలోనూ
నేల నిండు స్వచ్ఛంగా స్నానం చేస్తోంది
స్వేచ్ఛా రెక్కలనాడిస్తూ
పక్షులు ఆకాశాన హాయిగా ఎగురుతున్నాయి
నీడలు లేని నదీముఖం నిర్మలంగా మెరుస్తోంది
కాలుష్యం తోకముడిస్తే
ఆలింగనానికి ప్రకృతి ప్రేమగా చేతులు సాచింది.
లోకం రణరంగమైన విషాదానికి కరిగి
‘ప్యార్‌ కరోనా’ అంటూ కదిలి
పగలు కూడా చీకటిపూసే నిరాశలో
వారు గోరంత వెలుగు నింపుతున్నారు
కొండెక్కే జీవితాలకు ప్రాణాలొడ్డి
పనిముట్లతో మానవతకు గుడి కడుతున్నారు
ప్రకాశవంతమైన సూర్యోదయమొకటి
మనకోసం వేచివుందన్న నమ్మికతో
పోరాట స్ఫూర్తితో
రేపటికోసం జయకేతనమొకటి
సిధ్ధం చేద్దాం రండి.
- శారద ఆవాల, విజయవాడ, 9295601447

ఈ కవితను వినాలనుకుంటే...


ద్వితీయ బహుమతి

బతుకు చెమ్మ
మిగల మగ్గిన మామిడి పండు
చెట్టున వేలాడుతోంది
కాసేపట్లో రాలడానికి సిద్ధపడుతోంది
వంగిన వరికంకి నిండా
పసిడి జిలుగులు
నేలకు అంటి మొలకెత్తాలనుకుంటోంది
కోయని కూరగాయలు
కుళ్లిన గాయాలై
మొక్కనో పాదునో అతుక్కునే ఉన్నాయి
రైతు మాత్రం దిక్కులు చూస్తున్నాడు
దణ్నం పెడదామంటే
ఏది తూర్పో ఏది పడమరో తెలీక
దిక్కులు పిక్కటిల్లేలా రోదిస్తున్నాడు
దిగులు భారం మోసే
భుజం ఉంది శక్తి ఉంది
బద్దలైన అద్దాన్ని
అతికించే పనిముట్లున్నాయి
తెగిన దారం
దానికదే ముడిపడుతుందని చూస్తున్నాను
శూన్య గోళాన
గతంలా సంచరించే జనాలు
సమూహంగా మసిలే
రోడ్ల సందళ్లు
నింగికి ఎగిరే
ఆకాశయానపు విహారాలు
బహిరంగ విపణిలో
చిట్లని అమ్మకాలు కొనుగోళ్లు
నీటి పొరలు అలుముకున్న కళ్లల్లో
తేటదనపు కాంతులు
ఉపశమనపు పన్నీటి జల్లులు
నా ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేస్తున్నాయి
కొత్త పదబంధాలు
మానవీయతను బోధిస్తున్నాయి
కరోనా సందేశాలు
బతుకు చెమ్మ రుచిని చూపిస్తున్నాయి
నేనిప్పుడు వజ్ర సంకల్పుణ్ని
నేనిప్పుడు అగ్ని పునీతుణ్ని.
- దాట్ల దేవదానం రాజు, యానాం 9440105987

ఈ కవితను వినాలనుకుంటే...


