గుర్తే నా గురువు.. బుడికే నా భూమి

  • 374 Views
  • 0Likes
  • Like
  • Article Share

    బద్రి కూర్మారావు

  • ఉపాధ్యాయులు, సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల/ జూనియర్ కళాశాల
  • సబ్బవరం, విశాఖపట్నం
  • 9704798643
బద్రి కూర్మారావు

తెలుగు చలనచిత్రం ఇప్పుడు జానపదం వైపు చూస్తోంది. పాశ్చాత్య వాద్యాల హోరు మధ్య ఓ సెలయేటి నాదంలా జానపదాన్ని వినిపిస్తోంది. అలా ‘పలాస- 1978’ చిత్రంతో వెలుగులోకి వచ్చిన ఉత్తరాంధ్ర జానపద కళారూపం జముకుల పాట. దీనికి చివరితరం వారసుడైన బోనెల అసిరయ్య వాద్యం ఈ చిత్రానికి మట్టి పరిమళాన్నద్దింది.
జముకుల
పాట లేదా జముకుల కథ ఒకప్పుడు ఉత్తరాంధ్రలో దేదీప్యమానంగా వెలుగొందిన జానపదకళ. దీన్ని పల్లెల్లో ‘బుడికిపాట’ లేదా ‘బోనెల పాట’గా వ్యవహరించేవారు. నిరక్షరాస్యులైన పల్లె ప్రజలకు, వ్యవసాయం చేసి అలసివచ్చిన జీవులకు రాత్రిపూట ‘గిరడా’ (దీపపు వెలుగులో) ముందు స్త్రీ వేషం వేసుకుని ఇద్దరు వంతలతో జముకు వాయిస్తూ కథలు చెబుతూ అలరించేవారు కళాకారులు. భారత, రామాయణ ఘట్టాలైన సుభద్రాకల్యాణం, విరాటపర్వం, సాంబుడి పెళ్లి, లవకుశ, సీతావనవాసం, మహిరావణ యుద్ధంతో పాటు నలదమయంతి, బాలనాగమ్మ, ముగ్గురు మరాఠీల కథ, పరశురాముని యుద్ధం, రేణుకా ఎల్లమ లాంటి కథలతో పాటు ప్రాంతీయ జానపదాలతో ప్రజలను మైమరపించేవారు. నెలలకొద్దీ గ్రామాల్లో బసచేసి ప్రజలకు తమ పాటలను వినిపించి కుటుంబ పోషణ చేసుకునేవారు. సినిమా, టీవీల రాకతో ఈ కళను నమ్ముకున్న కుటుంబాలు చెల్లాచెదురయ్యాయి. 1990 నుంచి ఇలాంటి కళలకు ఆదరణ తగ్గుతూ 2000 నాటి నుంచి ఒక్కొక్క కళారూపం కనుమరుగయ్యే దశకు చేరుకుంది.
      ఉత్తరాంధ్ర జముకు పాట ప్రత్యేకత జముకు వాద్యం. జముకు/ జమిడిక వాద్యాన్ని కంచు, ఇత్తడి, రేకు లేదా కర్రతో తయారు చేస్తారు. కుంచం ఆకారంలో ఉండే దీన్ని ఒక పక్క గేదె లేదా ఆవు చర్మంతో మూస్తారు. మధ్య భాగంలో చిన్నరంధ్రం చేసి బిగుతుగా ఉండే దారాన్ని పోనిచ్చి చివరన ముడివేస్తారు. రెండో పక్కకు ఒక కర్రముక్కకు ఆ దారాన్ని కట్టి ఎడమచేత్తో బిగుతుగా లాగిపట్టుకుని కుడిచేత్తో జముకు లోపల భాగం నుంచి మునివేళ్లతో మోగిస్తే మనోహర శబ్దం వస్తుంది. పాటకి అనుగుణంగా జముకు వాయిస్తారు.
జాతర్ల నుంచి ఉద్యమాల వరకూ
