ఏదో సామెత చెప్పినట్లు!

  • 766 Views
  • 5Likes
  • Like
  • Article Share

    చంద్రమౌళి రమాదేవి

  • విశ్రాంత ఉపాధ్యాయురాలు
  • పుట్టపర్తి, అనంతపురం జిల్లా
  • 9676031879
చంద్రమౌళి రమాదేవి

తెలుగువారికి గారెలంటే ఎంత ఇష్టమో. భారతమన్నా అంతే ఇష్టం. అందుకే ‘తింటే గారెలే తినాలి వింటే భారతం వినాలి’ అన్నారు. ఆ రోజుల్లో ఎంత ఇష్టంగా గారెలు తినేవారంటే, చివరికి ఎక్కువైపోయి ‘తినగ తినగ గారెలు చేదు’ అనటం మొదలుపెట్టేవారు. మరిప్పుడో? మండిపోయే ధరల్లో అంతంత మినప్పప్పు, నూనె పోసి అన్నన్ని గారెలు వండేదెవరు? చేదయ్యేంతవరకూ తినేదెవరు? 
పోనీ
అవి నేతిగారెలా! అంటే, ‘మా తాతలు నేతులు తాగారు, మా మూతులు వాసన చూడండి’ అన్నట్లున్న స్థితిలో ఇప్పుడు ఆ మాటే ఎవరూ ఎత్తరు. ‘చింత చచ్చినా పులుపు చావలేదు’ లాంటి భేషజం గలవారూ ఆ జోలికి వెళ్లరు. ఇప్పుడు ‘తినగ తినగ వేము తియ్యనుండు’ అంటూ వేపాకు తినాల్సి వస్తుందేమో.
      జీతాలు రాగానే ‘పాలు కలనాడే పరమాన్నం. తల్లి కలనాడే పుట్టిల్లు’ అంటూ డబ్బు ఖర్చు పెట్టారంటే దిబ్బరొట్టెలాంటి పర్సు అప్పడంలా మారడం ఖాయం. నెలవారీ ఖర్చులను మన జీతానికి అనుగుణంగా కుదించటం ఇనుప గుగ్గిళ్లు మింగడంలాంటిది. ధరల పట్టిక చూసి సరుకులు తగ్గించి తెస్తే ‘వాములు తినే స్వాములారికి పచ్చగడ్డి ఫలహారమా’ అని అనిపించక మానదు. పూతరేకులు తిన్నట్టుగా అతి జాగ్రత్తగా ఖర్చుపెడితే సరి లేకపోతే ‘నూకలకేడ్చి తాడు కేడ్చినట్లు’ ఉంటుంది. ఎవరితోనైనా చెప్పుకుందామన్నా ‘రోలు పోయి మద్దెలతో మొర పెట్టుకున్నట్టు’ అందరిదీ అదే సమస్య. ‘నాకు కాస్త గంజి పొయ్యి, నీకు ఆకలి వేయకుండా ఉండే మంత్రం చెబుతాను’ అన్నాట్ట వెనకటికెవడో.
      ‘ఇదిగో తాయిలం’ అంటూ కొన్ని కొన్ని వస్తువులు మనల్ని బజారులో ఊరిస్తుంటాయి. వాటి ధర అకస్మాత్తుగా పెరిగిందని తెలియని అజ్ఞానంలో పర్సు తెరిచామా ‘అమ్మ ఆశ దోసె, అప్పడం దప్పళం’ అంటూ అవి కిలకిలా నవ్వుతాయి. ఉదాహరణకు... .కందిపప్పు, నూనెలు, పంచదార అప్పుడప్పుడు ఉల్లిపాయలు. అప్పుడు మనం వాటిని చూసి ‘అందని ద్రాక్ష పుల్లన’ అని సరిపెట్టుకోవాల్సిందే. ‘ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి ఎగురుతుందా’ అనుకుని పచ్చళ్లుతో కడుపు నింపుకోవాల్సిందే. ‘కాలే కడుపుకి గంజే పరమాన్నం’ అనుకునేవారు పొయ్యి కిందకీ, పొయ్యి మీదకీ సమృద్ధిగా ఉన్నవారిని ‘పెట్టి పుట్టారనుకోవడం’లో తప్పేమీ లేదు కదా!
      ఆకాశాన్నంటే ధరలు ఇలా ఉంటే మరి మన నాయకులేం చేస్తున్నారు? అని పొరపాటున కూడా ప్రశ్నించకండి. ‘పొట్ల చెట్టుకి పొరుగు గిట్టదు’ అన్నట్లు వారికి ఒకరితో ఒకరు కలహించుకోవటానికే సమయం చాలదు. ‘నేతి బీరకాయలో నెయ్యి’ లాంటి నిజాయితీ గలవారి నుంచి ఏం ఆశిస్తాం? అయినా ‘అయిదు వేళ్లూ నోట్లోకి వెళ్తున్నవాళ్లకి’.. ‘అన్నమో రామచంద్రా’ అంటూ అలమటించే వారి ఆవేదన అర్థమవుతుందా! ‘పిల్లి కళ్లు మూసుకుని పాలు తాగుతూ లోకం కళ్లు మూసుకుంది’ అనుకుంటుందిట. మన నాయకులూ అంతే! ‘తాటి చెట్టు కింద నిలబడి పాలు తాగుతున్నా’మంటే నమ్మగలమా! వెంటనే ‘నిప్పు లేనిదే పొగ రాదు కదా’ అంటాం. ‘బెల్లం చుట్టూ చీమలు చేరుతాయన్న’ట్లుగా నాయకుల చుట్టూ ఉండే వందిమాగధులు. అంతా తెలిసి కూడా వారినే ఎన్నుకుని ఇప్పుడు ‘రోట్లో తలపెట్టి రోకలి పోటుకి వెరవడమెందుకు’? సర్కారువారు లోటు బడ్జెట్‌తో అప్పులు చేస్తారు కదా మరి మనం కూడా ‘అప్పు చేసి పప్పుకూడు’ తిందామనుకుంటే ఇంతే సంగతులు. ‘మింగ మెతుకు లేకున్నా మీసాలకు సంపెంగ నూనె ఎందుకని’ జనం హేళన చెయ్యగలరు. అప్పుడు ‘ఒంటికి కారం రాసు’కున్నట్లు ఉంటుంది. ‘సింగినాదం జీలకర్ర’ అని పట్టించుకోనివారయితే ఫర్వాలేదు.
      ఏదో ఉత్సాహం తెచ్చుకుని బతుకుతుంటే ‘పాల పొంగుపై నీళ్లు జల్లినట్లు’ ధరల పెరుగుదల అనే వార్త చెవినపడుతుంది. ‘మూలిగే నక్కపై తాటిపండు పడి’నట్లవుతుంది. దుకాణాల్లో వెంటనే పాతసామానుకి కొత్త లేబుల్స్‌ వచ్చేస్తాయి. ‘గరిటె కాల్చి వాత పెట్టినట్ల’నిపించినా నోటమాట రాక నీళ్లు నములుతూ ఉండిపోతాం. ఎవరైనా దీన్ని వ్యతిరేకిద్దాం, బంద్‌లు చేద్దాం, ర్యాలీలు నిర్వహిద్దామంటే మనకేమో భయం. బస్సుల అద్దాలు పగలగొట్టి, నిప్పు బెడితే కొందరికి సరదాగా ఉంటుందేమో కాని తర్వాత బస్సు చార్జీలు పెరిగితే మన చేతి చమురే కదా వదిలేది! రాళ్లు రువ్వితే భలేగా ఉంటుందేమో కాని ఆ తర్వాత లాఠీచార్జీ, కాల్పులతో ‘అడ్డాలనాడు తాగిన ఆముదం’ గుర్తుకొస్తుందేమో! ఖర్మకాలి మనకి ‘నూకలు చెల్లిపోయాయ’నుకోండి అప్పుడు ‘బూడిదలో పోసిన పన్నీరు’లా మనకి దక్కేదేంటి? ‘బతికుంటే బలుసాకు తినొచ్చ’నుకుని ‘బెల్లం కొట్టిన రాయి’లా ఉండిపోయామనుకోండి.. ‘‘అదేంటి ‘చలిమిడి ముద్ద’లా ఉండిపోయారు? మరీ ‘నోట్లో వేలుపెడితే కొరకటం రాని’ వాళ్లలా ఉంటే ఎలా? అయినా ‘కందకు లేని దురద కత్తిపీటకెందుకు?’ ఏదో మీ బాగుకోరి చెబుతున్నామ’’ంటూ రాజకీయాలు. చివరికి ‘నిప్పుతో చెలగాటా’నికి సిద్ధమై... వాళ్ల ‘అడుగులకు మడుగులొత్తు’తూ వెళ్లామా! చూడండి ఏం జరుగుతుందో! ‘తంతే బూర్లగంపలో పడ్డట్టు’ నాలుగు లాఠీ దెబ్బలతో ఛోటా నాయకుడు కూడా బడా లీడరైపోతాడు. మనమేమో ఆ దెబ్బలకి కొన్నాళ్లపాటు కుంటుతూ నడుస్తాం. ధరలు మాత్రం తగ్గవు. షరా మామూలే. అప్పుడా నాయకుడి పేరు వింటే ‘పుండు మీద కారం జల్లినట్లు’, ‘కాకరకాయ తిన్నట్లు’ ఉండదా మరి!
      ‘గుండెల మీద కుంపటి’లా ఇంట్లో పెళ్లీడుకొచ్చిన కూతురు. ‘ముదిరిన బెండకాయ’లాంటి నిరుద్యోగి కొడుకు. ‘పొరుగింటి పుల్లకూరే రుచి’ అని నమ్మి ప్రతిదానికీ పొరుగువాళ్లతో పోల్చుకుని నిరాశ చెందే భార్య, ‘కరవులో అధికమాసం’లా, ‘పానకంలో పుడక’ల్లా ప్రతిసారీ వచ్చే బంధువులు, ఇంట్లోవాళ్లు విలువ ఇవ్వకపోతే ‘కడవంత గుమ్మడికాయ కత్తిపీటకి లోకువే’ పోనీలే అంటూ సరిపెట్టుకునే యజమాని... ‘బాబోయ్‌ వద్దండీ ఇలాంటి జీవితం’ అంటారా? మరి చాలీ చాలని జీతాలతో బండిలాగే వాళ్ల కథలింతే అని సర్దుబాటు చేసుకుంటారా? అందుకనే ‘అత్తెసరు’ మార్కులతో గాకుండా, మంచి ర్యాంకులతో పాసవ్వాలని నూరిపోసే ‘పెద్దల మాట చద్దిమూట’ అని ఒప్పుకోవాల్సిందే.
      ‘కోటి విద్యలు కూటి కొరకే’నంటూ ఏదైనా చేసి విపరీతంగా డబ్బు సంపాదించాలనే కోరిక వెర్రితలలు వేస్తోంది. నిజాయితీగా ‘కలో గంజో’ తాగి బతుకుదామనే వారి సంఖ్య తక్కువే. ‘పరిగెత్తి పాలు తాగడం కంటే నిలబడి నీళ్లు తాగడం మేలు’ అని అంటే మిమ్మల్ని పిచ్చివాణ్ని చూసినట్లు చూడగలరు! మన చుట్టూ ఉండేవాళ్లు ‘నాలుగురాళ్లు వెనకేసుకోవడా’నికి, విలాస జీవితం గడపటానికి పడే పాట్లు ఎన్ని చూడట్లేదు!!
      సొంతవారినే మోసం జేసే ‘తిన్న ఇంటి వాసాలు లెక్కబెట్టేవాళ్లు’... ‘తిండికి తిమ్మరాజు పనికి పోతరాజు’లాంటివాళ్లు... ‘కాకికి ఎంగిలి మెతుకు విదల్చని’ దాతలు... ‘గాలికిపోయిన పేలపిండి కృష్ణార్పణం’, ‘అంగట్లో బెల్లం గుళ్లో లింగానికి నైవేద్యం’ అంటూ దేవుడి మాన్యాలు స్వాహా చేసే భక్తులు... ఊరివాళ్ల సొమ్ము కాజేస్తూ ‘అంబలి తాగేవాడికి మీసాలెత్తే వాడింకొకడు’లా దర్జా వెలగబెట్టేవాళ్లు... ‘నోట్లో నువ్వు గింజ నాన’నివ్వకుండా ఉన్నదానికి ఉప్పూకారం, మసాలా జోడించి డబ్బు చేసుకునేవాళ్లు... ‘చదవక ముందు కాకరకాయ అని చదువుకున్నాక కీకరకాయ’ అన్నట్లుగా అతి తెలివి ప్రదర్శించేవారు... చివరికి ‘ఎంగిలి కూటికి ఆశపడే’ స్థాయికంటే కూడా దిగజారి దొంగతనంగా మనిషి శరీరావయవాల్ని విక్రయించేవాళ్లు... వీళ్లందరి తిప్పలూ జానెడు పొట్టకోసమేనా:? ఇలాంటి వాళ్లను చూసే పెద్దలు ‘బియ్యం పుచ్చిపోతాయని పుట్టారు’ అని అంటారు.
      అక్కడక్కడా కొంతమంది మంచివాళ్లూ ఉంటారు సుమా! పెరుగుతున్న ధరలు, ఆస్తులు పెంచుకోవడం లాంటివి ఏవీ వాళ్లను అంతగా కలవరపెట్టవు. ‘వెన్నపూసలాంటి మనసు’ కలవారు, ‘అన్నపూర్ణలా ఆదరించే’వారు, ‘తెల్లనివన్నీ పాలు నల్లనివన్నీ నీళ్లని అనుకునే అమాయకులు’, ‘పాలు-నీళ్లలా కలిసిపోయే’ స్నేహితులు, ‘తామింత తిని నలుగురికింత పెడదామను’కునేవారు, ‘అన్నీ ఉన్న విస్తరి అణిగి మణిగి ఉంటుంద’న్నట్లుగా ఉండే వినయశీలురూ’ ఉంటారండోయ్‌! అలాంటి వాళ్లు మన పక్కన ఉంటే కొంగున బంగారం ముడేసుకున్నట్లే! 


వెనక్కి ...

మీ అభిప్రాయం