తృతీయ బహుమతి

కొత్త ప్రపంచం
ముసిరిన చీకట్లలోంచి వెలుగులు తొంగి చూస్తున్నట్లు 
లాక్‌డౌన్‌ సడలింపుతో మెల్లగా తలుపులు తెరచుకుంటాయి.
కొన్ని అడుగులు ప్రపంచంలోకి కదులుతాయి..!!
బతుకుపాట పాడాలంటే తలుపు తెరవాల్సిందే 
పొట్టచేత పట్టుకుని పరుగులు పెట్టాల్సిందే 
రెక్కాడితేగాని డొక్కాడని జీవన స్థితిగతులను మార్చాల్సిందే..
జీవన విధివిధానాలను ఒక క్రమపద్ధతిలో పేర్చాల్సిందే..!!
అసలు ఓనమాలు దిద్దాల్సిన తరుణమిదే..
ఇప్పుడు కావాల్సింది ఉరుకులు పరుగులే కాదు 
నిన్నటిని మించిన ఓర్పూ.. నేర్పూ.. 
బతుకు మీద ఆశ.. భవిత మీద ధ్యాసతో 
రేపటి జీవితాన్ని గెలిపించి నడిపించాలి..!! 
నిన్నటి నిర్బంధపు పాఠాలను.. 
కాలం నేర్పిన గుణపాఠాలను 
మరోసారి మననం చేసుకొని కాలు కదుపుదాం..
నిర్లక్ష్యపు జాడలను తరిమేద్దాం..
మానవత్వంతో చేయూతనిచ్చి 
మనల్ని నడిపించిన మార్గదర్శకులకి 
జోహార్లు కొడదాం..!! 
కొన్నాళ్లు విడివిడిగానే అడుగులు వేద్దాం 
మాస్కులతో ఇంకొన్నాళ్లు ఇలాగే కొనసాగుదాం 
జనజీవన జగతిలో.. నవజీవన శాంతికై 
మహనీయులు నడిచిన నేలని 
మరోసారి కళ్లతో మనసారా తడుముకొని 
మళ్లీ కొత్తగా ప్రపంచంలోకి అడుగేద్దాం..
మనిషిగా తీర్చిదిద్దుకుని సరికొత్త ప్రపంచాన్ని 
పునర్మించుకుందాం..!! 
- స్వప్న మేకల, హైదరాబాద్, 9052221870

ఈ కవితను వినాలనుకుంటే...


ప్రోత్సాహక బహుమతి (1)

చెమట పాదాల నడక
రోడ్లు
చెమట పాదాలతో
నడుస్తున్నాయి
ఎంత నడిచినా
తొవ్వ తరుగుతలేదు
పెయ్యిమీది భయం కుబుసం
తొలగిపోతలేదు
నడక.. నడక...
అశోకుడు నాటించిన చెట్లే
ఇరువైపులా ఆశ్రయమిస్తున్నాయి
పచ్చని ఆకులు పత్రహరితాన్ని విడిచి
కన్నీరుమున్నీరైనాయి
పట్నం ఎండమావుల్లో
ఎంత తోడుకున్నా
ఏమీ మిగలడం లేదు
కడుపొక చేతుల
రెక్కల్లేని బిడ్డలొక చేతుల
నడక.. నడక.. నడక..
అవ్వా, నాయినా
కంఢ్లళ్ల మెదులుతుండ్రు
అన్నం పెట్టిన తల్లె
మాటిమాటికి మతికస్తోంది
ఆవుసు పోసిన పల్లె
రమ్మని పిలుస్తోంది
కరోనా పుణ్యమా అని
కూలివాడలన్నీ వెలివాడలైనాయి
పుట్‌పాత్‌లు, పార్కులే
ఆదరించిన కన్నతల్లులు
ఆకలి అవసరాలు
అడ్డామీద బేరాలైనాయి
ఏమాత్రం లింకులేని
ఆధార్‌ కార్డుల లంకె
బతుకులకు ఆధారమైంది
పేదరికానికి ఎన్ని ఫొటోలో
పేజీలన్నీ నిండినయి
ఎండిన డొక్కలంటే ఎంత పాయిరమో
పోటాపోటీగా పొట్లాల పంపిణీ
తాళం తెరిచేలోగా
ప్రాణాలు ఆగేటట్టు లేవు
గమ్యం వచ్చినా రాకున్నా
బొబ్బలు బొబ్బలయిన
కూలి బతుకుల ఆకలి శ్వాసలు
నిలిచేటట్టు లేవు..
నడక.. నడక.. నడక...
- డా।। పత్తిపాక మోహన్, సిరిసిల్ల, 9966229548


ప్రోత్సాహక బహుమతి (2)

ఈ దుఃఖం ఇలాగే ఉండిపోదు
సంతోషాలు ఎప్పుడూ పైమెట్టు మీదే ఉంటాయి
దుఃఖం చాపలా కిందే పడుంటుంది
ఒకచోట ఆనందం
మరోచోట విషాదం
భిన్నపార్శ్వాల జీవితం
జీవితం రెండుగా విడిపోయిన చోట
ఒకరి దుఃఖాలు మరొకరికి సంతోషాలు కావు
సంతోషాలన్నీ ఒకేలా ఉన్నా
దుఃఖాలు వేరు వేరుగా ఉంటాయి
ఏ దుఃఖాన్ని కదిపినా
ఆకలి కేకలే వినిపిస్తాయి
ఏ గాయాన్ని తాకినా
బాధల శకలాలే రాలుస్తాయి
ఒక్కో దుఃఖం
జీవితకాలానికి సరిపడే పాఠం నేర్పుతుంది
అనాధది ఒక దుఃఖం
ఆకలిపేగుది ఒక దుఃఖం
దుఃఖాలన్నీ ఒకచోట చేరి
లోకంలోని ఆకలికోసం చర్చిస్తున్నాయి
బయట నిర్మానుష్యపు చీకటి
ఎటు వెళ్లాలన్నా భయం
కరోనా భయం కన్నా
ఆకలి భయమే ఎక్కువగా వెంటాడుతోంది
యుద్ధం ఆగేటట్టులేదు
లాక్‌డౌన్‌ సడలింపూ లేదు
ఎండిన కొమ్మల్లా మనుషులు
ఇంటి చెట్టు కిందే వాలిపోతున్నారు
నట్టింట్లో ఆకలి చీకట్లు కమ్ముకున్న వేళ
కన్నీళ్లు దిగమింగుతూ
కాలం నెట్టుకురావాల్సిందే
కరోనా వచ్చినా కార్చిచ్చు వచ్చినా
రేపటి రోజు భయానకమే
నిరాశానీడలు పరచుకున్న చోట
అణగారిన బతుకులు
ఆపన్నహస్తం కోసం చూస్తున్నాయి
ఈ దుఃఖం ఇలాగే ఉండిపోదు
అంతా కుదుట పడ్డాక
మళ్లీ సంతోషం కళ్లజూడొచ్చు
- చొక్కర తాతారావు, విశాఖపట్టణం, 6301192215


ప్రోత్సాహక బహుమతి (3)

అయినా.. గెలుపు నీదే! 
యుద్ధం అర్థం మారుతోంది!
యుద్దమంటే 
అనాది నుంచి
ఆధునిక యుగం వరకు
త్రివిధ దళాల్ని రణరంగాన మోహరించే
పడికట్టు పద్ధతి కాదు
పోటీపడి అత్యాధునిక ఆయుధాలు
కూర్చుకోవడం కాదు
దేశ సరిహద్దుల్లో ఎదుర్కొనే
సంప్రదాయ బాహ్యశత్రువు కాదు
భౌతిక ఆక్రమణలు
విధ్వంసాలు క్షతగాత్రులు
మరణ రాసులు కానేకాదు
యుద్ధం తీరు మారుతోంది!
యుద్దమంటే
గాంధేయం
కాలు కదపకుండా
పెదవి పలుకకుండా
తలుపు లోపలి నుంచి
తలపులతో చేసే
కట్టడి పోరాటం
రణం రూపు మారుతోంది!
రణమంటే
రక్తమోడే గాయాలకు
మలాం పూయడం
ఊపిర్లు ఊది
ప్రాణాలు పోయడం
వైద్యులూ సఫాయిలూ పోలీసులే
సైనికులు
స్టెతస్కోప్‌- ఇంజక్షన్లు
పార- చీపుర్లే
అస్త్రశస్త్రాలు
ఆవాసాలు వినువీధులు వైద్యశాలలు
నేటి రణక్షేత్రాలు
శత్రువు నువ్వే
పోరాడే సైనికుడు నువ్వే
యుద్ధస్థలీ నువ్వే
తాబేలులా తలను ఇంట్లోకి ముడుచుకోవడం
ఉష్ట్ర పక్షిలా మాస్కుల్లో ముఖాన్ని దూర్చడం
అరచేతుల్లో గంగ ప్రవహించడం
గెలుపు రహస్యం
గెలుపంటే మరేం లేదు
ఇప్పుడు బతకడం
- పిన్నంశెట్టి కిషన్, హైదరాబాదు, 9700230310


ప్రోత్సాహక బహుమతి (4)

మట్టి పాదాలు
ఆ పాదాల నిండా
గుచ్చుకున్న ముళ్లున్నాయి
ముళ్లు చేసిన గాయాలున్నాయి
గాయాల్లాంటి అనుభవాలున్నాయి
ఆ పాదాల నిండా
తెరిచిన పుస్తకాల్లాంటి పగుళ్లున్నాయి
ఆ పగుళ్లలో
చెమట, కన్నీటి సముద్రాలున్నాయి
ఎవరో వేసిన దారుల్లో
పూలుపరచి పిలిస్తే
వచ్చి వాలే లలిత చరణాలు కావవి
చావుకు ఎదురు నిలబడి
జీవితాన్ని గెలుపొందేవి
కాలం కత్తి అంచున
అచ్చెరువొందే విన్యాసాలు ప్రదర్శించేవి
ఆకలి పేగుల మీద
బతుకును బ్యాలెన్స్‌గా నడిపేవి
వేల మైళ్ల దూరాన్ని పొదిగిన
మట్టి పాదాలవి
అవి మొదట సన్నటి కాలిబాటగా మొదలై
సమూహాలై
కూడళ్ల దగ్గర కూడి
మళ్లీ పాయలై చీలిపోతాయి
దేశాన్ని అక్కున చేర్చుకొని
చంటి పాప మాదిరి
జోలపాడి, ఊయలూపి నిద్రబుచ్చుతాయి
అవి పాదుల్లాంటి పాదాలు
రెక్కలున్నా ఎగిరిపోవు
అవి ఎండకి నీడనిచ్చే
గొడుగుల్లాంటి పాదాలు
తప్పుకొనేవి కావు
ఇప్పుడవి
పుండైన గుండెకు నమూనాలు
పచ్చటి పసరు పూసే
ఆకుల్లాంటి చేతులు కావాలి
పట్టుకొని కట్టుకట్టే
గాజు గుడ్డలాంటి మనసు కావాలి
విడిదినిచ్చి సేదదీర్చే
చెట్టులాంటి మనిషి కావాలి
ఆ పాదాలను సల్లంగ ఇల్లు చేర్చాలి
- పెద్దిపాగ పున్నారావు, పాలపర్రు, 8919130533


ప్రోత్సాహక బహుమతి (5)

కొన్నాళ్లే ఈ కన్నీళ్లు...
కొన్నాళ్లే ఈ కన్నీళ్లు
ఇంకొన్నాళ్లే ఈ సంకెళ్లు
నీకూ నాకూ సమాజానికి మధ్య
గీసిన ఈ సామాజిక దూరపు గీత
నువ్వో పక్క నేనో పక్క
చెరుపుకుంటూ దగ్గరయ్యే
రోజొకటి రానే వస్తుంది 
మాస్కుల వలలకు భయపడి
సొంతింట్లో దాగిన మాటల మీనులు
స్వేచ్ఛగా వీధుల చెరువుల్లో ఈదే
రోజొకటి రానే వస్తుంది
ఆంక్షల ఎగతాళి చూపులకు వెరసి
స్వీయ నిర్భందపు కవచాల్లో
దూరిన గొంగళిపురుగులు
స్వేచ్ఛగా సీతాకోకలై ఎగిరే
రోజొకటి రానే వస్తుంది
అడుగు బయట పెట్టకుండా
అడ్డుపడ్డ రక్షణ శృంఖలాలు
పటాపంచలై సమూలంగా తొలగే
రోజొకటి రానే వస్తుంది
అలికిడులు అల్లర్ల పాటలు
కరవైన పార్కుల తోటలు
కోయిలలై శ్రావ్యంగా కూసే 
రోజొకటి రానే వస్తుంది
రహదారి చెట్లపై రద్దీల పక్షులై
కువకువల నాదాలు
పలికించిన వాహనాలు
జోరుగా తమ హోరును వినిపించే
రోజొకటి రానే వస్తుంది
కణకణ నిప్పుల కరోనా గ్రీష్మాలకు
మండూకాలైన కూలీ బతుకులు
సుప్తావస్థను వీడే
రోజొకటి రానే వస్తుంది
కూటికి చోటుకు కరువై
వలసల బతుకే బరువై
చీకట్లు నిండుకున్న ఆశలకు
వెలుగు దివ్వెలు పూసే
రోజొకటి రానే వస్తుంది
నిత్యం కోవిడ్‌ వార్తల స్తోత్రాలతో
నిద్రలేచిన ఉదయాలు
సంతోషపు సమాహారాల్ని
ఏదో ఒకరోజు తేనే తెస్తుంది
- జి.మహేందర్, నాగులమల్యాల, కరీంనగర్, 9177806073


