అప్రమేయాలతో జాగ్రత్త!

  • 327 Views
  • 0Likes
  • Like
  • Article Share

    వీవెన్‌

  • హైదరాబాదు
  • 9963029061
వీవెన్‌

అప్రమేయం అంటే? మన ప్రమేయం లేకుండానే కంప్యూటర్‌/ మొబైలు అనువర్తనాలు గానీ, ఎల్రక్టానిక్‌ ఉపకరణాలు గానీ మన కోసం లేదా మన తరఫున ఎంచుకునే ఎంపికలు, తీసుకునే నిర్ణయాలే అప్రమేయాలు. అంటే, వాటి తయారీదార్లు మనకోసం ముందుగా నిర్దేశించిన అమరికలు అన్నమాట. ఉదాహరణకు, టీవీ పెట్టగానే ఏ ఛానెల్‌ వస్తుంది? టీవీ కట్టేయక ముందు చూస్తున్న ఛానెలా? లేక ప్రసారాలు అందించే డిష్‌/ కేబుల్‌ సర్వీసు వారి ఛానెలా? ఇది అప్రమేయ ఎంపికకు ఓ ఉదాహరణ.
      మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌ తెరచి టైపు చేస్తుంటే ఆ పాఠ్యం ఏ ఫాంటులో ఉండాలి? అందుకోసం మైక్రోసాఫ్ట్‌ వారు ఓ నిర్ణయం తీసుకున్నారు. అది వినియోగదారు వాడే వెర్షనును బట్టి టైమ్స్‌ న్యూ రోమన్, ఏరియల్‌ లేదా కాలిబ్రి అయి ఉంటుంది. ఏదైనా వెబ్‌సైటులో నమోదు చేసుకుంటున్నప్పుడు, వాళ్ల న్యూస్‌లెటర్‌ లేదా మార్కెటింగ్‌ ఈమెయిళ్లు మనకు తరచూ పంపించేలా టిక్కు పెట్టేసి ఉంచుతారు. మనం తెలుగు రాష్ట్రాల్లో కంప్యూటర్‌ లేదా స్మార్టు ఫోను కొన్నా అది ఆంగ్లంలో ఉంటుంది, టైపు చేస్తే ఆంగ్లమే టైపవుతుంది. ఇవన్నీ మన తరఫున ఆ తయారీదార్లు తీసుకున్న అప్రమేయ నిర్ణయాలే. 
వినియోగదారుల సౌకర్యానికే కానీ..
ఆయా ఉత్పత్తులు, సేవలను అందుకుంటున్నప్పుడు, ప్రతి చిన్న విషయానికీ ప్రతీసారీ ‘మీ ఎంపిక ఏంటి?’ అని వినియోగదారులను విసిగించకుండా వాటిని సౌకర్యంగా వాడుకోడానికే ఈ అప్రమేయం అన్న భావన పుట్టింది. ఎక్కువమంది వాడుకరులకు సరిపడేలా లేదా ఎక్కువ సందర్భాలకు అనుకూలమైన ఎంపికలనే తయారీదార్లు అప్రమేయాలుగా ఎంచుకుంటారు.
మైక్రోసాఫ్ట్‌ వర్డ్‌ ఉదాహరణనే తీసుకుంటే, ఎవరైనా ఓ ఉత్తరం టైపు చేద్దామని మొదలుపెట్టగానే కంప్యూటరు ఈ ప్రశ్నలు వరుసగా అడగాల్సివస్తుంది.. పాఠ్యం ఏ ఫాంటులో ఉండాలి, ఎంత పరిమాణం ఉండాలి? అక్షరాల మధ్య ఎడం ఎంత ఉండాలి, పంక్తుల మధ్య ఖాళీ ఎంత ఉండాలి, పేరాల మధ్య ఖాళీ? పాఠ్యం ఎడమవైపునకు బద్ధించి ఉండాలా, పేజీ కుడివైపునకా, మధ్యకా? పేజీ పరిమాణం ఏఫోరా, మార్జిన్లు ఎంత ఉండాలి? పాఠ్యం రంగు, పేజీ రంగు? ఇలా చిన్ని చిన్ని నిర్ణయాలు కోకొల్లలుగా ఉంటాయి. ఇవన్నీ ప్రతీసారీ అమర్చుకుంటూ కూర్చుంటామా? అందుకే ఈ అప్రమేయాలు.
      అప్రమేయాల ఎంపిక సహేతుకంగా ఉంటే మనం వాటిని ప్రతీసారీ మార్చుకునే పనుండదు. చాలా సందర్భాలకు అవి సరిపోతాయి. ప్రత్యేక అవసరాలకు మాత్రం మార్చుకుంటే సరిపోతుంది. కానీ, కొన్నిసార్లు ఈ అప్రమేయాలు వాడుకరులకు, మేలు చేయకపోగా హాని కలిగించేవిగా ఉంటాయి. లేదా ఆయా ఉత్పత్తుల, సేవల తయారీదార్లకు అనుకూలంగా ఉంటాయి. మనకు గూగుల్‌ ఖాతా ఉంటే, అది అంతర్జాలంలో మీ వెతుకులాటలను, యూట్యూబ్‌ వీక్షణ చరిత్రను నమోదు చేస్తూ ఉంటుంది. ఆ సమాచారాన్ని మీకు వ్యాపార ప్రకటనలను చూపించడానికి గూగుల్, వాళ్లకి పనిచేసే మూడోపక్ష కాంట్రాక్టరులూ వాడుకోవచ్చు అనేలా ఎంపిక చేసి ఉంటుంది. ఇదే విధంగా, ఫేస్‌బుక్‌ లాంటి సామాజిక మాధ్యమాల్లో వివిధ అమరికలు అవసరాన్ని మించి మన సమాచారాన్ని వాళ్లతో పంచుకునేలా ఉంటాయి. లాభాపేక్ష, పోటీతత్వం పెరిగిపోయిన ఈ రోజుల్లో వస్తూత్పత్తుల తయారీదార్లు, వినియోగదారులకు వివిధ సేవలు అందించేవారు అన్ని నిర్ణయాలు, ఎంపికలు వినియోగదారులకు అనుకూలంగా ఉండేవే, మేలు చేసేవే ఎంచుకుంటారని ఆశించలేం.
      ఒకవేళ తయారీదార్లు మంచికి కట్టుబడి ఉన్నా వారి నిర్ణయాలు ఎక్కువ మంది వాడుకరులకు అనుగుణంగా ఉండవచ్చు గానీ మనకి, ప్రత్యేకించి మన ఒక్కరికే అనుకూలంగా ఉండకపోయే అవకాశం కూడా ఉంది. కంప్యూటర్‌ తెరలపై అక్షరాలు 9 పాయింట్ల పరిమాణంలో చూపించడం అందరికీ బావున్నా, చూపుతక్కువ ఉన్నవారికి కొంచెం పెద్ద అక్షరాలు అవసరం కావచ్చు. కాబట్టి మన భద్రత కోసం (ఉదాహరణకు, అప్పనంగా మన సమాచారాన్ని, వనరులను తయారీదార్లు వాడేసుకోకుండా చూసుకోడానికి), మన సౌకర్యం కోసమూ (తెర మీద అక్షరాలు పెద్దగా కనబడేలా అమర్చుకోవడం లాంటివి) మనం తరచూ వాడే కంప్యూటర్, మొబైల్‌ అనువర్తనాల అమరికలను మనకు తగ్గట్టు మలచుకోవడం మనకే మంచిది.
      ఈ విషయంలో ప్రముఖ వ్యాపార సంస్థలు అందించే అనువర్తనాల కంటే, స్వచ్ఛంద ప్రయత్నాల ద్వారా తయారయ్యే స్వేచ్ఛా సాఫ్ట్‌వేరు అనువర్తనాలే మేలు. ఇవి వాడుకరుల భద్రత, అంతరంగికత రాజీపడకుండా ఉండేలా అప్రమేయ ఎంపికలతో లభిస్తున్నాయి. ఉదాహరణకు, అంతర్జాలంలో విహరిస్తున్నప్పుడు మన జాడను గుట్టుగా కనిపెట్టే వివిధ ట్రాకర్లను, కుకీలను ఫైర్‌ఫాక్స్‌ అంతర్జాల విహారిణి అప్రమేయంగానే అడ్డుకుంటుంది. ఎందుకంటే దాన్ని తయారు చేసిన మొజిల్లా అనే సంస్థ వాడుకరుల హక్కుల కోసం, అంతర్జాల స్వతంత్రత కోసం పోరాడే లాభాపేక్ష లేని స్వచ్ఛంద సంస్థ. వారి ఉత్పాదనల్లో వాడుకరుల భద్రత, అంతరంగికతలు మొదటి ప్రాధాన్యాంశాలు. ఇలాంటి సంరక్షణ గూగుల్‌ క్రోమ్, మైక్రోసాఫ్ట్‌ ఎడ్జ్‌ లాంటి ప్రముఖ సంస్థల విహారిణులలో అప్రమేయంగా ఉండదు.
      చాలామంది తెలియకో, కష్టమనుకునో, అర్థంకాకనో (లేక బద్దకం వల్లనో మరి) కంప్యూటర్, ఫోను వంటి వాటిల్లో అప్రమేయ అమరికలను మార్చుకోరు.  అందుకేనేమో ఎంత ఎడమచేతి వాటం వాళ్లయినా కంప్యూటర్‌ మౌస్‌ను కుడిచేత్తోనే వాడుతూంటారు! బహుశా, ఈ అనువర్తనాలు తెలుగులో ఉంటే అర్థంకాకపోవడం, తెలియకపోవడం అనే సమస్య ఉండదేమో.
      కంప్యూటర్, మొబైల్‌ అనువర్తనాల్లో అమరికలు, అభిరుచులు, ఎంపికలు (సెట్టింగులు, ప్రిఫరెన్సులు, ఆప్షన్స్‌) లాంటివి ఈ అప్రమేయాలను వాడుకరులకు తగ్గట్టు మార్చుకునేందుకు వీలుకల్పిస్తాయి. కాబట్టి, కంప్యూటరు/ స్మార్టుఫోనుల్లో మీ అభిమాన అనువర్తనాల అమరికలను ఓసారి చూడండి. వాటిని మీకు తగ్గట్టు మలచుకోండి. వాటిలో కొన్ని భాషను ‘తెలుగు’ అని ఎంచుకోనిస్తాయి కూడా!


వెనక్కి ...

మీ అభిప్రాయం