పారిపోవుట యిదియేమి ప్రజ్ఞ!

  • 35 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। ప్రభల జానకి

  • హైదరాబాదు
  • 9000496959
డా।। ప్రభల జానకి

రామదాసు కట్టించిన భవ్య ఆలయాన్ని విడిచి.. అసలు ఆ భద్రాచలం పుణ్యక్షేత్రాన్నే వదిలేసి పోలవరంలో తలదాచుకున్నారట శ్రీరామ ప్రభువులు! ఎందుకు? ఆయనకు అంత కష్టం ఏమొచ్చింది? నమ్మశక్యం కాని విషయమే కానీ, నమ్మితీరాల్సిన చారిత్రక వాస్తవమిది. అయిదేళ్ల పాటు పోలవరానికి వలసపోయిన రామచంద్రుడి మీద నిందాస్తుతిలో భల్లా పేరయకవి రచించిన ‘భద్రగిరి శతకమే’ దీనికి సాక్ష్యం!
పద్దెనిమిదో
శతాబ్దం పూర్వార్ధంలో ‘దంసా’ అనే సేనానాయకుడు వరంగల్లు సమీపంలో వేల్పుకొండ దుర్గం నిర్మించుకున్నాడు. విశృంఖలంగా విజృంభించి చుట్టుపక్కల ప్రాంతాల్లో దురంతాలకు పాల్పడ్డాడు. ప్రజలను దోచుకుంటూ, స్త్రీలను చెరబడుతూ, దేవాలయాల్ని ధ్వంసం చేసుకుంటూ వస్తున్న అతని ధాటికి స్థానికులందరూ బెదిరిపోయే పరిస్థితి! భద్రాద్రి రామాలయ ధర్మకర్తృత్వం నిర్వహిస్తున్న పాల్వంచ జమీందారు అశ్వారావు బహద్దూరు కూడా దంసాకు జడిసి పలాయనం చిత్తగించాడు. ధీరులైన రామాలయ అర్చకులు, హరిదాసాదులు మూలవిరాట్టు విగ్రహాలకు తగిన రక్షణ కల్పించి.. ఉత్సవ విగ్రహాలు, రామదాసు చేయించిన దివ్యాభరణాలను వెంట తీసుకుని రహస్యంగా పడవల మీద రెడ్డి పోలవరం వలసవెళ్లిపోయారు. వారికి అక్కడి జమీందారు శ్రీరాములదేవు హృదయపూర్వక స్వాగతమిచ్చి ఆదరించాడు. ఆ కాలంలో ఇలాంటి రక్షణ కల్పించటం పెద్ద సాహసమే! భద్రాద్రి ఉత్సవ విగ్రహాల పరిరక్షణలో ఆంగ్లేయుల ఉద్యోగి జోగిపంతులు, గోరుందొర కప్తాను అపరిమిత సాయం చేశారు. ఈ వలస సమయంలో శ్రీరాముడికి జరగాల్సిన ఉత్సవాలను యథావిధిగా జరిపించటానికి అవసరమైన వ్యయాన్ని విజయనగర ప్రభువులు పూసపాటి విజయరామరాజు, సీతారామరాజులు భరించి చరిత్రలో శాశ్వతత్వం పొందారు. 
      శ్రీరామాలయ ఉత్సవ విగ్రహాల వలస... ప్రజల్లో ఆందోళన కలిగించి అభద్రతాభావాన్ని రేకెత్తించిన విషయం, అప్పటి భద్రాద్రి నగర పరిస్థితులు ‘భద్రగిరి శతకం’లో వర్ణితమయ్యాయి. భల్లా పేరయకవి చేసిన ఈ సీస పద్యరచన దంసా దుండగాలను కళ్లకు కట్టినట్లు వివరించింది. చారిత్రక విషయాలను సంవత్సరాలతో సహా భల్లా పేరయ కవి ఈ శతకంలో పేర్కొన్నాడు. దంసా దౌష్ట్యం పూసపాటి విజయరామరాజు, సీతారామరాజు, రామలదేవు, జోగిపంతులు తదితరుల కాలంలో జరిగినట్లు కవి స్పష్టంగా చెప్పాడు. దంసా క్రీ.శ.1710లో పుట్టి, 1782లో మరణించాడని కొన్ని ప్రమాణాలు లభ్యమయ్యాయి. శ్రీరామ విగ్రహ వలస ‘సర్వధారి’ సంవత్సరంలో జరిగిందని భద్రగిరి శతకం చెబుతోంది. అంటే, దంసా జీవితకాలంలోని 1769వ సంవత్సరమన్న మాట! అప్పటి నుంచి 1773 వరకూ సీతారాములు పోలవరంలో ఉండి, ఆ తర్వాత రెండేళ్లు రాజమహేంద్రవరంలో గడిపి జయనామ సంవత్సరం అంటే 1775లో మార్గమధ్యంలోనే శ్రీరామనవమి కల్యాణోత్సవం జరిపించుకుని భద్రాద్రిలో తిరిగి కాలుమోపారు. ‘‘శ్రీరాముడు పోలవరము వలస యేగుటచో కవి శతక మారంభించి తిరిగివచ్చిన పిదప నైదేండ్లకు బూర్తిచేసియుండును’’ అని భద్రగిరి శతకం పీఠికలో శేషాద్రిరమణ కవులు అభిప్రాయపడ్డారు. తన దగ్గరి తాళపత్రం ప్రకారం పిఠాపురం మహారాజు రాయించిన రాతప్రతి ఆధారంగా ఈ శతకానికి శేషాద్రిరమణ కవులు శుద్ధప్రతిని తయారుచేశారు. దాన్ని 1928లో వావిళ్ల వారు ప్రచురించారు. 
