నాయమేటికి దప్పితివి రఘునాథా?

  • 503 Views
  • 1Likes
  • Like
  • Article Share

    హర్ష

  • హైదరాబాదు.

రుద్రకవి సుగ్రీవవిజయమును స్త్రీ, వృద్ధ, పామరాదులు పలువురు పాడుచుందురట! ఆయా పాత్రముల పాటలు తత్తద్వేషధారులు వచ్చి పాడునట్లును తక్కిన సంధి వచనాదులు ఒక్కరిద్దరు సూత్రధారప్రాయులు పఠించునట్లును, నీ సుగ్రీవవిజయము వీథియాటగా నాడబడుచుండెడిది. ఈ లఘుకృతి వీరకరుణరసభరితము. నీతిహృద్యము’’  - వేటూరి ప్రభాకరశాస్త్రి
తెలుగులో
‘సౌభరి చరిత్రము’ను తొలి యక్షగానంగా పేర్కొంటారు. రచించింది ప్రోలుగంటి చెన్నశౌరి. కానీ ఇప్పుడిది అలభ్యం. ఇక దొరుకుతున్న వాటిలో ముందువరసలో నిలిచేది ‘సుగ్రీవ విజయం’. దీన్ని క్రీ.శ.1550 కాలానికి చెందిన కందుకూరి రుద్రకవి రచించాడు. అయితే ‘లక్ష్మీ కల్యాణమురేకు’, చక్రపురి రాఘవాచార్యుడు రాసిన ‘విప్రనారాయణ చరిత్రము’ అనే యక్షగానాలు సుగ్రీవ విజయానికి ముందు వచ్చిన రచనలంటారు. అయితే వీటిలో మొదటిది అలభ్యం, రెండోది అముద్రితం. అందుకని ఆరుద్ర అన్నట్లు ‘‘ఈ (యక్షగాన) శాఖపై పూచిన తొలిపువ్వులు ఎన్నో ఉన్నాయి. కానీ తొలిపండు మాత్రం ఒక్క సుగ్రీవ విజయమే’’. 
      ఇది రామాయణంలో కిష్కింధకాండకు సంబంధించిన కథ. శ్రీరాముడి సాయంతో వాలిని వధించి వానర రాజ్య పట్టాన్ని సుగ్రీవుడు దక్కించుకున్న ఘట్టం ఈ యక్షగానం ఇతివృత్తం. అంటే కథ చాలా చిన్నది. అన్ని కావ్యాల్లానే సంప్రదాయాన్ని అనుసరించి ‘సుగ్రీవ విజయం’ కూడా శ్రీకారంతోనే ప్రారంభమవుతుంది. ఈ యక్షగానాన్ని రుద్రకవి కందుకూరి జనార్దనుడికి అంకితం ఇచ్చాడు. కావ్య ప్రారంభమే కాదు, కథను కూడా ‘శ్రీ’కారంతోనే ప్రారంభించడం, తొలి ఉత్పలమాల పద్యం తప్పిస్తే మిగిలిన భాగమంతా దేశి ఛందస్సులోనే రాయడం ‘సుగ్రీవ విజయం’ ప్రత్యేకత.
సుగ్రీవుడి సంశయం
రావణుడు సీతను అపహరిస్తాడు. రామలక్ష్మణులు ఆమెకోసం వెతుకుతూ పంపానదీ తీరంలో సంచరిస్తుంటారు. సుగ్రీవుడు ఋష్యమూక పర్వతం మీది నుంచి వారి ‘తేజోవిశేషాలకు’ అచ్చెరువొందుతాడు. వాళ్ల చేతుల్లోని విల్లంబులను చూసి, తనను చంపించడానికి వాలి పంపిన మనుషులేమోనని భయపడతాడు కూడా. అదే మాట తన మంత్రి హనుమంతుడికి చెబుతాడు. ‘వాళ్లు కపటమునుల్లా ఏమీ అనిపించడం లేదు. గొప్ప రాజసంతో అలరారుతున్న వాళ్లు ఇక్కడికి ఎందుకు వస్తున్నారో? నిజం తెలుసుకుని వస్తాను’ అంటాడు ఆంజనేయుడు. నేరుగా రామలక్ష్మణుల దగ్గరికి వెళ్తాడు. ‘మునివేషం, నృపచిహ్నాలు రెండూ ఉన్నాయి. ఇంతకూ మీరెవరు? అడవిలో ఎందుకు సంచరిస్తున్నారు?’ అని అడుగుతాడు. అప్పుడు లక్ష్మణుడు సీతాపహరణం వరకూ జరిగిందంతా చెప్పి ‘సీతాన్వేషణకు బయల్దేరిన మాకు దారిలో శబరి కలిసి సుగ్రీవుడి దగ్గరికి వెళ్తే మా కార్యం నెరవేరుతుందని చెప్పింది’ అంటాడు. మారుతి వివరాలను అడుగుతాడు. దానికి ఆయన ‘నాపేరు హనుమంతుడు. సుగ్రీవుడి మంత్రిని, వాయుపుత్రుణ్ని. సుగ్రీవుడు అపరిమిత బలసంపన్నుడు. అతణ్ని మీకు బంటుగా చేస్తా’నంటాడు. బదులుగా లక్ష్మణుడు ‘మా అన్న శ్రీరాముడు కూడా సాటిలేని వీరుడు. అయితే రాజులు యుద్ధానికి ఒక్కరే వెళ్లకూడదు. అందుకే మీ సాయం కోరి వచ్చాం’ అంటాడు.
ధీరోదాత్తుడు రాముడు
రాముడి వల్ల మేలు జరుగుతుందని సుగ్రీవుడితో చెబుతాడు హనుమంతుడు. అలా రాముడు, సుగ్రీవుడు ఒకరికొకరు మిత్రులుగా ఉంటామని అగ్నిసాక్షిగా ప్రమాణం చేస్తారు. తర్వాత సీతను రావణుడు అపహరించుకు పోతున్నప్పుడు ఆమె విడిచిపెట్టిన ఆభరణాలను సుగ్రీవుడు రాముడికి చూపిస్తాడు. వాటిని చూసిన రాముడు వెంటనే మూర్ఛపోతాడు. కాసేపటికి తేరుకొని, ఆభరణాలను హత్తుకొని ‘‘నను శౌర్యవంతుడని తన పుత్రినిడినట్టి/ జనక విభుడీ వార్త విని వగవకున్నె’’ అని తనవల్ల సూర్య వంశమే అపకీర్తి పాలైందని విలపిస్తాడు. ఈ సందర్భంలో రాముడి మనఃస్థితిని నాటకీయత ఉట్టిపడేలా ఇలా వర్ణిస్తాడు రుద్రకవి. 
కన్నులనశ్రులు గ్రమ్మగ వగచున్‌ 
ఔరా విధివశమనీ తలయూచున్‌ 
ఏటికి ప్రాణములికనని తలచున్‌ 
క్రమ్మర సొమ్ములు రొమ్మున నొత్తున్‌
ఏగతి నోరుతునికనని పలుకున్‌ 
బాపురె విధియని ఫాలము ముట్టున్‌ 

      అయితే ఇది ఏడ్చేందుకు సమయం కాదు. ముందు సుగ్రీవుడి పగదీర్చి, తర్వాత రావణుడితో యుద్ధానికి వెళ్లాలనుకుంటాడు రాముడు. ఇక్కడ రాముడి ధీరోదాత్తత వెల్లడవుతుంది. ఆ తర్వాత సుగ్రీవుణ్ని అడిగి వాలితో అతనికెందుకు వైరం వచ్చిందో కనుక్కుంటాడు. ఏడు తాటిచెట్లను ఒక బాణం దెబ్బతో కూల్చిన రాముడి బలాన్ని చూసిన సుగ్రీవుడు.. సీతాపతికి సాష్టాంగ పడి తనను బంటుగా చేసుకోమంటాడు.
వాలి- సుగ్రీవుల పోరాటం
‘వాలిని యుద్ధానికి పిలువు. నీకు వానర రాజ్యం ఇస్తాను’ అంటూ సుగ్రీవుడికి భరోసా కల్పిస్తాడు రాముడు. సుగ్రీవుడి ఆహ్వానం మేరకు వాలి యుద్ధానికి వస్తాడు. తమ్ముణ్ని చావమోదుతాడు. ఇదంతా చాటునుంచి గమనిస్తుంటారు రామలక్ష్మణులు. 
ముక్కులు చెక్కులు మూపులు వీపుల్‌ 
ప్రక్కలు పిక్కలు బరులును దరులున్‌ 
స్వరములు శిరములు జానులు వీనుల్‌ 
కరములు నురములు కాళ్లును వ్రేళ్లున్‌ 
ఎక్కువ తక్కువ లింతయు లేకన్‌ 
ఒక్క రూపమున నున్నవి చూడన్‌ 

      అని వితర్కించుకుంటున్న రాముడు తన బాణం ఎవరిని హతమారుస్తుందోనని మిన్నకుండి పోతాడు. తర్వాత సుగ్రీవుడు ‘నిన్ను నమ్మితే ఇలా చేశావేంటి?’ అని అడుగుతాడు. దానికి రాముడు ‘మీరిద్దరూ ఒకేలా ఉన్నారు. ఈ గజపుష్పమాల ధరించి వాలిని మళ్లీ యుద్ధానికి పిలువ’మంటాడు.
      రాముడు చెప్పిన ప్రకారం చేస్తాడు సుగ్రీవుడు. అప్పుడు వాలి ‘వీణ్ని చంపకుండా వదిలిపెడితే ‘తెంపుగల మగవాని వలె’ తిరిగివచ్చాడు. ఇక వీణ్ని ప్రాణాలతో విడిచిపెట్టేది లేద’నుకుంటాడు. వాలి యుద్ధానికి వెళ్తుంటే అతని భార్య తార ‘సుగ్రీవుడికి అండగా రాముడు ఉన్నట్లు అంగదుడి ద్వారా తెలిసింది. అందుకే మళ్లీ యుద్ధానికి పిలుస్తున్నాడు. రాముడు విష్ణుమూర్తి అవతారం. ఆయనను మీరు గెలవలేరు. వెళ్లి శరణు వేడుకోండి’ అంటుంది. ‘నాలాంటి బల సంపన్నుణ్ని విడిచిపెట్టి రాముడు సుగ్రీవుడితో స్నేహం చేశాడు. రావణుడు సీతను అపహరించుకు పోయినప్పుడే రాముడి బలం ఎంతో తెలిసింది. ఇక నీ పాలుమాలిన మాటలను కట్టిపెట్టు’ అని యుద్ధానికి బయల్దేరతాడు వాలి. యుద్ధంలో తడబడుతున్న సుగ్రీవుణ్ని గమనించిన రాముడు చెట్టు చాటునుంచి ఒక దివ్యాస్త్రాన్ని వాలి మీదికి సంధిస్తాడు. దాంతో వాలి నేలకూలతాడు.
స్వాభిమాని వాలి
తనను చూసేందుకు వస్తున్న రాముడితో ‘నాయమెరుగక చంపితివి నరనాథ!! పాపము కట్టుకొంటివి; నీవు బోయవే కాని రాజువెలా అవుతావు?; అయినా కోతి మాంసం ఏం చేసుకుంటావు? అన్నదమ్ములం మాలో మేం తగవు పడితే మధ్యలో నువ్వెందుకు వచ్చావు?; మునిరూపంలో ఉండి హింసకు పాల్పడ్డావు. నువ్వు రాజువూ కావు, తపసివీ కావు. ఒకవేళ నేను చేసింది తప్పే అయితే భరతుడితో ఆజ్ఞాపింప చేస్తే న్యాయం కానీ, నన్ను చంపడం పాడికాదు కదా! ఇవన్నీ అలా ఉంచితే రాముడు ధర్మాత్ముడు అంటారు. ఆ మాట నిజమని ఇప్పుడెలా నమ్మాలి? కనీసం నాకు ఎదురు నిలిచి చంపినా బాగుండేది. రావణుణ్ని నా వాలంలో చుట్టి సముద్రంలో ముంచాను. ఒక్క మాట చెప్పి ఉంటే రాక్షసులందరినీ మట్టుబెట్టి సీతను తీసుకొచ్చే వాణ్ని కదా!’ అంటాడు వాలి. ఇక్కడ అతణ్ని అభిమాన ధనుడిగా చిత్రించాడు రుద్రకవి. అంతేకాదు వాలి రాముడి చేతిలో మరణించినప్పటికీ చదివేవారికి అతనిపట్ల సానుభూతి కలుగుతుంది.
      దానికి రాముడు వాలితో ‘ఎందుకు కపివర్యా! ఈ పాలుమాలిన మాటలు? మహా బలశాలివై ఉండీ తమ్ముడి భార్యను చెరబట్టావు. అసలు నిన్ను నేను చంపేందుకు తగినవాడివే కాదు. పైగా మృగాలను చాటునుంచి కాకుండా ఇంకెలా చంపాలి? నేను భరతుడు పంపితేనే వనవాసానికి వచ్చాను కదా! ఇదలా ఉంచితే ధర్మమే జయిస్తుంది అని నమ్మని బతుకు దుర్భరమే కదా!’ అంటాడు.
