కవితా భారతికి నిండు హారతి

  • 56 Views
  • 1Likes
  • Like
  • Article Share

అరవై ఏళ్లుగా జరుగుతున్న అపురూపమైన కార్యక్రమమది. దేశంలోని ప్రధాన భాషల కవిత్వపు రుచినంతటినీ ఒకేచోట చవిచూపించే అరుదైన వేదిక అది. ఆత్మీయ వాతావరణంలో ఇరవై రెండు భాషల కవుల కవితాపఠనంతో రసజ్ఞలోకానికి వీనులవిందు చేసే ఆ వేడుకే.. ‘ఆకాశవాణి జాతీయ కవిసమ్మేళనం’. ఆయా భాషల కవుల్లో ఏడాదికి ఒక్కరికి.. అదీ తమ జీవితకాలంలో ఒక్కసారి మాత్రమే దక్కే ఈ సమ్మేళనపు ప్రాతినిధ్యం.. భారతీయ కవన విశారదులందరికీ ప్రతిష్ఠాత్మకం.  
రవి
గాంచని చోటును కూడా కవి దర్శించగలడు. ఎదుటి వ్యక్తి అంతరంగం నుంచి అంతర్జాతీయ సమస్యల వరకూ అన్నిటినీ అర్థం చేసుకోగలడు. తన కవిత్వంతో సమాజాన్ని మేల్కొలుపుతాడు. ఆ ఆయుధంతోనే సమస్యల మీద పోరాటం సాగిస్తాడు. ‘‘మునుముందుకు నడిపించేదీ/ పెనునిద్దుర వదిలించేదీ’’ అని శ్రీశ్రీ ఊరికే అన్నారా?! దేశ పురోగతికి తమవంతు సమిధలందించే కవులను గౌరవించేందుకు, జాతీయ సమైక్యతను పెంచేందుకు భారత గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆకాశవాణి 1956 జనవరి 26న తొలిసారి జాతీయ సర్వభాషా కవిసమ్మేళనాన్ని నిర్వహించింది. అప్పట్లో ఇది కొన్ని భాషలకు పరిమితం. క్రమంగా భాషల సంఖ్య పెరుగుతూ వచ్చింది. భాష పెద్దదా చిన్నదా అని చూడకుండా వారి గళం వినిపించే అవకాశం కల్పిస్తోంది ఆకాశవాణి.
      ప్రతిష్ఠాత్మకమైన ఈ కార్యక్రమం కోసం రాజ్యాంగం గుర్తించిన 22 భాషలను పరిగణనలోకి తీసుకుంటారు. స్థానిక కేంద్రాల్లో ప్రసారమైన కవితల్లోంచి ప్రతి మూడు నెలలకూ రెండు మంచి కవితల చొప్పున ప్రాథమికంగా ఎంపిక చేస్తారు. సాధారణంగా ఆకాశవాణిలో ప్రసారమైన వాటినే పరిగణనలోకి తీసుకున్నప్పటికీ ఒక్కోసారి పత్రికల్లో ప్రచురితమైన కవితలను కూడా ఎంచుకుంటారు. అలా నాలుగు విడతల్లో ఎంపికైన ఎనిమిది కవితలను దిల్లీ కేంద్రానికి పంపిస్తారు. ఆకాశవాణిలో కవిత ప్రసారమవడమే ఒక మంచి గుర్తింపుగా భావిస్తారు కవులు. ఇక జాతీయ కవి సమ్మేళనానికి తమ కవిత ఎంపికయితే అదొక పెద్ద పురస్కారంగా సంతోషిస్తారు. 
      ఆకాశవాణి స్థానిక కేంద్రాలు మూల కవితలను, వాటి హిందీ, ఆంగ్ల అనువాదాలను ప్రధాన కేంద్రానికి పంపుతాయి. హిందీ కవితలకు మాత్రం ఆంగ్లానువాదం సరిపోతుంది. దిల్లీ ఆకాశవాణి కేంద్ర అధికారులు, దిగ్గజ కవులతో కూడిన బృందం ఒక్కో భాష నుంచి ఒక్కో కవితను జాతీయ కవితగా నిర్ణయిస్తుంది. 
      దేశంలో హిందీ మాట్లాడే ప్రాంతాలు ఎక్కువ కాబట్టి దానికి మాత్రం రెండు కవితలుంటాయి. అంటే 22 భాషల నుంచి 23 కవితలన్నమాట. ఈ కవితలను ప్రాంతీయ కేంద్రాలకు పంపుతారు. హిందీ, ఇంగ్లీషు అనువాదాల ఆధారంగా వాటిని తక్కిన 21 భాషల్లోకీ అనువదింపచేస్తారు. భాష, భావం పటిష్టంగా ఉండాలనే ఉద్దేశంతో అనువాదాలను ప్రత్యేకంగా కవులతో మాత్రమే చేయిస్తారు. మూలకవి కవితను ఎలాంటి శ్రుతి, లయతో రాశారో అనువాదం కూడా అలాంటి లయతోనే ఉండేలా చూస్తారు. ఏ భాషా కవికైనా జాతీయ కవిగా అవకాశం ఒకసారి మాత్రమే దక్కుతుంది.
దేశమంతా అక్కడే..
ఎంపికైన కవులందరూ డిసెంబరు మూడో వారంలో జరిగే జాతీయ సర్వభాషా కవి సమ్మేళనంలో పాల్గొంటారు. దీన్ని ఒక్కోసారి ఒక్కో నగరంలో నిర్వహిస్తారు. ఈ సమ్మేళనం సంస్కృతంతో ప్రారంభమై స్థానిక భాషతో ముగుస్తుంది. గంటన్నరకు పైగా సాగే ఈ కార్యక్రమం వల్ల అన్ని భాషల కవిత్వాన్నీ అన్ని రాష్ట్రాలవారూ వినే సదవకాశం కలుగుతుంది. ఈ కార్యక్రమంలో ఎందరో మేలు కవులను కలుసుకుని ఎంతో ప్రేరణ పొందామని, కొత్త ఉత్సాహం నింపుకున్నామని జాతీయ కవిగా ఎంపికయిన కోవిదులు సంతోషంగా, సగర్వంగా చెప్పుకున్నారు. ఒకరకంగా ఇది భిన్నత్వంలో ఏకత్వం, రసస్ఫూర్తి కలిగించే చక్కటి సందర్భం అన్నమాట.
   జాతీయ సర్వభాషా కవి సమ్మేళనం వల్ల సత్కవులు గుర్తింపు, గౌరవం పొందడమే కాదు ఆయా రాష్ట్రాల సంస్కృతీ సంప్రదాయాలకు ప్రాతినిధ్యం వహించినట్లవుతుంది. భిన్న శైలీశిల్పాలను పరిశీలించడానికి, వివిధ రాష్ట్రాలకు చెందిన ప్రజల ఆలోచనాసరళి, భావప్రకటన ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి వీలవుతుంది. ఒక్కో గళం ఏకకాలంలో అన్ని భాషల్లో వినిపించినట్లవుతుంది. దేశ సమైక్యతకు సంకేతమిది. ఆయా భాషల కవిత్వాన్నే గాక అనువాద ప్రక్రియకు కూడా ఇది మంచి ప్రోత్సాహకరం. ఈ జాతీయ కవిసమ్మేళనంలో దేశంలో ఉన్న అనేక సమస్యలు ప్రతిఫలిస్తాయి. అభ్యుదయం ప్రతిబింబిస్తుంది. భిన్న భాషా కవులు ఎలా ఆలోచిస్తున్నారో, ఏ విధంగా అభివ్యక్తీకరిస్తున్నారో, కవితా ప్రక్రియ ఎలా ఉందో, అవెలా తర్జుమా అవుతున్నాయో, వాటికి స్పందనలు, ప్రతిస్పందనలు ఎలా ఉన్నాయో అవగతమవుతుంది. ఇది మరెందరికో స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు. 
      కవి సమ్మేళన కార్యక్రమంలో మొదట మూల కవి చదివిన కొన్ని పాదాలు వస్తాయి. తర్వాత స్థానిక భాషలో అనువాదం వస్తుంది. జనవరి 25వ తేదీ రాత్రి, 26 ఉదయం, రాత్రి- ఇలా మూడుసార్లు ఆ కవితలను ప్రసారం చేస్తారు. తమ కవిత తక్కిన 21 భాషల్లోకి అనువాదమై దేశమంతటా ప్రసారమవడాన్ని అపురూపంగా భావిస్తారు కవులు. ఈ కార్యక్రమాన్ని వినడం ఒక మంచి అనుభూతిగా అభివర్ణిస్తారు సాహితీ ప్రేమికులు.  
      ఏటా జరిగే జాతీయ కవి సమ్మేళనంలో తెలుగు నుంచి ఇప్పటి వరకూ నాగభైరవ కోటేశ్వరరావు, డా।।ఎన్‌.గోపి, శిఖామణి, సి.భవానీదేవి, పాపినేని శివశంకర్, మందరపు హైమవతి, యార్లగడ్డ రాఘవేంద్రరావు, వనమాలి, పి.వి.ప్రసాదమూర్తి, సుధామ, యాకూబ్, దేవిప్రియ, రాధేయ, కె.శివారెడ్డి, నూకా రాంప్రసాద్‌ రెడ్డి, అనంత పద్మనాభరావు, దర్భశయనం శ్రీనివాసాచార్య, పైడి తెరేష్‌బాబు తదితర ఉద్దండ కవులు ప్రాతినిధ్యం వహించారు. ఈ సంవత్సరం తెలంగాణ రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ ఆకాశవాణి జాతీయకవిగా ఎంపికయ్యారు. తెలుగు కవికోయిలలకు ప్రతినిధులుగా జాతీయస్థాయిలో తమ కవితాస్వరాలను వినిపించిన వారిలో కొంతమంది అనుభవాల జ్ఞాపకాలు పక్కపుటలో...


ప్రాణమిత్రుణ్ని అందించింది
ఆకాశవాణి జాతీయ కవిగా భోపాల్‌ వెళ్లాను. అద్భుతమైన కవులు అక్కడ పరిచయమయ్యారు. ముఖ్యంగా గుజరాతీ కవి రమణిక్‌ సోమేశ్వర్‌తో పరిచయం ఎక్కడిదాకా వెళ్లిందంటే, ఆయన నా ‘కాలాన్ని నిద్రపోనివ్వను’, ‘జలగీతం’ పుస్తకాలను గుజరాతీలోకి అనువాదం చేశారు. అది మరచిపోలేని అనుభూతి. ఒక భాష కవిత 21 భాషల్లోకి అనువాదం కావడం మంచి ప్రయోగం. మనది బహుళ భాషల దేశం కనుక.. అందర్నీ కలపాలంటే ఇంతకు మించి వేరే మార్గం లేదు. చైనా ఉందంటే 98 శాతం వాళ్ల మాతృభాష మాండరిన్‌. వాళ్లొక కేక వేస్తే దేశమంతా వినిపిస్తుంది. మనదలా కాదు. ఈ నేపథ్యంలో ఆకాశవాణి ప్రయత్నం చాలా వాంఛనీయం. కాకపోతే నాణ్యమైన కవిత్వం రావాలి.  

- డా।। ఎన్‌.గోపి 


ఆ వాక్యాలెంత గొప్పవి
కాశీలో జరిగిన జాతీయ కవి సమ్మేళనంలో ‘వెళ్లిపోయినవాళ్లని జ్ఞాపకం పెట్టుకోండి’ కవిత చదివాను. అదొక ప్రత్యేకమైన అనుభవం. ఇక అనువాదకుడిగా ఈ కార్యక్రమం కోసం 30, 40 కవితలను అనువదించి ఉంటాను. అనువాదమంటే పరకాయ ప్రవేశం. వాక్యం ఎంతో గొప్పది. ప్రేమతో నిండిన, ధర్మాగ్రహంతో నిండిన వాక్యాలెంత గొప్పవి? ఆగ్రహం తోనూ జాలితోనూ నిండి ప్రవహిస్తున్న వాక్యం మరీ గొప్పది. ఒక కవితను తర్జుమా చేస్తున్నప్పుడు అనువాదకుడు కాదు, కవి మాత్రమే ఉంటాడు. కవితలో నిమగ్నమై మూలకవి ఆత్మను ఆవహింప చేసుకుని చెప్పాలి.    

 - కె.శివారెడ్డి


అంతకు మించి ఇంకేం కావాలి!
జయపురలో జరిగిన 2002 జాతీయ కవి సమ్మేళనంలో ‘సంతకాలు చేద్దాం రండి!’ కవిత చదవడం, దాని హిందీ అనువాదానికి ప్రేక్షకులంతా ‘వహ్వా’ అనడం అద్భుతమైన, అపురూపమైన అనుభూతి. అప్పటి కరతాళధ్వనులు ఇప్పటికీ చెవుల్లో మారుమోగుతున్నాయి. కవికి పాఠకుల స్పందన, రసాస్వాదన, అభినందనలు ముఖ్యం. వారి హృదయాల్లో స్థానం సంపాదించడం కన్నా మరేదీ ఎక్కువ కాదు. ఎక్కడో విజయవాడ నుంచి వెళ్లి తక్కిన భాషా కవులనూ, అనువాద కవులనూ కలుసుకోవడం, వారి పరిచయాలను పదిలపరచుకోవడం మర్చిపోలేని జ్ఞాపకం. విభిన్న వస్తువులతో కూడిన వివిధ భాషల కవితలు వింటున్నప్పుడు ఇది చాలు, ఇంతకన్నా ఇంకేమీ లేకున్నా ఫర్వాలేదు అనిపిస్తుంది. 

- మందరపు హైమవతి


‘ఒక్కటీ రాలేదా’ అన్నారు
1983లో దిల్లీలో జాతీయ కవి సమ్మేళనంలో పాల్గొన్నాను. నా కవిత హిందీ అనువాదం విని చాలా మంచి కవితంటూ మిగిలిన వారు ఎంతో అభినందించారు. కువార్‌ బేచెయిన్‌ అనే కవి తన ఆరు కవితా సంకలనాలు ఇచ్చి.. ‘‘నాకు తెలుగు రాకపోయినా ఫరవాలేదు, మీ సంకలనం ఇస్తే గుర్తుగా పెట్టుకుంటా’’నన్నారు. అప్పటికి నా పుస్తకాలేవీ ప్రచురితం కాలేదు. ‘‘జాతీయకవిగా వచ్చారు, ఒక్కటీ రాలేదా?’’ అన్నారు. నా రచనలు పుస్తకరూపంలో రావాలనుకోవడానికి అది ప్రేరణ. ప్రోగ్రామ్‌ ఎగ్జిక్యూటివ్‌ అయిన తర్వాత ఇక్కడ జాతీయ కవితల తెలుగు అనువాదాలను నేను నిర్వహించాను. 

- సుధామ 


దేశమంతటికీ చేరింది
నాగపూర్‌ (2018) జాతీయ కవిసమ్మేళనంలో పాల్గొనే అవకాశం కలిగింది. నా కవిత మిగతా భారతీయ భాషల్లోకి అనువాదమై ప్రసారమవడం ఆనందదాయకం. అదే సమయంలో నేను ఇతర భాషల కవులను కలిసే అవకాశమూ లభించి ంది. ఆ తర్వాత కూడా కవిత్వానికి సంబంధించి మేం చర్చించుకుంటూ వస్తున్నాం. దేశవ్యాప్తంగా నిత్యం రేడియో వింటున్నవాళ్లు ఎందరో ఉన్నారు. కవి సమ్మేళనం ప్రసారానికి మంచి స్పందన వస్తుంది. అలాగే స్థానిక పత్రికలవాళ్లు ఆయా భాషా కవితల అనువాదాలను ప్రచురించి ప్రాచుర్యం కల్పిస్తున్నారు. నా కవిత అనువాదాలను పత్రికలు అలా  దేశమంతటికీ చేర్చాయి. 

- యాకూబ్‌ 


అమ్మలందరికీ దక్కిన గౌరవం
దాదాపు పాతికేళ్లుగా ఈ కవి సమ్మేళనంలో వివిధ భాషల కవితల అనువాదకురాలిగా పాల్గొంటున్నాను. జాతీయ తెలుగు కవులుగా ఎంపికైన నా ముందు తరం కవులు నాకెంతో స్ఫూర్తి. 2019లో నేను రాసిన ‘అమ్మ నిజం చెప్పదు’ కవిత నన్ను జాతీయ కవిగా నిలబెట్టింది. ఆ కవితలో అమ్మ త్యాగం గురించి రాశాను. ఇది అమ్మలందరికీ దక్కిన గౌరవం. చెన్నైలో జరిగిన కార్యక్రమంలో ఆ రాష్ట్ర గవర్నర్‌ నుంచి సత్కారం అందుకున్నాను. సాహితీలోకం అందించిన ఈ గుర్తింపు నా అక్షరాలకు మరింత పరిమళాన్ని అద్దింది.

- డా।। సి.భవానీదేవి


అక్షరం ఇచ్చిన కానుక
2006లో ఆకాశవాణి జాతీయ కవిగా ఎంపికయ్యాను. ఈ వేడుకకు విశ్వకవి రవీంద్రుని శ్వాస, పాద స్పర్శలతో పునీతమైన శాంతినికేతన్‌ వేదికయ్యింది. నేనక్కడకు వెళ్తానని గానీ, ఈ కంప్యూటర్‌ యుగంలో కూడా ఆశ్రమవైభవాన్ని కోల్పోని ఓ మహోన్నత విశ్వవిద్యాలయంలో అడుగుపెడతానని గానీ, అక్కడి తరువుల మీదుగా వీచే గాలిని శ్వాసిస్తానని గానీ, వీణాపాణిమృదురాగాలు ఎల్లెడలా అల్లుకుపోయిన ఆ కుటీరాలను తాకుతూ అలౌకికమైన తేజఃపుంజాలను నా ఎదనిండా నిలుపుకుంటానని గానీ ఊహించలేదు. అదంతా నాకు అక్షరం ఇచ్చిన కానుక. అది నా మీద కురిపించిన అద్వితీయమైన వరాలజల్లు. పగలంతా శాంతినికేతన్‌లో కలియతిరిగి, చెప్పలేనంత అనుభూతిని నా ఎదనిండా నింపుకుని, ఆ సాయంత్రం ‘పక్షులు ఎగిరిపోయాక’ కవిత వినిపించడం.. ఓహ్‌.. ఈ అనుభవాన్ని మాత్రం నేను అక్షరీకరించలేను. 

- యార్లగడ్డ రాఘవేంద్రరావు 


దక్షిణాదితో సరితూగలేదు
వారణాసి హిందూ విశ్వవిద్యాలయంలో (2017) కిక్కిరిసిన సమావేశమందిరంలో సర్వభాషా కవిసమ్మేళనం జరిగింది. ఇందులో పాల్గొనటం, ‘ఇష్టం’ కవిత చదవడం మరచిపోలేను. ఆయా భాషల్లో కవిత్వం తీరుతెన్నులు రేఖామాత్రంగానైనా తెలుసుకునే అవకాశం ఆ సమ్మేళనం. అందులో విలక్షణ కవితలు వినిపించాయి. అయితే వస్తువైవిధ్యంలో, అభివ్యక్తి నైపుణ్యంలో ఉత్తర భారతీయ భాషా కవిత్వం దక్షిణాదితో సరితూగలేదు. నా కవిత అనువాదం దేశంలోని అన్ని రేడియో కేంద్రాల నుంచి ప్రసారం కావటం సంతోషదాయకం! 

- డా।। పాపినేని శివశంకర్‌


కవిత్వానికి ప్రాధాన్యం
జాతీయ సమైక్యత, ఒక ప్రాంత కవులను ఇతర ప్రాంతాలకు పరిచయం చేయడం ఈ కవి సమ్మేళనం ఉద్దేశం. నేను ఆకాశవాణి దిల్లీ కేంద్రం సంచాలకుడిగా ఉన్నప్పుడు దిల్లీ, లఖ్‌నవూ, నాగపూరులో దీన్ని నిర్వహించాను. రసజ్ఞుల సమక్షంలో సుమారుగా మూడు నిమిషాల పాటు మూల కవులు వేదిక మీద తమ కవితలను వినిపిస్తారు. తర్వాత అనువాదకవులు వాటిని హిందీలో చదువుతారు. మనకు ఆకాశవాణి కేంద్రాలు దాదాపు 200 ఉన్నాయి. స్థానిక కేంద్రాల్లో మూల కవితను ఒక నిమిషం వినిపించి, అనువాదాన్ని పూర్తిగా వినిపిస్తారు. 2016 సమ్మేళనంలో నేను జాతీయకవిగా పాల్గొన్నాను. సాహిత్య అకాడెమీ సాహిత్యానికి ప్రాధాన్యమిచ్చినట్లు ఆకాశవాణి కవిత్వానికి ప్రాధాన్యమివ్వాలని ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇదెంతో ప్రతిష్ఠాత్మకం. 

- రేవూరి అనంత పద్మనాభరావు


మరెక్కడా చూడలేదు
నా కవిత ‘మార్నింగ్‌ వాక్‌’ 2010 జాతీయ కవి సమ్మేళనానికి ఎంపికవడం, తెలుగు భాషకు ప్రాతినిధ్యం వహించే అవకాశం రావడం గొప్ప ఆనందాన్నిచ్చింది. అసోం రాజధాని గువాహటిలో జరిగిన సమ్మేళనంలో తక్కిన 21 భాషల కవుల సమక్షంలో కూర్చోవడం ఒక గొప్ప సందర్భం. మధురానుభూతిని పొందిన క్షణాలవి. వివిధ భాషల కవిత్వం ఎలా ఉందో తెలుసుకున్నాను. వాళ్లూ తెలుగు కవిత్వం గురించి అడిగారు. 40 ఏళ్లలో ఎన్నో కవిసమ్మేళనాల్లో పాల్గొన్నాను. కానీ అంతమంది భారతీయ భాషా కవులను మరే వేదికమీదా చూడలేదు. 

- దర్భశయనం శ్రీనివాసాచార్య


అదో అద్భుతం
అన్ని భాషల మధ్య ఒక సహజీవన సౌందర్యాన్ని, ఆదాన ప్రదాన విశేషాలని, జాతీయ సమైక్య స్ఫూర్తిని, రగిలించాలి, కరిగించాలంటే అందరి మధ్యా ఒక ఏకత్వ స్ఫూర్తిని తీసుకురావాలంటే ఇదొక మార్గం. భాష అనేది మహా శక్తివంతమైన, ప్రేరణాత్మకమైన మాధ్యమం కాబట్టి దానిద్వారా ఈ పని చేస్తే బాగుంటుంది అనుకుని, ఈ సర్వభాషా కవిసమ్మేళనాన్ని ప్రారంభించి ఉంటారు. ఆ లక్ష్యాన్ని ఈ కార్యక్రమం అద్భుతంగా నెరవేర్చింది, ఇప్పటికీ నెరవేరుస్తోంది. అందుకు తాజా ఉదాహరణ నేను. దిల్లీ కొత్తేం కాదు. కానీ ఈసారి కొత్తగా చూశాను. ఎందుకంటే ఒక ఉత్సుకతతో అందర్నీ కలుస్తున్నాననే గొప్ప భావనతో వెళ్లాను. ఒక్కొక్క ప్రాంతం నుంచి కవులు.. వాళ్లు ఒక్కొక్కరే రారు, వారితోబాటు వారి మట్టి పరిమళాన్ని తెస్తారు. వారి జీవనసౌందర్యాన్ని తీసుకొస్తారు. అన్నిటినీ మించి వారి జీవన వైరుధ్యాన్ని తెస్తారు. వందల వేల సంవత్సరాల తాలూకు జ్ఞాపకాల పరంపర అంతా మనతోబాటు వస్తుంది. దానికి మనం కేవలం కొనసాగింపు. ఒక సంబరం, సంతోషం.. కవులందరిలో కనిపించింది. వారి చిరునవ్వుల్లో ప్రతిఫలించింది. వారి గుండెచప్పుళ్లలో వినిపించింది. అలాంటి ఒక అద్భుతాన్ని ఆవిష్కరించింది ఆకాశవాణి. నేనక్కడ తెలంగాణ ప్రాంత కవిత ‘పండుగ’ చదువుతున్నప్పుడు మంచి ప్రతిస్పందన వచ్చింది. హిందీ అనువాదం కూడా చాలా చక్కగా చేశారు. 

- డా. మామిడి హరికృష్ణ 


 


వెనక్కి ...

మీ అభిప్రాయం