పాత్రికేయ ప్రభ

  • 83 Views
  • 0Likes
  • Like
  • Article Share

పత్రికా రంగంలో అయిదు దశాబ్దాలకు పైగా సేవలందించిన పాత్రికేయ దిగ్గజం పొత్తూరి వెంకటేశ్వరరావు. విలువలతో కూడిన జర్నలిస్టుగా పాత్రికేయ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకున్నారాయన. 1934, ఫిబ్రవరి 8న గుంటూరు జిల్లా పొత్తూరులో వెంకటసుబ్బయ్య, పన్నగేంద్రమ్మ దంపతులకు పొత్తూరి జన్మించారు. గుంటూరు హిందూ కళాశాలలో డిగ్రీ చదివారు. 1957లో హైదరాబాదులోని ఆంధ్రజనతా పత్రికతో పాత్రికేయ ప్రస్థానాన్ని ప్రారంభించిన ఆయన అనతి కాలంలోనే విశిష్ట పాత్రికేయులుగా ఎదిగారు. ఈనాడు, ఆంధ్రభూమి, ఆంధ్రప్రభ, వార్త పత్రికల్లో పనిచేశారు. ఆంధ్రప్రభ దిన, వార పత్రికలకు సంపాదకత్వం వహించారు. ఆంధ్రప్రభతో ఆయనది దాదాపు ఒకటిన్నర దశాబ్దపు అనుబంధం. 2000లో ‘నాటి పత్రికలు మేటి విజయాలు’ పేరిట వెంకటేశ్వరరావు రాసిన పుస్తకం విశేష పాఠకాదరణ పొందింది. ఇది ఆయన  రేడియో ప్రసంగాల సంకలనం. ‘చింతన, చిరస్మరణీయులు, తెలుగు పత్రికలు, కాశీనాథుని నాగేశ్వరరావు, వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు’ ఈయన ఇతర రచనలు. ఆంధ్రప్రభ వారపత్రికలో వచ్చిన సంపాదకీయాలకు పొత్తపు రూపాలే ‘వ్యాసప్రభ, చింతన, చిరస్మరణీయులు’. 
పొత్తూరి ‘విధి నా సారథి’ పేరుతో ఆత్మకథను వెలువరించారు. ఎనభయ్యేళ్లు దాటిన వయసులో ఒక అనుభవజ్ఞులైన పాత్రికేయుడి జీవిత అవలోకనమే ఈ పొత్తం. పీవీ నరసింహారావు మీద వచ్చిన ‘ఇయర్స్‌ ఆఫ్‌ పవర్‌’కి సహ రచయితగా పనిచేశారు. మతాలు, వాటి పరిభాష మీద నిఘంటు రూపంలో ‘పారిమార్థిక పదకోశం’ వెలువరించారు. కుర్తాళం పీఠాధిపతి సిద్ధేశ్వరానంద భారతీస్వామితో తన అనుబంధం నేపథ్యంలో ఆయన గురించి ‘యతి కులపతి’ పుస్తకం రాశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రెస్‌ అకాడమీ అధ్యక్షుడిగా కూడా సేవలందించారు. ఆ సమయంలో పాత పత్రికలకు డిజిటల్‌ రూపంలో శాశ్వతత్వం కల్పించడానికి ఆయన చూపిన చొరవ మరవలేనిది. 2005లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మావోయిస్టులతో జరిపిన చర్చల్లో పౌర స్పందన వేదిక సభ్యుడిగా పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రచురణలకు గౌరవ సంపాదకత్వం కూడా వహించారు. తితిదే సరళ వ్యాఖ్యాన సహిత కవిత్రయ భారతం ప్రచురించినప్పుడు మొదటి ముద్రణలో దొర్లిన లోపాలను పరిశీలించి సరిచేయడానికి ఏర్పాటు చేసిన ఏడుగురు సభ్యుల పండిత పరిషత్తులో పొత్తూరి ఒకరు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్‌ అందుకున్నారు. 2005లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉత్తమ పాత్రికేయ పురస్కారంతో ఆయన్ని సత్కరించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని పొత్తూరి సమర్థించారు. 
      ‘‘పాత్రికేయ ఉద్యోగ జీవితంలో ఇబ్బందికర పరిస్థితులు చాలా ఎదుర్కొన్నాను. కానీ, పాత్రికేయాన్ని వదలాలన్న ఆలోచన ఎప్పుడూ రాలేదు. ఇది ఏరోజుకారోజు కొత్తగా ఉంటుంది. ఎప్పటికప్పుడు కొత్త సవాళ్లు ఎదురవుతుం టాయి. వాటిని పరిష్కరించుకుంటూ సాధ్యమైనంత వరకు ప్రజలకు వాస్తవాలు వెల్లడించడంలో గొప్ప సంతృప్తి ఉంటుంది’’ అని ఒక సందర్భంలో చెప్పారాయన. పొత్తూరి అర్ధాంగి సత్యవాణి. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఈ పాత్రికేయ మేరునగం 2020, మార్చి 5న తుదిశ్వాస విడిచారు.


వెనక్కి ...

మీ అభిప్రాయం