మూఢనమ్మకాలపై మూడోనేత్రం

  • 744 Views
  • 0Likes
  • Like
  • Article Share

ఒక మనిషి అవసరం మీద మరో మనిషి ఎప్పుడూ వల విసురుతూనే ఉంటాడు. ఆ అవసరం ఆసరాగా ఎదుటి వ్యక్తిలో మొదట భయాన్ని సృష్టిస్తాడు. దేవుడి పేరు చెప్పి ఆ భయాన్ని అణచివేస్తాడు. ఈ మధ్యలో తన పబ్బం గడుపుకుంటాడు. గ్రామీణ సమాజంలో ఇలాంటి దోపిడీకి పావులుగా మారే అమాయకులు ఎందరో కనిపిస్తారు. అయితే, భ్రమల్ని వీడి మనిషి ఎప్పుడూ వాస్తవంలో జీవించాలని, లేకపోతే మూఢనమ్మకాల్లో చిక్కుకుని ఆగమాగం కాక తప్పదని తెలియజేస్తుంది బోయ జంగయ్య జాతర నవల. 
‘అభూత
అసందర్భ కల్పనల్లోంచి, అవాస్తవిక ప్రపంచంలోంచి, దెయ్యాలు భూతాల క్షుద్ర సాహిత్యంలోంచి తెలుగు రచన బయటపడి పునర్జీవించటానికి ఇట్లాంటి రచనలు రావాలి’ అని బోయ జంగయ్య గురించి భారతి మాస పత్రిక వ్యాఖ్యానించింది. మూఢవిశ్వాసాల పట్ల తిరస్కారం, శాస్త్రీయ దృక్పథం, దళిత చైతన్యం బోయ జంగయ్యను తెలుగు సాహిత్యంలో ఉన్నతంగా నిలబెట్టాయి. గ్రామీణుల వాస్తవిక జీవితాలను, వారి వెనుకబాటుతనాన్ని, అక్కడ కనిపించే అంధవిశ్వాసాలను కళ్లకుకట్టినట్లు రాయడంలో సిద్ధహస్తులైన జంగయ్య హేతువాది, మార్క్సిస్టు కూడా. సమాజం శాస్త్రీయ దృక్పథాన్ని అలవరచుకుని, అనవసర ఆచారాలను వదిలేయాలని తన రచనల్లో బలంగా చెప్పారు జంగయ్య. 
దోపిడీ పర్వం
బోయ జంగయ్య ‘జాతర’ నవల గ్రామీణ ప్రాంతాల్లో ముఖ్యంగా తెలంగాణ మారుమూల పల్లెల్లో దైవం పేరిట జరిగే దోపిడీనీ, మూఢనమ్మకాల వల్ల గ్రామీణ ప్రజలు మోసపోతున్న వైనాన్నీ వివరిస్తుంది. రాధ అనే మహిళకు సంతానం కలగడం చుట్టూ ఈ నవల సాగుతుంది. ఆ ఊరి భూస్వామి సీతయ్య కోడలు రాధ. ఆమె భర్త పాండయ్య బంగారు బొమ్మలాంటి భార్యను పట్టించుకోకుండా పట్నం వెళ్లి మద్యం తాగి, పరాయి స్త్రీలతో గడిపి వస్తుంటాడు. రాధకి పిల్లలు కలగకపోవడంతో భర్త రెండో పెళ్లికి సిద్ధపడతాడు. అయితే, సీతయ్య అందుకు ఒప్పుకోడు. ‘‘కొట్టంలో పశువుల మంద ఎంత పెరిగితే అంత విలువ కాని, ఒక మనిషి ఇద్దరు పెళ్లాలను చేసుకుంటే విలువ తగ్గుతుంద’’ని చెబుతాడు. గుడిలో దీపం వెలిగించి ఒక రాత్రి నిద్ర చేస్తే పిల్లలు కలుగుతారని ఊళ్లోవాళ్లు సీతయ్యకు చెబుతారు. రాధను గుడికి పోయి రమ్మంటాడు సీతయ్య. అప్పుడు రాధ ‘‘ఛీ! ఆడపిల్ల జీవితం ఏంది? ఇష్టమున్నంత చదువనియ్యరు. ఇష్టమైనోన్ని చేసుకోనియ్యరు. భర్త కుటుంబంవాళ్లతో తప్ప వేరేవాళ్లతో మాట్లాడొద్దు. పోగా... భార్యని పెట్టుకుని గూడా మరో స్త్రీ కోసం తిరగటం, ఒళ్లు తూలే వరకు తాగొచ్చినా సేవలు చేసి పడుకోబెట్టాలి. పిల్లలను కనాలి. పిల్లలు కాకుంటే ఆడదాని లోపమే అంటారు’’ అని తన మనసులో అనుకుంటూనే జీతగాడు రంగడి సహాయంతో గుర్రపు బండిమీద జాతరకి వెళుతుంది. దీపారాధన సమయంలో పూజారి రాధను చూస్తాడు. ఆమె కోరికను తెలుసుకుని ‘‘ఏ కార్యం వెనుక ఏ పరమార్థం దాగుందో! మనం నిమిత్తమాత్రులమే’’ అని రాధకు మాయ మాటలు చెప్పి ‘మన్మథపూజ’ చేస్తాడు. ఆ తర్వాత రాధ కడుపు పండుతుంది. ఇదీ స్థూలంగా నవల ఇతివృత్తం. ఇందులో దేవునిపేరిట జరిగే మోసాలు, భక్తిముసుగులో పేట్రేగుతున్న అకృత్యాలను చర్చకు పెడతారు రచయిత. గుడికిపోయి పూజ చేస్తే పిల్లలు పుడతారనేది ఒట్టి అబద్ధమని ఈ నవలలో చివరికి రాధ తెలుసుకుంటుంది. మనిషిని గుడ్డివాణ్ని, ఎడ్డివాణ్ని చేస్తున్న మూఢనమ్మకాలను ప్రచారం చేసేవాళ్లమీద ఆమెకు కోపం వస్తుంది. ‘‘చెట్టువల్ల మరో చెట్టు పుట్టినట్టే, జంతువు వల్ల మరో జంతువు పుట్టినట్టే, మనిషి వల్ల మనిషి పుడతాడుగానీ మంత్రాలకు, పూజలకు పుట్టరనుకుంటా’’ అంటుందామె. ఒక సాధారణ గృహిణి నోట ఇలాంటి మాటలు పలికించడం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల్లో చైతన్యం నింపే ప్రయత్నం చేశారు రచయిత. 
స్త్రీవాదానికంటే ముందే...
జాతర నవల ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురితమయ్యింది. మైసూరు విశ్వవిద్యాలయం 1995లో బీఈడీ విద్యార్థులకు దీన్ని ఉపవాచకంగా చేర్చింది. జంగయ్యకు విశేష ఖ్యాతిని ఆర్జించి పెట్టిన ఈ నవలను విమర్శకులు దళిత సాహిత్యం కింద చేరుస్తూ వచ్చారు. కానీ, ఇది స్త్రీవాద నవల అని, స్త్రీవాదం తెలుగు సమాజంలో వెళ్లూనుకోకముందే జంగయ్య ఈ నవలలో లైంగిక దోపిడీ గురించి మాట్లాడారని, స్త్రీల పట్ల నెలకొన్న వివక్షను, జరుగుతున్న అన్యాయాల్ని ఇందులో బలంగా చిత్రించారని పలువురు పేర్కొన్నారు. శ్రీశ్రీ స్మారక పురస్కారం, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ నవలా పురస్కారం ఈ నవలను వరించాయి. పితృస్వామ్య సమాజంలో కనిపించే పురుషాధిక్యత, మతం, దైవం పేరిట సామాన్యులపై పెత్తందారులు సాగించే దోపిడీ, దేవుడి పేరు మీద జరిగే రకరకాల తంతులు లాంటివెన్నో ‘జాతర’ నవలలో కనిపించి ఆశ్చర్యానికి గురిచేస్తాయి. తమ కోరికలు నెరవేరడం కోసం దేవుడి చుట్టూ తిరిగే ప్రజలు, తమ ఆశ అడియాస అయితే అదే దైవాన్ని ఎలా నిందిస్తారో కూడా ఇందులో కనిపిస్తుంది. ఏ జాతరకు పోతే పిల్లలు పుడతారో అదే జాతరలో ఒక్కగానొక్క కొడుకును కోల్పోయిన తల్లి ‘‘నీ గుడి గుండంలో మునగరో, నీ గుడి చీకటికానురో, నీ కడుపు కాలరో’’ అంటూ దేవుడికి శాపనార్థాలు పెడుతుంది. పోలీసులు జాతరలో తిరుగుతున్న వేశ్యలను పట్టుకుని వాళ్ల భర్తల పేర్లు చెప్పమని అడిగితే, దేవుళ్లే తమ మొగుళ్లని చెప్పగానే పాఠకులకు ఆశ్చర్యం కలిగినా, అదే నిజమని చివరికి అర్థమవుతుంది. దొంగ స్వాముల అకృత్యాలు, పోలీసుల దుర్మార్గాలనూ కళ్లకుకడుతుందీ నవల. 
పదునైన సంభాషణలు
‘‘మనిషి ఊహ చాలా తీయనిది. నిజ జీవితంలో పొందలేనివన్నీ మనిషి ఊహల్లో పొందుతాడు. ఆకాశం విశాలంగా వున్నట్లే ఊహ చాలా విశాలంగా వుంటుంది. మందులో మత్తున్నట్టే ఊహల్లో మత్తుంటుంది. నిజ జీవితంకంటే ఊహల్లోనే తృప్తి ఉన్నట్లు ప్రతి మనిషికి కొన్ని గుర్తులు. తను బతకడం కోసం రాయిని పూజిస్తున్నాడు. పామును పూజిస్తున్నాడు. ఈ పూజలకు కారణం భయం. మనిషిలో భయం ఉన్నంత వరకు ఈ పూజలు తప్పవు’’ లాంటి ఆలోచింపజేసే సంభాషణలు ఈ నవలలో చాలా కనిపిస్తాయి. 
      బోయ జంగయ్యను సాహితీప్రియులు, సన్నిహితులు ‘బోజ’ అని పిలుచుకుంటారు. కథనంలో క్లుప్తత, పాత్ర చిత్రణలో సహజత్వం జంగయ్య రచనల్లో మరో ప్రత్యేకత. ‘జాతర’ నవలలోని భాష, పాత్రలు, సన్నివేశాలు తెలంగాణ పల్లె వాతావరణాన్ని కళ్లకు కడతాయి. కొన్ని సంప్రదాయాలు సమాజాన్ని అంధకారంలోకి నెడుతున్న వైనాన్ని జంగయ్య తన రచనల్లో నిర్భయంగా చెప్పారు. బాలల కోసం కూడా ఆయన అనేక పుస్తకాలు రాశారు. 2006లో ప్రచురించిన ‘మనవడు చెప్పిన కథలు’ మంచి గుర్తింపు తెచ్చింది. ఆయన సాహితీ సేవను గుర్తించి పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం 2003లో గౌరవ డాక్టరేటుతో సత్కరించింది. ‘గొర్రెలు’ కథను ఉస్మానియా, ఆంధ్ర విశ్వవిద్యాలయాలు పాఠ్యాంశంగా తీసుకున్నాయి. యాభైౖ ఏళ్ల నిరంతర సాహితీ సేద్యం సాగించిన బోజ కథలన్నీ మానవతావాదాన్ని చిత్రిస్తాయి. ‘‘జీవితాన్ని బాగా చదివిన వారే ఇటువంటి ఉత్తమ నవలలు, కథలు రాయగలరు. బోయ జంగయ్య రచనలను చదువుతున్నప్పుడు వొళ్లు జలదరిస్తుంది’’ అంటూ రాచకొండ విశ్వనాథ శాస్త్రి లాంటి వారు అందించిన మెచ్చుకోళ్లు బోయ జంగయ్య అద్భుత రచనా పాటవానికి నిదర్శనాలు.


వెనక్కి ...

మీ అభిప్రాయం