అడుగో రామయ్యే..!!

  • 406 Views
  • 2Likes
  • Like
  • Article Share

    కనగాల జయకుమార్‌

  • చలనచిత్ర సహ దర్శకుడు
  • గుంటూరు
  • 9391385178
కనగాల జయకుమార్‌

బాపూ రమణల ‘సంపూర్ణ రామాయణం’ చిత్రంలోని శబరి పాట రాసేటప్పటికే ఎనభయ్యో పడిలో పడ్డారు దేవులపల్లి కృష్ణశాస్త్రి. ఉంగరాల వెండిజుట్టుతో, పండులాంటి శరీరంతో, పండిన అనుభవాలతో... శబరి మగవాడైతే ఇలాగే ఉండేవాడా అన్నట్టు ఉండేవారు. ఆయన శబరిలో మమేకమై పలికిన గీతమే
‘ఊరికే కొలను..’! ఇది కలంతో కాదు, హృదయంతో
రాసిన గీతం. హృదయాన్ని బరువెక్కించే గీతం.
మంచి సాహిత్యాన్ని ఆస్వాదించామన్న తృప్తిని
మిగిల్చే గీతం. 
దేవులపల్లి రచనల్లో ఓ ఆణిముత్యం.
ఊరికే కొలను నీరు వులికి వులికి పడుతుంది 
ఓరగా నెమలి పించెమార వేసుకుంటుంది
ఎందుకో, ఎందుకో ప్రతి పులుగు ఏదో చెప్పబోతుంది
వనములో చెట్టు చెట్టు కనులు విప్పి చూస్తుంది
ఉండుండి నా వొళ్లు వూగి వూగి పోతుంది

      కొలనులో నీరు ఉలికిపడటానికి ఏదో కారణం ఉండాలి. ఏంటది? నెమలి పురి విప్పి నాట్యం చేయడం మామూలే. కానీ నెమలి పింఛం ఆరబెట్టుకోవడం కృష్ణశాస్త్రి ఎక్కడ చూశారోగానీ, కొత్తగా అనిపించే చక్కటి దృశ్యం. ప్రతి పక్షీ (పులుగు) ఏదో చెప్పాలని తాపత్రయపడుతోందట! ఎందుకో మరి! అంతేనా... చెట్లన్నీ తమ పత్రాలనే నేత్రాలుగా చేసుకుని ఉత్కంఠతో చూస్తున్నాయట. ఇలాంటి ఉద్విగ్న పరిస్థితుల్లో ఉండుండి నా ఒళ్లు ఊగి ఊగి పోతోంది అంటూ శబరి తన ఉద్వేగాన్ని తెలియజేస్తోంది ఇలా- 
అడుగో రామయ్యే, ఆ అడుగులు నా తండ్రివే
ఇదుగో శబరీ శబరీ వస్తున్నానంటున్నవి

      ఇదీ అసలు కారణం. రాముడి రాకకు ఉరకలేసిన ఉత్సాహం, అడుగుల చప్పుడు గుర్తుపట్టడం, చప్పుళ్లతో రాముడు వస్తున్నాడన్న భావనను అన్వయించుకోవడం తదితరాలన్నీ పరాకాష్ఠకు చేరిన శబరి సుదీర్ఘ నిరీక్షణకు సంకేతాలు. రాముడి రాకకు కొలను, పక్షులు, వృక్షాలు, శబరితోపాటు మొత్తం ప్రకృతి పులకిస్తోందన్న కృష్ణశాస్త్రి భావన ప్రతి శ్రోతనూ పులకింపజేస్తుంది.
కదలలేదు వెర్రి శబరి, ఎదురు చూడలేదని, 
నా కోసమె నా కోసమె, నడచి నడచి నడచి...

      రాముడు ఇలా అనుకుంటున్నాడని శబరి అనుకోవడం, తప్పక వస్తాడనే గట్టి నమ్మకం- ఆమె భక్తికి తార్కాణం. దేవులపల్లి ఇక్కడ శబరిని ‘వెర్రి శబరి’ అనడం, నాడు సాహితీప్రియుల్లో ఓ చర్చనీయాంశమైంది. ముసలి ముద్ద అయిన శబరికి తనంటే పిచ్చిభక్తి అని, అందుకే ముద్దుగా ‘పిచ్చిశబరి’ అని రాముడు సంబోధించడం భగవంతుడికి, భక్తురాలికి మధ్య ఉన్న అవినాభావ సంబంధాన్ని తెలియజేస్తుంది.
      ఒకే పదాన్ని పలుసార్లు సందర్భోచితంగా వాడటం, ఈ పాటలో కృష్ణశాస్త్రి ప్రత్యేకత. ప్రతి చెట్టు అనడానికి చెట్టు చెట్టు అనడం, ఊగి ఊగి పోవడం లాంటివి శబరి ఉద్విగ్నతకు అద్దంపడతాయి. ఇక ‘నా కోసమె నా కోసమె’ అన్నది ఓ భక్తురాలిగా ఆమె ఆత్మవిశ్వాసం. రాముడు ఎంత దూరం నడిచి వచ్చాడో, ఎంత ప్రయాసపడ్డాడో ఈ ‘వెర్రి శబరి’ కోసం అనే అర్థం ‘నడచి నడచి నడచి’లో స్ఫురిస్తుంది. పద ప్రయోగం, పద ప్రయోజనం ఎరిగిన మహాకవి దేవులపల్లి.
నా కన్నా నిరుపేద, నా మహారాజు పాపం అడుగో- రాజభోగం వదిలి అడవులపాలైన రాముణ్ని చూసి, పాపం నాకన్నా నిరుపేద అని జాలిపడటంలో వృద్ధ శబరి పెద్దరికం, నా మహారాజు అనడంలో సేవకురాలి భక్తితో పాటు దేవులపల్లి కృష్ణశాస్త్రి రచనా శిల్పమూ గోచరిస్తాయి. ఎందరో కవులు, వాళ్లలో కృష్ణశాస్త్రి ఓ కవితాశిల్పి. ఓ ఆంధ్రా షెల్లీ.
అసలే ఆనదు చూపు, ఆపై ఈ కన్నీరు,
తీరా దయచేసిన నీ రూపు తోచదయ్యయ్యో! 

      దృష్టి సన్నగిల్లిన వృద్ధాప్యం, రాముడు వచ్చాడన్న ఆనందంలో సజల నేత్రాల కన్నీటి తెర... చెంత చేరిన రాముణ్ని చూడటానికి అవరోధాలయ్యాయి. ఆచంచల భక్తి, అవ్యాజమైన ప్రేమోద్వేగాలకు లోనైన శబరి పరిస్థితి ఇది. వృద్ధాప్యం నిండిన కృష్ణశాస్త్రి తాను శబరిగా మారి, తాదాత్మ్యం చెంది, రాసిన ఈ పంక్తులు... అనితర సాధ్యమైన భావ ప్రకటనకు సాక్ష్యాలు. 
      రాముణ్ని కళ్లారా చూడాలన్న తపన, ఆరాటం శబరిది. కానీ, కళ్లకు అడ్డం పడుతున్న కన్నీటి తెరలను చీల్చుకుని నిన్ను చూడటం ఎలాగో... నా రామా అన్నది ఆమె బాధ. ఆ క్షణంలో ఆమె గుండె గొంతుకలో కొట్లాడి పలికించిన పలుకులు... ఏదీ, ఏదీ, ఏదీ, నీలమేఘ మోహనము, నీ మంగళరూపము. 
      రాముడు తప్పకుండా వస్తాడని ఊహించిన శబరి ఆతిథ్యం కోసం ఇవి సేకరించింది... కొలను నడిగి తేటనీరు, కొమ్మ నడిగి పూలచేరు/ చెట్టు నడిగి పుట్ట నడిగి, పట్టుకొచ్చిన ఫలాలు../ పుట్టతేనె రసాలు. ‘ఈ అడవి దాగిపోనా’ అన్న కృష్ణశాస్త్రికి అడవిలో దొరికిన తియ్యని పదాలే తినుబండారాలు. దోరవేవో కాయలేవో, ఆరముగ్గిన వేవోగాని/ ముందుగా రవ్వంత చూసి, విందుగా అందీయనా! అంటూ తాను ముందు రుచిచూసి, రాముడికి తినిపించడంతో పాట పూర్తయిపోతుంది. 
      ఈ పాటకు పల్లవి, అనుపల్లవి, చరణం అనే నిబంధనలు లేవు- శబరికి ‘ఎంగిలి’ అనే భావన లేనట్టే. ఈ గీతానికి కె.వి.మహదేవన్‌ బాణి ప్రాణం పోసింది. గొంతులో ఆర్ద్రత, వృద్ధాప్యపు వణుకులను తొణికింపజేసిన సుశీల గానం పునీతమైంది. రికార్డింగ్‌ పూర్తయిన తర్వాత అక్కడ అందరి గుండెలూ బరువెక్కాయి. నిర్మాణ సారథి, మాటల రచయిత ముళ్లపూడి వెంకటరమణ పసిపిల్లాడిలా ఏడ్చారు. 
      శబరి పాత్రలో పండరీబాయి, పవిత్రత ఉట్టిపడే వదనంతో రాముడు రాగానే నీళ్లు నిండిన కళ్లతో భావోద్వేగాలు ప్రదర్శించిన తీరు గుండెను స్పృశిస్తుంది. దర్శకుడు బాపు ఈ శబరి ఘట్టాన్ని ఓ తపస్సులా తెరకెక్కించారు. వెండితెర మీద తన కుంచెతో రంగులద్దారు. అందుకే ఎప్పుడు చూసినా, ఈ దృశ్యం మనసును హత్తుకుంటుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం