కలల మేలుకొలుపు

  • 41 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। అయాచితం నటేశ్వరశర్మ

  • కామారెడ్డి, నిజామాబాదు జిల్లా.
  • 9440468557

ఎటుచూసినా అంబరాన్ని చుంబిస్తున్న ఎత్తయిన కొండలు. వాటి అంచుల్లో తగులుకున్న తెల్లటి మబ్బుల దూదిపింజలు. నింగినీ, నేలనూ అనుసంధానం చేస్తున్నట్లు ప్రవహించే కొండవాగులు. చిక్కగా కప్పిన ఆకుపచ్చని చీరల్ని తలపించే ఆ కొండల మీది చెట్లూ చేమలూ. వెరసి అద్దంలా నిర్మలమైన ప్రకృతి. ముందుకు అడుగు వేస్తున్నానే కానీ, అడుగడుగునా మధుర దృశ్యాలను చూస్తున్న మనసు మాత్రం ముందుకు వెళ్లడం లేదు. ఎగుడుదిగుడు దారులు కూడా సుఖాన్నే కలిగిస్తున్నాయి. నా కాళ్ల కింద నలుగుతున్నవి కఠినశిలలే అయినా మెత్తని దిరిసెన పువ్వుల్లా ఉన్నాయి. నిర్మానుష్యంగా ఉన్న ఆ దారిలో నడవటం కొంచెం భయం కలిగిస్తున్నా, ప్రకృతికాంత తన వయ్యారాలతో, ఒంపుసొంపులతో నన్ను ఆకర్షిస్తూనే ఉంది. ఎప్పటికప్పుడు వెనక్కి వెళ్లిపోదాం అనుకుంటున్న నన్ను తన కౌగిట్లోకి లాక్కొంటూనే ఉంది. ఆ ఆలింగనం స్పర్శకు అందని పులకింతలకు ఆలవాలం. అడుగడుగునా ఎందరెందరో లతా లలనలు, తరువుల తరుణులు, జలపాతాల జవ్వనులు... అదొక శతసహస్ర తరుణీ విలాస విరాజమాన లోకం... ఎవరూ సంచరించని ఈ లోకానికి ఎలా వచ్చానో!
తన్మయత్వంలో తరిస్తున్న నా తనువు గాలిలో తేలిపోతోంది. మానస సరస్సులో తేలియాడే రాజహంసలా! ఇంతలో చెవుల్లో తేనెల్ని కురిపిస్తూ వినబడింది కలగానం! అదే కోకిలగానం! వసంతం రాకున్నా హసిస్తూ పాడుతున్న ఆ పికరాజం ఏ మావికొమ్మపై కూర్చుందో తెలుసుకోవడం అంత కష్టం కాలేదు నాకు. అప్రయత్నంగానే చూతవృక్ష సుందరిని సమీపించాను. తన కొమ్మల చేతులు చాచి, నన్నే రమ్మని పిలుస్తున్నట్లు అనిపించింది. కఠినంగా ఉండే నా చేతులతో తాకాను... పులకరించి, నన్ను పలకరించింది. ‘ఎన్నాళ్లయింది చెలికాడా? ఈ దరికి రాక?’ అన్నట్లు విరహతాపంతో కూడిన పిలుపులా అనిపించి, ఆశ్చర్యపోయాను. ఒళ్లు పులకలెత్తింది. అమృత సరోవరంలో స్నానం చేసినట్లయింది. ‘సుందరీ! ఆకులలో నీ ప్రేమలేఖల్ని చదువుతున్నాను’ అన్నాను మృదువుగా! నా మాటలకు ఆ తరుతరుణి తల ఊపింది... నా శిరస్సు మీద చిగుళ్ల పూలవానల్ని కురిపిస్తూ. 
      మంగళ తోరణాలు కట్టినట్లున్న కొమ్మల గుమ్మాల కింద కూర్చున్నాను. వనమంతా పెళ్లిసందడితో కూడిన ఇల్లులా ఉంది. బంతిపూల దారులు స్వాగతం పలుకుతోంటే లేచి ముందుకు నడుస్తున్నాను. తిన్నగా పొదరింట్లోకి చేరుకున్నాను. అక్కడ మల్లికా, మాలతీ మాట్లాడుకుంటున్నారు. శిలాతలాన్నే హంసతూలికా తల్పంలా చేసుకుని మేను వాల్చాను. ఆ పొదరింట్లో శకుంతల కోసం నిరీక్షించే దుష్యంతుడిలా కలలు కంటున్నాను. విచ్చుకున్న కమలంలా కదలివచ్చింది ఓ లతా శకుంతల! విలాసంగా నా మీద వాలిపోయింది. లతాంతాల సౌరభాలు ముక్కుపుటాల్ని తాకుతున్నాయి. పరిమళాల్ని పీలుస్తూనే ఆ లతా లలనను చూశాను. అతిలోక సుందరి ఆమె. అంతటి అందాన్ని మునుపెక్కడా చూడలేదు. అంతే విశ్వరూపాన్ని వీక్షించిన అర్జునుడిలా నిశ్చేష్టుడినయ్యాను. ఆ క్షణంనుంచి నా మనసంతా ఆమే నిండిపోగా, ఓ కమనీయానుభూతిలో ఓలలాడుతున్నాను.
      ‘ప్రకృతి అంతా నేనే నిండిపోవాలి. అంతటా నేనే ఉండిపోవాలి. చిరంతనంగా ... పరమానందంగా...’ అనుకొంటూ మైమరచిన నా మేను మీద పడిన వెచ్చటి స్పర్శతో నా కల వీడిపోయింది. కళ్లు తెరిచి చూశాను. చుర్రుమని మండుతున్న సూర్యుడు కర్తవ్యోపదేశం చేస్తున్నాడు- ‘కలలు కనడం కాదు, కర్మశీలాన్ని అలవరచుకో’ అని! అప్పుడు జ్ఞానోదయమైంది. బోధివృక్షం కింద బుద్ధుడిలా మారిపోయాను. నిరంతర తపనతో వెలిగే సిద్ధుడినయ్యాను.


వెనక్కి ...

మీ అభిప్రాయం