కాకతీయ శిల్పం... అద్వితీయ వైభవం

  • 713 Views
  • 4Likes
  • Like
  • Article Share

    కె.విజయబాబు

  • చరిత్ర, పర్యాటక శాఖ ఆచార్యులు కాకతీయ విశ్వవిద్యాలయం,
  • వరంగల్‌.
  • 9440349593
కె.విజయబాబు

వేయిస్తంభాల గుడి... ఓ అద్భుతం! అంతకంటే అచ్చెరువొందించేది రామప్ప దేవాలయం! ఇక కీర్తితోరణమైతే దానికదే సాటి. ఈ నిర్మాణాలన్నీ కాకతీయ శిల్పకళా ప్రాభవానికి సజీవ సాక్ష్యాలు. వీటితోపాటు తెలుగునాట నాలుగు చెరగులా విస్తరించిన కాకతీయ కాలపు కోవెలలన్నీ ఎనలేని వారసత్వ సంపదలే. వాటి విశిష్టతల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే!
కాకతీయులు
కళలకు పట్టంకట్టారు. సంగీతం, సాహిత్యం, నృత్యం... అన్నింటినీ సమాదరించారు. ముఖ్యంగా, వాళ్ల ప్రోత్సాహంతో ప్రభవించి వికసించిన ‘కాకతీయ శిల్పం’ అయితే ఓ శిల్పరీతిగా విశిష్టమైంది. అందుకే ‘‘కాకతీయ యుగంలో సాహిత్యం వర్ధిల్లింది. సంగీతం దశదిశలా చల్లగా మారుమోగింది. ఆకాశపుటంచులపైన, కెరటాల ఒంపులమీద, దిగ్గజాల కుంభస్థలాలమీద తెలుగు గజ్జెలు నాట్యం చేశాయి. గుట్టలు గుళ్లుగా మారాయి. రాళ్లు రమణీయమైన శిల్పాలకింద జీవంపోసుకున్నాయి’’ అన్నారు ఆరుద్ర. 
      కర్ణాటకలోని బేలూరు, హలెబీడుల్లోని హోయసలుల శిల్పసంపద అపూర్వమైంది. వాళ్ల తర్వాత అంతటి శిల్పకళా చాతుర్యాన్ని ప్రదర్శిస్తూనే, తమదైన ప్రత్యేకతను నిలుపుకున్నవారు కాకతీయులు. వరంగల్లు జిల్లా కేంద్రంతోపాటు హన్మకొండ, ఐనవోలు, కొరవి, గూడూరు, ఇనుగుర్తి, కొండపర్తి, పాలంపేట, మాటూరు, పమ్మి, ముప్పవరం, చినకందుకూరు, కటాక్షపూర్, ఘనపూర్, జాకారం, మొగిలిచర్ల, రామానుజపురం తదితర ప్రదేశాల్లో కాకతీయ దేవాలయాలు ఉన్నాయి. అలాగే నల్లగొండ జిల్లాలోని నాగులపాడు, పానగల్లు, పిల్లలమర్రి, కొలనుపాక, వాడపల్లి మొదలైన చోట్లా అవి కొలువుదీరాయి. కరీంనగర్‌లోని నగునూరు, మంథని, బెజ్జంకి; మహబూబ్‌నగర్‌ జిల్లా వడ్డెమాను, భూత్‌పూర్, ఉమామహేశ్వరం; గుంటూరు జిల్లా దుర్గి, రావిపాడు, కారెంపూడి, మాచర్ల; ప్రకాశం జిల్లా మోటుపల్లి, పెదగంజాం, త్రిపురాంతకంలలోనూ కాకతీయ నిర్మాణాలు కనిపిస్తాయి. 
