రాద్దాం.. తెలుగును వెలిగిద్దాం!

  • 82 Views
  • 0Likes
  • Like
  • Article Share

అంతర్జాలంలో అనంత విజ్ఞానాన్ని తెలుసుకోవడానికి వేదిక వికీపీడియా. ఆంగ్లంతో పోల్చితే వికీపీడియాలో తెలుగులో అందుబాటులో ఉన్న వ్యాసాలు చాలా తక్కువ. వీటి సంఖ్యను పెంచడం ఎలా? అసలు వికీపీడియాలో తెలుగు వ్యాసాల సంఖ్య పెరగాల్సిన అవసరం ఏంటి? పౌర సమాజాన్ని ప్రభావవంతంగా ఇందులో ఎలా భాగస్వామ్యం చెయ్యాలి? వ్యాసాల అనువాదంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీనికోసం ఏయే పద్ధతుల్ని అనుసరించాలి? మాటల అనువాదంలో జరుగుతున్న ప్రగతి ఏంటి? లాంటి వాటి మీద విస్తృత మేధామథనానికి ‘తెలుగు వికీపీడియా సదస్సు-2020’ వేదికైంది.
కేంద్ర
సమాచార సాంకేతిక శాఖ, తెలంగాణ ప్రభుత్వం సంయుక్తంగా అంతర్జాతీయ సమాచార సాంకేతిక విజ్ఞాన సంస్థ (ట్రిపుల్‌ఐటీ) హైదరాబాదుతో కలిసి తెలుగులో వికీపీడియాలోని వ్యాసాల సంఖ్యను రానున్న అయిదు పదేళ్లలో 30 లక్షలకు పెంచాలన్న భారీ సంకల్పాన్ని భుజానికెత్తుకున్నాయి. పౌర సమాజాన్ని భాగస్వాములను చేస్తూ ముందుకు తీసుకెళ్లే ఈ క్రతువుకు సంబంధించి ఫిబ్రవరి 8న హైదరాబాదు గచ్చిబౌలిలోని ట్రిపుల్‌ఐటీ వేదికగా తెలుగు వికీపీడియా సదస్సు జరిగింది. భాషా, సాహితీ అభిమానులు, మేధావులు, వివిధ రంగాల ప్రముఖులు ఇందులో పాల్గొన్నారు. 
      ఆంగ్ల వికీపీడియా 2001లో  ప్రారంభమవ్వగా, 2003 డిసెంబరు 10 నుంచి తెలుగు వికీపీడియా అందుబాటులోకి వచ్చింది. ఆంగ్ల వికీలో 70 లక్షలకుపైగా వ్యాసాలు అందుబాటులో ఉన్నాయి. తెలుగులో 72వేల వ్యాసాలే ఉన్నాయి. ఈ సంఖ్యను పెంచడానికి ఆంగ్ల వ్యాసాలను ట్రిపుల్‌ఐటీ అభివృద్ధి చేసే ఆన్‌లైన్‌ టూల్‌కిట్‌ ద్వారా తెలుగులోకి అనువదిస్తారు. ఆ తర్వాత మూడు దశల్లో విషయాన్ని సరిదిద్దుతారు. అనంతరం దాన్ని వికీపీడియాలో అప్‌లోడ్‌ చేస్తారు. అలాగే సమాజంలోని అందర్నీ భాగస్వాములు చేసి వివిధ అంశాల మీద తెలుగులో వ్యాసాలు రాసి అప్‌లోడ్‌ చేసేలా ప్రోత్సహిస్తారు. ఔత్సాహికులు తమకు అందుబాటులో ఉన్న తెలుగు టైపింగ్‌ టూల్స్‌ను ఉపయోగించి వ్యాసాలు రాసి ట్రిపుల్‌ఐటీ అందించే ఫాంట్‌ కన్వర్టర్‌ సాయంతో యూనికోడ్‌లోకి మార్చి వికీపీడియాలో అప్‌లోడ్‌ చేయవచ్చు. తెలుగు వికీపీడియా మీద మరింత అవగాహన కోసం ప్రత్యేక ఉచిత శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వివరాల కోసం 93965 33666, 99592 63974 (వాట్సప్‌) నంబర్లలో తెవికీ బాధ్యులను సంప్రదించవచ్చు. 

 


ఈ సదస్సులో ఆయా రంగాల ప్రముఖులు వెలిబుచ్చిన అభిప్రాయాలు, అందించిన సూచనలివి...

భాషకు ముప్పు
వికీపీడియా అంటే విజ్ఞాన భాండాగారం. అది కచ్చితంగా స్థానిక భాషల్లో ఉండాలి. తెలుగులో వ్యాసాలను రాసే వారిని తయారు చేయడం చాలా ముఖ్యం. ఇందుకోసం ట్రిపుల్‌ఐటీ హైదరాబాదు అన్ని విధాలా ప్రయత్నిస్తోంది. వికీథాన్‌ పేరిట ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 నుంచి 6 గంటల వరకు, శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉచితంగా ఔత్సాహికులకు శిక్షణ ఇస్తున్నాం. ఇందుకుగాను తెలుగు వికీ పేరిట ప్రత్యేక కేంద్రాన్ని ట్రిపుల్‌ఐటీలో ఏర్పాటు చేశాం. వ్యాసాలు రాయాలనుకునే వారు ఈ కేంద్రాన్ని సంప్రదించి సలహాలు, సూచనలు పొందవచ్చు. మరింత సమాచారం కోసం tewiki.iiit.ac.inను చూడవచ్చు. అలాగే, tewiki@iiit.ac.inకు మెయిల్‌ చేయవచ్చు. 

- ఆచార్య వాసుదేవవర్మ, తెలుగు వికీ ప్రాజెక్టు ప్రధాన పరిశోధకులు, ట్రిపుల్‌ఐటీ ఆర్‌ అండ్‌ డీ మాజీ డీన్‌ 


స్వచ్ఛందంగా ముందుకు రావాలి
తెలుగు వికీపీడియాను వృద్ధి చేయడంతో పాటు తప్పులు లేకుండా ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందుబాటులో ఉంచడం చాలా కీలకం. అనువాదాలు సరళంగా ఉండాలి. అప్పుడే పాఠకుల ఆదరణ పెరుగుతుంది. తెలుగు వికీపీడియాలో వ్యాసాలు రాసే వారితో పాటు దాన్ని వినియోగించే వారి సంఖ్యనూ పెంచాల్సి ఉంది. నిరంతరం వస్తున్న సాంకేతిక మార్పులను అన్వయించుకుంటేనే ఏ భాష అభివృద్ధి అయినా సాధ్యం. తెలుగు వికీ బలోపేతానికి సాహితీవేత్తలు, తెలుగు భాషా ప్రేమికులు స్వచ్ఛందంగా ముందుకు రావాలి. 

- ఆచార్య కె.నాగేశ్వర్‌ 


ఆ నిర్లక్ష్యాన్ని సరిదిద్దాలి
తెలుగు భాషకు పునర్వైభవం తీసుకువచ్చే మహత్తర క్రతువుకు ఆరంభమిది. వికీపీడియాలో తెలుగు వ్యాసాల సంఖ్య పెంచడం ఒక్కరితో సాధ్యమయ్యే పని కాదు. వ్యాసాలు రాసే వలంటీర్లు చాలా మంది కావాలి. ఇందుకు ఆంగ్ల, తెలుగు భాషల్లో ప్రావీణ్యం ఉన్నవారు అవసరం. కానీ, వీరి సంఖ్య ఒక శాతం కంటే తక్కువ. వ్యాసాలను అనువదించేందుకు అవసరమైన ఆన్‌లైన్‌ అనువాద టూల్‌కిట్స్‌ను అభివృద్ధి చేసేందుకు ట్రిపుల్‌ఐటీ హైదరా బాదు కృషిచేస్తోంది. గత 20, 30 ఏళ్లలో సమాచార సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులొచ్చాయి. మాటల అనువాదం ద్వారా ఒక భాషలో మాట్లాడిన దాన్ని వెంటనే మరో భాషలోకి అనువాదం చేసి వినిపించే పరిజ్ఞానం వృద్ధి చెందింది. ఆంగ్లం, చైనీస్, జపనీస్, జర్మన్, ఫ్రెంచ్, ఇటాలియన్‌ భాషల్లో ఈ అనువాదాలు జరుగుతున్నా భారతీయ భాషలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. దీని మీద దృష్టిపెట్టి పనిచేయాలి.  

- ఆచార్య రాజ్‌రెడ్డి, ట్రిపుల్‌ఐటీ హైదరాబాదు పాలన మండలి అధ్యక్షులు


వారి సహకారం తీసుకోవాలి
వికీపీడియాలో తెలుగు వ్యాసాలు రాయడంలో పండితులు, అధ్యాపకులు, పాత్రికేయులు, రచయితలు, పరిశోధక విద్యార్థుల సహకారం తీసుకోవాలి. తెలుగు వ్యాసాలు రాసేందుకు వెయ్యి మంది నిపుణులు దొరికినా అదృష్టమనుకోవాలి. ఇంగ్లీషు స్థాయిలో కాకపోయినా వ్యాసాల్ని కనీసం ఏడు లక్షలకు తీసుకెళ్లినా ఎంతో ప్రయోజనం ఉంటుంది. జ్ఞానాన్ని సులభంగా అందించేందుకు వికీపీడియా తోడ్పడుతుంది. మన భాషలను నేటి అవసరాలకు అనుగుణంగా వృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. గత వంద, రెండొందల ఏళ్లుగా మాతృభాషలు వెనుకబడిపోయాయి. మన దేశంలో ఒక రాష్ట్ర భాష గురించి మరొక రాష్ట్ర ప్రజలకు తెలియడంలేదు. వికీపీడియా సాయంతో అమ్మభాషల అభివృద్ధి సాధ్యమవుతుంది. 

- జయప్రకాశ్‌నారాయణ, లోక్‌సత్తా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు 


ప్రపంచానికి చాటాలి
మాతృభాషలోని మాధుర్యాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించాలి. తెలుగు వెలుగులీనేందుకు అందరి సహకారం అవసరం. ఎవరి భాష వారికి గొప్ప. ఆయా భాషల్లోని వైవిధ్యాన్ని గౌరవించే విశాల దృక్పథం ఉండాలి. భాషలోని సౌందర్యమే సాహిత్యమని గుర్తుంచుకోవాలి. భిన్న సంస్కృతి, సంప్రదాయాలకు నెలవైన తెలంగాణ విశిష్టతను తెలుగు వికీపీడియా వేదికగా ప్రపంచానికి చాటాలి. 

- మామిడి హరికృష్ణ, తెలంగాణ భాషా సంస్కృతిక శాఖ సంచాలకులువెనక్కి ...

మీ అభిప్రాయం