ప్రోత్సాహక బహుమతి (6)
ముగింపు
దేనికైనా ఒక ముగింపు ఉంటుంది
ఏ కథకైనా కవితకైనా ఒక ముగింపు ఉన్నట్లే
ఏ వ్యథకైనా ఒక ముగింపు ఉంటుంది
ఉంటుంది 
దేనికైనా ఒక ముగింపు వుంటుంది
కొన్ని చీడపీడల శిశిరం తరువాత
ఒక వసంతపు రాక తప్పక ఉంటుంది
ఒక తుపాను బీభత్సం ముగిశాక
ఒక ప్రశాంతత పావురంలా వచ్చి వాలుతుంది
ఒక పాడుకాలం మోడై కూలాక
ఒక కొత్త చిగురు కోకిల పాటై వినిపిస్తుంది
ఎంత పెద్ద వికటాట్టహాసానికైనా
ఒక చిరునవ్వుతోనే ముగింపు ఉంటుంది
ఉంటుంది 
దేనికైనా ఒక ముగింపు ఉంటుంది
కొంత అల్పపీడనం తగ్గాక
సముద్రం గూటి పడవయ్యే ఊగుతుంది
కొంత అల్లకల్లోలం ముగిశాక
జీవితం చిన్న నీటితరగల్లానే సేదదీరుతుంది
ఎంత ఉరుముల మెరుపుల వానకైనా
ఒక చిరుజల్లు ముగింపే ఉంటుంది
ఉంటుంది
దేనికైనా ఒక ముగింపు ఉంటుంది
కొన్ని కన్నీళ్లు కురిశాక
ఒక ఆనందభాష్పం తప్పక పలకరిస్తుంది
అనేక దుఃఖకాలాలు కరిగాక
ఒక సంతోష సమయం
తప్పక హృదయాన్ని తాకుతుంది
ఒక సంక్షోభ కెరటం శాంతించాక
ఒక ప్రశాంతత అలై అలిసిన
మన పాదాలను తడుపుతుంది
ఎన్ని యుద్ధ బీభత్సాలకైనా
ఒక శాంతి ముగింపే తప్పక ఉంటుంది
ఉంటుంది 
దేనికైనా ఒక ముగింపు ఉంటుంది
ఏ కథకైనా కవితకైనా ఒక ముగింపు ఉన్నట్టే
ఈ కరోనా వ్యథకీ తప్పక
ఒక ముగింపు ఉంటుంది
దేనికైనా ఒక ముగింపు ఉంటుంది
ఒక అర్థవంతమైన ముగింపుతో పాటు
ఒక ఆకురాలే సంక్షోభం
ఒక పురుగు ముట్టిన సందర్భం
ముగింపునకు చేరాక
చిగురించే వసంతంలాంటి
ఒక సరికొత్త ప్రారంభమూ
తప్పక ఉంటుంది!
- చిత్తలూరి, హైదరాబాదు, 8247432521