      ప్రాచీన ఆలయాల మాదిరిగా చారిత్రక ప్రసిద్ధమైన ప్రదేశాల్లో లేకపోవడం ఈ కాలపు దేవాలయాల ప్రత్యేకత. పాలంపేట, జాకారం, ఘనపూర్, బెజ్జంకి లాంటివి దీనికి నిదర్శనం. బహుశా శత్రువుల దాడులకు గురికాకుండా ఉండేందుకే ఇలాంటి ‘లోపలి’ ప్రాంతాల్లో నిర్మించి ఉండొచ్చు. దేవాలయ నేలమాళిగల్లో సంపదను భద్రపరచుకునే సంప్రదాయమూ ఇలాంటి ప్రాంతాల ఎంపికకు ఓ కారణం కావచ్చు. ఏది ఏమైనా నాటి రాజులు, వాళ్ల సామంతులు, దండనాయకులు యుద్ధాల్లో గెలిస్తే దేవాలయాలు కట్టించారు. విజయసూచకంగానో, పాప పరిహారార్థమో... ఎందుకోసం కట్టించినా, వాటిని అందమైన శిల్ప సంపదకు నిలయాలుగా తీర్చిదిద్దారు. వాటిలోని దేవతల పేర్లకు ముందు తమ పేర్లు చేర్చి కొలిచారు. ఉదాహరణకు రుద్రదేవ మహారాజు ప్రతిష్ఠించిన ఈశ్వరుడు రుద్రేశ్వరుడు (వేయిస్తంభాల గుడి). అలాగే, పిల్లలమర్రిలో ఎరుకసానమ్మ ప్రతిష్ఠించిన దేవుడు ఎరుకేశ్వరుడు అయ్యాడు. ఇలా ఓ వినూత్న సంప్రదాయాన్ని కాకతీయులు సృష్టించారు. 
మత సామరస్యామే పునాది
ఆనాటి సమాజంలో శైవ వైష్ణవ విభేదాలు ఎక్కువగా ఉండేవి. వాటిని తొలగించడానికి చాలామంది కవులు ప్రయత్నించారు. తిక్కన హరిహరనాథ తత్త్వం, పోతన శ్రీనాథాది కవుల రచనల్లోని అద్వైత భావనలన్నీ మత సామరస్యంకోసం చేసిన ప్రయత్నాలే. కాకతీయ ప్రభువులు కూడా శైవ, వైష్ణవాలయాలను ఒకే ప్రాంగణంలో నిర్మించారు. హన్మకొండ వేయిస్తంభాల గుడి ప్రాంగణంలో రుద్రేశ్వర, వాసుదేవ, సూర్యదేవ ఆలయాలను ఒకే పునాది మీద కట్టారు. ఇలాంటి త్రికూట ఆలయాలను కాకతీయులు విరివిగా నిర్మించారు. ఈ ఆలయాల్లోని మూడు గుడుల మధ్య మూలాలను మూసి వేయకపోవడం ఓ విశేషం. దీనివల్ల ఆలయంలోకి గాలి, వెలుతురు ధారాళంగా వస్తాయి. 
      ఉత్తర, దక్షిణ భారత దేవాలయ నిర్మాణ శైలుల మిశ్రమమైన ‘వేసర’ రీతిని కాకతీయ శిల్పులు అనుసరించారు. కఠినమైన నల్లరాతి మీద మనోహర శిల్పాలు చెక్కారు. వాటికి అద్దాల మెరుపును సాధించారు. ఆలయ నిర్మాణంలో అక్కడక్కడా ఎర్రరాతినీ వాడారు. పాలంపేట రామప్ప దేవాలయ వెలుపలి భాగం ఎర్రరాతితో నిర్మితమైందే. అయితే ఏ దేవాలయంలోనైనా ఉత్కృష్టమైన శిల్పకళా నైపుణ్యం ప్రదర్శించాల్సి వచ్చిన చోట మాత్రం నల్లరాతినే ఎంచుకున్నారు. 
      ఆ కాలంలో నిర్మితమైనవన్నీ భారీ దేవాలయాలే. భూమి నుంచి అయిదారడుగుల ఎత్తులో ఉండే సువిశాలమైన పీఠాల మీద వాటిని నిర్మించారు. వేయిస్తంభాల గుడి, రామప్ప, పిల్లలమర్రి ఆలయాలు దీనికి నిదర్శనాలు. ఆ పీఠాలకు అనువుగా భూమిలో ఏడెనిమిది అడుగుల రాతి పునాదులు కట్టారు. వాటికింద ఇసుక పోశారు. ఈ విధానాన్ని ‘సాండ్‌ బాక్స్‌ సిస్టమ్‌’ అంటారు. ప్రస్తుతం ఆ ఆలయాలు కొంతవరకు భూమిలోకి కుంగిపోయాయి. ప్రకృతి వైపరీత్యాల వల్ల అడుగున ఉన్న ఇసుక చెదరడమే దీనికి కారణం. అయినా 800 ఏళ్లుగా నిలబడి ఉన్న అంత భారీ కట్టడాలు, బరువైన స్తంభాలన్నీ ఆనాటి నిర్మాణ కౌశలానికి అద్దంపడతాయి.
