కరోనాపై కదనం -  ఏప్రిల్‌, 3 ఫలితాలు

  • 5026 Views
  • 81Likes
  • Like
  • Article Share

ప్రథమ బహుమతి 
నిశ్శబ్దం గెలుస్తుంది చూడు 
సహాయ నిరాకరణోద్యమంలా సత్యాగ్రహంలా 
ఆ మహమ్మారికి దూరంగా కదుల్దాం.. 
శబ్దంకన్నా నిశ్శబ్దం పెద్దయుద్ధం 
మహాత్ముడు మనకు నేర్పిన పాఠమే కదా.. 
ఈ నిశ్చల నిశ్శబ్ద పోరులో 
నిశ్శబ్దం గెలుస్తుంది చూడు 
ఏదో ఐపోతామనీ ఐపోతున్నామనీ.. 
నిరాశా నిస్పృహల జాడ్యాలు వీడి 
భౌతిక దూరాల క్రతువును 
మనలో మనమే పూరించుకోవాలి 
కరోనా పిడికిళ్ల మధ్య నలుగుతూ 
మరణమృదంగాలను మోగిస్తూ 
దేశాలు గిరిగీసుకుంటున్న వేళ 
హృదయాలను విశాలం చేసుకుంటూ 
వైద్యులు భూలోక దేవుళ్లై కదులుతున్నారు
నిశ్శబ్దం గెలుస్తుంది చూడు 
నువ్వైనా.. నేనైనా.. 
ముందుగా అపరిశుభ్ర అలసత్వాలు వీడి 
రక్షణ కవచాలతో కుదుటపడాలి 
జాతిని మృత్యుఘాతాలతో కుంగదీస్తున్న 
కర్కశ కరోనా వైరస్‌ను మౌనంగానే తుదముట్టించాలి 
నిశ్శబ్దం గెలుస్తుంది చూడు 
భయాలతో పోగుపడుతున్న 
గుండె కండె దారాన్ని నిర్భయంగా విప్పుకోవాలి 
సంక్షోభం సమసేదాకా ఇంట్లోనూ ఒంట్లోనూ కంట్లోనూ 
సమస్యల సాలెగూళ్లను అల్లొద్దు 
నీకు నువ్వే సాంత్వనా శిబిరమై నిలిచిపో 
మౌన పఠనమై మార్గాలను అన్వేషించు 
నిశ్శబ్దం గెలుస్తుంది చూడు 
బతుకెప్పుడూ ఆటుపోటుల సంద్రమే అయినా 
గమ్యం చేరుకుంటూనే ఉండాలి 
అరణ్యవాసాలు అజ్ఞాతవాసాలు అష్టదిగ్బంధనాలు 
మన ఇతిహాసాలు ఇచ్చిన ఇంధనాలే కదా.. 
నాలుగ్గోడల మధ్య ఈ సవాళ్లను ఎదుర్కోలేమా.. 
మనకోసం మనమే తపస్సు చేద్దాం 
వేలవేల ఉషస్సులు అవని నిండా పరుచుకుంటాయి 
అదిగో నిశ్శబ్దం గెలుస్తుంది చూడు..! 
- కటుకోఝ్వల రమేష్, ఇల్లెందు, 99490 83327

ఈ కవితను వినాలనుకుంటే...