వాడి ములుకులు తార పలుకులు 
ఇంతలో వాలి మరణ వార్త విని, భర్త దగ్గరికి చేరుకున్న తార జన్మజన్మలకైనా ‘నీలాంటి పతి దొరకడ’ని వాపోతుంది. ‘రాముడు వాలిని చంపేశాడు. ఇక రాజ్యమంతా తీసుకుని ఏలుకో, అయినా ఇదేం పౌరుషం’ అని సుగ్రీవుణ్ని దెప్పిపొడుస్తుంది. ఆ తర్వాత రాముణ్ని చూస్తూ, ‘నీ భార్యను అపహరించిన దశకంఠుడు ఉండగా వాలిని ఎందుకు చంపాల్సి వచ్చింది? భరతుడు రాజ్యం గుంజుకున్నప్పుడు ఈ సాహసం ఎక్కడ పోయింది? న్యాయం ఎందుకు తప్పావు? నీ న్యాయమంతా కూడా సీతతో పాటే వెళ్లిపోయిందా? పుణ్యపాపాలు తెలియని నీవెక్కడి రాజువు? గుణహీనుడివే తప్ప గొప్పవాడివి మాత్రం కావు. సూర్యవంశంలో పుట్టిన నిన్ను రాజు అని ఎలా అనుకోవాలి?’ అంటుంది. ఈ ఘట్టంలో రుద్రకవి తన రచనను గురించి ‘కరుణ భాసుర యక్షగాన ప్రబంధం’ అని చెప్పుకున్నట్టు కరుణ రసాన్ని అద్భుతంగా ఆవిష్కరిస్తాడు. అంతేకాదు తార అనే ఎత్తిపొడుపు మాటలు రామబాణాల ములుకుల కంటే వాడిగా ఉంటాయి. ఆ తర్వాత మూర్ఛ నుంచి తేరుకున్న వాలి సుగ్రీవుడితో ‘నీ వైరం అంతా తీరిపోయింది. అయితే రాజులను నమ్మకు. రాముడికి ఇచ్చిన మాటను తొందరగా నెరవేర్చు. అంగదుడు పిల్లవాడు. వాడికేమీ తెలియదు. ఇకనుంచి వాణ్ని నీ కొడుకే అనుకుని మంచిగా చూసుకో’ అని అంటాడు. అంగదుడి వైపు తిరిగి ‘నాయనా ఏడవకు. సుగ్రీవుడు నీకు చిన్నాన్నే కదా! నువ్వంటే ఎంతో ప్రేమ. నిన్ను మన్నిస్తాడు. నీకు నేనెంతో సుగ్రీవుడూ అంతే. ఇకనుంచి ఆగడాలు చేయకు. నిన్ను వానర రాజుగా చేయాలన్న నా కోరిక తీరలేదు’ అని సుద్దులు చెప్తాడు.
      రాముడు అతని శరీరం నుంచి బాణాన్ని తీసిన వెంటనే వాలి ఊర్ధ్వ లోకాలకు ఏగుతాడు. వానరులు అతనికి అంతిమక్రియలు నిర్వహిస్తారు. ఆ తర్వాత సుగ్రీవుడికి వానర రాజ్యపట్టం, అంగదుడికి యువరాజ్య పట్టం కట్టమని కిష్కింధ ప్రజలను రాముడు ఆదేశిస్తాడు. జరుగుతున్నదంతా గమనిస్తున్న కిష్కింధ ప్రజలు... ‘అయ్యో! ఈ కుటిలుడి మాటలు విని రాముడు వాలిని చంపేశాడు’ అని కొంతమంది; ‘లేదులేదు... రాముడికేం తెలుసు? సుగ్రీవుడే దీనికంతటికీ కారకుడ’ని మరికొంతమంది; ‘అదేమీ లేదు... భార్య, కొడుకు వద్దని వారించినా యుద్ధానికి వెళ్లిన వాలిదే తప్ప’ని ఇంకొంతమంది; ‘రాముడంతటి వాడితో కోతికి శత్రుత్వం ఎందుక’ని మరింకొంతమంది; ‘అసలు ఇవన్నీ మనకెందుకు వాలి కంటే సుగ్రీవుడే మేల’ని ఇంకొంత మంది పరిపరి విధాలుగా చెప్పుకుంటారు.
సుగ్రీవ పట్టాభిషేకం
కిష్కింధలో సుగ్రీవుడు సింహాసనం అధిష్ఠిస్తాడు. అంగదుడికి యువరాజ్య పట్టం కడతారు. కిష్కింధలోని పుణ్యాంగనలు శ్రీరాముడికి విజయం చేకూరాలని, ఆయన కృపతో సుగ్రీవుడు వానర రాజ్యాన్ని సుభిక్షంగా పరిపాలించాలని, సుగ్రీవుడితో పాటు అంగదుడికీ కీర్తి కలగాలని ‘ధవళాలు’ పాడతారు. ఇక అక్కడి చెంచెతలు రాముడి చేతిలో రావణుడికి భంగపాటు తప్పదని, రామాయణం సుఖాంతం అవుతుందని ‘ఏలలు’ ఆలపిస్తారు. సుగ్రీవుడు రాముడికి సాష్టాంగ ప్రణామం చేసి కిష్కింధకు రావాలని ఆహ్వానిస్తాడు. దానికి శ్రీరాముడు ‘వనవాసానికి వచ్చాము. కనుక మేము పట్టణాలకు రాకూడదు. వానాకాలం ముగిసిన తర్వాత రావణుడితో యుద్ధానికి సన్నాహాలు చేద్దాం. అప్పటివరకు నేను, లక్ష్మణుడు మాల్యవంతం మీదే ఉంటాం’ అంటాడు. సుగ్రీవుడు సకల వానరులతో కిష్కింధకు వచ్చి రాజ్యపాలనలో నిమగ్నుడవుతాడు. అలా చివరికి ‘‘ఇందిరావరునకు నిభభయ హరునకు/ కందర్ప గురునకు కల్యాణం...’’ అనే మంగళాశాసనంతో సుగ్రీవ విజయం యక్షగానం ముగుస్తుంది. రామాయణంలో నాయకుడు రాముడు. పతాక నాయకుడు సుగ్రీవుడు. అంటే రాముడి (నాయకుడి) సాయంతో తన కార్యాన్ని నెరవేర్చుకుని, నాయకుడికి అతని ప్రయత్నంలో సహకరించే వాడన్నమాట! రావణుడు ప్రతినాయకుడు. ఇక సుగ్రీవ విజయంలో నాయకుడు సుగ్రీవుడు అయితే, పతాక నాయకుడు రాముడు. ప్రతినాయకుడు వాలి. అలా రామాయణంలో దాన్ని పోలిన మరో రచనగా, రసవంతంగా మలచిన ‘సుగ్రీవ విజయం’ యక్షగానం రుద్రకవి పేర్కొన్నట్లే భూమిమీద ‘ఆచంద్రతారార్కమై’ ఒప్పుతుంది.
      సుగ్రీవ విజయంలో ప్రధాన రసం (అంగి రసం) వీరం. కథకు ఆయువుపట్టు సంఘర్షణ. కరుణ, రౌద్ర రసాలు అంగ రసాలు. ఇందులో రుద్రకవి... ఓ వృత్తం, కందం, రెండు సీస పద్యాలు, మూడు తేటగీతులు, రెండువందల ద్విపదలు, వచనాలు, త్రిపుట, జంపె, కురుచజంపె, ఆటతాళం, ఏకతాళం లాంటి దరువులు; ధవళాలు, శోభనాలు, మంగళాలు, ఏలలు, అర్ధచంద్రికలు మొదలైన ఛందో ప్రక్రియలను ఉపయోగించాడు. మొదటగా రాసిన ఉత్పలమాల పద్యం మినహా మిగిలినవన్నీ దేశీయ ఛందో ప్రక్రియలు. రుద్రకవి త్రిపుటలన్నీ (గురజాడ అప్పారావు సృష్టించిన) ముత్యాల సరాల లక్షణానికి సరిపోతాయి. తొలి తెలుగు యక్షగానాల్లో ఒకటైన ‘సుగ్రీవ విజయం’ చదివాక ఆరుద్ర అన్నట్టు- రుద్రకవి రామాయణం అంతా ఇలా యక్షగానంలా రాయలేదేమనే బాధ కలుగుతుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం