శ్రీరాములు తండ్రిగా సీతమ్మ తల్లిగా..

  • 95 Views
  • 0Likes
  • Like
  • Article Share

    సాహితీసుధ

మానవ జీవవ అవస్థలన్నింటిలోనూ భాగం పంచుకున్న సీతారాములు జానపదుల దృష్టిలో ఆకాశంలో తిరిగే దేవతామూర్తులు కాదు, రక్తమాంసాలున్న సామాన్యజీవులు. అందుకే సీతమ్మ తెలుగింటి ఆడపిల్లలా ఆడి పాడింది. సమర్త పాటలకి పరవశించిపోయింది. అప్పగింత పాటలప్పుడు వేదనతో పరితపించింది. పతిని తలచుకుంటూ అడవిలో దీనంగా విలపించింది. సీతారాముల గురించే కాదు.. లక్ష్మణదేవర నవ్వు, ఊర్మిళాదేవి నిద్ర, లంకాదహనం, కుశలవ చరిత్ర అంటూ సమస్త రామాయణాన్నీ పాటగా మలుచుకున్నారు పల్లీయులు.  
రంగనాథ
రామాయణం మొదలు రామాయణ కల్పవృక్షం వరకూ తెలుగులో అనేక రామాయణాలొచ్చాయి. ఇవన్నీ వాల్మీకి రామకథాశ్రయమే అయినా వేటికవి ప్రత్యేకమైనవి. తెలుగు సాహిత్యానికి వన్నెలద్దిన ఆ కావ్యాలకు తోడుగా ఇప్పటికీ రామకథ కొత్తగా వినబడుతూనే ఉంది. వివిధ ప్రక్రియల్లో వికసిస్తూనే ఉంది.
కూజంతం రామరామేతి మధురం మధురాక్షరమ్‌
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్‌ 

      వాల్మీకి కోకిల చెప్పని మధురమైన రామాయణ ఘట్టాలనేకం జానపదుల నోట పాటలుగా ప్రవహించాయి. రంగనాథ భాస్కరాది రామాయణాల్లో అవాల్మీకాలైన విశేషాలు అనేకం కనిపిస్తాయి. ఇవన్నీ శిష్టరామాయణాల్లో లేని చిత్రమైన, సొగసైన రాములోరి కథామందారాలు. శారదకాండ్రు పాడే రామకథని వింటే పల్లీయులకు తెలిసినంత రామాయణం పండితులకి తెలియదేమో అనే సందేహం కలుగుతుంది. 
      సురవరం ప్రతాపరెడ్డి ‘రామాయణ విశేషములు’ అనే రచనలో వాల్మీకి చెప్పని చమత్కారాలను ప్రస్తావించారు. ఆరుద్ర.. రాముడికి సీతేం అవుతుందనే సందేహం తీర్చారు. జనప్రియ రామాయణం ద్వారా పుట్టపర్తి నారాయణాచార్యులు కొత్త దృష్టిని కలిగించారు. పండిత పామర జనరంజకంగా రామకథని ప్రవచించారు ఉషశ్రీ. ఇవన్నీ ఒక ఎత్తు అనుకుంటే జానపద బాణీలో రచనలు చేసిన కరణం ఆదినారాయణ దాసు ‘సూక్ష్మ రామాయణం’, లాడె సుందర నారాయణ ‘రామకథా సుధార్ణవం’ లాంటివి మరోఎత్తు. వీటన్నింటికీ భిన్నంగా జానపదులు పాడుకునే శాంత గోవింద నామాలు, పెండ్లి గోవింద నామాలు, శారద రామాయణం, శ్రీ మద్రామాయణ గొబ్బిపాట ఇవన్నీ ఇంకో ఎత్తు. ప్రత్యేకంగా స్త్రీలు పాడుకునే రామాయణ పాటలున్నాయి. ఇవి ఈనాటికీ పల్లీయుల గొంతుల్లో తారంగమాడుతున్నాయి. వీటన్నింటినీ సేకరించి శ్రీపాద గోపాలకృష్ణమూర్తి స్త్రీల రామాయణపు పాటలుగా వెలువరించారు. కోలవెన్ను మలయవాసిని ‘జానపద సాహిత్యం- రామాయణం’లో ఇలాంటి పాటలనే కొన్నింటిని విశ్లేషించారు. సీతాకల్యాణం, ఊర్మిళాదేవి నిద్ర, లక్ష్మణదేవర మూర్ఛ, శ్రీరామ పట్టాభిషేకం లాంటి పాటలు జానపదుల నోటనే కాదు బిక్షుగాయకుల గొంతున గుప్తనిధులుగా నిలిచి ఉన్నాయి. సీతమ్మను తమ ఇంటి ఆడపడుచుగా.. పంచవటి, చిత్రకూటం, శేషతీర్థం, మిథిలా నగరం, అయోధ్య.. ఇవన్నీ తాము కలదిరిగిన లోగిళ్లుగా భావించుకుని మన జానపదులు కట్టుకున్న ఈ పాటలు, కథాగేయాల ప్రత్యేకతలేంటో చూద్దాం.  
శారద రామాయణం
తెలంగాణలో శారదకాండ్రు పాడే రామగాథ ఇది. వీళ్లు ఉపయోగించే తంబూరకే శారద అనిపేరు. ఇతర జానపద గేయాలలో కంటే ఈ శారద పాటల్లోనే సాహిత్య ప్రతిభ అధికంగా ఉంటుందంటారు పరిశోధకులు బిరుదురాజు రామరాజు. వాల్మీకి రామాయణాన్ని అనుసరించి ఓ అజ్ఞాత కవి రాసిన కథ ఆధారంగా పుత్రకామేష్టినుంచి పాదుకా పట్టాభిషేకం వరకూ ఎంతో భక్తిశ్రద్ధలతో గానం చేస్తారీ కళాకారులు. రామకథను వల్లించే పాటల్లో అతి పెద్దది ఇదే. ‘‘తరమా! దానిసోయగం బెన్నగా తరమా/ తలచుకుంటేను మది నిల్ప తరమా/ బ్రహ్మరుద్రాదులకు నెన్న తరమా/ ఇదే కదా చూడ శోక సాగరమా!’’ అంటూ సీతకోసం విలపించే రాముణ్ని కళ్లముందు నిలిపే ఈ కళాకారులు కరుణ రసాన్ని అద్భుతంగా పండిస్తారు. ఈ పాటలో ప్రబంధ ఛాయలు కనిపిస్తాయి. కథ కన్నా వర్ణన సౌందర్యం ఇందులో ప్రధానమైంది.
లంకా యాగం
బహుళ ప్రచారం పొందిన కథాగేయమిది. సీతారాములు అడవులకు పయనమవు తున్నారు. లక్ష్మణుడు తల్లితో ‘వారి వెంట నేనూ వెళ్తాను, దీవెనలు ఇవ్వ’మంటాడు.  సుమిత్ర ఇలా చెప్పి సాగనంపుతుంది..
శ్రీరాములు తండ్రిగా సీతమ్మ తల్లిగా భావింపు లక్షుమన్నా!
ప్రొద్దు ప్రొద్దున లేచి వదినె పాదంబులకు దండమైన బెట్టుము
తోటలా పండ్లన్నీ, దొన్నెలో పెట్టుకుని మీదుగా దెచ్చి యిమ్ము
పదునాలుగూ యేండ్లు తర్లిపోయిన మీరు కలియరండని...  

      కథాగేయం చివర్లో సీతమ్మను కనుగొని.. కుశల ప్రశ్నలన్నీ అయ్యాక తిరుగు ప్రయాణమవుతూ ‘‘ఆకలిగొన్నాను. ఈ అశోక వనమున ఒక పండు ఇప్పించుతల్లీ!’’ అంటాడు హనుమంతుడు ఆర్తిగా. ‘‘ఇనుప గుగ్గిళ్లవి. విషముష్టిపండ్లు.. అవి అంటరాని గరళం. ముట్టవద్ద’’ని వారిస్తుంది సీతమ్మ. ఆ తల్లి లంకలో ఎలాంటి పరిస్థితుల మధ్య జీవిస్తోందో ఇలా తెలియజేశారన్న మాట జానపదులు. శూర్పణక కొడుకు చక్రభూపాలుణ్ని లక్ష్మణుడు వధించడం లాంటివి ఈ పాటలోని ఇతర ఘట్టాలు వీరాద్భుత రస సమ్మేళనంతో ఒకానొక భావనా ప్రపంచంలోకి తీసుకుపోతాయి. ఇందులో జానపదుల కల్పనాశక్తి, కథన శిల్పం అబ్బురమనిపిస్తుంది.
గోవింద నామాలు
స్త్రీలు పాడుకునే రామాయణపు పాటల్లో అతిపెద్దవి మూడు.. పెండ్లి, శాంత, చర గోవింద నామాలు. ప్రతీ చరణం చివరా ‘గోవిందా!’ అని ఉండటంతో వీటికి ‘గోవింద నామాలు’ అనే పేరు స్థిరపడింది. ‘‘పాల సముద్రం మీద గోవింద రామ/ భద్రాద్రీ శయనూ గోవింద/ శేషపానుపు మీద గోవింద రామ/ లక్ష్మితో పవళించే గోవింద’’ అంటూ రామకథను గానం చేస్తారు. రామాదుల జననం, వివాహం వంటివి ఈ పాటల్లో ప్రధాన ఘట్టాలు. ‘‘వక్కో మాసమున వత్తిగిల నేర్చిరి/ రెండో మాసమున కూర్మము నిలిపిరి/ మూడో మాసమున పెదవులు విరిచిరి/ నాలుగో మాసమున నవ్వులు నేర్చిరి/ అయిదో మాసమున ఆటలు నేర్చిరంటూ...’’ సాగే ఈ పాట రామలక్ష్మణ భరత శత్రుఘ్నుల వివాహ మహోత్సవాన్ని రమ్యంగా తెలియజేస్తుంది. పెండ్లి గోవింద నామాల్లో అలక కట్నాల ప్రసక్తి ముచ్చటగొల్పుతుంది. రామాదుల వివాహ అనంతరం అలుక సమయంలో పెద్దవారు ముగ్గురికీ కట్నాలు ఇస్తాడు కానీ శత్రుఘ్నుడికి జనకుడు ఏమీ ఇవ్వడు. మావగారి ముందు చేయి చాచి ‘నాకూ కావాలి’ అంటాడు శత్రుఘ్నుడు.  ‘‘కడసార్ని పుట్టిన కాంతని పెండ్లాడి/ తగవు సరికాదురా ధనములివ్వం మేము’’ అంటాడు జనకుడు. చిన్నబిడ్డ గారాల కూతురు కదా! ఆమెను ఇవ్వడమే గొప్ప. ఇక కట్నమెందుకూ! అన్నది జనకుడి వాదన. ఎంత అందమైన భావనో కదా! పెళ్లిళ్లప్పుడు తెలుగువారింట జరిగే అనేక మర్యాదలను గురించీ ఈ పాట ప్రస్తావిస్తుంది 
పుత్రకామేష్టి
తెలంగాణలో బతుకమ్మ పండుగప్పుడు పాడే పాటల్లో ముఖ్యమైందీ పాట. పి.పి.బి.గోదానాయకమ్మ రాసిన ఈ పాటను కొండా శంకరయ్య సేకరించారు. ఇందులో చిత్రమైన కల్పనలు అనేకం కనిపిస్తాయి. రాముడు యతివేషంలో సీతని చూసే ఘట్టం శిష్టరామాయణాల్లో ఎక్కడా కనిపించదు. ముని రూపంలో శివుడు పార్వతిని పరీక్షించిన ‘కుమార సంభవం’లోని సన్నివేశం స్ఫురణకొస్తుంది. ఇలా సీతారాములు వివాహానికి ముందే ప్రేమించుకున్నట్టు సంస్కృతంలో భాసుడు, తమిళకవి కంబన్, హిందీలో గోస్వామి, తులసీదాసు చిత్రించారు. 
లక్ష్మణదేవర నవ్వు
‘‘కలకలనవ్వే లక్ష్మణదేవరపుడూ కలతలు పుట్టెరా కపులందరికినీ/ కిలకిలనవ్వే లక్ష్మణ దేవరపుడూ కిలకిల నవ్వగా ఖిన్నుడయ్యే రాజు’’ అంటూ ఈ పాట చాలా గమ్మత్తుగా సాగుతుంది. నిండు కొలువులో ఎందుకో నవ్వుతాడు సౌమిత్రి. ఆ నవ్వుకి కారణమేమై ఉంటుందా అని రాముడితో సహా అందరూ తర్కించు కుంటారు. తమతమ లోపాలను ఎంచుకుంటూ మథన పడుతుంటారు. అకారణమైన ఈ నవ్వుకి కారణం చెప్పక పోతే శిరసు ఖండిస్తానని అన్న ఆగ్రహిస్తే సౌమిత్రి అసలు సంగతిని ఇలా విన్నవిస్తాడు.. ‘‘మనం అడవులకి పోయిన రోజులవి. ఒకరోజు రాత్రి పర్ణశాలలో మీరు సేదతీరుతున్నప్పుడు నిద్రాదేవి ఏడుపు వినిపించింది. కారణం అడిగితే లోకమంతటినీ నిద్రలో ముంచా. కానీ నీపై ఎలాంటి ప్రభావమూ చూపలేకపోతున్నా. ఇది ప్రకృతి విరుద్ధం. నాకు తలవంపులు. ఏదైనా మార్గం చెప్పు అని ప్రార్థించింది’’ అంటాడు. ఆ తర్వాత తను ఎందుకు నవ్వాడో చెప్పి అన్న ప్రేమకు పాత్రుడవుతాడు. 
ఊర్మిళాదేవి నిద్ర
రామాయణ కవులందరూ ఈ సాధ్విని మరచిపోయినా తెలుగు స్త్రీలు మాత్రం తమ పాటల పేటికలో భద్రంగా నిలుపు కున్నారు. బందా కనకలింగేశ్వరరావు, ఆడిదం రామారావు, ఇల్లిందల సరస్వతి దేవి ఈ విశిష్ట గీతాన్ని విశ్లేషించారు. సీతారాములతో పాటూ లక్ష్మణుడూ అడవులకు వెళ్లబోతుంటే నేనూ వస్తానని వేడుకుంటుంది ఊర్మిళ. వద్దని వారించిన భర్త మాటకు మారుపలకలేక పద్నాలుగేళ్ల నిద్రకు ఉపక్రమిస్తుంది. వనవాసం ముగించుకుని వచ్చిన తర్వాత కూడా భార్య ఊసే ఎత్తకుండా అన్నగారి సేవకి అంకితమైపోతాడు సౌమిత్రి. ఈ సంగతిని సీత, రాముడి చెవిన వేస్తుంది. వెనుకటి తరం స్త్రీలు సరదాగా పాడుకునే ఈ పాటలో స్త్రీ హృదయవేదన మరో స్త్రీకి మాత్రమే తెలుస్తుందనే భావన పొడసూపు తుంది. అలా అన్న ఆనతితో భార్య దగ్గరికి వెళ్లిన లక్ష్మణుడికి ఎదురయ్యే అనుభవాలే ఈ గీత సాహిత్యం. ‘‘శ్రీరామభూపాలుడూ .. పట్టాభిషిక్తుడై కొలువుండగా’’ అంటూ సాగే పాట, ‘‘కస్తూరి రంగ రంగా... నాయన్న కావేటి రంగ రంగా’’ అనే కృష్ణ సంబంధమైన గేయశైలిలో సాగుతుంది. తెలంగాణలో పాడే గౌరమ్మపాటలోనూ ఇదే ఛాయలు కనిపిస్తాయంటారు బిరుదురాజు రామరాజు తన జానపద గేయ సాహిత్యంలో.
కుశలవుల జననం
సీత మీద ఎవరో మోపిన నిందకు భయపడి రాముడు ఆమెను అడవిలో విడిచిపెడతాడు. ఓ ముని ఆశ్రమంలో జానకి కుశలవులకు జన్మనిస్తుంది. వాళ్లిద్దరినీ ఊయలలూపుతూ ఎంతో ఆవేదనతో ఆమె పాడే ఈ జోలపాటను వింటే హృదయం ద్రవిస్తుంది. 
ఏడవకు నా తండ్రి లవ కుమారా!
ఏడవకు నా తండ్రి కుశ కుమారా!
శ్రీరామపుత్రులు చింతేలా మీకు
ఏడిస్తే మిమ్మెవ్వరెత్తుకుంటారు
బంగారు ఉంగరాలు ఉయ్యెల గొనుచు
ఊర్మిళా పినతల్లి వచ్చె నేడవకు
వజ్రాలు తాపినా హారాలు గొనుచు
లక్ష్మణా పినతండ్రి వచ్చె ఏడవకు

      ఈ పాటలో సీత విచారమూ, తల్లడిల్లే ఆమె హృదయవేదన వ్యక్తమవుతాయి. ఇలా జనశ్రుతితో ఇప్పటికీ నిలిచిపోయిన రామాయణ కథాగేయాల్లో ‘శ్రీరామ పట్టాభిషేకం, మాయలేడి పాట, సీతమ్మ అగ్నిప్రవేశం’ అనేవీ ఉన్నాయి. ఈ పాటల్లో జానపదుల వర్ణనలు గమ్మత్తుగా ఉంటాయి. లంకలో సీతమ్మ దుఃఖిస్తూ విభీషణుని కూతురితో తన బాధను వెల్లడించే సందర్భంలో.. ‘‘వేగుచుక్క వినుమా వెడలు శృంగారు బంగారు కొమ్మ వినుమా! తీగ మెరుపా వినుమా! చీకటింటద్దమా! విభీషణుని పుత్రి వినుమా!’’ అంటూ సంబోధిస్తుంది. కష్టాల చీకటిని తొలగించు వేగుచుక్కా అనీ, చీకట్లో మెరిసే శంపాలతికా అనీ, అంధకార బంధురమైన ప్రదేశంలో తనకు లభించిన ఆశాదీపమని కాబోలు ‘చీకటింటద్దమా!’ అని అంటుంది. అసుర కన్య అయినప్పటికీ ఆమె మనసు అద్దం లాంటిదనే సీత మాటల్లో గొప్ప పోలిక కనిపిస్తుంది. ఈ వర్ణనలన్నీ శిష్టరామాయణ కవులకి భిన్నంగా ఉండటమే కాదు వాస్తవికతకి దగ్గరిగా ఉంటాయి.
      అనాదిగా జానపదుల గొంతుల్లో పరవళ్లుతొక్కుతున్న రామకథని శిష్ట కవులు గ్రహించారో, లేదూ పాడుకోవడానికి యోగ్యమైన గాథలని ఆ రామాయణ కావ్యాల నుంచి జానపదులే గ్రహించి ఉంటారో తేల్చి చెప్పడం కష్టం. జానపద సాహిత్యం వాగ్రూపంలో ఓ తరం నుంచి మరో తరానికి ప్రవహిస్తుంది. ఆ వాహికలో కొత్తకథలు చేరవచ్చు లేదూ పాతవే మరిన్ని మార్పులతో విస్తృతం కావచ్చు. జానపదుల రామకథల్లో జీవలక్షణం ఉంటుంది. లోకసామాన్యమైన విషయాలన్నింటినీ సీతారాములు అనుభవించినట్టుగా అనుభూతి చెందుతారు. అద్భుతమైన కథా కథనంతో, అక్కడక్కడ హాస్యస్ఫురణ కలిగిస్తూనే అనూహ్యమైన మలుపులతో కథకు ముక్తాయింపు పలకడంలో జానపదులకు మించినవారు లేరు. 


వెనక్కి ...

మీ అభిప్రాయం