ఆంగ్ల మాధ్యమం జీవోలు రాజ్యాంగ విరుద్ధం

  • 404 Views
  • 25Likes
  • Like
  • Article Share

ప్రభుత్వ పాఠశాలల్లో 1వ తరగతి నుంచి 6వ తరగతి వరకు తెలుగు మాధ్యమం స్థానంలో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టేందుకు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవోలను హైకోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. ప్రభుత్వ నిర్ణయం రాజ్యాంగ నిబంధనలు, విద్యా హక్కు చట్టం, సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా ఉన్నాయని తేల్చి చెప్పింది. జాతీయ విద్యా విధానం, వివిధ కమిషన్ల నివేదికలు, స్వాతంత్య్రానికి ముందు, తర్వాత పరిస్థితులను పరిశీలించాక ఒకటో తరగతి నుండి 8వ వరకు విద్యా భోధన మాతృభాషలో ఉండాలని స్పష్టం చేసింది. ఆంగ్ల మాధ్యమంలో బోధన కోసం ప్రభుత్వం జారీ చేసిన 81, 85 జీవోలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మాధ్యమాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని స్పష్టం చేసింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ ఎన్‌.జయసూర్యతో కూడిన ధర్మాసనం బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ మేరకు కీలక తీర్పు ఇచ్చింది. 2020-21 విద్యా సంవత్సరం నుంచి.. 1 నుంచి 6వ తరగతి వరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆంగ్లమాధ్యమం ప్రవేశపెట్టేందుకు గత నవంబర్లో రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన 81, 85 జీవోలను సవాలు చేస్తూ... అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ గుంటుపల్లి శ్రీనివాస్, భాజపా ఏపీ ముఖ్య అధికార ప్రతినిధి, సామాజిక ఉద్యమకారుడు సుధీష్‌ రాంబొట్ల హైకోర్టులో వేర్వేరుగా ప్రజాహిత వ్యాజ్యాలు దాఖలు చేశారు. వాటిపైనే హైకోర్టు తన నిర్ణయాన్ని వెల్లడిస్తూ 92 పేజీల తీర్పు ఇచ్చింది.
      ‘‘మొదటి జాతీయ విద్యా విధానం ప్రకారం పాఠశాల విద్యార్థులకు మాతృభాషలో బోధనే సరైనదని గుర్తించారు. అధికరణ 19(1) భావవ్యక్తీకరణ, వాక్‌ స్వాతంత్య్రం కల్పిస్తోంది. విద్యాభ్యాసం అందులో అంతర్గతంగా ఉంది. మాతృభాషలో లేదా గుర్తించిన భాషల్లో మాధ్యమాన్ని ఎంపిక చేసుకునే హక్కు అధికరణ 19(1)(ఏ) కల్పిస్తోంది. వృత్తిని, వ్యాపారాన్ని ఎంచుకునే హక్కును రాజ్యాంగం కల్పిస్తోంది. ప్రభుత్వం జీవో జారీచేయడం ద్వారా అన్ని పాఠశాలల యాజమాన్యాలు మాధ్యమాన్ని ఆంగ్లంలోకి మార్చాలని చెప్పడం అధికరణ 19(1)(జీ)ని ఉల్లంఘించడమే. అధికరణ 21 ప్రకారం వ్యక్తిగత స్వేచ్ఛను నిరాకరించడానికి వీల్లేదు. వ్యక్తిగత స్వేచ్ఛ, జీవించే హక్కులో విద్యా హక్కు ఇమిడి ఉందని ఇదివరకే సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. పాఠ్యాంశాల్ని(సిలబస్‌), మాధ్యమాన్ని నిర్ణయించే    అధికారం విద్యా హక్కు చట్టం ప్రకారం ఎన్‌సీఈఆర్‌టీ, ఏపీ విద్యా చట్టం-1982 ప్రకారం ఎస్‌సీఈఆర్‌టీకి ఉంటుంది. మాధ్యమాన్ని మార్చే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు.  పిల్లల్ని ఏ మాధ్యమంలో చదివించుకోవాలో నిర్ణయించుకునే హక్కు తల్లిదండ్రులకు ఉంటుంది. పేరెంట్్స అసోసియేషన్ల ఆకాంక్ష మేరకు మాధ్యమాన్ని మార్చడానికి వీల్లేదు. ఆ విధంగా మార్చొచ్చని చట్టాలు, నిబంధనలు కానీ లేవు. ఒక్కసారిగా అన్ని పాఠశాలల యాజమాన్యాలను ఆంగ్ల మాధ్యమంలోకి బోధనను మార్చాలనడం వారి ప్రాథమిక హక్కుల్ని ఉల్లంఘించడమే. విద్యా సంస్థల ఏర్పాటు హక్కు, దానిని నిర్వహించుకునే హక్కును భాష, మతం పేరుతో తీసేయడానికి వీల్లేదు. ఏపీ విద్యా హక్కు చట్టానికి సవరణ చేసిన బిల్లుకు రాష్ట్రపతి ఆమోద ముద్రవేయక ముందే జీవో ఇవ్వడం సరికాదు. ఈ నేపథ్యంలో జీవోలను రద్దు చేస్తున్నాం. కేంద్రప్రభుత్వం తరఫున సహాయ సొలిసిటర్‌ జనరల్‌(ఏఎస్‌జీ) రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన జీవోలు విద్యా హక్కు చట్టం సెక్షన్‌ 29(2)(ఎఫ్‌) ప్రకారం ప్రాథమిక విద్య మాతృభాషలో ఉండాలన్న నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. మాధ్యమాన్ని మార్చేందుకు నిర్ణయం తీసుకునే ముందు ప్రభుత్వం అకడమిక్‌ అథారిటీతో సంప్రదింపులు జరిపినట్లు కనిపించడం లేదు. సంబంధిత వివరాలు కోర్టు ముందు లేవు. అకడమిక్‌ అథారిటీ సిఫారసులు లేకుండా హఠాత్తుగా మాధ్యమంలో మార్పు చేయడం విద్యా హక్కు చట్టం సెక్షన్‌ 29(2)(ఎఫ్‌)ను ఉల్లంఘించడమే’’ అని ధర్మాసనం పేర్కొంది. 
      ‘‘పిల్లల వ్యక్తిత్వ వికాసం, సామాజిక, సాంస్కృతిక గుర్తింపు తెచ్చే విషయంలో మాతృభాషది అతి పెద్ద పాత్ర. కేంద్ర విద్యా హక్కు చట్టం, ఏపీ విద్యా చట్టం-1982 ప్రకారం పాఠ్యాంశాలు, మాధ్యమం తప్పని సరిగా మాతృభాషలో ఉండాలని స్పష్టం చేస్తున్నాయి. మాతృభాషలో విద్యాభ్యాసం చిన్నారులకు చదువులో భయం లేకుండా చేస్తుంది. ఆలోచనల్ని స్వేచ్ఛగా పంచుకోవడానికి వీలు కల్పిస్తుంది. ఒడిశా, కన్నడ, తమిళం తదితర లింగ్విస్టిక్‌ మైనార్టీ పాఠశాలల కొనసాగింపునకు రాష్ట్ర ప్రభుత్వం స్వేచ్ఛనిచ్చింది. కానీ తెలుగు మాధ్యమ పాఠశాలల్ని ఆంగ్ల మాధ్యమంలోకి మారుస్తూ జీవో ఇచ్చింది. ఈ నిర్ణయం పేద ప్రజల పిల్లలకు ఉపయోగపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. 2008, 2017లో ప్రభుత్వం ఇచ్చిన జీవోలను పరిశీలిస్తే రాష్ట్రంలో ఆంగ్ల, తెలుగు మాధ్యమ పాఠశాలలను సమాంతరంగా నిర్వహించారు. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల ఇష్టం మేరకు తెలుగు, ఆంగ్లం మాధ్యమాల్ని ఎంపిక చేసుకోవచ్చు. మండలానికి ఒక తెలుగు మాధ్యమ పాఠశాల ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వ వాదన.. విద్యాహక్కు చట్ట నిబంధనలను సంతృప్తి పరిచేదిగా లేదు. ఈ నేపథ్యంలో ఆ వాదనను అంగీకరించలేం. మాతృభాష లేదా ప్రాంతీయ భాషలో మాధ్యమాన్ని యునెస్కో, ఎన్సీఎఫ్‌ సమర్థించాయి. తద్వారా అన్ని విధాల అభివృద్ధి సాధ్యపడుతుందని పేర్కొన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో మాతృభాషగా తెలుగు అభివృద్ధి చెందడానికి సొంత చరిత్ర ఉంది. తెలుగు పాఠశాలల్ని ఆంగ్ల మాధ్యమానికి మార్చడానికి ప్రభుత్వం ఎలాంటి ఆధారాలు లేకుండా అనాలోచితంగా జీవోలు జారీచేసింది. స్వాతంత్య్రానికి పూర్వం, తర్వాత, 1955 రాష్ట్ర పునర్విభజన కమిషన్, జాతీయ విద్యా విధానం తదితర నివేదికలు పరిశీలించాక 1 నుంచి 8 వరకు మాతృభాషలో విద్యా బోధన ఉండాలని స్పష్టం చేస్తున్నాం. రాజ్యాంగ, విద్యా హక్కు, సుప్రీం తీర్పుల స్పూర్తికి విరుద్ధంగా జీవోలున్నందున వాటిని రద్దు చేస్తున్నాం’’ అని హైకోర్టు స్పష్టం చేసింది. 
      తెలుగు భాషకున్న ఘన చరిత్రను ధర్మాసనం గుర్తు చేసింది. బ్రిటిష్‌ కాలం నుంచి అనేక చారిత్రక అంశాల్ని తీర్పులో స్పృశించింది. మాతృభాషకు సేవ చేసిన జాతి నేతలను స్మరించింది. పిటిషనర్ల తరఫున న్యాయవాదులు కారుమంచి ఇంద్రనీల్‌బాబు, అనూప్‌ కౌశిక్‌ వాదనలు వినిపించారు. జీవోలను సవాలు చేస్తూ భాజపా జాతీయ కార్యదర్శి సత్యకుమార్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది వేదుల వెంకటరమణ వాదించారు. 

