‘ప్రాగ్వి పశ్చిన్మతంబున/ రసము వేయిరెట్లు గొప్పది... నవకథా ధృతిని మించి’’ అన్నారు, తెలుగులో తొలి జ్ఞానపీఠ పురస్కార గ్రహీత కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ. ఆహారపదార్థాల్లో వినియోగించే రసమే అసలు సిసలు రసం అనేవాళ్లను మినహాయిస్తే ఒక లెక్కప్రకారం రసాలు తొమ్మిది. ఇవి నవరసాలుగా ప్రతీతి. అవి.. శృంగారం, హాస్యం, కరుణం, రౌద్రం, వీరం, భయానకం, బీభత్సం, అద్భుతం, శాంతం. వీటిలోని ఎనిమిది రసాలకు భరతమహర్షి నాట్యశాస్త్రంలో భావాలు రాశాడు. రతి, హాస్యం, శోకం, క్రోధం, ఉత్సాహం, భయం, జుగుప్స, విస్మయం! వీటిలో శృంగార పురుషుణ్నే రసికుడంటారు. దీన్ని బట్టి శృంగార రసం ఒక్కటే రసం అనుకోవాల్సి వస్తుంది. బీభత్సరసమూ రసమేగా! భయానక రసమూ రసమే. హాస్య రసమూ రసమేగా. శాంత రసమూ రసమే! మరి ఈ రసాలు ఉన్నవాళ్లను రసికులు అనరేం? ఎంత అన్యాయం!
ఇవన్నీ ఎలా ఉన్నా శృంగార హాస్యరసాలు అగ్ర రస స్థానానికి పోటీపడుతుంటాయి. ఈ రెండు రసాల మంచి చెడులను విశ్లేషిస్తే నా సామిరంగా ఇలా ఉంటుంది ‘విచిత్రంగా’!
శృంగారం ప్రాణుల పుట్టుకకు కారణమవుతుంది కాబట్టి అది గొప్పరసమని కొందరు వాదిస్తారు. కానీ శృంగారం ప్రాణుల పుట్టుకకు కారణమే గానీ ప్రాణులు సుఖంగా ఉండటానికి అది కారణం కాదు. బ్రహ్మచారి పెళ్లి కాలేదని ఏడుస్తుంటే, వివాహితుడు పెళ్లయిందని ఏడుస్తుంటాడు. రెండింటిలోనూ ఏడుపు ఒక్కటే. కారణాలే వేరు.
శృంగారం మితిమీరితే ఎయిడ్స్ సమస్య ఉండవచ్చు. పోలీసు రెయిడ్స్ సమస్య కావచ్చు. కానీ హాస్యం ఎంత హద్దుమీరినా సమస్యేమీ ఉండకపోవచ్చు. శృంగారం చట్టపరంగానూ, నైతికపరంగానూ భార్యభర్తలకే పరిమితం. ఇతరులకు ఆమోదయోగ్యం కాదు. హాస్యం భార్యభర్తలతో సహా అన్ని బంధుత్వాలు ఉన్నవాళ్లు హాస్యరసాన్ని అనుభవించవచ్చు. శృంగారం యవ్వనంలో మాత్రమే ఉపయోగపడుతుంది. బాల్యంలో పనికిరాదు. వృద్ధాప్యంలో అంతకుమించి పనికి రాదు. హాస్యం ఏ వయసు వారికైనా పనికొస్తుంది. ఆనందించగలిగిన మనసు ఉంటేచాలు. జీవితాంతం ఆనందించవచ్చు. ఆబాలగోపాలానికి అవసరమైన రసం ఇది. సంతోషం సగంబలం అంటారు. ఆ సంతోషానిచ్చేది హాస్యరసమేగా!
శృంగారానికి వృద్ధి చేసేది.. ఎక్కువ అనుకూలమైంది ప్రధానంగా శీతకాలం. హాస్యానికి ఏకాలమైనా ఫర్వాలేదు. దీనికి ఒక కాలమంటూ లేదు. శృంగారం రాత్రి కార్యక్రమంగా ముద్ర వేసుకుంది. కానీ హాస్యం అలాంటిది కాదు. పండు వెన్నెల్లో అయినా, మండుటెండల్లోనైనా అహోరాత్రులూ హాస్యం ఒకలాగే ఉంటుంది. శృంగారానికి ఎడం ఉంటుంది. హాస్యం నిరంతరాయంగా ఉంటుంది. శృంగారానికి ‘సామాజిక దూరం’ అవరోధం. హాస్యానికి ఎలాంటి ‘లాక్డౌన్లు’ ఏవీ ఉండవు. మనుషులు దూరంగా ఉంటూనే నవ్వులు పంచుకోవచ్చు.
ఈ కారణాల వల్ల హాస్యానిది నవరసాల్లో మొదటి స్థానమని పళ్లికిలించేవాళ్లు వాదిస్తుంటారు. కానీ తరచి చూస్తే నవరసాల దేముంది? అన్నిటికీ మించిన రసం ఒకటుంది. దానిపేరే నీరసం! ఏ రసం ఎక్కువ అనుభవించినా చివరికి వచ్చేది నీరసమే.. దానికి మించింది ఏముంది? అందువల్ల రసరాజు నీరసమే.
నీరసమూ జిందాబాద్.