వ్యంగ్యాస్త్రాల దాడి
ఆనాటి గోల్కొండ పాలకులను సైతం కరిగించిన రామదాసు భక్తి తీవ్రత స్ఫూర్తిమంతమైంది. అనంతర కాలంలో ప్రతి కవీ ఆత్మాశ్రయ కవిత్వం రాసి తమ నిత్య జీవితంలోని అనేక ఇబ్బందులను విన్నవించుకోవడంతో పాటు దైవంతో మైత్రిని, సాన్నిహిత్యాన్ని అనుభవించారు. ఈ నేపథ్యంలో సామాజికంగా అలజడులు రేగిన సందర్భాల్లో కవులు వ్యాజస్తుతి శతకాలు వెలువరించారు. అధికారాల్ని, ఐశ్వర్యాన్ని అనుభవించి పరుల దండయాత్రల సమయంలో పలాయనం చిత్తగించిన రాజుల్ని క్షమించేది లేదంటూ శ్రీరాముణ్ని సైతం భల్లా పేరయ విమర్శించాడు. ‘‘రఘువంశమునకెంత రట్టడి దెచ్చితి, వరుస పోలవరంబు వలసబోయి/ భక్తకోటికి నెంత భయము పుట్టించితి, వరుస పోలవరంబు వలసపోయి’’- ఇందులో రఘువంశ ప్రఖ్యాతి శ్రీరాముడిదే అయినా, అపఖ్యాతి పరిపాలకులందరినీ ఉద్దేశించిందే! ‘‘సౌమిత్రికైన దోచకపోయెనా యిట్లు పోవరాదని నీకు బుద్ధి దెలుప/ సీతయైనను మీకు జెప్పలేదాయెనా యిలువెడలుట మహాహీనమనుచు’’ అంటూ పరిపాలకులకు సన్నిహితులు హితవు చెప్పాల్సిన అవసరాన్ని కవి సూచించాడు. ప్రజల ధన మాన ప్రాణాలను రక్షించాల్సిన వారే పారిపోతే సామాన్యులకు ఇక దిక్కెవరంటూ ‘‘పారిపోవుట యిదియేమి ప్రజ్ఞ’’ అని ఎత్తిపొడిచాడు. 
      ఆనాటి ప్రజలు ఈ దండయాత్రలకు, సాంస్కృతిక కల్లోలాలకు ఎంత ఆవేదన చెందారో భద్రగిరి శతకంతో అర్థమవు తుంది. ‘‘సంస్కృతాంధ్రోక్తులసారంబు లుడిగివోయి నపసవ్యభాషల అమరె జగము/ కర్పూరచందనాగరు ధూపముల బాసి గంజాయి పొగలచే గప్పె గుళ్లు’’ అంటూ భల్లా పేరయ ఆవేదన చెందాడు. ఈ పరిస్థితిని చక్కదిద్దకుండా తన దారి తాను చూసుకున్నందుకు రాముణ్ని నిరసించాడు. దశావతారాలను జ్ఞాపకం చేసి, ఇతరుల తోడ్పాటుతో విజయాలు సాధించావు గానీ, వాటిలో నీ స్వయంశక్తి ఏమీ లేదన్నాడు. నీ శంఖుచక్రాలు, ధనుర్బాణాల విలువ ఏపాటిదని పరిహసించాడు. ‘‘తాటకపై కుగ్రతరముగ వెడలిన బాణంబు లెక్కడ బడియె నొక్కొ/ ఘన సుబాహుని బట్టి ఖండించివైచిన శరములెచ్చోటికి నరిగె నొక్కొ’’ అని ప్రశ్నించాడు. కేవలం అలంకారాలుగా మిగిలిపోయిన నీ శంఖుచక్రాలను విడిచిపెట్టు స్వామీ అంటూ ఇలా వ్యంగ్యంగా సలహా ఇచ్చాడు..
శంఖంబు కడుబీదజంగంబుచే నున్న వూదియైనను బొట్ట పోసికొనును 
చక్రంబు కుమ్మరి సరసనుండిన వేడ్క, కుండలైనను చేసికొనురయమున...
స్వామి నీకేల యివి వృథా సరసముగను వారివారికి దయసేయు వరుసతోడ
భద్రగిరివాస శ్రీరామ భద్రదాస పోష బిరుదాంక రఘుకులాంబుధి శశాంక

      శ్రీరాముడి ఆయుధాలు నిరూపయోగమయ్యాయని పేరయ చెప్పటానికి స్ఫూర్తి రామదాసు కీర్తనల్లోని ‘‘నీ శరచాపముల గతి తప్పెనా’’ అనే భావనలే కావచ్చు. కవి దృష్టి కేవలం ఆయుధాల దగ్గరే ఆగలేదు, శ్రీవారి ప్రసాదాల మీదకు కూడా దండెత్తింది. ‘‘పుట్లాది పొంగలి పులిహోరలను మెక్కువారికి రణముపై వాంఛగలదె/ శర్కర పొంగళ్ల చవిగొన్నవారికి బ్రాణంబుపై దీపి బర్వకున్నె?’’ అంటూ ఎద్దేవాచేశాడు. ఇక్కడే కవి అనే ‘‘తాటిపండులు తిని తనిసినవారికి’’ అనే మాట, భద్రాద్రి రాముడికి నిత్యం తాటిపండును నైవేద్యం పెట్టిన పోకల దమ్మక్కను జ్ఞప్తికి తెస్తుంది. 
క్షమించు రామచంద్రా..!
‘‘నీ స్థలంబున నీవు నిలువలేవైతివి- భక్తులనెట్లు కాపాడగలవు?’’ అంటూ రామచంద్రుణ్ని సూటిగా ప్రశ్నించాడు పేరయ కవి. ఏదో విధంగా ప్రజల్ని, రాజ్యాన్ని రక్షించాలి గాని మీరే వలస వెళ్లిపోతే ప్రజలకు మీపై నమ్మకం పోతుందన్న హితవుతో బాటు ‘సత్కీర్తి’కి మచ్చన్న మందలింపూ ఇందులో ఉంది. శ్రీరాముడు వలసబోయిన వృత్తాంతం విని జనక, దశరథ మహారాజులు ఏమనుకుంటారో అని చెబుతూ, ‘‘హరువిల్లు విఱువగ వరపుత్రి నీయంగ జనకరాజేమి విచారపడెనో/ పరశురాముని భంగపఱుపగా నెంచిన దశరథుండేరీతి తల్లడిల్లెెనో’’ అంటాడు కవి. స్థానిక పాలకులతో పాటు నమ్ముకున్న దేవుడూ ఊరు విడిచిపోవడంతో నాటి భద్రగిరి వాసులు సైతం ప్రాణభీతితో కాందిశీకులై, వలసపోయారు. శ్రీరామాలయం వస్తు వాహనాలనేకం దొంగల పాలయ్యాయి.
      ఈ శతకం పూర్వార్థం నిందాప్రధానంగా, ఉత్తరార్థం స్తుతి ప్రధానంగా ఉంటుంది. మొదట్లో వ్యాజస్తుతి చేసిన కవి చివర్లో పశ్చాత్తాపపడి శ్రీరాముని క్షమించమని వేడుకుంటాడు. ‘‘అల కుచేలుని చేరె డటుకుల భక్షించి సంపద లొసగిన సరస గుణుడ’’ వని కీర్తించాడు. ‘‘శ్రీరామచంద్రులు సీతాసమేతులై వచ్చిరి భద్రాద్రివాసమునకు/ జయనామవత్సర చైత్ర శుద్ధాష్టమి తరువాత దినమందు దగ వివాహ’’ అంటూ ఆనందపారవశ్యం చెందుతాడు. శ్రీరామచంద్రుడి పోలవరం వలస కాలం అయిదు సంవత్సరాలని, తిథి, వార, నక్షత్రాలతో సహా తెలపడం చరిత్ర పరిశోధకులకు ఉపయుక్తమైన విషయం. ‘‘ఇందఱు చారిత్రక వ్యక్తులను, ఇన్ని చారిత్రక విషయాలను ఉదహరించిన చారిత్రక శతకమింకొకటి లేదు’’ అంటారు మల్లంపల్లి సోమశేఖరశర్మ. భల్లా పేరయకవి ఉభయభాషాప్రవీణుడు. నాటి పాలకవర్గాల భాష, ఆచార వ్యవహారాలతో సుపరిచితుడవడంతో హాస్య, వ్యంగ్యోక్తులతో సమకాలీన జీవన చిత్రణ చేశాడు. భద్రాచల క్షేత్ర ప్రసిద్ధికి కారణభూతుడైన భక్తుడు రామదాసు అయితే, శ్రీరామచంద్రుల వలస వృత్తాంతాన్ని సంపూర్ణంగా వివరించి ప్రసిద్ధి చెందిన మరో భక్తుడు భల్లా పేరయ కవి. భద్రాద్రి రాముడికి వీరి నిందాస్తుతి కీర్తనలు, శతకాలు కూడా శాశ్వత కీర్తినిచ్చాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం