గంతకు తగ్గ బొంత

  • 301 Views
  • 0Likes
  • Like
  • Article Share

గంతకు తగ్గ బొంత
పూర్వం గంగిరెద్దుల వాళ్లు సంక్రాంతి, దసరా పర్వదినాల్లో గంగిరెద్దును అలంకరించుకుని, సన్నాయి పట్టి వీధుల్లో గడపగడపకు తిరిగేవారు. ఈ అలంకరణలో గంగిరెద్దు వెన్నుపై కూర్చోడానికి వీలైన ఒక చద్దరులాంటిది రెండు వైపులా జారుతూ వేలాడే వస్త్రం వేసేవారు. దీన్ని గంత అంటారు. గంత స్థాయినిబట్టి గంగిరెద్దుల వారి సంపాదన తెలిసేది. గంగిరెద్దు పెద్దగా ఉంటే గంత పెద్దగా ఉండేది. దాని కండపుష్టినిబట్టి ఆ ఎద్దు ఆర్థికస్థాయి తెలిసేది.  
      ఈ గంతపైన కూర్చున్నవారు జారకుండా, మెత్తగా ఉండేలా ఓ బొంత వేసేవారు. గుడ్డపేలికలు దగ్గరగా కూర్చి కుడితే బొంత. ఇది చద్దరుకెక్కువ. పరుపునకు తక్కువ. మెత్తగా ఉంటుంది. ఎద్దు మూపుపై వేసే బొంత చిన్నది. కొంచెం తక్కువ రకంది. గంత స్థాయిని బట్టి బొంత. తక్కువ స్థాయికి తక్కువ రకం జోడీ వస్త్రం, అలంకారం. దీన్నిబట్టే ఈ సామెత పుట్టింది. మోస్తరు స్థాయికి మోస్తరుగా సరిపడే జంట లేదా తోడు అని అర్థం.


కుంచడుంటే కుడికొప్పు, 
అడ్డెడుంటే ఎడమ కొప్పు!

పూర్వం ధాన్యాన్ని అడ్డ, సేరు, కుంచము, తూము అనే పరిమాణాలతో కొలిచేవారు. ‘కుంచం’ నాలుగు మానికెల కొలత. ‘అడ్డ’ రెండు మానికెల కొలత.. కుంచంలో సగం. ‘మానిక’ అంటే ఎనిమిది పిడికిళ్ల కొలత. ఆడవాళ్లు అలంకరించుకునే పద్ధతిని బట్టి, పంటలు ఏ స్థాయిలో పండాయో ఊహించి చెప్పే క్రమంలో పుట్టిన సామెత ఇది. 


శీతకన్ను
ఉదాసీన వైఖరి, నిర్లక్ష్యధోరణి అని నిఘంటువులు చెబుతాయి. ఉపేక్ష అనే అర్థంలోనూ వాడతారు. శీతకన్ను అంటే శీతకాలపు కన్ను. శీతకాలంలో సూర్యుడు తక్కువ సమయమే కనిపించి, తొందరగా తప్పుకుంటాడు. దీని ఆధారంగా మంచి జాతీయాన్ని తయారు చేసుకున్నారు తెలుగువారు. ‘శీతకన్ను వేశారు’ అంటే.. తక్కువగా చూస్తున్నారు, పట్టించుకోవట్లేదు అని వ్యావహారికార్థం.


క.. చ అయితే!
మన తెలుగు ద్రావిడ భాషా కుటుంబంలోని భాష. ఇది మధ్య ద్రావిడ ఉపకుటుంబంలోది. మూలభాషలోని పదాలు ఆ కుటుంబ భాషల్లో కొన్ని ధ్వని పరిణామం చెందుతుంటాయి. ఈ పరిణామాల్లో తాలవ్యీకరణం ఒకటి. అంటే, మూల ద్రావిడ భాషలోని ‘క’ కారం ‘చ’ కారంగా మారడం. మూలద్రావిడంలో ఇ, ఈ, ఎ, ఏ లతో ఉన్న క కారం తెలుగులో చకారంగా మారడం తాలవ్యీకరణ ఫలితమే.  
        మూలద్రావిడం - తెలుగు
        కిలుము - చిలుము
        కిళి - చిలుక
        కివి - చెవి
        కై - చేయి
        కెంపు - చెంబు
        కెట్‌ - చెడు, చేటు
        కెవ్ - చెన్‌ (ఎర్రని)


కుందనం
మేలిమి బంగారం. పరిశుద్ధ లోహం అనే అర్థాన్నిచ్చే కుందన్‌ అనే పారశీ పదం దీనికి మాతృక. మరాఠిలో కుందన అనీ, గుజరాతీలో కుందన్‌ అని వ్యవహరించే ఈ మాటకి ప్రాచీన కావ్యాల్లోనూ అనేక ప్రయోగాలున్నాయి. ‘‘కూర్పించె నల్లిండ్లు కుందనమున’’ అని కవిసార్వభౌముడు శ్రీనాథుడూ, ‘‘కుందనపు మెరుంగగుమ్మలును’’ అని పిల్లలమర్రి పినవీరభద్రుడూ ప్రయోగించారీ పదాన్ని. 


హంసగానం
ప్రబంధాల్లో ఎన్నో రాచకార్యాలను చక్కబెట్టిన హంస మాటకారే కాని పాడినట్టు ఎక్కడా లేదు. హంస పాడదు. ఒకవేళ పాడితే అది చావు పాటేనట. ఎవరైనా చనిపోతే హంస ఎగిరిపోయింది అంటారు. అంటే ఆత్మ హంస రూపంలో పాడుకుంటూ పరమాత్మలో కలిసిపోతుందని వ్యవహారం. హంసగానానికి మరణమనే అర్థాన్ని ఆపాదించారు మన పెద్దవాళ్లు. హంసగానం చేశారంటే వాళ్లు దీర్ఘనిద్రకు వెళ్లారని అర్థం.


చెప్పుకోండి చూద్దాం!
ఇంతంత గుడికాయ
ఈచుట్టూ గుడికాయ
చింతల్ల తోపుల్లో
బొంత మామిడికాయ
ఏమిచ్చి కొనగలరు
వెలమ దొరలు!
ఈ పొడుపుకథకి విడుపు చందమామ. గుడికాయ అంటే గుండ్రంగా ఉండే కాయ. చింతకొమ్మకి కాసిన పెద్దమామిడికాయ. కావలిస్తే అమ్మేదెవరూ! కొనేదెవరూ! ఎంతటి మారాజులైనా చూస్తూ గుటకలు మింగాల్సిందే కదా!


మిన్నులు పడ్డచోటు
ఆకాశం ఒరిగిన ప్రదేశం. బహుదూర ప్రదేశం అని అర్థం. పిట్టమనిషి కానరాని చోటు అని సామాన్యార్థం. ‘‘ఇట్లు పాఱవైచితె మిన్నులు పడ్డచోట’’ అని పెద్దన కవి ప్రయోగం. బంధువులకూ, రోజూ చేసే పనులకూ దూరంచేసి ఈ అరణ్యంలో పడదోశావా అని ప్రవరుడు బాధపడిన సంగతి మనుచరిత్రలో కథ! ‘‘బొకాలెద మిన్నులు పడ్డచోటికిన్‌’’ అని శ్రీనాథుడి ప్రయోగం. ‘మిన్ను విరిగి మీద పడ్డా సరే నేననుకున్న పని చేసి తీరతా’నన్న జనసామాన్య ప్రయోగం రూపంలో ఈ మాట కొద్ది మార్పులతో నేటికి నిలిచి ఉంది.


పొత్తం కథ
తాటాకుల గ్రంథాలు తయారు చేయడం ఒక కళ. తాటి మట్టల నుంచి ఆకులు విడిపించి, సమానంగా కత్తిరించి నీడలో ఎండించేవారు. నీడలో ఎండించడానికి సంస్కృత పరిభాష ఛాయాశుష్కం. నీడలో ఎండిస్తే పెళుసుబారవు. తర్వాత వాటిని నీటిలో గాని, ఆవు పంచితంలోగాని నానబెట్టేవారు. పిదప ఉడికించేవారు. తద్వారా ఆకులు బాగా మెత్తబడతాయి. వాటిమీద శంఖంతోనో, గవ్వలవంటి నున్నని వస్తువుతోనో రుద్దేవారు. దానితో ఆకు గరుకుదనంపోయి నునుపుదేరుతుంది. తర్వాత కొంచెం ఎడం విడిచి ఒకవైపు గానీ, రెండువైపుల గాని రంధ్రాలు చేసి దారాలతో కట్టేవారు. ఇదే గ్రంథం. గ్రంథమంటే ‘చేర్చబడింది’ అని అర్థం. సూత్రమంటే దారం. ఈ తాటాకుల్లోని దారం (సూత్రం) పూసల్లోని దారంలాగా ఆకులనూ చుట్టుకుని ఉంటుంది కదా! ఇలాగే చాలా విషయాలకు వర్తించే వాక్యం సూత్రమైంది. ఈ గ్రంథమే ప్రోతమై అంటే కూర్చబడిందై పోధీ, పొత్తమైంది. పోస్త్‌ అనే పార్శి శబ్దం నుంచి పుస్తకం అన్న మాట వచ్చిందన్నది పెద్దలమాట. 



వెనక్కి ...

మీ అభిప్రాయం

  భాషాయణం