బుడబుక్కల పాటగా ప్రసిద్ధిగాంచిన కళారూపమిది. వీధి నడిబొడ్డున ‘గిరడా’ ముందు నిలుచొని స్త్రీ వేషం వేసుకున్న కళాకారుడితో పాటు మిగతా ఇద్దరూ వంతలు జముకులు వాయిస్తూ రాత్రి వేళల్లో పాటలు పాడతారు. అలాగే అమ్మవారి జాతర్లలో ‘మనవి’ చెబుతూ గ్రామదేవతల పుట్టుపూర్వోత్తరాలు ఆలపిస్తారు. అనేక బాణీల్లో పాటలు పాడి ప్రజలను ఆకట్టుకుంటారు. పురాణకథలతో పాటు రెల్లి చిన్నది పాట, అమ్మవారి పాట, కమ్మవారి పణతి, దువ్వందొర పాట, గంగరాజు పాటలతో పాటు అనేక హాస్య, ప్రేమ, సరసమైన జానపదాలను పాడి రంజింపజేసేవారు. ప్రజల భాష, యాసలో ఈ కథలు పాడతారు.
      వామపక్ష ఉద్యమాలు, సినిమాలు అప్పట్లో జముకు పాటను విరివిగా ఉపయోగించుకున్నాయి. ఫాసిస్ట్‌ ధోరణులకు వ్యతిరేకంగా మాచినేని, మిక్కిలినేని, ఉమామహేశ్వరరావులు ఈ కళను ఆధునికీకరించి పాటలు రచించారు. ‘కన్యాశుల్కం’ సినిమాలోని బుర్రకథలో జముకు వాద్యం కనిపిస్తుంది. శ్రీకాకుళ గిరిజన రైతాంగ ఉద్యమంలో కవి, రచయిత, సుబ్బారావు పాణిగ్రాహి జముకుల బాణీలు ఉపయోగించి పాటలు రాశారు. తెలుగు దేశం నలుదిశలా ‘జముకుల కథ’ పేరుతో సామాన్య ప్రజలకు చేరువయ్యారు. పీసా లక్ష్మణరావు, గరికిపాటి రాజారావు, కర్ణాటి లక్ష్మీనారాయణ లాంటి ప్రజానాట్య మండలి కళాకారులు జముకుల పాటల ద్వారా  ప్రజాసమస్యలను తెలియజెప్పారు. ‘జముకు’ పేరుతో ఓ బులెటిన్‌ కొంత కాలం మాసపత్రిక రూపంలో వెలువడేది.
అసిరయ్య ప్రత్యేకత 
ఉత్తరాంధ్రలో ఎన్నో బృందాలున్నా క్రమేణా ఒక్కొక్క బృందమూ ఈ కళకు స్వస్తి పలికింది. మిగిలినవారు రైళ్లు, బస్సుల్లో ‘యాచక వృత్తిని’ ఆశ్రయించారు. ఇప్పటికీ పల్లెల్లో ఒకటీ అరా ఈ కళాకారులు కనిపించి తమ పాటలను వినిపిస్తుంటారు. వారిలో బోనెల అసిరయ్య ఒకరు.
      శ్రీకాకుళం జిల్లా సంతకవిటి మండలం వాల్తేరు గ్రామానికి చెందిన బోనెల అసిరయ్య నిరక్షరాస్యుడు. 25 ఏళ్ల వయసులో రైతుకూలీ పనులు చేసుకుంటూ ఈ కళవైపు మళ్లారు. అప్పటికి పొలాల్లో, గ్రామాల్లో ఎన్నో జానపదాలు వినిపిస్తుండేవి. చదువులేని అసిరయ్య ఒకసారి ఏదైనా వింటే అలాగే దాన్ని గుర్తుంచుకుంటారు. విషయాన్ని సొంత బాణీలతో పాటకడతారు. పదిహేనేళ్ల పాటు స్త్రీ వేషం వేసుకుని గ్రామాల్లో దీపపుబుడ్డీ వెలుగులో బృందంతో తన పాటలను వినిపించి ఉదరపోషణ చేసుకున్నారు. సినిమా, టీవీల రాకతో ఈ పాటకు గిరాకీ తగ్గడంతో రైళ్లు, బస్సులు, జాతర్లను ఆశ్రయించారు. పొద్దున్నే ఇంటి దగ్గర  బయల్దేరి పొందూరు రైల్వేస్టేషన్‌లో బండెక్కి విశాఖ- పలాస ప్యాసింజర్, విశాఖ ఎక్స్‌ప్రెస్‌లలో పాడుకుంటూ దర్శనమిస్తాడు.
