ఆ న‌వ్వేంటి ల‌క్ష్మ‌ణా!?

  • 358 Views
  • 1Likes
  • Like
  • Article Share

    డా॥ శ్రీమంతుల దామోదర్‌

  • ప్రాజెక్టు అసిస్టెంట్‌, జానపద గిరిజన విజ్ఞానపీఠం, తెలుగు విశ్వవిద్యాలయం
  • వరంగల్లు
  • 9989139136
డా॥ శ్రీమంతుల దామోదర్‌

‘రంగనాథ రామాయణం ద్విపద కావ్యాలలోనే నగ్రగణ్యము, తెలుగు సాహిత్యమందలి యుత్తమోత్తమ కావ్యములలో నొకటి’’ అన్నారు రాళ్ళపల్లి అనంతకృష్ణశర్మ. రంగనాథ రామాయణానికి అంత ప్రశస్తి రావడానికి కారణమేంటి? అయోధ్య రామయ్య జీవితగాథను తెలుగువాళ్ల జీవితాలకు దగ్గరగా తీసుకురావడం, జానపదుల మౌఖిక రామాయణ గాథలకు కావ్యగౌరవం ఇవ్వడం... ఇదే ఈ కావ్యం ప్రత్యేకత. 
తెలుగు రామాయణాల్లో
మొదటిది రంగనాథ రామాయణం. దీన్ని గోన బుద్ధారెడ్డి పదమూడో శతాబ్దంలో రచించాడు. బుద్ధారెడ్డి తండ్రి గోన గన్నారెడ్డి (విఠలభూపతి) విష్ణుభక్తుడు. కాకతీయుల సామంతుడు. రంగనాథ రామాయణ రచనా కాలంనాటికి పాల్కురికి సోమన రచనలు వీరశైవాన్ని వ్యాపింపచేస్తున్నాయి. అదే సమయంలో దక్షిణదేశం నుంచి వైష్ణవ ప్రచారం మొదలైంది. ఈ స్థితిలో వైష్ణవ మతానుయాయి అయిన విఠలభూపతి ఓరోజు రామకథాసక్తుడై సభను ఉద్దేశించి ‘రమణమై తెనుగున రామాయణంబు/ క్రమమొప్పజెప్పెడు ఘనకావ్యశక్తి/ గల కవులెవ్వరు గలరుర్వి...’ తెలుగులో రామాయణాన్ని రమణీయంగా రచించగల కావ్యశక్తి ఉన్నవాళ్లు ఎవరైనా భూమి మీద ఉన్నారా అని విచారించాడు. అప్పుడు సభలోని పండితులు నీ పుత్రుడు బుద్ధభూపతే అందుకు సమర్థుడని విన్నవించారు. అలా తండ్రి మాట నిలబెట్టేందుకు బుద్ధారెడ్డి రాసిందే రంగనాథ రామాయణం. 
      ‘ఆది కవీశ్వరుడైన వాల్మీకి/ ఆదరంబున పుణ్యులందరు మెచ్చ/ చెప్పిన తెఱగున శ్రీరాముచరిత/ మొప్పజెప్పెద కథాభ్యుదయ మెట్లనిన..’ అని బుద్ధారెడ్డి దేశి ఛందో మణిపూస ద్విపదలో రామాయణ రచనకు పూనుకున్నాడు. అందుకే ‘సందుగొందుల నడయాడు ద్విపద కవితా కన్యకకు రాజాస్థాన ప్రవేశం కల్పించినవాడు గోనబుద్ధారెడ్డి’ అని ఆచార్య పింగళి లక్ష్మీకాంతం అభిప్రాయపడ్డారు. 
      ద్విపద కావ్య రచనలో సోమనాథుడి అంతటి ప్రసిద్ధిని రంగనాథ రామాయణంతో సంపాదించుకున్నాడు బుద్ధారెడ్డి. శివకవుల ఆవేశం లేకపోవటం, జానపదుల భాషకు దగ్గరగా ఉండటం ఈ కావ్య విశేషం. ‘వాల్మీకి ఆదరంబున పుణ్యులందరు మెచ్చునట్లు రచిస్తా’నన్నప్పటికీ బుద్ధారెడ్డి మూలానికి భిన్నంగా అవాల్మీకాంశాలనూ ఇందులో కూర్చాడు. ఆనాడు జనబాహుళ్యంలో ప్రచారంలో ఉన్న రామకథకు సంబంధించిన సన్నివేశాలను పొందుపరచాడు. కాలనేమి వృత్తాంతం, సులోచన సహగమనం, జంబుమాలి వృత్తాంతం, ఊర్మిళాదేవి నిద్ర మొదలైనవి వాటిలో ప్రముఖమైనవి. ఈ కథలన్నీ చిరుతల రామాయణం, తోలుబొమ్మలాట, చెక్కభజన, మిత్తిలి వంటి జానపద కళారూపాల్లో దర్శనమిస్తాయి. జానపదుల పాటల్లో కూడా వీటి ప్రస్తావన ఉంటుంది.
సౌమిత్రి హాసం
రంగనాథ రామాయణంలో మూలానికి భిన్నంగా సాగిన ఘట్టాల్లో ఊర్మిళాదేవి నిద్ర ముఖ్యమైంది. సీతారామలక్ష్మణులు అరణ్యవాసానికి బయలుదేరి శృంగవేరపురం చేరుకొంటారు. అక్కడ వాళ్లు గుహుడి ఆతిథ్యం స్వీకరించి ఓ మర్రిచెట్టు కింద నిద్రిస్తుంటారు. అన్నావదినలకు ఏ ఆపదా రాకుండా కాపలా ఉంటాడు లక్ష్మణుడు. ఆ రాత్రి నిద్రాదేవి మాయ రూపంలో లక్ష్మణుడి దగ్గరికి వస్తుంది. అప్పుడు లక్ష్మణుడు ఆమెతో... ‘అన్నావదినలకు కాపలాగా ఉండటం నా కర్తవ్యం. కాబట్టి అరణ్యవాసం ముగిసేవరకు నా భార్య ఊర్మిళను ఆవహించు’ అంటాడు. దీనికి సంబంధించిన సన్నివేశం జానపదుల ‘లక్ష్మణదేవర నవ్వు’ పాటలో కనిపిస్తుంది. రావణ వధానంతరం శ్రీరామ పట్టాభిషేకం జరుగుతుండగా లక్ష్మణుడు నవ్వుతాడు. ఎందుకు నవ్వావని రాముడు లక్ష్మణుడిని అడుగుతాడు. మనం అడవులకు పోయినప్పుడు మీరు నిద్రిస్తుండగా నేను కావలి ఉన్నాను. నన్ను సమీపించడానికి నిద్రాదేవి వచ్చి ‘నేను అందరినీ ఆవహించాను. అందరూ నిద్రిస్తున్నారు. కానీ, నీ దగ్గరికి మాత్రం రాలేకపోతున్నాను. ఇది ప్రకృతి విరుద్ధమ’ని వాపోయింది. అప్పుడు లక్ష్మణుడు నిద్రాదేవికి సాష్టాంగపడి...
మాయన్న రఘుపతి మా వదినకును
ఈ పర్ణశాలకే తాను కాపనెను
పొమ్ముడి అయోధ్య కనకపట్నాన
తనుబాసి తన సతి యుండదగదు
రాత్రియును పగలును లేవకుండగను

నను విడిచి పొందుమీ ధవళాక్షి నిద్ర... అని నిద్రాదేవితో అన్నట్లు జానపదులు అద్భుతంగా కల్పించుకున్నారు. ఒకరి నిద్రను మరొకరు ధరించడం అద్భుతం. ఇలాంటి అద్భుతమైన కల్పన జానపదులకే చెల్లుతుంది. భార్యాభర్తల వియోగాన్ని జానపదులు జీర్ణించుకోలేకపోయారు. పద్నాలుగేళ్లపాటు ఇరుగుపొరుగు మాటలు తట్టుకోవడం కష్టం. ఈ సూక్ష్మాన్ని గ్రహించిన జానపదులు ఊర్మిళాదేవి నిద్రతో ఆమెకు న్యాయం చేకూర్చారు. ఇంతచక్కని విషయం కాబట్టే గోన బుద్ధారెడ్డి లక్ష్మణదేవర నవ్వును రంగనాథ రామాయణంలో చేర్చాడు.
ఏడుబరులూ అవాల్మీకమే
వాల్మీకి రామాయణంలో మాయలేడి వృత్తాంతంలో సీత రాముడికి ఏమైందో వెళ్లి చూడమన్నప్పుడు... లక్ష్మణుడు ‘అది రాక్షసమాయ. రాముడికే ఆపద వస్తే ప్రకృతి బీభత్సం అవుతుంది’ అంటాడు. అయినా సీత ఆ మాటలు వినదు. పైగా లక్ష్మణుణ్ని తూలనాడుతుంది. ఈ సందర్భంలో లక్ష్మణుడు సీతకు ‘జాగ్రత్త’ అనిచెప్పి ప్రకృతికి అప్పగించి వెళ్లినట్లు మూలంలో ఉంది. రంగనాథ రామాయణంలో మాత్రం పర్ణశాలకు చుట్టు బరులేడు వ్రాసి/ వర్ణించి ఈ బరుల్‌ వడి దాటకమ్మా అనిచెప్పి వెళ్తాడు లక్ష్మణుడు. ఎలాంటి దుష్టశక్తులు, దుష్టబుద్ధులు బరుల దరిచేరకుండా సీత చుట్టూ రక్షణ వలయాన్ని అమర్చాడు. ఈ బరులు గీయడం చెక్కభజన పాటల్లో, చిందు యక్షగానాల్లో కనిపిస్తుంది. 
      ఇక వాల్మీకి రామాయణంలో రావణుడు సీతను స్పృశించి ఎత్తుకుపోయినట్లు కనిపిస్తుంది. రంగనాథ రామాయణంలో సీత రావణుణ్ని చూసి మూర్ఛిల్లగానే... ‘అచ్చారులోచన నదయుడై యెత్తి’ తెచ్చి రథంమీద లంకకు తీసుకెళ్లినట్లు ఉంది. సీతను పతివ్రతా శిరోమణిగా, దేవతామూర్తిగా భావిస్తారు జానపదులు. రావణుడు ఆమెను తాకడాన్ని జీర్ణించుకోలేక పోయారు. అందుకే ఆమె మూర్ఛిల్లగానే గడ్డను పెకిలించుకొని తీసుకుపోయినట్లు కల్పించుకున్నారు. ఈ కల్పనకూ తన కావ్యంలో చోటు కల్పించాడు బుద్ధారెడ్డి. ఈ వరసలోనే...
లక్ష్మణుడు లేనిది పర్ణశాలలో 
మరుగున దాగుండే మాయా రావణుడు 
నారాయణ హరి గోవింద యనుచు
నళినాక్షి ఎదురొచ్చి నిలిచె రావణుడు
హరిభక్తుడేయని మదిలోన తలచి
అతి వేగంబున భిక్షంబు తెచ్చి సీతమ్మ
భిక్షంబు పట్టక మాయా రావణుండు
పదితలలు జూపగ వడి మూర్ఛజెంద
గడ్డతో పెకిలించి రథములో పెట్టి...
అని చెక్కభజనల్లో కూడా ఓ పాట ఉంది. ఇది చిరుతల రామాయణంలోనూ కనిపిస్తుంది. రావణుడు ‘హే సీతా! నా నిజరూపంబు జూడుము/ ఇదో లంకాపురంబునేలు రావణాసురుండను వినుము’ అనగానే రావణుడి నిజరూపం చూసి సీత భయపడి మూర్ఛపోతుంది. అప్పుడామెను రావణుడు ఎత్తుకుపోయినట్లు ఉంది.
తెలుగు పరిమళం
జానపదులు ఏ పని చేసినా శకునం చూస్తారు. రంగనాథ రామాయణంలో రామలక్ష్మణులు సుగ్రీవుణ్ని కలుసుకునే ముందు ఋష్యమూక పర్వతం సమీపంలో ఓ చెట్టుకింద సేద తీరతారు. ఆ సమయంలో చెట్టుమీద ఓ బల్లి... ‘ఎల్లెడ శుభములె యొసగు నీకనుచు/ బల్లి దీప్తంబుగా...’ పలికిందని వర్ణించాడు కవి. ఏదైనా కార్యం గురించి మాట్లాడుకునేటప్పుడు బల్లి పలికితే శుభం జరుగుతుందని ఇప్పటికీ నమ్ముతారు. 
      ఇంద్రజిత్తు బాణానికి లక్ష్మణుడు మూర్ఛపోయిన సందర్భంలో... నా కన్నులెదుటనే నా సహోదరుడు/ నా కూర్మి బంధువు నా ప్రాణసఖుడు/ నా ప్రాణములిచ్చి నను విడిచిపోయే/ నాకు సిగ్గయ్యెడి నా శౌర్యమునకు/ నాకేల రాజ్యంబు నాకేల సీత/ నాకేల శౌర్యంబు నాకేల బ్రతుకు... అని శోకిస్తాడు రాముడు. దీనికీ చెక్కభజన పాటల్లో పోలిక కనిపిస్తుంది. ‘పగవారి బాణాలు పైబడి వస్తయి/ పలుకవేమిరా తమ్ముడా లక్ష్మణస్వామి/ పాలవర్ణం వంటి నీ యొక్క పలువరుస/ ఏ జన్మమున జూతునో లక్ష్మణస్వామి/... రాజ్యమెందుకు నాకు రణము నాకెందుకు/ గుణము కలిగినట్టి భార్య నాకెందుకు?’ అని విలపిస్తాడు. వాల్మీకి రామాయణంలో సీతారామకల్యాణం వైదిక ప్రధానంగా సాగితే, బుద్ధారెడ్డి రామాయణంలో తెరపట్టడం, నలుగుపెట్టడం, తలంబ్రాలు పోయడం, పెండ్లిపాటలు పాడటం లాంటి తెలుగింటి ఆచారాలు కనిపిస్తాయి.
      రామ పట్టాభిషేకం సందర్భంలో మంధర కైకను రెచ్చగొడుతుంది. అప్పుడు కైక దశరథుడి మీద అలుగుతుంది. పెట్టిన సొమ్ములు పెట్టెలో పెట్టి/ దట్టమౌ కస్తూరి తలపట్టు పెట్టి/ మలినవస్త్రం గట్టి మదినల్క దొట్టి... అన్నపానీయాలు ముట్టుకోకుండా తన కోపాన్ని తెలియజేస్తుంది. ఇవి జానపద గాథలు, పాటలు, కళారూపాల్లో విరివిగా కన్పిస్తాయి. 
      అలా తనకాలంలో తెలుగునాట ప్రముఖంగా ఉన్న మౌఖిక సాహిత్యానికి రంగనాథ రామాయణంలో చోటు కల్పించాడు గోన బుద్ధభూపతి. తెలుగువారికి రామకథను మరింత చేరువచేశాడు. భారతదేశంలో వాల్మీకి రామాయణానికి వచ్చిన ప్రసిద్ధ అనుసరణ కావ్యాల్లో రంగనాథ రామాయణమూ ఒకటి అనేది గొప్ప విషయమే కదా!


వెనక్కి ...

మీ అభిప్రాయం