అనేక పత్నీవ్రతం

  • 312 Views
  • 3Likes
  • Like
  • Article Share

    శంకరనారాయణ

  • హైదరాబాదు
  • 8008333227
శంకరనారాయణ

ఏకపత్నీవ్రతమా? అది మంచిదైతే చెప్పండి స్వామీ! ఎంత ఖర్చయినా చేస్తాను. ఎన్ని గంటలైనా కదలకుండా కూర్చుంటాను’ అని నిష్ఠాగరిష్ఠుడైన ఓ వ్యక్తి ఏకపత్నీవ్రతం గొప్పదనం మీద ఓ స్వామీజీ ప్రసంగాన్ని విని నొక్కి వక్కాణించాడట. ఏకపత్నీవ్రతం ఎన్ని గంటలైనా కూర్చుని చేసేదికాదు.. జీవితాంతం చేయాల్సింది. ఇలలోనే కాదు, కలలోనూ వ్రతం తప్పకూడదు. అప్పుడే ఫలశ్రుతి. ఇప్పుడు చెప్పండి! ఎంత మంది పురుష పుంగవులు ఈ వ్రతదీక్షా కంకణధారులయ్యారో.. అవుతారో!! అయినా అంటే అన్నానంటారుగానీ ఏకపత్నీవ్రతం గొప్ప ఏంటట అసలు!
      ఏ శ్రీరామచంద్రుడో, సత్యహరిశ్చంద్రుడో తప్ప మన దేవుళ్లలో మాత్రం ఏకపత్నీవ్రతులు ఎక్కడున్నారు? శ్రీరామచంద్రుడు ఏకపత్నీవ్రతుడు కావడానికి ఆయన వ్యక్తిగత సమస్యలు కారణం. తన తండ్రి ముగ్గురు మహారాణుల్ని (కౌసల్య, సుమిత్ర, కైకేయి) చేసుకోవడం వల్ల ఆయన ఎంత ఇబ్బందిపడ్డారు? అలాంటివి కళ్లారా చూసి, మనసారా అనుభవించినవాడు భవిష్యత్తులో తన పిల్లలూ ఇబ్బంది పడతారని భయపడటం.. ఆమేరకు జాగ్రత్తలు తీసుకోవడం సహజమేగా. అందువల్ల శ్రీరాముడు ఏకపత్నీవ్రతుడిగా మిగిలిపోయాడు. అయినా ఒక్క అత్తతోనే ప్రపంచంలో కోడళ్లు అంతా అవస్థలు పడుతుంటే సీతమ్మ వారు ముగ్గురు అత్తలతో ఎంత ఇబ్బంది పడేది! ఈ లెక్కన వనవాసం కూడా సీతమ్మకు వరమే అయ్యింది.
      ఏమైనా ఎక్కువమంది దేవతలు ఏకపత్నీవ్రతులు కాలేకపోయారన్నది పచ్చినిజం. కనీసం మన తాతముత్తాతల్లో సైతం అత్యధికులు ఏకపత్నీవ్రతం జోలికి పోలికి పోలేదు కదా! ఒక్కొక్కరు ముగ్గురు నలుగురిని కూడా చేసుకుని కులికారు కదా!
      ఏకపత్నీవ్రతం ధర్మం కదా అని మీరు అనవచ్చు. ఎవరైనా అనవచ్చు. అయినా దేవతలకు, పితృదేవతలకు పట్టని ధర్మాన్ని మనం ‘వంట’ పట్టించుకోవడం, ఇంట పట్టించుకోవడం, మనసులో పట్టించుకోవడం అవసరమా? ధర్మాన్ని పరిరక్షించాల్సిన రాజులకు అనేక మంది భార్యలు ఉండేవారు. ‘నవిష్ణుఃపృథివీ పతిః’ అన్నారు. రాజు విష్ణువుతో సమానం. విష్ణువు ఏకపత్నీవ్రతుడు కాడే! ‘యథారాజా తథాప్రజా’ సూత్రం కింద అనేక పత్నీవ్రతంలో ఆవగింజంత అపరాధమూ లేదు. అపచారం అంతకంటే కాదు. అందుకే కవిరాజులూ దీనికి జైకొట్టేశారు. ‘‘ఒక కాంతన్‌ గొనువాఁడు యోగ్యుఁడనఁగా నుర్విన్‌ వెలుంగొందు వే/ ఱొక కాంతన్‌ గొనువాఁడు మధ్యముఁడు నా నూహింపఁ జెన్నొందు..’’- ఇద్దరిని చేసుకున్నా పర్లేదు, అతనూ మంచోడేనని ధ్రువపత్రమిచ్చేశాడు కుప్పిలి సీతారామకవి. కవివాక్కు బ్రహ్మవాక్కు అయినా కాకపోయినా అనేక పత్నీవ్రతానికి మాత్రం ఆయనే పెద్దదిక్కు.   
      ఏతావాతా అనేక పత్నీవ్రతం వల్ల అనేక లాభాలున్నాయి. చెవులూరే విషయాలు విని తరిద్దాం!
      ‘ఇద్దరు పిల్లలు ఇంటికి ముద్దు’ అని వెనకటికి కుటుంబ సంక్షేమశాఖ వాళ్లు ప్రచారం చేసేవాళ్లు. ‘ఇద్దరు భార్యలు ఇంటికి ముద్దు’ అని అంటే, దానికి శ్రీకృష్ణ పరమాత్మనే ప్రధాన ప్రచారకర్త అవుతాడు. ఏకపత్నీవ్రతుడైన శ్రీరామచంద్రుడు జగద్గురువు అనిపించుకున్నాడా? అనేక పత్నీవ్రతుడైన శ్రీకృష్ణుడు జగద్గురువు అనిపించుకున్నాడా? శ్రీకృష్ణుడికే ఆ గౌరవం దక్కింది. కృష్ణం వందే జగద్గురుం అన్నారు గానీ ‘రామం వందే జగద్గురుం అనలేదే!’ బహు పత్నీవ్రతుడైన శ్రీకృష్ణుడేగా భగవద్గీతను అందించింది! అయినా ఎక్కువమంది భార్యలు ఉంటే తక్కువ కాలంలో మనిషికి వేదాంతం వస్తుంది. ఒక భార్యను పట్టుకొని వేలాడితే ‘ఈ జన్మమిక దర్లభమురా?’ అనే తత్వం అంత తేలిగ్గా తలకెక్కుతుందా? అనేక పత్నీవ్రతంలో అభివృద్ధి దాగుందని తెలుసుకోవాలి.
      ‘అధికస్య అధికం ఫలం...’ అంటారు. పెళ్లి విషయంలో మాత్రం అది నిజం కాదేంటి? పెళ్లి మీద పెళ్లి ఎంతో మంచిదని గురజాడ సృష్టించిన గిరీశమే చెప్పిన తర్వాత సృష్టిలో ఎవరు కాదనగలరు. భారతీయ సంస్కృతి మాదన్న వాడు కూడా కాదనలేడు.
      ఒక్క భార్య ఉన్నవాడు మహా అయితే ఒక్క ఇల్లు, రెండిళ్లు కట్టుకుంటాడు. అదేగనక అనేక పత్నీవ్రతుడైతే అనేక గృహాలు నిర్మించుకుంటాడు. ఎంతమంది ఇల్లాళ్లు ఉంటే అన్ని ఇళ్లూ తప్పవు. ఎంత సంపాదిస్తే ఈ అదృష్టం దక్కుతుంది? అనేక మంది భార్యలుంటే అనేక అత్తగారిళ్లు ఉంటాయి. జీవితాంతం ఒకే అత్తగారింటి మీద భారం వేయడం ఉండదు. ఒక ఇంటి నుంచి ఇంకో ఇంటికి నడుస్తూ ఉంటే ఎంత ఆరోగ్యం. కట్నాలు ఆశించేవాళ్లయితే అది ఇంకోటి. అనేక మంది భార్యలు ఉంటే ఏకకాలంలో అనేక కాన్పులు చేయవచ్చు. దేశజనాభా పెరుగుతుంది.
      అనేక భార్యలుంటే ఒనగూరే ఉపయోగాలను ఆరాతీస్తే ఎన్నో. శ్రమ విభజన బాగుందని భజన చేసేంత బాగా ఉంటుంది. ఉదాహరణకు ఓ భార్య ఇల్లు ఊడుస్తుంటే, ఇంకో శ్రీమతి వంటపని అందుకుంటుంది. శ్రమైక జీవనంలోని ఈ సౌందర్యాన్ని అనుభవిస్తూ శ్రీకృష్ణుడిలాగా ‘నారీ నారీ నడుమ మురారీ’ అని ఎంచక్కా పిలిపించుకోవచ్చు. అలాగే, అనేక పత్నీవ్రతులైన మగాళ్లకి ప్రతిరోజూ దువ్వుకోవడం, ప్రతినెలా క్షౌరం చేయించుకోవడం లాంటి సమస్యలే ఉండవు. ఇద్దరు భార్యలూ మొగుడి జుట్టు పీకాలనే ఏకసూత్ర కార్యక్రమం మీద చిత్తశుద్ధితో పనిచేయడం వల్ల జుట్టు సమస్య పరిష్కారం అయిపోతుంది. ధరఖర్వాటు డొకండు పద్యం వాడుకోవచ్చు. అనేక మంది భార్యలు ఉండటం వల్ల ఆహారంలో వైవిధ్యాన్నీ ఆస్వాదించవచ్చు. విహారంలో వైవిధ్యాన్నీ చూడవచ్చు. మగాడి బయటి తిరుగుళ్లకు ఆస్కారమే ఉండదు. ‘చట్టం’ తన పని తాను చేసుకుపోతుంది’. ఒకరి కంటి నుంచి తప్పించుకోగలిగినా, ఇంకొకరి కంటి నుంచి తప్పించుకోలేరు. క్లిష్టమైన సమస్యల మీద భార్యలందరూ ఒక్కతాటి మీదికి వచ్చి కనీసం ద్విసభ్యన్యాయస్థానంగా ఏర్పడి ఎలాంటి అప్పీలు లేని శిక్షలు విధించవచ్చు.
      అనేక మంది భార్యలు తమ భర్తలను రకరకాల తిట్లతో దండించే క్రమంలో భాషాభివృద్ధి కూడా జరగవచ్చు. పోలీసుల అవసరం కూడా తగ్గుతుంది. ఆఫీసు నుంచి ఆలస్యంగా ఇంటికి రావడం కూడా తగ్గిపోతుంది. ఎటొచ్చీ ఒక ఇంటికి బదులు ఇంకో ఇంటికి రావచ్చు. అంతేతేడా! 
      శ్రీకృష్ణుడికి బహు భార్యలు ఉండబట్టి సరిపోయింది గానీ లేకపోతే నరకాసురుడు చచ్చేవాడా? సత్యభామే లేకపోతే దీపావళి పండగ వచ్చేదా? అనేక పత్నీవ్రతం వల్ల జనాలకు ఇన్ని ప్రయోజనాలు ఉన్నప్పుడు ఏకపత్నీవ్రతం ఎంత ఛాదస్తం!


వెనక్కి ...

మీ అభిప్రాయం