 

                                                                                   అపూర్వ స్పందనకు కృతజ్ఞతాంజలి
కరోనా విలయంతో తల్లడిల్లుతున్న ప్రజలకు ధైర్యం చెప్పేందుకు, వారిలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకు తెలుగువెలుగు.ఇన్‌ ఆధ్వర్యంలో రామోజీ ఫౌండేషన్‌ నిర్వహించిన ఈ రోజు వారీ కవితల పోటీ దిగ్విజయవంతం అయింది. పోటీకి ఆహ్వాన ప్రకటన వెలువడింది మొదలు రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాక అన్ని ప్రాంతాల్లోని, దేశాల్లోని తెలుగు కవులు సమధికోత్సాహంతో స్పందిస్తూ వచ్చారు. సబ్బండ వర్ణాల సంవేదనల్నీ ఆవాహన చేసుకుని ఎప్పటికప్పుడు అద్భుతమైన కవితల్ని సృజించారు.
      ఈ పోటీకి దాదాపు 20 వేలకు పైగా కవితలు వచ్చాయి. ఒక విపత్తు నేపథ్యంలో కేవలం 30 రోజుల వ్యవధిలో ఇన్ని వేల కవితలు వెలువడటం అరుదైన క్రతువుగా భావిస్తున్నాము. ఏ రోజుకారోజు ఎన్ని కవితలు వచ్చిందీ ప్రకటించాము. వచ్చిన ప్రతి కవితనూ రామోజీ ఫౌండేషన్‌ సంపాదకవర్గంలోని ముగ్గురు సభ్యుల ప్రత్యేక బృందం నిశితంగా పరిశీలించింది. రోజూ సుమారు 15 నుంచి 30 వరకూ మొదటి దశ వడపోతను దాటుకుని వచ్చేవి. వీటిలో భాష, శైలి, వస్తువు, సమకాలీనత, ప్రతీకలు, శిల్పం, ప్రయోగాలు, సందేశం... ఇలా పలుకోణాల్లో పరిశీలించి, చర్చించి బహుమతులకు ఎంపిక చేశాము. మొదటి మూడు స్థానాలకూ అర్హమైన కొన్ని కవితలు నిడివి ఎక్కువగా ఉండటం వల్ల అవకాశాన్ని కోల్పోయాయి. రోజూ అన్నింటికీ బహుమతులు ఇవ్వడం, ప్రచురించడం సాధ్యం కాదు. వస్తున్న కవితలను చూసి మొదట్లో 6 అనుకున్న బహుమతుల సంఖ్యను 8కి పెంచాము. కొందరు ఒకటి కన్నా ఎక్కువసార్లు బహుమతులు సాధించారు. బహుమతి వచ్చినా, రాకపోయినా కొంత మంది రోజూ క్రమం తప్పక కవితలను పంపడం ముచ్చట కలిగించింది. విజేతల్లో తొలిసారి కవితని రాసిన వారి నుంచి, కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీతల వరకూ ఉన్నారు.
      ప్రథమ బహుమతి కవితలను ఈనాడు దినపత్రిక, ఈనాడు.నెట్‌లలో ప్రచురించాము. నెలరోజుల పాటు వరుసగా కవితలను ప్రచురించడం 46 ఏళ్ల ఈనాడు ప్రస్థానంలో ఇదే తొలిసారి. రోజూ ప్రథమ, ద్వితీయ, తృతీయ కవితలను నాలుగు కేంద్రాల నుంచి ప్రసారం అవుతున్న ఈ.ఎఫ్‌.ఎం. రేడియోలో వినిపించాము. ఆ ఆడియోలను ఫేస్‌బుక్, టెలిగ్రాం యాప్‌లో తెలుగువెలుగు ఛానల్‌లలో కూడా అందించాము. రోజూ 8 బహుమతి కవితలనూ  తెలుగువెలుగు.ఇన్  లో ప్రచురించాము. ఉత్తమంగానే ఉన్నా ఈ పోటీలో బహుమతులు రాని చాలా కవితలు ఇతర పత్రికల్లో, సైట్లలో, ఫేస్‌బుక్‌లో, బ్లాగుల్లో ప్రచురితమయ్యాయి. ‘కరోనాపై కదనం’ పోటీ స్ఫూర్తితో రోజూ వివిధ కోణాల్లో కవితల్ని రాశామని చాలా మంది కవులు తెలియజేశారు. ఇదంతా ఎనలేని భాషా, సాహితీ సేవే.
      సాహిత్య చరిత్రలోనే అరుదైన ఈ సందర్భంలో అపూర్వ కవితా సంపద పోగుపడింది. ఇదంతా భాష, సాహిత్య, సామాజిక పరిశోధకులకు, విశ్లేషకులకు అద్భుతమైన ముడి సరుకు. మరెక్కడా దొరకని సాహితీ నిధి. దీన్ని భద్రపరిచి, భావితరాలకు అందించాలని తలపెట్టాము. మాకందిన వాటిలో పునరుక్తులు, అభ్యంతరకర భావాలు, పదజాలం ఉన్న కవితల్ని మినహాయించి మిగిలిన అన్నింటినీ  తెలుగువెలుగు.ఇన్  లో మూడు విభాగాలుగా ప్రచురించాలని భావిస్తున్నాము. ఈ విషయంలో ఏవైనా అభ్యంతరాలుంటే తెలియజేయవలసిందిగా కోరుతున్నాము.
       ఆ విధంగా మన కవుల సృజన, ఆ కవితా సుమాలన్నీ శాశ్వతత్వాన్ని సంతరించుకుంటాయన్నది మా ఆకాంక్ష. బహుమతి కవితలకు త్వరలో పారితోషికాలను విజేతల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తాము. తెలుగువెలుగు.ఇన్  లో ప్రచురించే మిగిలిన కవితలకు ఎలాంటి పారితోషికమూ ఉండదు. వాటిని కవి పేరు, ఫొటోలతో ప్రచురిస్తాము.
      ఈ కవితా యజ్ఞంలో పాలుపంచుకున్న వారందరికీ నిర్వాహక సంస్థ రామోజీ ఫౌండేషన్, నిర్వహణ భాగస్వాములు ఈనాడు, ఈటీవీ, ఈటీవీ భారత్, ఈ.ఎఫ్‌.ఎం. సంస్థలు హృదయపూర్వక హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాయి.
      కరోనాపై మనం విజయం సాధించాలని, ప్రతి ఒక్కరి జీవితాల్లోనూ వెలుగుపూలు పూయాలని ఆకాంక్షిస్తూ...
                                                                                                                                       - రామోజీ ఫౌండేషన్‌


ఎస్‌పి.బాలు అభినందన
2 తేదీన ప్రథమ బహుమతి పొందిన తంగెళ్ల రాజగోపాల్‌ ‘మనిషిని నేను’ కవితను ఈనాడులో చదివిన ప్రముఖ సినీ గాయకులు ఎస్‌.పి. బాలు ఆ కవిని అభినందిస్తూ, దాన్ని పాడి ఆడియోను మీడియాకు విడుదల చేశారు. 28వతేదీన ప్రథమ బహుమతి పొందిన దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి రచన ‘రోడ్లు చిగురించాలి’ని పాడి ఫేస్‌బుక్‌లో పోస్ట్‌ చేశారు. ఇవి రెండూ సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా ప్రచారంలోకి వచ్చాయి. ఎజ్రాశాస్త్రి ‘ఎంత ఆర్ద్రంగా, ఆర్తిగా రాశారు’ అని ప్రశంసించారు. ‘మిత్రులారా చేతనైన సాయం చేద్దాం. ఆకలిని పూర్తిగా తుడిచెయ్యలేకపోవచ్చు. మనం చిన్న త్యాగం చేసైనా పది మందికీ సహకరిద్దాం. సర్వేజనా సుఖినోభవంతు’ అని బాలు పిలుపునిచ్చారు.

 

 


వెనక్కి ...

మీ అభిప్రాయం

  అధికార భాష