      అసిరయ్య ఈ ప్రాంతంలో బాగా వాడుకలో ఉన్న జానపదాలతో పాటు హుషారైన, సరసమైన జానపదాలు, బావామరదలు హాస్యాలు, చతురోక్తులను పాటలుగా మలచుకొని శ్రావ్యమైన గొంతుతో, ఉత్తరాంధ్ర యాసతో ఆలపిస్తారు. జముకు వాయిస్తూ అభినయం చేస్తూ ప్రయాణికుల మనసులు దోచుకుంటారు. ‘‘బావొచ్చాడోలక్కా/ బావొచ్చాడు/ ఎంత బాగున్నాడోలక్కా/ బాగున్నాడు/ వాడు ఎడమకాలికేసినడు ఎర్రటిజోడు/ వాడు కుడి కాలికేసినాడు కర్రిటి జోడు’’, ‘‘అల్లుడా/ గారెలొండ లోరల్లుడా/ బూరెలొండలా’’, ‘‘పట్టుచీర కట్టమన్నది.. మా అత్తా కట్టేకవద్దన్నది/ మరదల మందార మాల/ మాయత్త మరదల మందారమాల’’, ‘‘నీవు కొట్టకురో తిట్టకురో/ బడా సింగిడి బావ/ నేను పల్లెటూరి పిల్లనురా/ బడా సింగిడి బావ’’, ‘‘అత్తర్‌ సాయిబో రారా..! అందాల మారాజు రారా!’’ లాంటి పాటలు అసిరయ్య గళంలో శ్రావ్యంగా పలుకుతాయి. ‘‘ఆలయాన వెలసిన ఆ దేవునిరీతి..’’ లాంటి పాత సినిమాపాటలు, భక్తిగీతాలను కూడా తన జముకు వాద్యంతో పాడి ఆయన ప్రయాణికులను ఆకట్టుకుంటారు.
వెండితెర పైకి..
అసిరయ్య పాటలను కొంతమంది రికార్డు చేసి యూట్యూబ్‌లో పెట్టడంతో అవి బాహ్య ప్రపంచంలోకి వచ్చాయి. వాటి గురించి తెలుసుకున్న విశాఖపట్నం శ్రీమాతా రికార్డింగ్‌ ఎంటర్‌ప్రైజెస్‌కు చెందిన పల్లి నాగభూషణం, బి. నర్సింహమూర్తి.. అసిరయ్య జానపదాలతో పాటు సారంగధర లాంటి పురాణకథలను రికార్డ్‌ చేసి యూట్యూబ్‌లో పెట్టారు. ఈ పాటలు ‘పలాస- 1978’ చిత్రం సంగీత దర్శకులు రఘు కుంచె చెవిన పడటంతో హైదరాబాదుకు పిలిపించి, కొన్ని పాటలు పాడించి సినిమాలో అవకాశమిచ్చారు. అలా ఈ చిత్రం నేపథ్యగీతం ‘‘ఏవూరు ఏవూరే ఒలెభామా/ నీదీ ఏవూరే/ శ్రీకాకుళం జిల్లా/ జిల్లాలో పలాస మాఊరు’’కు అసిరయ్య జముకు వాయించారు. ‘‘బావొచ్చాడోలక్కా’’ పాటతో పాటు చిత్రం చివర్లో ‘‘జోజో వానలు కురిసె/ చిన్నవాడా/ జోన్న చేలు గూలుకురిసి/ గూటిలోనా చిన్నవాడు/ మాటమాటకి కన్నుగీటి/ దిబ్బమీద దానియిల్లు../ రాయిలాంటి దాని మనసు/ రాలిపోతే యీవవేసే’’ గీతానికీ అవకాశమిచ్చారు.
      ‘పలాస- 1978’ చిత్రం విడుదలైనప్పటి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో అసిరయ్య అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు. సామాన్యుడు అయిన తనకు, తన పాటకి ఇలాంటి అవకాశమొస్తుందని కలలో కూడా ఊహించని అసిరయ్య వారందరికి కృతజ్ఞతలు చెబుతూ... ‘గుర్తే నా గురువు, బుడికే నా భూమి’ అంటూ ప్రాణం ఉన్నంత వరకు ఈ బుడికి పాటను పాడుతూనే ఉంటానంటారు. ‘‘ఈ బుడికి పాటతోనే నా కుటుంబాన్ని పెంచడంతో పాటు ముగ్గురాడపిల్లలకు పెళ్లిళ్లు చేశా. నా కుమారుణ్ని ఎమ్మే బీఈడీ చదివించా’’నని ఆనందభాష్పాలతో చెప్పుకునే ఈ కళాకారుడు జముకుల పాటకు చివరితరం వారు. తనలాగే మరెంతో మంది కళాకారులున్నారని, వారసుల కోసం ఈ కళ ఎదురు చూస్తుందనేటప్పుడు అసిరయ్య గొంతులో ఓ విషాద జీర!


వెనక్కి ...

మీ అభిప్రాయం