‘ఈనాడు’ సౌజన్యంతో..


‘‘ప్రాథమిక విద్య దశలో మాధ్యమాన్ని ఎంపిక చేసుకునే హక్కు విద్యార్థులకు, తల్లిదండ్రులకు ఉంటుందని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఈ నేపథ్యంలో పిల్లలు, వారి తల్లిదండ్రులు, సంరక్షకులకు ఏ మాధ్యమాన్ని ఎంపిక చేసుకోవాలనే స్వేచ్ఛ ఉంటుంది. మాతృభాష కన్నా ఆంగ్లం మరింత ప్రయోజనం అనే రాష్ట్ర ప్రభుత్వ వాదన సుప్రీంకోర్టు చెప్పిన దానికి విరుద్ధంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేయడం ద్వారా ఒక్క కలంపోటుతో మాధ్యమాన్ని ఎంచుకునే హక్కును తీసేయడం రాజ్యాంగ విరుద్ధం’’
‘‘ఏపీలో దశాబ్దాలుగా తెలుగు మాధ్యమం కొనసాగుతోంది. ‘ఆచరణ సాధ్యం’ మేరకు మాతృభాషలో విద్యా భోదన చేయాలని విద్యా హక్కు చట్టం చెబుతున్న కారణంగా మాధ్యమాన్ని మార్చే అధికారం తమకు ఉందని ప్రభుత్వం చెబుతున్న వాదనను అంగీకరించలేం’’
‘‘పిల్లల విద్య అన్ని అంశాల్లో వారి అభివృద్ధికి తోడ్పడేదిగా ఉండాలి. పిల్లల వ్యక్తిత్వ వికాసంలో మాధ్యమం కీలక పాత్ర పోషిస్తుంది. వ్యక్తిత్వ వికాసం, సామాజిక, సాంస్కృతిక గుర్తింపు తెచ్చే విషయంలో మాతృభాషది అతి పెద్ద పాత్ర’’ 

- హైకోర్టు ధర్మాసనం


‘ఆంగ్ల భాష మన హృదయాల్ని బలవంతంగా ఆక్రమించింది. మాతృ భాష అమ్మ లాంటిది. ఆంగ్లంతో మనకు అలాంటి అనుబంధం ఉండదు. ఆంగ్లంలో జ్ఞానం సంపాదించకపోయినా శాస్త్రీయంగా రష్యా చాలా అభివృద్ధిని సాధించింది. ఆంగ్లం లేకుండా మనం ఏమీ చేయలేమనే మానసిక బానిసత్వాన్ని ఆంగ్లేయులు సృష్టించారు. మాతృభాషలో కంటే ఆంగ్లంలో వృత్తి నైపుణ్యాలు బాగా సాధించామని చెప్పుకొనే వాళ్లు అవమానకరంగా భావించాలి. పుట్టిన పసిపాప మొదటి పాఠం తల్లి దగ్గర నుంచే నేర్చుకుం టుంది. పిల్లల మానసికాభివృద్ధికి మాతృభాష ఆలంబన. ఆ అవకాశం లేకుండా చిన్నారుల మీద ఇతర భాషల ప్రభావం పడేలా చేయడం మాతృభూమికి వ్యతిరేకంగా పాపం చేసినట్లే. వాస్తవమైన విద్య విదేశీ భాషా మాధ్యమంతో సాధ్యం కాదు. దేశీ సంస్కృతిని విస్మరించే ఆంగ్ల విద్యావిధానం హృదయాలకు ఎన్నటికీ చేరిక కాదు. 

- మహాత్మాగాంధీ వివిధ సందర్భాల్లో వ్యక్తంజేసిన ఈ అభిప్రాయాలను హైకోర్టు తన తీర్పులో ఉట్టంకించింది.


 


వెనక్కి ...

మీ అభిప్రాయం