లేపాక్షితో ‘తెలుగు పండగ’

  • 384 Views
  • 0Likes
  • Like
  • Article Share

    విజయ్‌ ఇంజ్యోతి

  • అనంతపురం
  • 8008552036
విజయ్‌ ఇంజ్యోతి

లేపాక్షి మురిసింది. తెలుగుదనాన్ని నింపుకున్న ఆటపాటలతో ఆ నేల పులకరించింది. జాతి వారసత్వ సంపద అయిన ప్రాచీన కట్టడాన్ని పరిరక్షించుకోవడానికి ప్రారంభించిన ‘లేపాక్షి ఉత్సవాలు’... తెలుగు సాంస్కృతిక, చారిత్రక ఔన్నత్యానికి పట్టంకట్టాయి. విజయనగర సామ్రాజ్య శిల్పకళ, చిత్రకళా వైభవానికి ‘పెట్టినకోట’ అయిన లేపాక్షి దేవాలయాన్ని పర్యాటకకేంద్రంగా మలచాలన్న లక్ష్యంతో నిర్వహించిన ఈ ఉత్సవాలు విజయవంతమయ్యాయి. 
అనంతపురం జిల్లా లేపాక్షి...
అయిదు వందల ఏళ్ల కిందట ఓ ప్రముఖ వాణిజ్య కేంద్రం. కళలకు కాణాచి. అత్యున్నత స్థాయి శిల్పులు, చిత్రకారుల ప్రతిభకు అద్దం పట్టే కట్టడాలకు నెలవు. కాల గమనంలో దాని ప్రశస్తి పరితమైపోయింది. యునెస్కో గుర్తింపు పొందిన ప్రపంచ వారసత్వ కట్టడాలకు తీసిపోని కళానైపుణ్యాన్ని నింపుకున్నది లేపాక్షి. 
      ఈ ప్రాంతానికి పునర్వైభవం తేవడానికి రూ.4 కోట్ల వ్యయంతో తొలిసారి లేపాక్షి ఉత్సవాలను నిర్వహించింది ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం. ‘తెలుగు పండగ’ పేరుతో ఫిబ్రవరి 27, 28 తేదీల్లో వీటిని కన్నులపండువగా జరిపింది. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచే కాకుండా... తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర ప్రాంతాల నుంచీ పర్యాటకులు భారీగా వచ్చారు.
      తెలుగు జాతి చరిత్రలో తరగని.. చెరగని అద్భుత శిల్పకళా సంపదకు నిలయం లేపాక్షి. ప్రస్తుతం అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గ పరిధిలో ఓ మండల కేంద్రం. విజయనగర ప్రభువు అచ్యుతరాయల కోశాధికారి అయిన విరూపణ్ణ క్రీ.శ.1533లో లేపాక్షిలో వీరభద్రస్వామి ఆలయాన్ని నిర్మించాడు. దీన్ని దుర్గా పాపనాశేశ్వరస్వామి ఆలయంగా కూడా పిలుస్తారు. రాయల కాలంలో  ఇక్కడ రత్నాలను రాశులుగా పోసి అమ్మేవారు. స్థానిక కూర్మ కొండపై 20 అడుగుల ఎత్తులో ఎలాంటి పునాదులు లేకుండా, ఏడు ప్రాకారాలుగా నిర్మితమైంది లేపాక్షి దేవాలయం. నాలుగు ప్రాకారాలు కాలగర్భంలో కలిసిపోయాయి. మిగిలిన వాటినైనా కాపాడుకోవాలన్న పాలకుల ఉద్దేశమే లేపాక్షి ఉత్సవాలకు ప్రాణం పోసింది.  
లే... పక్షి! లేపాక్షి  
లేపాక్షికి ఆ పేరు రావడం వెనక అనేక గాథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ప్రధానమైంది రామాయణ కథ. రావణుడు సీతను అపహరించుకుని వెళ్తూంటే, కూర్మ గిరి మీద జటాయువు అడ్డగించింది. కోపోద్రిక్తుడైన లంకాధీశుడు ఆ పక్షి రెక్కలను తెగనరికాడు. కుప్పకూలిపోయిన జటాయువు ‘రామా.. రామా’ అని కలవరిస్తుండగా, సీతాన్వేషణలో ఉన్న రాముడు వచ్చి దానికి సాంత్వన చేకూర్చాడు. ‘లే-పక్షి’ అన్నాడు. అదే లేపాక్షిగా మారిందని చెబుతారు. ఇక్కడి ఆలయంలో ప్రధాన దైవం వీరభద్రుడు. గర్భగుడిలో స్వామి వారి పుట్టశిల ఉంది.
      లేపాక్షిలోని ఏకశిలా రాతి నంది భారతదేశంలోనే అతి పెద్దది. 26.5 అడుగుల పొడవు, 15 అడుగుల ఎత్తుండే ఈ నంది చూపరులను కట్టిపడేస్తుంది. దీనికి శిల్పులు చేసిన అలంకరణ చాలా అందంగా ఉంటుంది. 
      ఆలయం రెండో ప్రాకారంలో ఏడు శిరస్సుల నాగేంద్రుడు కనిపిస్తాడు. ఆలయ నిర్మాణ సమయంలో ఓరోజు శిల్పులు భోజనానికి వచ్చారట. అయితే, భోజనం తయారవడానికి కొంత సమయం పడుతుందని వారి తల్లి చెప్పిందట. ఆ సమయాన్ని వృథా చేయడమెందుకని వంటశాలకు ఎదురుగా ఉన్న పెద్ద బండరాయినే ఏడు శిరస్సుల నాగేంద్రుడిగా మలిచారట శిల్పులు. నాట్యమండపంలో తూర్పు వైపున 70 రాతి స్తంభాలు ఉంటాయి. సుందరాకృతులు దాల్చిన అనేక శిల్పాలకు ఆలవాలాలు ఈ స్తంభాలు. వాటిల్లో ఒకటి భూమిని   తాకకుండా వేలాడుతూ ఉంటుంది. సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే నిర్మాణమిది. దీన్ని మూలాధార స్తంభంగా పిలుస్తారు. నాట్యమండపం పైకప్పు మీద వటపత్రశాయి తైలవర్ణ చిత్రం చూపు తిప్పుకోనివ్వదు. మనం ఎక్కడ నిల్చుని చూసినా ఆ శాయి మనల్నే చూస్తుండే విధంగా దాన్ని తీర్చిదిద్దిన నైపుణ్యం అబ్బురపరుస్తుంది. 
పదివేల మందికి విడిది
గర్భగుడి పైకప్పు మీద 13 అడుగుల నిడివితో ఉండే అతిపెద్ద వీరభద్ర వర్ణచిత్రం చెక్కుచెదరలేదు. శివకేశవులకు భేదం లేదని చెప్పడానికన్నట్లు, మూలవిరాట్టుకు కుడివైపు ఉండే చిన్న గుడిలోని విష్ణు పీఠం మీద పాపనాశేశ్వర స్వామి కొలువుదీరాడు. ఎడమవైపు గుడిలోని శివ పీఠం ఏమో విష్ణువుకు ఆసనమైంది. సీతాన్వేషణలో భాగంగా ఇక్కడికి వచ్చినప్పుడు రామ హనుమంతులు ఇక్కడ రెండు గుడుల్లో రామ, హనుమ లింగాలను ప్రతిష్ఠించినట్లు చెబుతారు. పార్వతీదేవి, భద్రకాళి, గణపతి, నవగ్రహాల ఆలయాలూ ఉన్నాయిక్కడ. ఆలయం రెండో ప్రాకారంలో కల్యాణ మండపానికి పశ్చిమ భాగంలో సీతమ్మ పాదం కనిపిస్తుంది. ఇక్కడే నాటి శిల్పులు వాడిన పళ్లేలను చూడవచ్చు. నిర్మాణ సమయంలో శిల్పులు ఉండటానికి, తదనంతరం భక్తుల వసతికోసం ఇక్కడ అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. ఆ కాలంలో వాణిజ్య కేంద్రంగా వర్ధిల్లిన లేపాక్షిలో పర్యాటకుల తాకిడిని తట్టుకోవడానికి ఆలయంలోనే 600 సత్రాలను నిర్మించారు. ఆలయం మూడో ప్రాకారంలో వీటిని ఏర్పాటు చేశారు. వీటిల్లో ఏకంగా పదివేల మంది సేదదీరవచ్చు. అంతేకాదు... సత్రానికి సత్రానికి మధ్య అడ్డుగా తెరలు ఏర్పాటు చేసుకునేందుకు రాతిస్తంభాలకు ప్రత్యేకంగా రంధ్రాలను తొలిచారు. 
      ఆలయం పైకప్పులు, చుట్టూ గోడల మీద కనిపించే తైలవర్ణ చిత్రాలు లేపాక్షికి అదనపు ఆకర్షణ. రామాయణ, మహాభారత గాథలు, పరమేశ్వర లీలలతో పాటు అనేక దృశ్యాలను చిత్రకారులు హృద్యంగా ఆవిష్కరించారు. విజయనగర నిర్మాణ శైలికి సాక్ష్యాలైన లేపాక్షి శిల్పాలు, ఆనాడు విలసిల్లిన చిత్రకళను కళ్లకు కట్టే తైలవర్ణ చిత్రాల సౌందర్య విశేషాలు ప్రత్యేక చర్చనీయాంశాలు.  అన్నట్టు, ఈ చిత్రాల్లో కనిపించే ఆకృతులు (డిజైన్లు) ఈనాటికీ కలంకారీలో మెరుస్తుంటాయి. సర్వాంగ సుందరమైన ముఖమండపంతో పాటు అసంపూర్తిగా ఉండే పార్వతీ పరమేశ్వరుల కల్యాణ మండపమూ కనిపిస్తుందిక్కడ. ఈ అసంపూర్తి నిర్మాణం వెనక ఓ కథ ఉంది.  అచ్యుతరాయల మరణానంతరం అతని అల్లుడు రామరాయలు రాజయ్యాడు. విరూపణ్ణ ఖజానా ధనాన్ని వృథా చేస్తూ ఆలయం నిర్మిస్తున్నాడని రామరాయలకు కొందరు ఫిర్యాదు చేశారు. దీన్ని నమ్మిన రాజు విరూపణ్ణ కళ్లు పెకిలించమని ఆదేశించాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న విరూపణ్ణ, తన కళ్లను తానే పెకిలించుకుని గోడ మీద కొట్టాడట. ఆయన అలా చేశాడనడానికి ఆధారంగా కల్యాణమండపం దగ్గర ఓ గోడమీద కనిపించే ఎర్రటి గుర్తులను చూపిస్తారు. 
తెలుగుదనానికి పట్టం
లేపాక్షి ఉత్సవాలను హిందూపురం శాసనసభ్యుడు, సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ముందుండి నడిపించారు. ఆహ్వాన పత్రికలు మొదలుకుని ముగింపు కార్యక్రమం వరకు అన్నీ ఆయనే చూసుకున్నారు. హిందూపురం నుంచి లేపాక్షికి జరిగిన సైకిల్‌ యాత్రలో స్వయంగా పాల్గొన్నారు. అంతదూరం ఎక్కడా సైకిల్‌ ఆపకుండా లేపాక్షికి చేరిన మొదటివ్యక్తి కూడా ఆయనే కావడం విశేషం. లేపాక్షిలో జరిగిన అయిదు కిలోమీటర్ల పరుగులోనూ పాల్గొని అధికారులు, స్థానికులను ఉత్సాహపరిచారు. ముగింపు ఉత్సవాల్లో శ్రీకృష్ణదేవరాయలుగా కనిపించి సభికులను కట్టిపడేశారు. ఉత్సవాల ప్రారంభోత్సవానికి ముఖ్యమంత్రి చంద్రబాబు, కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు, రాష్ట్ర సభాపతి కోడెల శివప్రసాద్‌తో పాటు మంత్రులు, జిల్లా ప్రజాప్రతినిధులు, సినీ ప్రముఖులు హాజరయ్యారు. రెండో రోజు ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తితో పాటు తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల మంత్రులు, సినీనటులు వచ్చారు. 
      మొదటి రోజు ఉదయం గ్రామోత్సవంతో కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. లేపాక్షి గ్రామ ప్రధాన దేవతలకు నంది విగ్రహం నుంచి ఊరేగింపు నిర్వహించారు. ఈ ఉత్సవాల కోసం రాష్ట్రం నలుమూలల నుంచి కళాకారులు వచ్చారు. నృత్య నీరాజనం, శాస్త్రీయ నృత్యం, చెక్కభజన, జానపద, నృత్య ప్రదర్శనలు, కోలాటం, కూచిపూడి, భరతనాట్యం, పౌరాణిక పద్యాల ధారణ, ధ్వన్యనుకరణ, ఇంద్రజాలం, హాస్య వల్లరి, తప్పెట్లు, మరగాళ్లు, కీలుగుర్రాలు, డ్రమ్ము వాద్యాలు తదితరాలతో లేపాక్షి హోరెత్తింది. ఆహార మహోత్సవం, హస్తకళల మేళా, ముగ్గులు, పుష్పాల ప్రదర్శనలూ పర్యాటకులను అలరించాయి. 999 మంది కళాకారులతో ప్రధాన రహదారి పొడవునా నిర్వహించిన శోభయాత్ర ప్రత్యేకంగా నిలిచింది. రెండో రోజూ ఉదయం నుంచి సాయంత్రం వరకూ... శాస్త్రీయ నృత్యం, నాసికా వేణుగానం, రంగస్థల నటుడు గుమ్మడి గోపాలకృష్ణ పౌరాణిక పద్యాలు, ఆంధ్ర భరతనాట్యం, హాస్యనాటిక, ఏకపాత్రాభినయం, పౌరాణిక నాటకాలు, శివతాండవం, కోయనృత్యం, గ్రామీణ క్రీడలతో ఈ ఉత్సవాలు పర్యాటకుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీత విభావరి, నటి శోభన శాస్త్రీయ నృత్యం, శివమణి డ్రమ్స్‌ ‘వహ్‌వా!’ అనిపించాయి.
లేపాక్షికి కొత్త రూపు
ఈ ఉత్సవాల పుణ్యమా అని ఆ గ్రామం రూపురేఖలు మారిపోయాయి. లేపాక్షి నుంచి బింగిపల్లికి, జటాయువు ఘాట్‌కు వెళ్లేందుకు శాశ్వత రహదారి నిర్మితమైంది. వీరభద్రేశ్వరస్వామి ఆలయం పడమర ద్వారం దగ్గరికి  వెళ్లేందుకు మరో రహదారి వచ్చింది.  ఆలయం పడమర ద్వారం దగ్గర ఉన్న కోనేరు(గజగుండం)ను పునరుద్ధరించి కాలువలను నిర్మించారు. నంది విగ్రహం వెనకనుంచి జటాయువు కొండకు వెళ్లేందుకు రహదారి నిర్మాణం చేపట్టారు. జటాయువు ఘాట్‌ను పునరుద్ధరించారు. ఆర్టీసీ బస్టాండు కొత్త అందాలు అద్దుకుంది. కొడికొండ చెక్‌పోస్టు దగ్గర స్వాగత ద్వారాన్ని, నంది విగ్రహాన్ని ఏర్పాటుచేశారు. లేపాక్షి ప్రధాన రహదారిలో ఎల్‌ఈడీ విద్యుద్దీపాలను ఏర్పాటు చేశారు. ఆలయం తూర్పు ద్వారం దగ్గర పెద్దగుంతను పూడ్చివేసి తూర్పు ద్వారాన్ని తెరిచారు. ఆలయంలో నూతన ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠించారు. 
      లేపాక్షి ఉత్సవాలను ఏటా నిర్వహిస్తామని ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. రాష్ట్రంలో చారిత్రక ప్రాధాన్యమున్న అన్ని ప్రాంతాల్లో ఇలాగే ఉత్సవాలు నిర్వహిస్తామన్నారు. తెలుగు జాతి చారిత్రక వైభవగీతిని ఎలుగెత్తి చాటే కట్టడాలెన్నో రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఉన్నాయి. వాటిని పరిరక్షణతో పాటు ఆయా కట్టడాల విశిష్టతను లోకానికి చాటడానికి ఇలాంటి ఉత్సవాలు ఉపకరిస్తాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం