ఘనయశోరాజి రంగాజి

  • 287 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। అనంతలక్ష్మి

  • అసోసియేట్‌ ప్రొఫెసర్‌
  • రైల్వే డిగ్రీ కళాశాల, హైదరాబాద్‌
  • 9949198141
డా।। అనంతలక్ష్మి

విజయరాఘవ నాయకుడి ఆస్థాన కవయిత్రిగా కలకాలం నిలిచిపోయే అద్భుత రచనలు చేసిన విదుషీమణి పసుపులేటి రంగాజమ్మ. పాత్రచిత్రణ, పాత్రోచిత భాష, సంభాషణాచాతుర్యం, కథాగతికి అనుకూలంగా చేసే కల్పనలు ఆమె సృజనాత్మకశక్తిని, పాండితీ ప్రకర్షను కళ్లకుకడతాయి. అందుకే స్వయంగా కవి, పండితుడు, సంగీత నృత్య కళాప్రవీణుడైన విజయరాఘవుడి నుంచే కాదు, విద్వత్కవుల ప్రశంసలూ అందుకున్నారామె.
‘‘భరత
సంగీత సాహితీ ప్రముఖ విద్యలాకృతులు గన్న చందాన వెలయుచు విజయ రాఘవ నాయకుని ఆస్థాన మలంకరించిన సంగీత సాహిత్య విద్యా చతురులలో రంగాజమ్మ మేటి’’ అని కీర్తించారు ఆండ్ర శేషగిరిరావు. తన ప్రతిభా పాటవాలతో విజయరాఘవ నాయకుడి ఆస్థానంలో, జీవితంలో స్థానం సంపాదించుకున్నారామె కనకాభిషేకంతో పాటు అర్ధరాజ్యాన్నీ బహుమతిగా అందుకున్నారు. తంజావూరులో ఇప్పటికీ రంగాజమ్మ మేడ ఉంది. 
      విజయరాఘవ నాయకుడు క్రీ.శ.1633 నుంచి 1674 వరకు తంజావూరుని పాలించాడు. ఈ కాలంలోనే రంగాజమ్మ రచనలు చేసి ఉంటారు. తన ‘ఉషా పరిణయం’ కృత్యాదిలో ‘‘వేంకటేంద్రుని పుత్రి! వినుత సద్గుణ ధాత్రి!/ ఘనయశోరాజి! రంగాజి వినుము/ మాధుర్యమున మించు మన్నారు దాసవి/ లాస ప్రబంధంబు లలిత ఫణితి/ గావించి, మిగుల శృంగారంబు గన్పట్ట/ బదములు మృదు రసాస్పదములగుచు/ రాణింప రచియించి, రామాయణంబును/ భాగవతంబును, భారతంబు’’; ‘‘సంగ్రహంబుగ రచియించి సరస రీతి/ మమ్ము మెప్పించితివి చాల నెమ్మి దనర/ బరగ హరివంశమున నుషాపరిణయ కథ/ తెనుగు గావింపు మిక నీవు తేట గాగ’’ అని చెప్పుకున్నారు రంగాజమ్మ. దీన్ని బట్టి ఉషాపరిణయ కావ్యం నాటికే ఆమె ‘మన్నారుదాసవిలాసం’ ప్రబంధం, రామాయణ, భాగవత, భారత సంగ్రహాలు రాసినట్లు అవగతమవుతుంది. తర్వాతి కాలంలో ‘మన్నారుదాసవిలాసం నాటకం’ (యక్షగానం) రచించినట్టు తెలుస్తోంది. 
కవయిత్రి.. రాజనీతి విశారద
‘‘విజయ రాఘవ మహీపాల విరచిత కనకాభిషేకయు, విద్వత్కవిజన స్తవనీయవివేకయు, పసుపులేటి వెంకటాద్రి బహుజన్మతపఃఫలంబును, మంగమాంబా గర్భశుక్తిముక్తాఫలంబును, రంగద్గుణకదంబ యునగు రంగాజమ్మ వచన రచనా చమ త్కృతిం జెన్ను మీఱు..’’ అని ఉషాపరిణ యం ఆశ్వాసాంత గద్యల్లో చెప్పుకున్నారు రంగాజమ్మ. దీన్నిబట్టి చూస్తే ఆమె తల్లిదండ్రులు పసుపులేటి వెంకటాద్రి, మంగమాంబ. అలాగే తాను రాజగోపాల దేవుని భక్తురాలినని, వాచకత్వంలో ప్రవీణురాలినని, విచిత్రంగా రాసిన పత్రికలను చదివి అర్థం చేసుకోగలనని, వాటికి సమాధానంగా స్వహస్తాలతో వందలాది పత్రికల్ని రచించే నేర్పుకలదాన్ననీ (విచిత్రతర పత్రికాశత లిఖిత వాచికార్థావగాహన ప్రవీణయు, తత్పత్రిపత్రికాశత స్వహస్త లేఖన ప్రశస్తకీర్తియు) పేర్కొంది. శృంగార రస నిర్భరమైన పదాలు రచించినట్లు (శృంగార రసతరంగిత పదకవిత్వ మహనీయ మతిస్ఫూర్తియు) కూడా ప్రకటించుకుంది. బహుశా వాగ్గేయకారుడు, పదకర్త క్షేత్రయ్య విజయ రాఘవుడి ఆస్థానానికి వచ్చినపుడు ఆయన ప్రభావం ఆమెపై పడి ఉండవచ్చు. ‘‘అతులితాష్టభాషా కవితా సర్వంకష మనీషావిశేష విశారదయు, రాజనీతి విద్యావిశారదయు’’ అని కూడా తన ప్రజ్ఞను వివరించుకున్నారామె. నిజంగానే ఎనిమిది భాషల్లో కవనం అల్లగలిగిన ప్రతిభ రంగాజమ్మ సొంతం. ఈ విషయాన్ని ‘మన్నారుదాస విలాసం’ నిరూపిస్తుంది. ఇందులో ఒక్కో భాషలో ఒక్కో పద్యం రాశారామె. అంతేకాదు, రంగాజమ్మ రాజనీతి విశారద కూడా. అందుకే రాజుకి అంతటి అభిమాన పాత్రురాలయ్యారు. ఆమె చదివి సమాధానాలు రాసిన లేఖలు రాజ వ్యవహా రాలకు సంబం ధించినవే కావొచ్చ న్నది చాలామంది అభిప్రాయం. విజయరాఘవుడి నుంచి కనకాభిషేకం పొందిన విషయాన్నీ ఆమె స్వయంగా వెల్లడించారు. ‘‘సరస మృదుమధుర కవితాచా తుర్యధుర్య’’ అనీ చెప్పుకున్నారు. ఈ లక్షణాలన్నీ యథార్థాలేనని సమకాలీన కవి పండితులు అంగీకరించారు. 
గ్రంథలిపిలోనూ..
‘‘చతురాస్యుండనదగు నీ/ పతి ఇటు నిను గారవించి బహుమతి దోపన్‌/ కృతి రచియింపుమనెన్‌ భా/ రతికిన్‌ బ్రతి వత్తువమ్మ రంగాజమ్మా!’’ అని రాజగురువు తాతాచార్యుల ప్రశంసలను పొందారు రంగాజమ్మ. ‘మన్నారుదాస విలాసం’ పేరిట విజయరాఘవుడి మీద అద్భుత యక్షగానం రచించి అతని పేరుకి, తన పాండిత్యానికీ చిరప్రతిష్ఠ తెచ్చుకున్నారు. ఈ రచనను 1926లో కాకినాడ ఆంధ్రసాహిత్య పరిషత్తు ముద్రించింది. నాటక లక్షణాలు దీనికి సమగ్రంగా అన్వయించవు. రంగాజమ్మ దీన్ని ప్రయోగార్థం (ప్రదర్శించటం కోసం) రచించారు. ద్రాక్షపాకంలో సాగిన ఈ రచనలో వ్యాకరణానికి విరుద్ధంగా కొన్ని ప్రయోగాలు చేశారు. ఇందులో సంస్కృత శ్లోకాలు, చూర్ణికలు ఉన్నాయి. అక్కడక్కడా ప్రాకృత, పైశాచి, మాగధి, శౌరసేని, అపభ్రంశ భాషా వాక్యాలూ కనిపిస్తాయి. తమిళ పదాలు కొన్ని తెలుగు వాక్యాలలో ఇమిడిపోయి దర్శనమిస్తాయి. అసలైతే మన్నారుదాస విలాస ప్రబంధం రంగాజమ్మ మొదటి రచన. అది తన ఇష్ట నాయకుడు విజయ రాఘవుడి చరిత్ర. అందుకే కాబోలు దాని పట్ల మక్కువ కలిగిన రంగాజమ్మ దానికే యక్షగాన రూపం కూడా ఇచ్చారు. ‘‘రంగాజమ్మ రచనలలో ప్రథమము, ప్రశస్తమునునగు నీ కృతి యందు విజయ రాఘవ నాయకునికి మన్నారు దేవునిపై గల మక్కువయు ఆ మన్నారుస్వామికి, నేతద్దేవాలయమునకు విజయ రాఘవుడొనరించిన దాన ధర్మములు, అచ్చట ఫాల్గుణ మాసమున జరుగు తిరునాళ్ల వైభవములు, కాంతిమతీ వివాహము మున్నగునవి వర్ణితములైనవి’’ అంటూ మన్నారుదాస విలాసం ప్రబంధం గురించి పేర్కొన్నారు నిడదవోలు వేంకటరావు. కురుగంటి సీతారామయ్య ‘తంజాపురాంధ్ర నాయక రాజుల చరిత్ర’లో మన్నారుదాస విలాసంలోవి అంటూ చాలా పద్యాలు కనిపిస్తాయి. ఈ ప్రబంధం తమిళదేశంలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. సులభ శైలి దీనికి ఓ కారణమైతే, తమిళ లిపికి ఆధారమైన గ్రంథలిపిలో అందుబాటులో ఉండటం మరో ప్రధాన కారణం. తెలుగు అర్థమైనా, చదవడం రాని వారి కోసం ఈ లిపిలో రాసే అలవాటు ఆ కాలపు తెలుగు కవులకు ఉండేదని నారాయణ తీర్థుల యక్షగానం ‘పారిజాత కథ’ ద్వారా తెలుస్తోంది. తమిళనాట ప్రసిద్ధి పొందిన ఈ రచన గ్రంథలిపిలోనూ ఉంటుంది. 
గుజగుజరేకులు... చిటితాళం... 
రంగాజమ్మ ‘ఉషాపరిణయం’ నాలుగాశ్వాసాల ప్రబంధం. అయితే మూడు ఆశ్వాసాలు పూర్తిగా, నాలుగోది కొద్ది భాగం మాత్రమే లభ్యమవుతున్నాయి. దీన్ని తంజావూరు గ్రంథాలయం, ఆంధ్ర సాహిత్య పరిషత్తు ప్రచురించాయి. ఈ గ్రంథ రచన చేయాలని స్వయంగా విజయరాఘవ నాయకుడే కోరాడట. ‘‘...వెంట శృంగారవతులు రంగురక్తులు మీఱ సంగీత మేళంబు గావింప, నగ్రభాగంబున నాచార్యాగ్రేసరుండగు శతక్రతు శ్రీనివాసాచార్యుండు కృత దురిత భంగంబగు హరివంశ కథా ప్రసంగంబు గావింప, నింపు మీఱ, నేనును శృంగార రసంబు చెన్నుమీఱ మన్నారుదాస విలాసంబు వినిపించుచున్న సమయంబున’’ అంటూ మన్నారుదాస విలాసాన్ని వినిపిస్తున్న సమయంలో ఈ రచన చేయాలని అడిగినట్లు రంగాజమ్మ చెప్పుకున్నారు. ‘‘మొదటిది అగు మన్నారుదాస విలాస ప్రబంధము తన యేలికయగు విజయ రాఘవ నాయకుని చరిత్రని వర్ణించేది. రెండవది హరివంశాంత ర్గతమైన ఉషా పరిణయ గాథ. ఈ రెండు ప్రబంధములను చదివిన వారికి మొదటి దాని కన్న రెండవది మిన్న యని గన్పట్టక మానదు. కథాసంవిధానము నందును, కవితా పటిమయందును శైలి, రీతి యందును నీ రెండవది తెనుగున గల గొప్ప ప్రబంధములతో సరియగునని చెప్పుట నిజము చెప్పుట యగును. ఈ గ్రంథము కనుపర్తి యబ్బయామాత్యునికి పూర్వము వ్రాయబడి యుండి, యాతని ‘యనిరుద్ధ చరిత్ర’ కంటె సర్వ విధముల మేలని చెప్పుటకు తగినదై యున్నది. చక్కని కవిత్వము’’ అని ఉషాపరిణయాన్ని ప్రశంసించారు కురుగంటి సీతారామయ్య.  ‘‘ఈమె రచనలలో ఉత్తరోత్తరము రసోత్తరముగా కనపడుచున్నది. కథా సంవిధానమునను, కవితా పటిమయందును ఈమె రచనలలో మిన్నయైన ఉషాపరిణ యము పూర్వకవుల రీతుల స్ఫురింప జేయు నుత్తమ కావ్యముగానున్నది’’ అన్నారు ఊటుకూరి లక్ష్మీకాన్తమ్మ.
      తన రచనల్లో ఆ కాలంనాటి ఆచార వ్యవహారాలు, ప్రజల జీవనవిధానం, సాంఘిక పరిస్థితులకు అద్దంపట్టారు రంగాజమ్మ. ముఖ్యంగా అప్పట్లో పిల్లల ఆటలెన్నింటినో గ్రంథస్థం చేశారు. ‘‘పరగ గుజ్జెన గూళ్లు వండి, నెచ్చెలులతో వేర్వేర బొమ్మల పెండ్లి సేయు/ వెన్నెల బైటను కన్నియలున్‌ దాను మొనయుచు డాగిలిమూతలాడు.... నింతులను గూడి బంగరు బంతులాడు/ బాలికలతోడ నారామ కేళి సల్పు/ జదువు మృదు కోకిలాలాప సరణి మీర/ వీణ వాయించు జెవులకు విందు గాక’’ అంటూ అప్పటి బాల్య క్రీడల్ని రమణీయంగా వర్ణించారు. ఇంకా చెండు గోరింతం, గుజగుజ రేకులు, పగడసాల, చదరంగం, జారుడు బీట లాంటి చాలా ఆటల ప్రస్తావన తెచ్చారు. వీటిని చూస్తే బమ్మెర పోతన వర్ణించిన రుక్మిణి స్ఫురణకొస్తుంది. ఆటలనే కాదు తన కాలపు వాద్య విశేషాలని కూడా పరిచయం చేశారు రంగాజమ్మ. దండె, తంబుర, స్వరమండలం, రబాబు, వేటు గజ్జలు, ముఖవీణ, కిన్నెర వీణ, తాళం, పిల్లగోవి, కామాచి, చిటితాళం, మురజ, నావరజం, రావణహస్తం లాంటి చాలా వాద్యాలు ఆమె రచనల్లో కనిపిస్తాయి. అయితే ‘రావణహస్తం’ లాంటివి ఉషా పరిణయం కావ్య నాయిక ఉష కాలంలో ఉండే అవకాశం లేదు. కానీ, వాటిని తన కావ్యంలో పేర్కొంటూ ఆ కథకి కొత్త అందం తెచ్చారు రంగాజమ్మ. ‘మంత్రివరులు, గుఱి దొరలు, అవసరము వారలు, హెగ్గడికత్తెలు, అన్నగారలు, సవరణలు’ లాంటి ఆనాటి కొలువు కూటమిలోని ఉద్యోగుల వివరాలనూ అందించారు. ఇక ఆమె చేయించే వన విహారంలో సంపెంగ, బొడ్డుమల్లె, పొన్న మొగ్గలు, సేవంతి, విరవాది, పొగడ, పారిజాతం లాంటి తెలుగు పెరటి తోట పూలన్నీ కనపడతాయి. అప్పటి పూజా విధానాలు, ఆహారపు అలవాట్లని కూడా సందర్భానుసారం పేర్కొన్నారు. 
      సాధారణంగా ప్రబంధాల్లో కనిపించే అంగాంగ వర్ణన ఉషాపరిణయ కావ్యంలో ఉండవు. నాయికా నాయకుల భౌతిక రూప వర్ణన కన్నా గుణ వర్ణనకే రంగాజమ్మ అధిక ప్రాధాన్యమిచ్చారు. లలితమైన పదాలతోనే రచనలు చేసినా ఆమెకున్న సంస్కృత భాషా పటిమ, ప్రౌఢనిర్భర రచనా సామర్థ్యం అక్కడక్కడా తళుక్కుమంటాయి. ‘‘ప్రద్యుమ్నోపేత సంకర్షణ ముఖ కమల ప్రస్ఫురద్దివ్య శంఖ/ ప్రోద్యద్భూరి ప్రణాదంబులు బహు పటహవ్యూహ భేరీ రవంబుల్‌...’’ లాంటివి అందుకు ఉదాహరణలు. ‘ఉత్కట హాసము’ మొదలైన పదప్రయోగాలు భాష పైన ఆమెకున్న పట్టుని తెలియజేస్తాయి. 
మన్నారుదాస విలాస నాటకం యక్షగాన రీతికి చెందింది. ఈ ప్రక్రియలో వచనాలు, దరువులు, ద్విపదలు, ధవళాలు, జోల, సువ్వాల లాంటివి ఉంటాయి. దేశీయ వేష భాషలు, ఆచార వ్యవహారాలు సందర్భోచితంగా వర్ణితమవుతాయి. హాస్యరసం యక్షగానాలలో కనిపించే మరో విశేషం.       ‘‘మన్నారు దాస విలాస నాటక మున రంగాజమ్మ ప్రతిభ, లోకజ్ఞత, హాస్యరస సంవిధానము, సంగీత పరిజ్ఞానము నిండార వెల్లివిరియుచున్నవి. ఈ నాటకము నందు పాత్రోచిత భాష వాడబడుటచే నిది మఱియు రసవత్తరమైన హాస్య మన నిది యని నిరూపించు చున్నది. ఈ నాటకమున సున్నితమగు జాతీయమగు హాస్యము ప్రవచింపబడినది’’ అని నిడదవోలు ప్రశంసించారు. స్వయంగా రంగాజమ్మే ఈ నాటకం గురించి ‘‘శృంగార కరుణ హాస్య శాంతాది రసంబులు పొదల మృదుల మధురోచిత వచన రచనల నందంబుగా సందర్భింప రచించితి’’ అని చెప్పుకున్నారు. 
      యక్షగానాల్లో పాత్రోచిత భాషని ప్రవేశపెట్టింది విజయ రాఘవుడు. రంగాజమ్మ దాన్ని పెంపొందించారు. ఈ మార్పు వల్ల నాట్య గేయ ప్రధానమైన యక్షగానం నాటకంగా పరిణామం చెంది, వాస్తవికతని సంతరించుకుంది. తన యక్షగానంలో కావలివాడు, విద్వత్కవులు, పురోహితుడు, ఎఱుకత, ముత్తయిదువలు... లాంటి పాత్రలకు పాత్రోచిత భాష వాడారు రంగాజమ్మ. ఉదాహరణకి ఎఱుకత మాటలు చూడండి.. ‘‘అమ్మాయమ్మ, అమ్మాయమ్మ శెయి సూపు, శెయి సూపు శెయి సూపవే దుండి, దానము గల శెయ్యె, బంగారు శేయే, దాన్యము గల శేయే, బంగారు శేయే, బాగ్యముల శేయే దుండి’’! ఇక ముత్తయిదువల మాటలు ఇలా ఉంటాయి.. ‘‘నాగరింటి పెండ్లినాడయినా వొక వక్కబ్రద్ద వేసుకొని నమల రాదషవో’’! సున్నితమైన హాస్యాన్ని పండించడంతో పాటు ఆనాటి ప్రజల జీవన విధానాన్ని ఈ మాటలు కళ్లకుకడతాయి. అద్భుత సృజనాత్మకత, విలక్షణ రచనా ప్రజ్ఞతో తెలుగు సాహితీ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకున్న రంగాజమ్మ కవయిత్రుల్లో మేలిమి మణిపూస.


వెనక్కి ...

మీ అభిప్రాయం