సాహితీ ఉత్సవం... ఎగసిన ఉత్సాహం

  • 53 Views
  • 0Likes
  • Like
  • Article Share

సాహిత్యోత్సవం (లిటరరీ ఫెస్ట్‌) అనగానే ఆంగ్లం హవానే ఎక్కువగా కనిపిస్తుంటుంది. అయితే, ప్రాంతీయ భాషా సాహిత్యాల్లో కూడా ఇలాంటివి ఎందుకు నిర్వహించకూడదనే ఆలోచనకు బీజం వేసింది హైదరాబాదు సాహితీ ఉత్సవం - 2020 (హెచ్‌ఎల్‌ఎఫ్‌). సైఫాబాదులోని విద్యారణ్య ఉన్నత పాఠశాలలో మూడు రోజుల పాటు జరిగిన ఈ ఉత్పవం దేశ విదేశాల్లోని రచయితలను భాగ్యనగరానికి తీసుకొచ్చింది. పుస్తకాల మీద చర్చలు, సమావేశాలు, రచయితలతో మాటామంతీ, విద్యార్థులకు కార్యశాలలు, చిత్రలేఖనాలు, సినిమా ప్రదర్శనలు, కథలు చెప్పడం లాంటి వాటితో ఆద్యంతం ఉత్సాహభరిత వాతావరణంలో సాగిన ఈ ఉత్సవం విశేషాలివి..! 
24 సదస్సులు,
28 కార్యశాలలు, 39 కథా శ్రవణాలు, 43 పుస్తకావిష్కరణలు, 36 సినిమా, 27 సాంస్కృతిక ప్రదర్శనలు.. ఇలాంటి ఇంకెన్నో వైవిధ్య కార్యక్రమాలతో హైదరాబాదు సాహితీ ఉత్సవం - 2020 సాహిత్యాభిలాషుల్ని సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్లింది. జనవరి 24 నుంచి 26 వరకు జరిగిన ఈ ఉత్సవం.. జాతీయ, అంతర్జాతీయ రచయితల్ని నగరవాసులకి పరిచయం చేసింది. ఈ ఉత్సవం మొదలై పదేళ్లవుతున్న నేపథ్యంలో ఈసారి కార్యక్రమాల్ని మరింత విస్తృతం చేశారు. ముఖ్యంగా ‘‘ఇలాంటి సాహితీ ఉత్సవాల్లో ఇంగ్లీషు పుస్తకాలు, సాహిత్యాన్ని చదవడం, పరిచయం చేయడం మంచిదేగానీ, తెలుగు లాంటి ప్రాంతీయ భాషల సాహిత్యాన్ని వీటిలోకి ఎందుకు తేకూడదు?’’ అన్న కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌ మాటలు ప్రతిఒక్కరిలో ఆలోచన నింపాయి. 
      సాహితీ ఉత్సవంలో భాగంగా వివిధ సదస్సులు, కార్యక్రమాల కోసం విద్యారణ్య పాఠశాలలో పలు వేదికలు ఏర్పాటు చేశారు. గోథె హాల్, కార్వీ కనోపీ వేదికల మీద సాహితీ సదస్సులు నిర్వహించారు. చిన్నపిల్లలకు కథలు చెప్పే వేదికకు కర్నాడ్‌ కార్నర్‌ అని పేరు పెట్టారు. ‘కావ్యధార’ వేదిక మీద యువ సినీ దర్శకులు, కవులు, రచయితలు ప్రసంగాలు చేశారు. ఈ ఉత్సవ సంప్రదాయంలో భాగంగా ఈ ఏడాది మలయాళం, ఆస్ట్రేలియన్‌ భాషా సాహిత్యాలను నేపథ్యంగా ఎంచుకున్నారు. ఆయా భాషలకు చెందిన 36 కళాత్మక చిత్రాలను ప్రదర్శించారు. రచయితల్ని సాహిత్యాభిమానులు నేరుగా కలుసుకునేందుకు ఏర్పాటు చేసిన వేదిక దగ్గర ఆసక్తికర చర్చలూ జరిగాయి.
మరుగునపడిన జీవితాలు
హైదరాబాదు సాహితీ ఉత్సవం ప్రారంభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ప్రముఖ రచయిత, దర్శకులు ఆదూర్‌ గోపాలకృష్ణన్‌ హాజరయ్యారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి బుర్రా వెంకటేశం, ఆస్ట్రేలియన్‌ కాన్సుల్‌ జనరల్‌ సుసాన్‌ గ్రేస్‌ ప్రత్యేక, గౌరవ అతిథులుగా విచ్చేశారు. మానవ నాగరికత, పురోగతికి సాహిత్యం ప్రధాన ఆధారం అని గోపాలకృష్ణన్‌ పేర్కొన్నారు. అనంతరం కార్వీ కనోపి వేదిక మీద ‘సినిమా, సాహిత్యం, సమాజం’ అంశం మీద ఏర్పాటు చేసిన చర్చలో ఆదూర్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం రాజకీయాలు సినిమాల్లోకి బాగా చొచ్చుకొచ్చాయని, ఒక మంచి సినిమా తీసే పరిస్థితి దేశంలో లేదని ఆవేదన వ్యక్తంజేశారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు మంచి సినిమాల్ని చూపించాలని, పిల్లల కోసమే దేశంలో ఏటా చాలా గొప్ప సినిమాలు వస్తున్నాయని అన్నారు. పాఠశాల రోజుల్లోనే సినిమా పాఠాలను పిల్లలకు బోధించాలని, స్క్రిప్ట్‌ రచనలో వాళ్లని ప్రోత్సహించాలని పిలుపునిచ్చారు. కేరళలో ఇలా చెయ్యడం వల్ల అక్కడ పిల్లలు చక్కని సినిమాలు తీస్తున్నారని వెల్లడించారు. దేశ విదేశాల నుంచి వచ్చిన రచయితలు ఈ సాహితీ ఉత్సవంలో తమ పుస్తకాల్ని పరిచయం చేశారు. వాటి రచన వెనక ఉన్న నేపథ్యాన్ని, రచనా క్రమంలో తమకు ఎదురైన సవాళ్లను వివరించారు. ప్రముఖ పాత్రికేయులు అశుతోష్, నరేష్‌ ఫెర్నాండెజ్, పర్యావరణ వేత్త, పాత్రికేయురాలు బహర్‌ దత్, ప్రసిద్ధ రచయితలు జెర్రీ పింటో, ఓల్గా, పాల్‌ జకారియా, చిన్మయ్‌ తుంబే, సినీ దర్శకులు, రచయిత హరిందర్‌ సింగ్‌ సిక్కా, నవలా రచయిత విక్రమ్‌ కపూర్‌ తదితరులెందరో ఆయా సదస్సుల్లో మాట్లాడారు. ప్రస్తుత సామాజిక స్థితిగతులు, పర్యావరణం, దేశ విభజన కాలం నాటి పరిస్థితులు, ఇందిరా గాంధీ హత్య అనంతరం జరిగిన పరిణామాలు, వలస, ప్రాచీన భారతీయ కథలు, చరిత్ర, న్యాయం, పాత్రికేయం ఇలా ఎన్నో అంశాల మీద వెలువరించిన పుస్తకాలను ఈ ఉత్సవంలో పరిచయం చేశారు. వాటి నుంచి కొన్ని భాగాల్ని చదివి వినిపించారు. 
      ‘ప్రకృతి పరిరక్షణలో భారతదేశ ప్రయోగాలు’ అంశం మీద బహర్‌ దత్‌ మాట్లాడుతూ.. పర్యావరణ పరిరక్షణకు సంబంధించి రాజకీయాలు ప్రస్తుతం చాలా అవరోధంగా మారుతున్నాయన్నారు. పర్యావరణం పట్ల ప్రజల్లో ఇప్పుడు ప్రశ్నించే తత్వం పెరగడం హర్షణీయమని పేర్కొన్నారు. తన అనుభవాల ఆధారంగా రాసిన ‘రివైల్డింగ్‌’ పుస్తకం గురించి చెప్పారు. ‘జ్ఞాపకాలు, చరిత్రలో హైదరాబాదు’ అంశం మీద జరిగిన సదస్సులో రచయిత్రి నజియా అఖ్తర్, రచయిత, పాత్రికేయులు యూనిస్‌ లసానియా మాట్లాడారు. తల్లిదండ్రులు, నాన్నమ్మ తాతయ్యల జ్ఞాపకాలు, అనుభవాల ఆధారంగా హైదరాబాదు యువ రచయితలు రచనలు చేశారని, పోలీస్‌ యాక్షన్, అధికార మార్పిడి నాటి పరిస్థితులు, అప్పటి జన జీవితాన్ని కళ్లకు కట్టారని నజియా అన్నారు. కాల్పనిక సాహిత్యం, చరిత్ర మధ్య ఉండే సరిహద్దుల్ని ప్రముఖ రచయిత్రి జిలానీ బానో చెరిపేశారని వ్యాఖ్యానించారు. ముస్లిం రచయితలు మహిళల జీవితాల్లోని నిశ్శబ్దాన్ని అక్షరబద్ధం చేసే ప్రయత్నం చేశారని చెప్పారు. ప్రముఖ బెంగాలీ రచయిత్రి నవనీత దేవసేనకు అంకితం చేస్తూ నిర్వహించిన ‘సీత పునరవలోకనం... నవనీత సంస్మరణం’ సదస్సులో ఓల్గా మాట్లాడారు. తన ‘విముక్త’ (ఆంగ్ల అనువాదం ‘లిబరేషన్‌ ఆఫ్‌ సీతా’)లో అహల్య, ఊర్మిళ, రేణుక లాంటి మరుగున పడిన మహిళల జీవితాల్ని పునర్నిర్మించే ప్రయత్నం చేసినట్లు చెప్పారావిడ. 
‘కథ’కు విశేష ఆదరణ 
‘అనువాదంలో తెలంగాణ సాహిత్యం’ మీద జరిగిన సదస్సులో అనువాదకులు దామోదర్‌ రావు, ఎలనాగ మాట్లాడారు. సమన్వయకర్తగా తెలంగాణ సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ వ్యవహరించారు. ప్రాంతీయ రచయితలు సామాజిక నిర్మాణం, వేదనలు నేపథ్యంగా రాస్తుంటే, భారతీయ ఆంగ్ల రచయితలు సూక్ష్మ అంశాల మీద దృష్టి సారిస్తున్నారని, అందుకే ఆంగ్లంలోకి ప్రాంతీయ రచనల అనువాదం అత్యావశ్యకమని దామోదర్‌ రావు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమం సమయంలో ఇక్కడి ప్రజల ఆకాంక్షని అందరికీ తెలియజెప్పేలా కొన్ని కవితల్ని సేకరించి ‘సెంట్‌ ఆఫ్‌ సాయిల్, ఓడ్‌ టు ఫ్రంట్‌ లైన్‌ ఫార్మేషన్‌’ పేరుతో ఆంగ్లంలోకి అనువదించినట్లు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఇక్కడి రచనలు విస్తృతంగా ఇతర భాషల్లోకి వెళ్లే అవకాశాల్ని అందిపుచ్చుకుంటున్నాయని మామిడి హరికృష్ణ అన్నారు. ‘వలసవాదుల గళం’ మీద జరిగిన సదస్సులో భారత సంతతి రచయిత్రులు రషీద మార్ఫీ, రొయానా గొంసాల్వెస్‌ మాట్లాడుతూ.. భారత్‌ నుంచి వందల ఏళ్ల కిందట ప్రజలు ఆస్ట్రేలియాకి వలస వెళ్లారని చెప్పారు. ఇలా వెళ్లినవారు మాతృ దేశంతో తమ పేగు బంధాన్ని అక్షరాల్లోకి తెచ్చారని పేర్కొన్నారు. ఇప్పుడు విదేశాలకు వలసలు పెరుగుతున్న నేపథ్యంలో వలస రచయితల రచనలకు అవకాశం ఎక్కువగా ఉందని రషీద అన్నారు. విదేశాల్లోని మైనారిటీలు తమ పుస్తకాల్ని ప్రచురింప జేసుకునే స్థాయికి చేరడం గొప్ప విషయ మని రొయానా హర్షం వ్యక్తం చేశారు. 
      సాహిత్య ఉత్సవంలో భాగంగా ఏర్పాటు చేసిన ‘కథలు చెప్పడం’ కార్యక్రమం పిల్లల్ని విశేషంగా ఆకట్టుకుంది. మూడు రోజుల పాటు ఈ ప్రాంగణం పిల్లలు, వారి తల్లిదండ్రులతో కిక్కిరిసి పోయింది. ఆంగ్లంతో పాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో కూడా కథలు వినిపించారు. హైకూలు, కథ, నవలా రచన తదితరాల మీద నిర్వహించిన కార్యశాలలకూ మంచి స్పందన లభించింది. నేషన్స్‌ రాక్‌ బీట్‌ ఆధ్వర్యంలో ‘యంగిస్థాన్‌ నుక్కాడ్‌’ పేరిట ఏర్పాటు చేసిన వేదిక యువతను ఉర్రూతలూగించింది. పాటలు, నాటకాలు, సంగీత వాద్య కచేరీలతో ఈ బృంద సభ్యులు అందరినీ అలరించారు. అకాపెల్లా శైలిలో సంగీత వాద్యాలు లేకుండా నోటితోనే ఆయా వాద్యాలు పలికిస్తూ అబ్బురపరచారు. కాలివేళ్లతో కుంచెను కదిలిస్తూ అప్పటికప్పుడే చిత్రలేఖనాలు వేస్తూ చిత్రకారులు సునీల్‌ కుమార్‌ ఆకట్టుకున్నారు. అన్ని సదస్సులూ నిర్దేశిత సమయానికే కచ్చితంగా పూర్తయ్యేలా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు. ఆవరణలో ఏర్పాటు చేసిన పుస్తక విక్రయ స్టాళ్లు జనంతో కిక్కిరిసి కనిపించాయి. మూడో రోజు సమాపన కార్యక్రమంలో కేంద్ర మాజీ మంత్రి జైరాం రమేశ్‌ వ్యాఖ్యలు ఉత్సవానికే ప్రత్యేకంగా నిలిచాయి. సాహితీ ఉత్సవాలు ఎలా ఉండాలో చెబుతూనే, ప్రాంతీయ భాషా సాహిత్యాలను కూడా వీటిలోకి తేవాల్సిన అవసరాన్ని ఆయన నొక్కి చెప్పారు. ఉత్సవ నిర్వాహకులు వచ్చే ఏడాదిలోనైనా ఈ సూచనలను ఆచరణలోకి తెస్తారా!?


వెనక్కి ...

మీ అభిప్రాయం