జనచేతన జయకేతన విమలకాంతిలో

  • 289 Views
  • 0Likes
  • Like
  • Article Share

    సాహితీసుధ

చాలీచాలని తిండితో, సరిపోని శక్తితో ఆరుగాలం చెమటోడ్చే బడుగు జీవులే ఈ దేశ ప్రగతి రథచక్రాలు. సమస్త వృత్తుల వాళ్ల రెక్కల కష్టమే ఈ దేశ సౌభాగ్యానికి ఆధారం. అలాంటి వారెందరో తమ కష్టం చేతికొచ్చి కలలు పండే నవయుగం ఇక ఎంతోదూరంలో లేదనే నమ్మకంతో పోరాట బాట పట్టారు. ఇక రాబోయేది శ్రమైక రాజ్యం.. అందులో శ్రామికుడే మకుటధారి.. దోపిడీకి గురయ్యేవాడు ఏదో ఒకనాడు తిరగబడతాడనీ, తన హక్కుల సాధనకు ఉద్యమిస్తాడనే సత్యాన్ని చరిత్రలో అనేక శ్రామిక పోరాటాలు నిరూపించాయి. తెలుగు చలనచిత్ర గీతాలూ ఈ కార్మికోద్యమ గళాలకు ప్రతిధ్వనులయ్యాయి.
‘‘ధనికస్వామికి దాస్యం చేసే/ యంత్రభూతముల కోరలు తోమే/ కార్మిక వీరుల కన్నుల నిండా/ కణకణ మండే/ గలగల తొణికే/
విలపాగ్నులకు, విషాదాశ్రులకు/ ఖరీదు కట్టే షరాబు లేడోయ్‌’’ అంటూ ‘మహాప్రస్థానం’లో శ్రామికుల పక్షాన నినదించారు శ్రీశ్రీ. సృష్టికి మూలం శ్రమే. ఈ చరాచర జగత్తు అంతా మానవ శ్రమ మూలంగా ఏర్పడిందే. పోరాడితే పోయేదేమీలేదు.. బతుకులు మారతాయి.. జీవన పరిస్థితులు మెరుగుపడతాయి.. నవతరాలకి సరికొత్త జీవన మార్గాలు తెరచుకుంటాయి.. ముందు తరాలు వెనకబడిపోకూడదని, హక్కులను కోల్పోకూడదనే ఎందరో కార్మికులు తెగించి పోరాడారు. వారు సాధించిపెట్టిన హక్కులను వృథాగా పోనివ్వబోమని నినదిస్తూ ‘చీమలదండు’ చిత్రంలో గద్దర్‌ రాసిన ఈ పాట కర్తవ్యాన్ని గుర్తుచేస్తుంది..
శ్రమజీవుల హక్కులకై
అశువులు బాసిన అమరులారా!
అందుకోండి అరుణారుణ వందనాలు
మీ త్యాగఫలం మీ కర్మఫలం వృథాకానియ్యం
ఎర్రజెండా సాక్షిగా...

      హక్కులు ముష్టెత్తుకుంటే రావని, పోరాడి సాధించుకోవాలనే నినాదంతో ఆనాటి భూర్జువా వ్యవస్థపై కార్మికులు ఐక్య పోరాటాలు చేశారు. దోపిడీ పీడనలకు వ్యతిరేకంగా అన్ని వర్గాల ప్రజలనూ సమైక్యపరచి ఉద్యమించారు. ఈ పోరాటాలన్నీ కార్మికుల రక్తంతో తడిసినవే. అలా శ్రమజీవుల రుధిరంతో తడిసి ఎగసినదే మేడే జెండా. ప్రపంచ కార్మికుల ఆకాంక్షలను నినదించే ఎజెండా. గుండె నెత్తురులు తర్పణ చేస్తూ ముందుకుసాగిన ఈ శ్రమవీరుల అసలు లక్ష్యమేంటో ‘ఎర్రమల్లెలు’ చిత్రంలో అదృష్టదీపక్‌ రాసిన పాట కళ్లకు కడుతుంది.
అన్యాయం అక్రమాలు దోపిడీలు 
దురంతాలు 
ఎన్నాళ్లని ఎన్నేళ్లని నిలదీసినదీ రోజు
అణగారిన శ్రమశక్తిని ఆవేశం 
ఊపిరిగా 
కదిలించినదీ రోజు
రగిలించినదీ రోజు..
అంటూ కదిలే ఎర్రసైన్యానికి కవాతు నినాదం వినిపించారు కవి. అన్ని విప్లవాలనూ ప్రభావితం చేసిన మేడే, కార్మికులకు ఒక స్పష్టమైన పోరాట సంప్రదాయాన్ని ఏర్పరచింది. 1886లో చికాగోలో కార్మికుల వీరోచిత పోరాటాల ఫలితంగా ఎనిమిది గంటల పనిదినం అమల్లోకొచ్చింది. అయితే ఈ మార్పు అన్నిచోట్లా ఆశించినంత స్థాయిలో రాలేదు. అసంఘటిత రంగాల్లో స్త్రీలూ, బాలకార్మికులూ పది నుంచి పన్నెండు గంటల వరకూ పనిచేస్తున్నారు. కార్మిక చట్టాలకు తూట్లుపొడుస్తూ యాజమాన్యాలు శ్రమదోపిడీని యథేచ్ఛగా కొనసాగిస్తున్నాయి. సమాన పనికి సమానవేతనమనే ప్రతిపాదన చెత్తబుట్టలోకి వెళ్లిపోతోంది. శ్రామిక జన సంక్షేమాన్ని నిలువునా పాతరేస్తున్న ఈ పరిస్థితులను అన్నిరంగాల కార్మికులకు తెలియజెప్పి, జనచేతన దిశగా మేడే చైతన్యబావుటా ఎగరేసినప్పుడే.. నాడే ఆనాడే మహోదయం వెల్లివిరుస్తుందంటారు ‘ఈనాడు’లో శ్రీశ్రీ..
విభేదాల విషాదాల తుది సమాధి ఈనాడే
మానవతకు సమానతకు తొలి పునాది 
ఈనాడే
జనచేతన జయకేతన విమల కాంతిలో
దేశమాత హర్షించే ఘర్షణ నేడే సంఘర్షణ ఈనాడే
అంటూ ఉద్యమించే సమయం ముందున్నప్పుడు పోరుకి సన్నద్ధం కావాలనీ, నిజాన్ని నిగ్గదీసి నిర్భయంగా ప్రశ్నించాలనీ ప్రబోధించడం ఈ పాటలో కనిపిస్తుంది. ‘‘ఒదిగి ఒదిగి బడుగు జనం పడి ఉండేదానాడు/ ఎదురుతిరిగి నిగ్గదీసి ప్రశ్నించేదీనాడు’’ అనే అనుపల్లవితో సాగే ఈ పాట కార్మిక జన లోకానికి స్ఫూర్తిమంత్రం లాంటిది. 
దుఃఖానికి కారణం దోపిడీ
చేసిన ఉత్పత్తికి తగిన వేతనం పొందలేనప్పుడు, శ్రమ నిష్ఫలమైనప్పుడు.. జరుగుతున్న దోపిడీని శ్రామికులు పసిగడతారు. ఈ దోపిడీ విభిన్న రూపాల్లో సమాజాన్ని ఓ జాఢ్యంలా పట్టిపీడిస్తోందని తెలుసుకుంటారు. బీడీ, రిక్షా కార్మికులు, రైతుకూలీలు, నేతపనివాళ్లు, కల్లుగీత, పారిశుద్ధ్య కార్మికులు, స్వర్ణకారులూ, చర్మకారులూ, సన్నకారు చిన్నకారు రైతులూ, భవన నిర్మాణ కార్మికులూ.. ఇలా సకల వృత్తుల వారి బాధలు వర్ణింపరానివనీ.. ముఖ్యంగా భవన కార్మికుల దుర్భర జీవనాన్ని ఈ పాటలో ఇలా బొమ్మకట్టించారు రచయిత. 
బండచాకిరీ చేసి ఒళ్లంతా గుల్లయితే
బతుకును బండలు చేసీ బంగళాలే నువు 
కడితే
అంటరానివాడవనిరి... ఇంటిలోకి రాకనిరి
ఊరవతల నీ బతుకుకు గుడిసె వచ్చెనా
ఈ గవర్నమెంటు ఆ గుడిసెను పీకవచ్చెనా  

      ఇది చారిత్రక వాస్తవం. చెమటోడ్చి ప్రపంచానికి భోజనం పెట్టేవాడికి భుక్తి దొరకడం లేదనే జాషువా మాట ఈనాటిది కాదు. పనికి తప్ప కడుపునిండా తిండికి నోచుకోని ఆగర్భదరిద్రుల తరతరాల పీడనకి నిలువుటద్దం ఈ పాట.
లోకంలో దుఃఖానికి కారణం దోపిడీనే అంటారు మార్క్స్‌. దోపిడీని సహించడమంటే బానిస తన సంకెళ్లను కళ్లకద్దుకున్నట్టే. ఉన్న స్థితి నుంచి మెరుగైన స్థితికోసం పోరాడాలి. చావైనా బతుకైనా అనుకున్నది సాధించుకునేందుకు తెగించాలనేది సామాన్యుడి లక్ష్యం కాగలిగినప్పుడే పోరాట మందారాలు మరిన్ని వికసిస్తాయి అని చెబుతారు జాలాది.
మడుసులను చంపోల్లే మారాజులయ్యేనా
మారాడలేనోళ్లు నోరున్న మూగోళ్లు
నేరత్తులయ్యేనా
తలరాతల తరబడి ఈ బతుకింతేనా
తెల్లారని చీకటిలో సెరలింతేనా
ఎదిరించే సూరీడే ఉదయించేనా
ఈ ఎర్రని మందారాలను బతికించేనా!

      సమరశీల చైతన్యమే ఊనికగా తమపై సాగుతున్న దోపిడీ పీడనలను గుర్తించే వర్గంగా కార్మిక వర్గం ఏదో ఒక స్థాయిలో తన ప్రతిఘటనను ప్రదర్శిస్తూనే ఉంటుంది. 1950-60 మధ్య సమ్మెలూ పోరాటాలూ చెదురుమదురుగా కొనసాగేవి కాస్తా ఎనభై దశకంలో తీవ్రరూపం దాల్చాయి. అయితే.. తమ వ్యక్తిగత స్వార్థం కోసం జనజీవనాన్ని స్తంభింపజేసే వర్గాలూ అప్పుడే తయారయ్యాయి. రాజకీయ ప్రేరణలతో వీరు చేసే బందుల వల్ల ప్రజలకు కలిగే ఇబ్బందులేంటో చెబుతూ వంగపండు రాసిన ఈ పాట ఈనాటికీ సమాజాన్ని హెచ్చరిస్తూనే ఉంది.
బందులొస్తె పండగంట కొంతమందికి
మందిసొమ్మ కొల్లగొట్టి మెక్కడానికి
బందులంటే ఇబ్బందులే
సందుసందున రాబందులే
గూండా నాయాళ్లు రౌడీ రాయుళ్లు
జెండాలు పట్టి దండుకునేటందుగా..

      నిజానికి బంద్‌ అంటే అన్యాయానికి వ్యతిరేకంగా ప్రజలు ఆ ఒక్కరోజు పనులు మానుకుని ప్రభుత్వానికి తమ అసమ్మతిని తెలియజేయడం. స్వచ్ఛందంగా పాటించే సహాయనిరాకరణ. రెక్కల కష్టం తప్ప ఏ ఆస్తిపాస్తులూ లేని కార్మికుల హక్కులకు ప్రతిబంధకం ఏర్పడినప్పుడు జరిపే బందుల పట్ల ప్రజలకు సానుభూతి ఉంటుంది. 
సంఘటిత పోరాటాలే శరణ్యం
పెట్టుబడికి కులం లేదు. మతం లేదు. ప్రాంతం లేదు. దేశకాల సరిహద్దులు లేవు. బహుళ కంపెనీల లక్ష్యం లాభాల కోసం వేట. ఆ క్రమంలో అవి అనేక అడ్డదార్లు తొక్కుతాయి. అయితే.. స్పష్టమైన పోరాట లక్ష్యం ఉన్నప్పుడు ఎలాంటి సంక్షోభమూ ఏం చేయలేదనీ.. సరికొత్త పోరాటం దిశగా సాగిపొమ్మని చెప్పే ‘మహాప్రస్థానం’ చిత్రానికి శ్రీశ్రీ రాసిన ఈ పాట కార్మికుల జీవితాల్లో కొత్త ఆశాకిరణాలను ప్రసరింపజేస్తుంది. ‘‘శక్తికోసమే నడూ యుక్తికోసమే నిలు..’’ అంటూ సాగే ఈ పాటలో...
వేగుచుక్క వెలిగె మింటిపై
వెలుగురేఖలవిగో కంటివా
ఉదయమెంతో లేదు దూరమూ
వదలిపోవు అంధకారమూ
జీవితాశలే భావి జాడలోయ్‌
ప్రగతి మార్గ మెన్నుకున్న బాటసారివై
అని, బతుకులో వెలుగు కోసం, మెతుకులు దొరికే తెరువు కోసం రెక్కలకష్టం తోడుగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగిపొమ్మనే హితోక్తి వినిపిస్తుంది.
      అప్పట్లో నవంబరు విప్లవం జాతీయోద్యమానికే కాక భారత కార్మికోద్యమానికీ ఒక ఉన్నత లక్ష్యాన్ని చూపెట్టింది. అఖిల భారత ట్రేడ్‌ యూనియన్‌ కాంగ్రెస్‌ ప్రథమ సమావేశానికి అధ్యక్షత వహించిన లాలా లజపతిరాయ్‌ ‘‘సామ్రాజ్యవాదం, సైనికతత్వం పెట్టుబడిదారి విధానపు కవల బిడ్డలు. వాటికి విరుగుడు ఈ మధ్యనే కనుగొనబడింది. అదే సంఘటిత కార్మికోద్యమం’’ అని చెప్పారు. అయితే.. దేశ ప్రగతిని అడ్డుకుంటున్న పేదరికం, నిరుద్యోగం వంటి సమస్యలు సమసిపోయే రోజు ఏనాడూ! అని ప్రశ్నించేవాళ్లే గాని సంఘటితంగా పోరాడే పరిస్థితులు కనిపించడం లేదంటూ ‘ఎర్రమల్లెలు’ చిత్రానికి ప్రభు రాసిన ‘‘నాంపల్లి టేసనుకాడి రాజాలింగో...’’ పాట ఇప్పటికీ ఈ దేశ బతుకుచిత్రాన్ని కళ్లకు కడుతుంది
తిందామంటే తిండీ లేదు
ఉందామంటే ఇల్లే లేదు
చేద్దామంటే కొలువూ లేదు
పోదామంటే నెలవూ లేదు 

      దోపిడీ అనేది చరిత్రలోనే మిళితమై ఉందంటారు డి.డి.కోశాంబి. అనేక సంఘటనల క్రమమే చరిత్ర అనుకుంటే పొరపాటు, ఉత్పత్తి శక్తుల్లోనూ ఉత్పత్తి సంబంధాల్లోనూ క్రమానుసారంగా వచ్చే మార్పులను క్రమానుగతంగా వివరించడమే చరిత్ర అని అంటారాయన. ఈజిప్టు పిరమిడ్లు, తాజ్‌మహల్‌ వంటి చలువరాతి కట్టడాలు, చైనా మహాకుడ్యం ఇవన్నీ ఆనాటి పాలకవర్గాలు కట్టగలిగారంటే ఎంత శ్రామిక శక్తి అవసరమై ఉంటుందీ! తాజ్మహల్‌ నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలెవ్వరు! అని శ్రీశ్రీ ప్రశ్నించినట్టుగానే కడుపుకాలే కష్టజీవులు ఒడలు విరిచీ గనులూ తొలచీ/ చెమట చలవను చేర్చి రాళ్లను తీర్చినారు తెలుసుకో అంటారు ‘తోడికోడళ్లు’ చిత్రంలో ఆత్రేయ.
      అసలు ఎందుకు పోరాడాలీ అంటే బతికే హక్కు కోసం. సామాజిక, ఆర్థిక సుస్థిరత కోసం. కోల్పోతున్న, పొందుతున్న వాటి మీద స్పష్టత కలగాలంటే పోరాడాలి. అప్పుడే శ్రమజీవుల బతుకులు తెరిపిన పడతాయి. కష్టం చేతికొచ్చి కార్మికుల ఆకాంక్షలు నెరవేరతాయి. 


వెనక్కి ...

మీ అభిప్రాయం