కలం పట్టి... గళం విప్పి...

  • 62 Views
  • 0Likes
  • Like
  • Article Share

    కె.ఎన్‌.మల్లీశ్వరి

  • విశాఖపట్నం
  • 8885016788
కె.ఎన్‌.మల్లీశ్వరి

నిజాన్ని నిజమని చెప్పడానికి ధైర్యం సరిపోని ఈ రోజుల్లో.. పొగడ్తలు, తెగడ్తలు తప్ప సాహిత్యాభివృద్ధికి నిర్మాణాత్మక  కృషి చేసే సంస్థలు తక్కువగా కనిపిస్తున్న ఈ కాలంలో.. ఓ సంస్థ పదేళ్ల నుంచి సామాజిక, వ్యవస్థీకృత దోపీడీ మీద నిరంతర పోరాటం చేస్తూ వస్తోంది. అంతేకాదు, అక్షరాలకు ఆలంబనగా నిలుస్తూ తెలుగు సాహితీవనంలో కొత్త మోదుగలను విరబూయిస్తోంది. స్త్రీవాదం భూమికగా అణచివేతకు గురవుతున్న సమస్త అస్తిత్వాల గోడును తమ కలం, గళం ద్వారా వినిపిస్తున్న ఆ సంస్థే ‘ప్రజాస్వామ్య  రచయిత్రుల వేదిక’. దశాబ్దం కిందట ఈ వేదిక పురుడుపోసుకున్న సందర్భం నుంచి.. ఇన్నేళ్ల ప్రయాణంలోని కీలక మజలీల వరకూ అన్నింటి మీద ‘ప్రరవే’ ఆంధ్రప్రదేశ్‌ శాఖ అధ్యక్షురాలు కె.ఎన్‌.మల్లీశ్వరి అవలోకనం.. ఆవిడ మాటల్లోనే..
2008 చలికాలపు
రోజులవి. పాడేరు అటవీ ప్రాంతం. 
      పొగమంచు తెరలను చీల్చుకుని దాదాపు నలభైమంది రచయిత్రులు, మిట్టపల్లాలతో ఉన్న కొండతోవలో నడుస్తున్నారు. ‘భూమిక’ పత్రిక ఏర్పాటు చేసిన ఉత్తరాంధ్ర యాత్రలో వాకపల్లి అత్యాచార బాధిత మహిళలను కలవడం ఓ ముఖ్య విషయం. వారిని కలవడానికి అబ్బూరి ఛాయాదేవి మొదలుకుని అప్పటికే స్త్రీవాద సాహిత్యం ద్వారా పాఠకులకి పరిచయమైన అనేకమంది రచయిత్రులు వచ్చారు. 
      కంటికి ఎదురుగా- కాలిబాట మీద జరజర పాకుతూ వెళ్లే నాగుబాములు, కాలు పట్టు నిలువనివ్వని గతుకుల నేల, ఊపిరి పీల్చడానికి కష్టమయ్యే ఎత్తు మీదకి నడక- ఆ రోజు రచయిత్రుల్లో ఒక పట్టుదల. ఏమి న్యాయం జరిపించగలరని, ఇంత ప్రయాస పడి వీళ్లంతా వచ్చారు అంటే- ఈ నిచ్చెనమెట్ల సమాజంలో అత్యంత బలహీన వర్గమైన ఆదివాసీ స్త్రీల మీద, అత్యంత బలమైన గ్రేహౌండ్‌ పోలీసులు చేసిన సామూహిక అత్యాచార కాండ అప్పటికే సమాజాన్ని కుదిపి వేస్తోంది. ఈ ఘోర ఘటనలో రచయిత్రులు వారికి ఏమి చేయగలరు! ‘భూమి చెపితే ఆకాశం నమ్మదా!’ అని ఎలుగెత్తి చెబుతున్న వారిని హత్తుకుని మేము మీతో ఉన్నాం అనైనా చెప్పగలరు కదా! అందుకే ఆ యాత్ర జరిగింది.
      ఆ రోజు చిన్నిచిన్ని గుంపులుగా కూడి కొండతోవలో నడుస్తున్నపుడు, నా పక్కనే ఉన్న ఘంటసాల నిర్మలతో స్త్రీవాద సాహిత్యం మీద చర్చ నడిచింది. ఒకప్పుడు సమాజాన్ని ఓ కుదుపునకు లోను చేసిన స్త్రీవాదం, 2000 నుంచీ స్తబ్దతకి లోనయ్యిందన్న విమర్శని తనతో ప్రస్తావిస్తే పాక్షికంగా ఏకీభవించారు. ‘మరి మీలాంటి వారంతా దానిని బద్దలు కొట్టే ప్రయత్నాలు చెయ్యాలి కదా’ అన్నాను. అపుడు నిర్మల ఒకమాట అన్నారు, ‘ఎవరో వచ్చి చెయ్యాలని ఎందుకు చూడాలి! నీకు బలంగా అనిపిస్తే నువ్వే ఆ ప్రయత్నం మొదలుపెట్టు, స్త్రీవాదులతో ఒక సదస్సు ఏర్పాటు చెయ్యి, మేము వస్తాం’ అన్నారు. 
మనలో మనం 
ఆ ఆలోచనే కొత్తగా అనిపించింది. ఆ ఊహ విడువని జ్వరంలా ఆలోచనల్లో పేలిపోతూ ఉండేది. పదిమంది కలిపి చేసే పనులంటే ఊపేసే ఉత్సాహం ఉండటంతో విశాఖ మిత్రులతో ఈ ఆలోచన పంచుకున్నాను. ఇది వర్గ పోరాటానికి ఏ మాత్రం సాయపడదు అన్న ఉద్దేశం కాబోలు పెద్దగా ఉత్సాహం చూపలేదు ఎవరూ. ఒకసారి రచయిత్రులందరం కలిపి మాట్లాడుకుంటే తప్పేంటి అన్న పట్టుదల కలిగింది. ఉమ్మడి ఆంధ్రలో నాకు తెలిసిన రచయిత్రులందరికీ వరుసగా ఫోన్లు చేయడం మొదలు పెడితే చాలా చిత్రంగా చాలామందిలో ఇదే భావం కనిపించింది. 
      ఆ తర్వాత విశాఖ మిత్రులు కూడా కొందరు సానుకూలంగా స్పందించారు. ఎలా అయినా అందరం కలవాలి అన్న పట్టుదలతో ప్రతి ఒక్కరు ఈ ఆలోచనని సొంతం చేసుకున్నారు. అందుకే ఈ ప్రయత్నం ‘మనలోమనం’ అయింది. ప్రజాస్వామిక పద్ధతిలో జరగాలని సామాజిక ఉద్యమకారిణి, రచయిత్రి రత్నమాల చెప్పడంతో- విశాఖలో స్థానిక మిత్రులతో నిర్వహణ కమిటీ ఏర్పడింది. కె.అనురాధ, ఇ.పి.ఎస్‌.భాగ్యలక్ష్మి, వర్మ, నారాయణ వేణులతో పాటు నేనూ ఈ కమిటీలో ఉన్నాను. 2009 జనవరి 10, 11 తేదీల్లో విశాఖపట్నం జిల్లా అనకాపల్లికి సమీపంలోని శంకరం గ్రామానికి దగ్గరి ఇండో అమెరికన్‌ హోటల్‌ మేనేజిమెంట్‌ కళాశాలలో ‘మనలోమనం’ సదస్సు జరిగింది. 
కొత్త తోవల్లోకి 
ఆనాటి తెలుగు సాహిత్య సమాజంలో సీరియస్‌గా రాస్తున్న రచయిత్రులలో ముప్పావు వంతు- దాదాపు 200 మంది వరకూ ఈ సదస్సుకి హాజరయ్యారు. ‘మనలోమనం’ ప్రయత్నం అర్థవంతమైన కార్యాచరణలోకి అడుగులు వేయాలని వచ్చినవారిలో తొంభై శాతం మంది కోరుకున్నారు. అందుకే ఓ ఏడాదిపాటు రాష్ట్ర వ్యాప్తంగా సదస్సులు నిర్వహించి రచయిత్రులందరినీ కూడగట్టుకుని అభిప్రాయాలు తెలుసుకోవాలని అనుకున్నాం. పన్నెండు మంది రచయిత్రులతో మళ్లీ ఓ కమిటీ ఏర్పడింది. అణచివేతకి గురైన అస్తిత్వాలకి దామాషా పద్ధతిలో సంస్థ నిర్వహణలో చోటు ఉండాలన్న ప్రతిపాదన స్థూలంగా అంగీకారం పొందింది. దళిత, తెలంగాణ స్త్రీల సాహిత్యం మీద వరంగల్లు కాకతీయ విశ్వ విద్యాలయంలో, ముస్లిం, రాయలసీమ స్త్రీల సాహిత్యం గురించి కడప యోగి వేమన విశ్వ విద్యాలయంలోనూ, క్రైస్తవ మైనార్టీ, బీసీ, కోస్తాంధ్ర స్త్రీల సాహిత్యం మీద గుంటూరు నాగార్జున విశ్వవిద్యాలయంలోనూ భారీ సదస్సులు జరిగాయి. నాలుగోది, ‘మనలోమనం’ చిట్టచివరి సదస్సు సరిగ్గా ఏడాది తిరిగేసరికి విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో గిరిజన, ఉత్తరాంధ్ర స్త్రీల సాహిత్యం మీద జరిగింది. 
సంస్థ ఆవిర్భావం 
ఆ ఏడాదికాలం అంత సులువైన నడక ఏమీ కాదు, ‘మనలోమనం’ కొత్త కమిటీ ఆరంభంలోనే కొన్ని ఒడుదొడుకులను ఎదుర్కొంది. రాజకీయ కారణాలతో విభేదించిన మిత్రులు కొందరు విడిపోయి ‘మట్టిపూలు’ అన్న వేదిక నిర్మించారు. ‘మనలోమనం’ కమిటీ, మట్టిపూలు ఏర్పాటును స్వాగతించింది. కమిటీ ఎలాంటి తడబాటుకు లోనవకుండా సజావుగా సాగడానికి, ఆ సంక్షోభ కాలంలో కథా, నవలా రచయిత్రి జాజుల గౌరి లాంటి వారు చేసిన కృషి గొప్పది. తెలంగాణ, రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో సదస్సులను నిర్వహించి చాలామంది రచయిత్రులను కలుసుకుని, వారితో చర్చలు చేసిన అనుభవం నుంచి, సంస్థ లక్ష్యాలను రూపొందించుకున్నాం. సంస్థ నిర్మాణం గురించి నిరంతరాయంగా రచయిత్రులు చర్చలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ కాలమంతా మా అందరి చుట్టూ కొత్త ఉత్తేజం ఆవరించింది. ప్రణాళిక రాసుకోవడం, దాన్ని విస్తృతంగా చర్చించడం, సాహిత్యంలోంచి కొత్త వెలుగులను దర్శించడం- పునరుజ్జీవించిన కాలమది. తాత్వికరంగంలోనూ భౌతికంగానూ స్త్రీవాదం చుట్టూ ఉన్న స్తబ్దతను పారదోలుతూ 2010 ఫిబ్రవరి 28న తారీఖున ‘మనలోమనం’ కమిటీ రద్దయ్యి ‘ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక’ ఆవిర్భవించింది. దేశంలోనే తొలి నిర్మాణాత్మక రచయిత్రుల సంస్థ ఇది. కుల, మత, ప్రాంత, జాతి, వర్గ అస్తిత్వాల వారంతా తమ తమ సమస్యల మీద పని చేస్తూనే ‘జండర్‌’ ఉమ్మడి సూత్రంగా ప్రరవేలో పని చేస్తారు.
కార్యాచరణ 
సామాజిక ఉద్యమాలతో స్త్రీల సాహిత్యాన్ని అనుసంధానం చెయ్యడం సంస్థ లక్ష్యాల్లో ఒకటి. దాని కోసం ప్రరవే విస్తృతంగా క్షేత్ర పర్యటనలు చేసింది. ఈ దశాబ్ద కాలంలో తలెత్తిన అనేక పోరాటాలకి సంఘీభావంగా ఆయా ప్రదేశాలకి వెళ్లడం, రాత రూపంలో అనుభవాలు పంచుకోవడం చేస్తూనే ఉంది. వాకపల్లి అత్యాచార ఘటనలో బాధితులకి మద్దతుగా ప్రరవే సాహిత్యం ద్వారా కృషి చేసింది. సోంపేట అణు విద్యుత్‌ ఫాక్టరీ ప్రతిపాదనకి వ్యతిరేకంగా జరిగిన ప్రజాపోరాట ప్రాంతాలకు వెళ్లి, వారి స్వరాన్ని అక్షరబద్ధం చేసింది. లక్షింపేట ఘటనలో దళితుల పక్షాన నిలబడి ఇతర ప్రజా సంఘాలతో కలిసి బాధితులను కలిసి వచ్చింది. ముజఫర్‌ నగర్‌ మారణకాండ ప్రాంతాల్లో పర్యటించింది. యురేనియం తవ్వకాల ప్రాంతాలకి వెళ్లి అక్కడి ప్రజల గోడును తెలుసుకుంది. ముట్టు గుడిసెల దురాచారాన్ని నలుగురి దృష్టికీ తీసుకువెళ్లి అది రూపు మాపడానికి కృషి చేస్తోంది. మత్స్యకారుల జీవితాలను అధ్యయనం చేస్తోంది. బాక్సైట్‌ తవ్వకాల వ్యతిరేక  పోరాటాలు, కళ్యాణపు లోవ మైనింగ్‌ తవ్వకాల వ్యతిరేక ఉద్యమాలకి మద్దతు ప్రకటించింది. గోదావరి ఆక్వా మెగా యూనిట్‌ స్థాపనకి వ్యతిరేకంగా ప్రజా ఉద్యమానికి తమ అక్షరాన్ని కలిపింది. సింగరేణి ఓపెన్‌ కాస్ట్‌ గనుల సమస్యని తెలుసుకునే పర్యటన, తెలంగాణ రైతు ఆత్మహత్యల మీదా, మల్లన్న సాగర్‌ ప్రాజెక్ట్‌ ముంపు గ్రామాల ప్రజల సమస్యల మీద కూడా ప్రరవే పని చేసింది.  ప్రజాస్వామిక వాదులు, రచయితలైన మిత్రులతో కలసి ప్రరవే ఛత్తీస్‌గఢ్‌ బస్సు యాత్ర చేసింది. అక్కడి సాంస్కృతిక జీవనాన్ని పరిశీలించింది. యాదాద్రి గుట్ట ఘటన, తితిలీ తుఫాన్‌ సందర్భం, ఇలా వర్తమానాన్ని కుదిపేస్తున్న సమస్యలమీద ప్రరవే నిరంతరాయంగా పని చేస్తూనే ఉంది. 
సాహిత్య సదస్సులు 
అరుంధతి రాయ్, రంగనాయకమ్మ, హరగోపాల్, బొజ్జా తారకం లాంటివారితో మొదలుపెట్టి తెలుగు సమాజంలో మేధో కార్యాచరణలో ఉన్న అనేకమంది మిత్రులు అనేక సందర్భాల్లో ప్రరవే సంభాషణలో గొంతు కలిపారు. కథా సందర్భం, కవితా సందర్భం, కథా విమర్శ, కవితా విమర్శ, నాటక సాహిత్యం, దళిత, బీసి, మైనార్టీ, ఆదివాసీ, ప్రాంతీయ సాహిత్యాలు, పత్రికా రచన, స్త్రీవాద ఆరంభ వికాస, వర్తమానాలు, అనువాద సాహిత్యం, అంతర్జాల సాహిత్యం, ప్రాచీన సాహిత్యంలో స్త్రీ పాత్రలు, బాల సాహిత్యం, ఇతర భాషా సాహిత్యాలు, సాహిత్య ప్రక్రియల మీద ప్రరవే అనేక సదస్సులు నిర్వహించింది. విశాఖపట్నం, రాజమహేంద్రి, నరసాపురం, పెనుగొండ, ఏలూరు, విజయవాడ, ఒంగోలు, కడప, తిరుపతి, హైదరాబాదు, వరంగల్లు, జమ్మికుంట, మహబూబ్‌ నగర్‌.. ఇలా అనేక ప్రాంతాల్లో మహాసభలు నిర్వహించుకుంది. 
సంక్షోభ సమయాలు 
ప్రరవే కీలక సభ్యురాలు పుట్ల హేమలత గత ఏడాది మరణించడం సంస్థకు చాలా పెద్ద లోటు. ఆమె ప్రాతినిధ్యాన్ని, స్ఫూర్తిని నిలబెట్టడానికి మరింత పని చేయాలి. ఇద్దరు కలిపి చేసే పనిలోనే ఎన్నో విభేదాలు వచ్చే ఆస్కారం ఉంది. ఇక అనేక మిత్ర భావజాలాలు కలిగిన వారు కలిసి చేసే పనిలో అద్భుతమైన సమన్వయంతో పాటు మరి కొన్ని సమస్యలూ వస్తాయి. వాటి పరిష్కారాలు సంస్థ ప్రణాళికని బట్టి సాగుతాయి. సంస్థ మీద ఒత్తిడులూ చాలా ఎక్కువే. ప్రజాస్వామిక భావజాలం పాదుకొల్పే ప్రయత్నాలకి బయటి శక్తుల వ్యతిరేకత, అసహనం ఏదో ఒకరూపంలో ఎదురవుతూనే ఉంటుంది. సంస్థ కార్యకలాపాలకి పలు ఆటంకాలు కలిగించడం ద్వారా కుప్పకూల్చే ప్రయత్నాలు ఎప్పుడూ పొంచి ఉంటూనే ఉంటాయి. ఫాసిస్ట్‌ శక్తులు ఒక్కోసారి మిత్రుల ముసుగు వేసుకుని వస్తాయి. వాటి పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా ముఖ్యం. కార్యాచరణతో పాటు సంస్థని నిలబెట్టడమే పెద్ద సవాలుగా మారిన కాలాలు కూడా ఉన్నాయి. 
      సంస్థలో ఇమడలేక సభ్యులు వెళ్లిపోయినపుడు వ్యక్తిగతంగా బాధ కలుగుతుంది. కానీ సంస్థ అంతిమం, వ్యక్తులు కాదు అన్నది గట్టిగా నమ్మడం వల్లనే ప్రరవే ఎలాంటి ఆటుపోట్లు ఎదురైనా నిబ్బరంగా నిలబడుతూ వచ్చింది. ఒక పెద్దాయన చెప్పినట్లు ఒక పదేళ్లు సంస్థని మనం నిలబెడితే ఆ తర్వాత అది సమాజాన్ని ఉన్నతంగా నిలబెట్టడంలో మెట్టుగా మారుతుంది. ఏ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటున్నా రకరకాల సాంకేతిక నేత్రాలతో వలలు వేస్తున్న అధికారం ధ్యాస అంతా ఆ ఐకమత్యం మీదనే ఉంటుంది. ఆ ఐక్యత సజావుగా సాగకుండా ఉండటానికే ఎన్నెన్నో ప్రలోభాలు ఎదురొచ్చి పరీక్ష పెడతాయి. అయినా సాధ్యమైనంత మేరకు అన్నిస్థాయిల్లో సంస్థ చైతన్యం విస్తరించుకుంటూ పోవాలి. 
      సంస్థ అంటే తీవ్రమైన రాజకీయాలు, ఆర్థికాలు, నియమాలు, నిబంధనలు, సామూహిక ప్రయోజనాలు; వీటన్నిటి మధ్య కూడా సుతిమెత్తని హృదయాల మధ్య మానవీయ విలువలు పరిమళిస్తూ ఉంటాయి. ఆ మానవీయ విలువలకి స్త్రీ తత్వం అంటుకుని ఉండటం వల్లన కదా ఇలా సంస్థ సభ్యులు తారసపడగానే అలా గభాలున హృదయానికి హత్తుకుపోవడం, గలగల నవ్వుల పరామర్శలు, మంచీ చెడ్డా పలకరింపులు, ఈ దశాబ్దికాలంలో మేము కూడబెట్టుకున్న ఈ ఘనమైన బంధు వర్గాన్ని చూసుకుని మనసు ఉప్పొంగిపోతుంది. ప్రయాణాలు, నిద్రలు, తిండితిప్పలు దగ్గర నుంచి కలిసుండే ఆ కాలమంతా ఎన్నెన్ని సర్దుబాట్లు, వ్యక్తిగతాన్ని పక్కనపెట్టి అందరమొక్కటై కలిసిపోవడం అనేదే లేకపోతే ఇంత ప్రయాణం సాధ్యపడేదే కాదు. స్త్రీలు కాబట్టి సమర్థత ఉండదు అనుకుంటారు కొందరు. స్త్రీలు కాబట్టే సవాలక్ష నిర్బంధాల మధ్య సంస్థని నిలబెట్టగలిగామంటాం మేము.


వెనక్కి ...

మీ అభిప్రాయం