నీళ్లలో తేలే ఇటుకలు
దేవాలయాల పైకప్పులను పెద్దపెద్ద రాతి పలకలతో కప్పారు. వీటిలో ప్రత్యేకించి గోపుర నిర్మాణాలు కనిపించవు. రామప్ప గుడి విమానం నిలువు గీతలతో సాదాగా ఉంటుంది. కానీ, ఈ విమానపు ఇటుకలకు  ఎక్కువ బరువు ఉండవు. నీళ్లలో తేలియాడుతాయి. మరోవైపు, ఆ కాలపు ఆలయాల్లో గోడలకంటే స్తంభాలు ఎక్కువగా కనిపిస్తాయి. వేయిస్తంభాల గుడి దీనికి నిదర్శనం. అందులో స్తంభాలు నిలబెట్టిన తీరు అద్భుతం. 
      ఆ కాలపు ఆలయాల స్తంభాలన్నీ దాదాపు ఒకే పద్ధతిలో కనపడతాయి. వాటి మీది శిల్పాలంకరణలో వదిలిన ఖాళీలు సన్నని దారం పట్టేంత సూక్ష్మంగా ఉంటాయి. వీటినిబట్టి నాటి శిల్పుల పనితీరుతోపాటు, వాళ్లు ఉపయోగించిన పనిముట్లు ఎంత సునిశితంగా ఉండేవో అర్థం చేసుకోవచ్చు. ఇక ఆ స్తంభాలమీద పెట్టిన మెరుగు వల్ల అవి ఇప్పటికీ అద్దాల్లా మెరుస్తూనే ఉన్నాయి. రామప్పగుడిలోని స్తంభాల మీద సముద్రమథనం, కోలాటం, దండలాస్యం లాంటివాటిని చెక్కారు. ఈ కోవెలతోపాటు రుద్రేశ్వరాలయంలోని రంగమండపాలు మనోహర శిల్పసంపదతో కనువిందు చేస్తాయి. ఆ మండపాల మధ్యభాగంలో కాకతీయుల అభిమాన దేవత దుర్గాదేవి (కాకతి/ ఏకవీరాదేవి), అష్టదిక్పాలకుల విగ్రహాలు కొలువుదీరాయి. అక్కడే సింహాకృతిలో త్రికోణ ఆకారంలో ఉండే నాలుగు శిలాఫలకాలను కాకతీయ చిహ్నాలుగా చెబుతారు. రంగమంటపం కిందిభాగంలో భారీ ఏకశిలతో తయారైన గుండ్రటి శిలాఫలకం ఉంటుంది. అది నృత్య ప్రదర్శనలకు రంగస్థలం. ఆ రాతిపై పడిన వెలుతురు పరావర్తనం చెంది గర్భాలయంలోకి ప్రసరిస్తుంది. 
      కాకతీయులు ప్రతిష్ఠించిన శివలింగాలన్నీ దాదాపు 8- 10 అడుగుల ఎత్తులో గంభీరంగా కనపడతాయి. పానవట్టాలు చతురస్రాకారంలో ఉంటాయి. గర్భాలయం పైకప్పుమీద ఓ చక్రాన్ని చిత్రించడం ప్రత్యేకంగా తోస్తుంది. గర్భాలయ ద్వారబంధానికి రెండువైపులా దేవతామూర్తులు, పరివార దేవతలతోపాటు చామరగ్రాహులైన పరిచారికలను చెక్కారు. ఈ విగ్రహాల చేతుల్లోని ఆయుధాలు, వాటి అలంకరణలు, ఆభరణాలు, వస్త్రధారణలు నాటి సామాజిక స్థితిగతులను ప్రతిబింబిస్తాయి. ఆ కాలపు అన్ని దేవాలయాల శిల్పాల్లో ఆనాటి ప్రజల అలంకారాలన్నీ కనిపిస్తాయి. ఆ శిల్పాల్లో ఎక్కువశాతం వాటిని వస్త్రాలతో కన్నా రకరకాల ఆభరణాలతోనే కప్పడం విశేషం. వేయిస్తంభాల గుడితోపాటు రామప్ప దేవాలయంలోని స్త్రీమూర్తులు నానాభరణ భూషితులుగా కనిపిస్తారు. చేతుల పదివేళ్లకూ పది ఉంగరాలతో పాటు రకరకాల శిరోభూషణాల ధారణ అబ్బురపరుస్తాయి. 
ఏమా జీవచైతన్యం!
వేయిస్తంభాల గుడి, రామప్ప దేవాలయ శిల్పాలతోపాటు ఓరుగల్లు కోటలోని నాట్యశిల్పాలు కాకతీయుల నృత్య కళాభిమానానికి పరాకాష్ఠ. జాయప్పసేనాని ‘నృత్త రత్నావళి’లోని కొన్ని నాట్యభంగిమలు రామప్ప దేవాలయం మీద కనిపిస్తాయి. ఆ కాలపు పేరిణి నృత్యం తిరిగి వెలుగులోకి వచ్చిందంటే కారణం ఈ ఆలయ శిల్పాలే. వీటిని పరిశోధించే ‘పేరిణి’కి ప్రాణం పోశారు ‘నటరాజ’ రామకృష్ణ. మొత్తమ్మీద దేశీ నృత్య సంప్రదాయాలను, వాటిని ప్రదర్శించిన దేశీయ కళాకారులను శిల్పాలలో చెక్కిన ఘనత కాకతీయులదే.  మరోవైపు ఆయా శిల్పాల్లో వాయిద్య కారులూ కనిపిస్తారు. వాళ్ల చేతుల్లోని వాద్య విశేషాలను బట్టి నాటి వాయిద్యాల స్వరూప స్వభావాలు తెలుసుకోవచ్చు. 
      రామప్ప దేవాలయానికి చుట్టూ ద్వారాల దగ్గర, మూలాలలోను 12 మంది సుందరీమణుల నిలువెత్తు విగ్రహాలు ఉంటాయి. స్తంభాల మధ్యభాగం నుంచి పైకప్పు వరకు ఊతగా ఉండేటట్లు వాటిని ఏర్పాటుచేశారు. ఈ శిల్పాలను అలంక రించిన తీరు, కేశాలంకరణలు దేనికదే వైవిధ్యంగా ఉంటాయి. ఒక నర్తకి చెవులకు అందమైన కమ్మలు, మరొక నర్తకికి ఎత్తయిన పాదరక్షలు, ఇంకో నర్తకి మెడలో చక్కటి మణిహారం కనిపిస్తాయి. ఒక నర్తకి జలపోసనాలతో అల్లిన పలుచని పావడా ధరించి ఉంటుంది. మరో నర్తకి కటి వస్త్రాన్ని ఓ కోతి లాగేస్తుంటే, ఆమె ముఖంలో వ్యక్తమైన హావభావాలను సైతం ఆ రాతిలో చక్కగా పలికించారు శిల్పులు. ఈ నర్తకీమణుల విగ్రహాలు త్రిభంగ ముద్రలో ఉంటాయి. అంటే వాటి తల, నడుము, కాళ్లు వ్యతిరేక దిశలలో కొద్దిగా వంగి ఉంటాయన్నమాట. దీంతో వాటిలో సహజ సౌందర్యం ప్రతిబింబిస్తుంది. మొత్తం కాకతీయ శిల్పాలన్నీ జీవచైతన్యంతో అలరారుతాయి. దేవతలు, నర్తకీమణులు, చామరగ్రాహులు... ఏ మూర్తులైనా సరే కదలికను సూచించే భంగిమల్లోనే కనిపిస్తాయి. అలాగే, ఆయా దేవాలయాల నిర్మాణం మీద హోయసల శిల్పకళా ప్రభావం కనిపిస్తుంది. అందమైన లతలు, ఏనుగులు, సింహాల వరసలు, చిన్న చిన్న బొమ్మలు వంటి వాటిలో ఇది మరింత స్పష్టంగా కళ్లకు కడుతుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకునే చలసాని ప్రసాదరావు తన ‘కాకతీయ శిల్పం’లో నాటి శిల్పుల పనితనం గురించి చెబుతూ ‘‘బౌద్ధయుగ శిల్పాలలోని నిరాడంబర రూపనిర్మాణాన్ని, ఆ శిల్పాలలో ప్రత్యక్షమయ్యే జీవచైతన్యాన్నీ స్వంతం చేసుకుంటూనే, హోయసల శిల్పంలోని అలంకరణా ప్రాధాన్యతనూ గుర్తించి తమ స్వంతమనదగిన నూతన శైలిని ఈ శిల్పులు రూపొందించుకుని దానికొక ప్రామాణికతను సాధించారు’’ అన్నారు. 
శిలలా! లోహాలా!
కాకతీయుల శిల్పకళ అనగానే అందరికీ గుర్తుకు వచ్చేది కాకతీయ ద్వార(కీర్తి) తోరణం. ఓరుగల్లు కోటలో ఉన్న ఈ నాలుగు ద్వారాలను పెద్దపెద్ద శిలలతో, ముప్ఫై, నలభై అడుగుల ఎత్తులో నిర్మించారు. ఇక కాకతీయ శిల్పులు రూపకల్పన చేసిన ‘నంది’ అత్యద్భుతం. వేయిస్తంభాల గుడి, రామప్ప దేవాలయాల్లోని నందుల హుందాతనం చూపు తిప్పుకోనివ్వదు.  
      కొన్ని కాకతీయ దేవాలయాల్లో 25-30 అడుగుల ఎత్తయిన ఏకశిలా ధ్వజస్తంభాలు ఉంటాయి. సిద్ధేశ్వర, పాంచాల రాజస్వామి ఆలయాల్లో వీటిని చూడవచ్చు. వాటిమీద ఓ రాతిచక్రం, దానిమీద చతురస్రాకార మండపం, అందులో ఓ చిన్ననంది విగ్రహం కనిపిస్తాయి. వాటిమీద దీపాలు పెట్టేవారు. అందుకే వాటిని ‘దీపస్తంభాలు’, ‘నందిస్తంభాలు’ అని పిలుస్తారు. 
      కాకతీయ శిల్పాలన్నింటిలోకి ప్రత్యేకమైనవి లోహపు శబ్దాన్నిచ్చే శిలలు. ఇవి ఓరుగల్లులోను, రామప్పలోను కనిపిస్తాయి. కోటలోని స్వయంభూ దేవాలయంలోని నందుల్ని తడితే లోహపు శబ్దం వచ్చేదట! ఈ అపూర్వ ఆలయం మన దురదృష్టం కొద్దీ శిథిలమైంది. అలాగే, రామప్ప దేవాలయ ద్వారబంధం పక్కన ఉండే శిల్పాలను మీటినా లోహపు శబ్దం వస్తుంది. ఘనపురంలో ‘కోటగుళ్లు’గా వ్యాప్తిలో ఉన్న కోవెల శిల్పాలూ మనోహరంగా ఉంటాయి. ఇక్కడి మదనికలు పరిపూర్ణ స్త్రీత్వంతో ప్రౌఢలుగా దర్శనమిస్తారు. రామప్ప దేవాలయ మదనికలు సన్నగా, నాజూకుగా యువతులుగా కనిపిస్తారు.  
సమాజానికి ప్రతిబింబాలు
కాకతీయులు ఉదారమైన విధానాలను పాటించారు. సమాజంలోని వివిధ వృత్తులవాళ్లని, వారివారి ప్రత్యేకతలను బట్టి గౌరవించారు. శిష్ట కళలతోపాటు, జానపద కళారూపాలనూ ఆదరించారు. ఫలితంగా ఆలయాల నిర్మాణంలో శిల్పకారులు వివిధ కథావస్తువులు, అంశాలు ఎన్నుకున్నారు. బౌద్ధ, జైన, శైవ, వైష్ణవ సిద్ధాంతాలకు అనుగుణంగా పురాణగాథలు, జానపదుల జీవన నేపథ్య దృశ్యాలను ఆలయాల గోడలమీద చెక్కారు. క్షీరసాగర మథనం, రామాయణ గాథలు, శివలీలలు, శ్రీకృష్ణలీలలు, బౌద్ధ, జైన, శైవ యోగుల, సిద్ధుల ప్రతిమలను కొలువుదీర్చారు.   
      నాటి సామాజిక, ఆర్థిక జీవన సరళిని ప్రతిబింబించే రీతిలో శిల్పాలను చెక్కడం కాకతీయ శిల్పరీతిలోని ప్రత్యేక లక్షణం. ఆభరణాలు, బట్టల్లో వివిధ ఆకృతులు, ఎత్తుమడమల చెప్పులు, శిరోభూషణాలు, కేశాలంకరణలు, వివిధ పనుల్లో మునిగిపోయిన స్త్రీపురుషులు... ఇలా ప్రతి శిల్పమూ ఓ అనర్ఘరత్నమే. ఇక కాకతీయులు అనుసరించిన జలసంరక్షణ పద్ధతులు, తవ్వించిన చెరువులు లోకప్రసిద్ధాలు. వాటివల్ల సామ్రాజ్యం సుభిక్షమైంది. దీనికి సంకేతంగా జలచరాలు, పద్మాలను ఎక్కువగా చిత్రీకరించారు. ‘‘నాట్య శిల్పాలు, సంగీత శిల్పాలు, చిత్రవిచిత్ర పరిష్వంగాలలో మునిగి తేలే ప్రేయసీ ప్రియులు, ఇత్యాది శిల్పాలు ఆనాటి సుసంపన్నమైన సామాజిక పరిస్థితులకు దర్పణం పడుతున్నాయి. అంతేకాదు ప్రముఖంగా పౌరాణిక గాథలు, స్త్రీమూర్తి శక్తి సామర్థ్యాలు, జల సమృద్ధి సాధన వల్ల కలిగే లాభాలు, ప్రకృతిపైన, సమాజంపైనా దాని ప్రభావం, జలాశయ పరిరక్షణ మొదలైన అంశాలకు పవిత్రతను, ఆధ్యాత్మికతను జోడించి, సామాన్యులకు విజ్ఞానాన్ని అందించే దృశ్యపాఠాలుగా ఈ శిల్పాలు కనిపిస్తాయి’’ అంటూ కాకతీయ శిల్పం గురించి ఆచార్య వి.కామేశ్వరరావు చెప్పిన మాటలు అక్షరసత్యాలు.
      కాకతీయులు సమర్థమైన, పటిష్ఠమైన పరిపాలనా వ్యవస్థలను ఏర్పరచి ప్రజారంజకమైన పాలనను అందించారు. భిన్నమతాలు, శాఖలు, వర్గాల మధ్య సమభావానికి, సద్భావనకు కృషి చేశారు. కాకతీయుల ఆలయాలు బహుదేవతలకు నిలయాలై, భిన్నవర్గాలను ఏకం చేసే సందేశాన్ని అందించాయి. వర్గాల మధ్య పరస్పర గౌరవాన్ని పెంపొందించడానికి ఇవి ప్రధానకేంద్రాలుగా పనిచేశాయి. నాటి ప్రజల సామాజిక, సాంస్కృతిక జీవనానికి అద్దంపట్టేలా నిర్మితమైన వాటి నిర్మాణకౌశలం, కాకతీయ శిల్పుల అత్యున్నత కళాభినివేశాన్ని ప్రతిబింబిస్తాయి. సాంస్కృతిక, విద్యాకేంద్రాలుగా ప్రజలకు మార్గనిర్దేశనం చేసిన ఈ ఆలయాలు చాలా విశిష్టమైనవి. ఇవి ఏదో ఓ మతానికి పరిమితమైనవి కావు. జాతి వారసత్వ వైభవానికి పెట్టనికోటలివి. చరిత్ర మిగిల్చివెళ్లిన విశిష్ట సంపదలివి. వీటిని కాపాడుకోవడం అంటే మనల్ని మనం గౌరవించుకున్నట్లే.


వెనక్కి ...

మీ అభిప్రాయం