ద్వితీయ బహుమతి 
సదనం నూతన బృందావనం    
ఏ మధుర క్షణాలనో గల్లీలో పారేసుకున్నట్లు
బాగా కావాల్సిన మనిషికెక్కడో
రోడ్డు ప్రమాదమంటూ కబురొచ్చినట్లు
ఒక్కడివీ మిగిలిన ఒంటరి ద్వీపంలో
ఏ అపరిచితుడో చొరబడి
కనిపించకుండా వెంబడిస్తున్నట్లు 
అండమాన్‌ చెరలోంచి రెక్కలుకట్టుకునైనా
తప్పించుకోవాలనుకున్నట్లు
బయటకెళ్దామని గింజుకుంటావెందుకు..? 
నిన్ను ఉండమంటున్నది నీ ఇంట్లోనే కదూ
కొత్తగా కాశ్మీరందాలేవైనా 
నీ పట్టణ రహదారుల పక్కన వెల్లివిరిశాయా?
నయగరా జలపాతం 
నగరం చౌరాస్తా దగ్గర 
అకస్మాత్తుగా ప్రత్యక్షమై జాలువారుతోందా?
గ్రహాంతరవాసులెవరో 
అలా అయోధ్య మైదానంలోకి దిగి హల్చల్‌ చేస్తున్నారా..?
పొద్దుపోయాక వీధిదీపాలేమైనా 
అరోరా ఆస్ట్రాలిస్‌ కాంతి పుంజాలు వెదజల్లుతున్నాయా?
ఏముందక్కడ!?
నిశ్శబ్దంగా కావలించుకునే కరోనా తప్ప
నీ దేహానికి మహాభాగ్యాన్నిపుడు 
ప్రసాదించేది నీ గేహమే కదూ...
అది కేవలం ఇల్లేనా 
కోవిడ్‌ కోరలకీ నీ ఊపిర్లకీ మధ్య రక్షణ కవచం
ఏ సంశయం లేకుండా మసలగలిగే మహోన్నత ప్రదేశం
అక్కడే పిల్లల మునివేళ్లతో ముస్తాబైన తెల్ల కాగితం
అన్ని గదుల్లోనూ ఆశ్చర్యాన్ని వెలిగించొచ్చు
అంతా సోదా చేస్తే
గతంలో వెతికీ వెతికీ దొరకదనుకున్నదేదో
అకస్మాత్తుగా కోహినూరు వజ్రంలా మెరిసిపోవచ్చు
నెత్తిమీద జీవితాన్ని మోస్తూ
నడుస్తున్న వలస బతుకు టీవీ తెరలోంచి
నీ మనసులోకి ప్రయాణం చేయొచ్చు..
ఆకలికంచంలో ఆవిర్లు కక్కుతున్న పప్పన్నం 
మంచుడబ్బాలో గడ్డకట్టిన భోజన సమయాలను 
చెత్త బుట్టలోకి విసిరేయొచ్చు
ఏ రణగొణ ధ్వనులూ లేని పొద్దంతా
ఎక్కడ్నించో ఓ మావికొమ్మ స్పష్టంగా
పంచమ స్వరాల మాధుర్యాన్ని అందించనూవచ్చు
తరచి తరచి చూడాలా..
సదనం నూతన బృందావనం 
- పాయల మురళీకృష్ణ, మెంటాడ, విజయనగరం జిల్లా, 94410 26977
ఈ కవితను వినాలనుకుంటే...


తృతీయ బహుమతి
చేతులు
పుట్టుకతో భవితవ్యానికి రేఖలు దిద్దుకొన్న చేతులు 
పెరుగుదలలో బాల్యాన్ని బడికి పంపిన చేతులు 
శిక్షణతో గమనానికి రూఢి నిచ్చిన చేతులు 
గత చరిత్రల వైనానికి కీర్తినిచ్చిన చేతులు 
ఆప్తుని రాకకు గుండెకు హత్తుకొన్న చేతులు 
బాష్ప వారిని జారనీక బుగ్గకు అద్దుకొన్న చేతులు 
సన్మానాల వేళలకు దండలు గుచ్చిన చేతులు 
శాస్త్రజ్ఞుని విజయానికి హర్షధ్వనుల చేతులు 
మానిషాద శ్లోక పదాన దయా పారవారమైన మహర్షి 
మహా కావ్య పాదపానికి ప్రపంచీకరుణల 
అంతఃకరణలను నాటిన చేతులు 
దూరాన కొండపైన లంఘించే వేగాన 
ప్రాణ రక్షణలకుగాను బంటు సేవల హనుమ 
సంజీవని నెత్తుకొని తెచ్చిన చేతులు 
మాటిమాటికి కడుగుతున్నా, 
కనిపించని కీటకమొకటి వచ్చి అంటుకుంటుందనే 
సరికొత్త ఆచారానికి, అకుంఠిత స్వచ్ఛతలకు అంకితమైన చేతులు.
సంక్రమిత రుజల విపత్కరావసరాలకు, 
జన సేవా కర్తవ్యాన మునిగిన వైద్యుడు నారాయణుడై 
అభయమిచ్చిన చేతులు 
కానుపు కష్టం లెక్కించక 
కలవరాలకు ఆదుకునే పరికరాలను కనుగొన్న 
స్త్రీమూర్తి దీక్షలకు సన్నుతులందిస్తున్న చేతులు 
వెల్లువలా దుమికిన వైరాణువులనరికట్టేందుకు 
పుర సంచార వీధులలో 
దిన రాత్రాలు కర్తవ్య సంవహనా 
భర మెత్తిన రక్షకభటుల చేతులు 
చీపురుకట్టల శుభోదయాన 
నాగరికుల మనో గృహావరణల మలినాల 
శుభ్రకరునికి కాళ్లు కడిగిన చేతులు 
ఆపన్న వేళల ఆరోగ్య దూరాలకు తాకకనే 
అందుకొన్న ఆర్ద్రతా సంపదల చేతులు 
విశ్వమంతా ఒక్కటిగా మనుగడే లక్ష్యంగా, 
మనసు స్పర్శలు అభిమతంగా 
ఒక్కొక్కరు అందరుగా జోడించిన వందనాల చేతులు. 
 - రాజేశ్వరి దివాకర్ల, వాషింగ్టన్‌ డీసీ, rajeswari.diwakarla@gmail.com
ఈ కవితను వినాలనుకుంటే...


ప్రోత్సాహక బహుమతి (1)    
మర్మం
జీవితానికి అర్థం ఏమిటో 
తలకిందులై వేలాడినా తెలియదు గబ్బిలానికి !
పాంచభౌతిక పరివృత్తంలోనే తారాడుతున్నా 
అయిదో పరమార్థం ఉంటుందన్న ఊహేరాదు!
శిథిల గుహల్లో పర్వత బిలాల్లో 
యుగాల్ని రెక్కల కింద సాగతీసినా ఓ క్షీరదాన్ననే తలపే తట్టదు!
నింగిని చీల్చే తన భీషణ విహంగ శక్తికి 
గురుత్వాకర్షణ నిలువునా వంగి మోకరిల్లిందన్న నిజం కానీ!
విలయ కల్లోలం రేపే చేవ ఉండీ అనాదిగా 
ఒకానొక పాథోజెనిక్‌ ప్రాణాంతక విష జీవి, 
నిద్రాణంగా, సహజీవనం చేస్తూందన్న స్పృహ కానీ
ఈ నక్తంచరికి లేదు! 
గబ్బిలమైనా తిమింగలమైనా చీమైనా, 
కంటికానని ఏకకణ జీవైనా 
తమవైన కాలమితిలో మహా కళాత్మకంగానే, 
వొదిగి కదలాడి కనుమరుగవుతాయి ఏమీ తెలియకుండానే!
శాశ్వతమంటూ ఏదీ మిగలని 
చక్రీయ కాలగతిలో ఉత్పాతాలూ అంతే! 
వస్తాయి పోతాయి సహజంగానే !
ఉద్ధృతిలో కొట్టుకుపోకుండా, 
ద్రష్టలా గట్టున నిలవడమే సిసలైన డిజాస్టర్‌ మేనేజ్మెంట్‌!
ఉపద్రవమో ప్రేరిత విస్ఫోటనమో 
కోవిడ్‌ వికృత కరాళకేళి సమస్త భూగోళాన్ని కుదిపి నెమ్మదిస్తుంది!
మానవ తప్పిదమో ఆధిపత్యపు దురాశో 
వూహాన్‌ లాబ్‌ దాచిన గుప్పిటి రహస్యం 
ఇనుప గోడని దాటి బయటకు ప్రవహించదు!
- చంద్రశేఖర్‌ ప్రతాప, కరీంనగర్, 99488 56377


ప్రోత్సాహక బహుమతి (2)
కూసింత జాగర్తండె.. ఆయ్‌!    
ఏ మువూర్తాన పుట్టిందోగాని 
రోజూ సావు వార్తలేనండె ఆయ్‌! 
ఎదవ ఎకసెక్కాలెందుగ్గాని 
పెపంచానికే పంచేసేసిందండె ఆయ్‌! 
ఒక సిన్మలేదు షికార్లేదు 
కడుపే కైలాసం ఇల్లే వైకుంఠమండె ఆయ్‌! 
రోడ్డుమింద తిరక్క పెట్రోలు మిగిలింది గానండె 
రయ్యిమంటా ధరల్ని మాత్రం ఆకాశానికెత్తేసిందండె ఆయ్‌! 
కష్టాలు మడుసులగ్గాకుంటె మానూమాకులకొస్తాయేటండె ఆయ్‌! 
ఎట్టెట్టా గండాల్నో దాటినోల్లం మనమేగాదేటండె ఆయ్‌! 
మొన్న దివిసీమ మునగలేదా? నిన్న హుదుద్‌ ఊడ్సకపోలేదా? 
తితిలీ ఈడ్సి తన్నలేదా? సునామీ సుట్టిపారేయలేదా? 
దేనికన్నా గుండెనిబ్బరం ఉండాలండె ఆయ్‌! 
సిమ్మాద్రి అప్పన్న ఏడుకొండల ఎంకన్న 
ఇజియవాడ దుర్గమ్మ కాశీ ఇశాలాక్షమ్మ 
ఇల్లింతమంది దేముళ్లున్నారండె 
మంతాన ఏమన్నైతె ఆళ్లూర్కుంటారేటండె ఆయ్‌! 
భారమంతా ఆళ్లకొదిలి ఇల్లు ఒళ్లు మాత్రం 
తెగ కడిగి భద్రంగా ఎక్కడోళ్లక్కడుండండె ఆయ్‌! 
దీని యవ్వారం సక్కబడగానే 
సిటికెలోనె మన కట్టమంతా మాయమవదా 
మీరె చెప్పండె ఆయ్‌! 
- డి.సూరిబాబు, హైదరాబాదు, 92472 88851


ప్రోత్సాహక బహుమతి (3)    
బూవికి బుయ్యొచ్చింది
నాయనా నానేవి సేతునురా నాయనా
బూవికి బుయ్యొచ్చిందిరా నాయనా
నానే వల్లకాట్లో పడిపోనురా నాయనా
నా సిన్నతనంలో పెద్దమ్మోరొచ్చిందిరా నాయనా
ఇంతలేసి కుండలేసిందిరా నాయనా
సూరుకి నాలుగు మంచాలు లేసినాయిరా నాయనా
ఊరమ్మోరుకి మొక్కుకున్నాంరా నాయనా
ఏటకి ఎనుబోతునే ఇచ్చినాంరా నాయనా
ఎన్ని మొక్కులిచ్చినా ఏట్నాబంరా నాయనా
ఇంటికి ఇద్దరేసి శవాల్లేసినాయిరా నాయనా
ఊరూరంతా సొశానం దిబ్బయిపోనాదిరా నాయనా
తెల్లోల్ల టీక మందొచ్చిందిరా నాయనా
ఊరు సల్లంగుందిరా నాయనా
ఏటేటా సంబరాలు సేసినాంరా నాయనా
కానీ ఏటోర్నాయనా... ఏగాలి సోకిందిరో నాయనా
బూవికి ఉపిద్రమే వచ్చేసినాదిరో నాయనా
తెల్లోల్ల బిల్లమందురా నాయనా
భరోసాగా వుండేదిరా నాయనా
ఆ బడాయంతా బెమే అయినాదిరా నాయనా
తెల్లోల్ల పానాలకే దిక్కులేకుండా పోనాదిరా నాయనా
బూవి బూవంతరా నాయనా 
శవాల దిబ్బయిందిరా నాయనా
నానే ఏట్లో పడిపోనురా నాయనా
ఏంమాయ రోగమొచ్చిందిరా నాయనా
మావేటి కానుకోనేక పోయాంరా నాయనా
ఏ అమ్మోరుకి మొక్కాలిరా దేవుడా
అయినా అమ్మోరులననేం నాబంరా దేవుడా
మాయదారి మడిసి నెత్తిన సెయ్యేసుకున్నాడురా నాయనా
సల్లకొండను తానె ముక్కలు జేసుకున్నాడురా నాయనా
బూవితల్లి ఊష్టంతో సలసల కాగిపోతున్నాదిరా నాయనా
ఏకాలానికా వానలు లేవురా నాయనా
ఏ ఎండలన్నాల్లు లేవురా నాయనా
సెట్టు సేమ జచ్చి బూవి బుగ్గయిపోనాదిరో నాయనా
ఇనపగోల్లుతోనే బూమాత ఒళ్లంతా పుండుజేసినారురో నాయనా
ఇసపు గాలులతోనె పంటపైరులన్నీ ఇసం జేసినారురో నాయనా
తెల్లోల్లంతా గొప్పోల్లన్నారురా నాయనా
ఆల్ల తెలివంతా తెల్లారిపోయిందిరా నాయనా
పల్లక ఒక్కొక్కడు ఏరేరుగ కూకుంటే సాలురా నాయనా
పానాలు సల్లగుంటాయిరా నాయనా
సెయ్యి సెయ్యి కలిసి తిరిగినావురా నాయనా
ఇక శివలోక సాయిజ్యమేరా నాయనా
బూవి సల్లంగుంటేరా నాయన 
పానాలు సల్లంగుంటాయిరా నాయనా    
- రత్నాల బాలకృష్ణ, విజయనగరం, 94401 43488


ప్రోత్సాహక బహుమతి (4)    
తెలిసిపోయింది..!    
ఉప్మారవ్వకు - ఇడ్లీరవ్వకూ
తేడా నాకు తెలిసింది.
చిన్న దానికి పన్నెండో ఎక్కం
రాదన్న సంగతి బైటపడింది.
చూపు మారినా అదే కళ్లద్దాలతో
అమ్మ సర్దుకుంటున్న వైనం,
గంజి ఇస్త్రీ బట్టలు ఒక్కరికే
పరిమితమనే రహస్యం,
వంటగదిలో ఫ్యాను ఉండాలనీ
ఎవరూ చెప్పకుండానే వెల్లడైనాయి.
కింది ఫ్లోరులో పెద్దాయనకి
చెవులు వినబడకనే అపుడపుడూ 
అలా హారన్‌కి స్పందించడని,
వీధి చివరి కిరాణా కొట్లో మాల్స్‌కి
మల్లే అన్నీ దొరుకుతాయనీ..
బిచ్చమెత్తేవాళ్లకో, అయిదారింటిని
ఈనిన వీధికుక్కకో.. అదనంగా
వండే ఆ గుప్పెడు గింజల కథ
బోధపడలేదే నిన్నటి దాకా..!
పెద్దపాలేరులా నే కూలికి పోతుంటే,
ఇంటిల్లిపాదీ ఊరికే కూచోట్లేదని..
వారంతా తగ్గి, నన్ను ఎత్తుగా 
నిలబెడుతున్నారనీ.. తెలిసిపోయింది.!    
- ఎం.ఆదినారాయణ రెడ్డి, ప్రత్తిపాడు, 95024 59325


ప్రోత్సాహక బహుమతి (5)
నట్టింట్లో వెన్నెల
వంటిల్లు ముఖమొన్నడూ చూడని శ్రీవారు
కత్తిపీట అస్త్రంతో కూరలను ముక్కలుగా నరుకుతున్నారు
పొయ్యిపై ఉడుకుతున్న అన్నంలో ప్రేమను కలుపుతున్నారు
పిల్లలు సైతం వడలిన మొక్కల ముఖాలపై నీళ్లు చల్లి
చిరునవ్వుల పూలను వికసింపజేస్తున్నారు
మూడుపూట్లా భోజనాలతో ఆత్మీయతను కమ్మగా నంజుకుంటున్నాం
నడిరాత్రి వరకూ అందమైన జ్ఞాపకాలను తవ్వుకుంటూ
నిద్రలోకి కలలను హాయిగా ఆహ్వానిస్తున్నాం
ఉరుకుల పరుగుల బతుకుల మధ్యన
ఇదొక అద్భుత ఆనందాలపర్వం
వీధులలో పడి తిరగాలని అల్లాడే జనానికి
ఈ ఆనందాలను నేను ఏ లిపిలో బోధించాలి
నట్టింట్లో రోజూ కురిసే వెన్నెల రుచిని 
వారితో ఎలా ఆస్వాదింపజేయాలి
కలిసి ఉంటే కలదు సుఖమే కానీ
అవసరమైనపుడు దూరాలు పాటించి సైతం
ఆరోగ్యాన్ని జాగ్రత్త చేసుకోవచ్చు
వీధులను నిర్మానుష్యం చేసి 
దేశానికి సహకరించాలి ఇప్పుడు
పనిలో పనిగా
మనిషి చేతిలో గాయపడీ గాయపడీ విసిగిన ప్రకృతి
ఈ హడావుడిలో మనిషి తనవైపు దృష్టి సారించట్లేదని 
కాస్త ఊపిరి పీల్చుకుంటోంది
తనకు తాను కట్టుకట్టుకుంటూ 
మళ్లీ దయతో మనవాళి కోసం చిగురిస్తోంది     
- పద్మావతి రాంభక్త, విశాఖపట్నం, 99663 07777 


 


వెనక్కి ...

మీ అభిప్రాయం