కష్టాల కల‘నేత’లో ఓ ప్రేమకథ

  • 567 Views
  • 2Likes
  • Like
  • Article Share

    డా।। చెంగల్వ రామలక్ష్మి

  • విజయవాడ
  • 9490696950
డా।। చెంగల్వ రామలక్ష్మి

నేత కార్మికుల జీవన నేపథ్యం ఇతివృత్తంగా పోరంకి దక్షిణామూర్తి చేసిన రచన.. ‘ముత్యాల పందిరి’. తెలంగాణ మాండలికంలో వచ్చిన తొలి నవల ఇది.  నేతన్నల జీవితాల్లోని ఒడుదొడుకులు, ఎంత కష్టపడినా చాలీచాలని ఆర్థికస్థితి, చదువుకుంటే ఉద్యోగాలు చేసి సంపాదించుకోవచ్చనే తర్వాతి తరం ఆలోచనలు.. అరవయ్యో దశకపు చేనేతల బతుకు చిత్రణ ఈ నవల.
చేనేత
వృత్తి పదకోశం నిర్మాణంలో భాగంగా పదాల సేకరణకు ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ నియమించిన పర్యటక పరిశోధకుల్లో పోరంకి దక్షిణామూర్తి ఒకరు. ఆయన పాత పాలమూరు జిల్లాలో పదసేకరణ చేస్తున్నప్పుడు అచ్చంపేటలో ఓ వ్యక్తి ‘గర్కెపోసల చీర, గంగసరం చీర’ లాంటి పేర్లు చెబుతూ ‘ముత్యాల పందిరి’ పేరూ చెప్పారట. అప్పుడే ఈ పేరుతో నవల రాయాలని ఆసక్తి కలిగినట్లు ఈ నవల ముందుమాటలో చెప్పారు రచయిత. అలా 1964లో వచ్చిందీ నవల. ఆంధ్రప్రభ వారపత్రిక ఉగాది నవలల పోటీలో తృతీయ బహుమతి పొందింది. ఆ పత్రికలో ధారావాహికగా ప్రచురితమైంది. అక్కినేని సారస్వత బహుమానాల్లో (1969) బంగారు పతకమూ అందుకుంది. మహబూబ్‌నగర్, నల్లగొండ, కరీంనగర్‌ ప్రాంతాల వాడుక మాటలు ఈ నవలలో కనిపిస్తాయి. నేతన్నల పరికరాలు, వాటిని ఆయా ప్రాంతాల్లో పలికే విధానం ఇందులో స్పష్టంగా ఉంటుంది. దక్షిణామూర్తి కోస్తా ప్రాంతపు మాండలికంలో ‘వెలుగూ- వెన్నెలా- గోదారీ’, రాయలసీమ యాసలో ‘రంగవల్లి’ నవలలను రచించి మూడు మాండలికాల్లోనూ, తొలి నవలా రచయితగా ఘనత వహించారు.
      ‘ముత్యాల పందిరి’లోని పిల్లల ఆటలు, ఆడుతూ పాడే పాటల్లోని స్వచ్ఛత, సౌందర్యం పాఠకులను ఆలరిస్తాయి. అంతేకాదు, ఈ నవల అపురూపమైన వచన ప్రేమ కావ్యంగా తోస్తుంది. రెండు పసి హృదయాల్లో మొలకెత్తి, చిగురులేసిన ప్రేమను.. కలిసిమెలిసి ఆడిపాడిన స్నేహాన్ని కాలం ఎలా కర్కశంగా విడదీసిందో చదివితే కళ్లు చెమర్చుతాయి. 
ఇదీ కథ
ఉయ్యాలవాడ గ్రామంలో నేతపని మీద బతుకుతున్న కుటుంబాలు చాలానే ఉన్నాయి. ఇంటింటా ముసలవ్వ దగ్గర నుంచి చిన్నపిల్లల వరకు పని చేస్తేనే గాని డొక్కాడని బతుకులు! పనిలో నైపుణ్యంతో పాటు పని చేయించే నేర్పు, లౌక్యం, బతకనేర్చిన తెలివి తేటలూ ఉంటే లక్ష్మయ్యలా బాగా డబ్బు సంపాదించవచ్చు. నూరు మగ్గాలు, ఇరవై మందిని పెట్టుకుని చీరలు నేయిస్తుంటాడితడు. ఎదురు మాట్లాడితే ఎవరినైనా పనిలో నుంచి తీసేస్తాడు. అన్నీ తెలిసినా ఏమీ అనలేని జనం నిస్సహాయత! శ్రమ ఊరి వాళ్లది, సంపద లక్ష్మయ్యది. అలాగే ఊళ్లో పెద్ద ఇల్లు కట్టాడు.
      నేతపనిలో శ్రమ ఎక్కువ, ఫలితం తక్కువ.. చదువుకుంటే ఉద్యోగం చేయవచ్చని, బడికి వెళ్లటానికి తోటిపిల్లలను ప్రోత్సహించే చంద్రయ్య, లక్ష్మయ్య మేనల్లుడు. అలా చదువుకుంటున్న పిల్లలు ఎదురు తిరుగుతున్నారు.. ప్రపంచం మారిపోతోంది అనుకంటూ లక్ష్మయ్య మొగ్గలోనే వాళ్ల ఆలోచనలను తుంచేశాడు. చంద్రయ్య అక్కడ ఉంటే తోటి పిల్లలను ఎలా మార్చేవాడో కానీ, తెలిసీ తెలియని ఆ వయసులో మామ కూతురు ఉంగరం వేలుకి పెట్టుకుని, అది కనపడక, ఇంటికి వెళ్తే కొడతారనే భయంతో ఊరు నుంచి పారిపోతాడు.. అదే అతని జీవితంలో గొప్ప మలుపవుతుంది.
      ముత్యాలు, చంద్రయ్య చిన్నప్పటి నుంచి కలిసి ఆడుకుంటారు.. ఒకరికొకరు అన్నట్లుగా ఉంటారు. చంద్రయ్య పారిపోయాక, ముత్యాలు ఉంగరం దొంగతనం చేశాడనుకుని బాధపడుతుంది. చంద్రయ్య తల్లీతండ్రీ కారణం తెలియక దిగులుపడతారు. లక్ష్మయ్యేమో దొంగతనం చేసే పారిపోయాడని తిడతాడు. మరోపక్క చంద్రయ్య కనపడిన లారీ ఎక్కి కొత్తూరులో కొత్త జీవితం ప్రారంభిస్తాడు. కాడెయ్య కుటుంబంలో ఒకడయిపోతాడు. నర్సయ్యకు స్నేహితుడై, పున్నమ్మకు ఇంకో తమ్ముడై ఆ ఇంట్లోనే నేతపని నేర్చుకుంటాడు. చదువుకుని సర్కారు ఉద్యోగం చేయాలనుకున్న చంద్రయ్య ఇల్లు విడిచి రావటంతో నేతపని ఇష్టంగా చేసుకుంటాడు. కష్టపడటంలో ఆనందం తెలుసుకుంటాడు. అయితే.. పాత పద్ధతులకు భిన్నంగా నేతలో మరింత ప్రావీణ్యం సంపాదించాలనే లక్ష్యంతో గద్వాల, పోచంపల్లి, సంగారెడ్డి తదితర ప్రాంతాలకు వెళ్లి అక్కడి నేత రీతులన్నీ నేర్చుకుంటాడు. నైపుణ్యం సంపాదిస్తాడు. గర్కెపూసల చీరలు, జరీ చీరలు, పట్టు చీరలు, లింగాల మండపం, రుద్రాక్ష పువ్వులు ఎన్నెన్నో రకాలు నేయటం నేర్చుకుంటాడు. అలా జీవితానుభవాల వల్ల వచ్చిన పరిపక్వతతో అతనిలో భయం జారిపోతుంది. అందరికీ వీడ్కోలు చెప్పి, సొంత ఊరికి ప్రయాణమవుతాడు.
ప్రేమకు సంకెళ్లు
కాల చలనంలో ఎన్నోమార్పులు. అన్నిచోట్ల నేతవాళ్లు సంఘాలు పెట్టుకుంటున్నారు. సంఘం కార్యాలయంలోనే నేతవాళ్లంతా నూలు తీసుకుంటారు. ఉయ్యాలవాడలోనూ కొత్త ఆలోచన రూపుదిద్దుకుంటూ లక్ష్మయ్యకు తెలియకుండా సంఘం పెట్టుకుంటారు. తనకేం తెలియదన్నా సంతకం వస్తే చాలని చంద్రయ్య తండ్రి బావనారుషిని అధ్యక్షుణ్ని చేస్తారు. లౌక్యం, మాటకారితనం లేని నిజాయితీపరుడైన అతని మీద తర్వాత నిందలు మోపుతారు. దాంతో బావనారుషి సంఘం నుంచి వెళ్లిపోతాడు. అప్పటికే ఆరోగ్యం పాడై, దారిలో దగ్గుతూ పడిపోతాడు. బతకమ్మను నీళ్లలో కలపటానికి ఊరివాళ్లతో వెళ్లిన ముత్యాలు కాలుకు ఉంగరం గుచ్చుకుంటుంది. ఆ రోజు చంద్రయ్య పోగొట్టుకున్న ఉంగరమే అది. అత్త దగ్గరికి పరుగెత్తుకుంటూ వెళ్లి జరిగిందంతా చెబుతుంది.
      చంద్రయ్య ఊళ్లోకి వచ్చేటప్పటికి ఊరంతా మారిపోతుంది. దీపాలు, మంచినీళ్ల బావి వచ్చాయి. వీధిబడి పెద్దదయింది. గ్రంథాలయం వచ్చింది. విత్తనాలకు ఆఫీసు పెట్టారు. తండ్రి మరణానికి తనే కారణమని చంద్రయ్య కుమిలిపోతాడు. తల్లికి దగ్గరుండి సేవలు చేస్తాడు. అతని రాకకు ముత్యాలు చాలా సంతోషిస్తుంది. చంద్రయ్య పనితనం చూసి లక్ష్మయ్య కార్ఖానాకు రమ్మంటాడు. కానీ, చంద్రయ్య ఎక్కడికీ వెళ్లకుండా ఇంట్లోనే పని మొదలుపెడతాడు. అతని నైపుణ్యం చుట్టు పక్కల గ్రామాలకూ తెలిసింది. తన చీరలకు బాగా గిరాకీ ఉంటోంది. ఇప్పుడు చంద్రయ్యకు నేతపనిలోనే ఆనందం. అదే జీవితం.
అంతలో రాములు, లక్ష్మయ్య కలిసి సంఘం డబ్బులు తినేస్తారు. తన పనులకు ఆసరాగా ఉంటాడని ముత్యాలుని రాములుకిచ్చి చేయాలనుకుంటాడు లక్ష్మయ్య. చంద్రయ్య నిర్లిప్తంగా ఉండిపోతాడు. ముత్యాలు ఏడుస్తుంటే, ధైర్యం చెప్పి ఓదార్చుతాడు. చంద్రయ్య వేలికి ఉంగరం తొడిగి ముత్యాలు వెళ్లిపోతుంది.
ఒకరికి ఒకరు
ముత్యాలు అడిగితే ఆమె కోసం ముత్యాల పందిరి చీర నేస్తానన్నాడు చంద్రయ్య. ఆ చీర కోసం చంద్రయ్య వేరే గిరాకీలు వచ్చినా ఆపేస్తాడు. ఆ పనిలోనే ఉంటాడు. ఊరంతా ముత్యాలు పెళ్లి సంబరాల్లో ఉంటుంది. అక్కడ రాములు తాళి కడుతుంటే ఇక్కడ చంద్రయ్య తల్లినోట్లో తులసి నీళ్లు పోస్తుంటాడు. ఒకవైపు పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఇంకోవైపు నక్కలు కూస్తున్నాయి. విధి వింత నాటకం.
      ముత్యాల పందిరి చీర తయారవుతుంది. ముత్యాలు భర్తతో కాపురానికి వెళ్తోంది.. ఎలాగైనా అందించాలి. ముత్యాల పందిరి చీర ముత్యాలు కోసం! సంచీలో పెట్టుకుని ఊడలమర్రి దగ్గరకొస్తాడు చంద్రయ్య. తనకు అన్యాయం చేసిన రాములు అంతుచూడటానికి లంబాడి లచ్చి కూడా అక్కడికి వస్తుంది. ముత్యాలును రాములు నుంచి కాపాడదాం అని చెబుతుంది. చంద్రయ్య ముత్యాలును రైల్లోంచి దింపి రాములు గురించి చెబుతాడు. ముత్యాల పందిరి చీర ఇచ్చి ఆమె వేలికి ఉంగరం తొడుగుతాడు. ఆమె కళ్లకద్దుకుని కప్పుకుంటుంది. చంద్రయ్య ఆలసటతో ఒళ్లు మరచి నిద్రపోతాడు.
      చంద్రయ్య వేలికి తొడిగిన ఉంగరం, పైన కప్పిన ముత్యాల పందిరి చీర తనతో ఉన్నాయి... రైలేదో వస్తుంటే ముత్యాలు గబగబ ముందుకు వెళ్తుంది! స్పృహ వచ్చేటప్పటికి ముత్యాలు తల, చంద్రయ్య గుండె దగ్గర ఉంటుంది. ఇద్దరూ ఒకరి కళ్లు మరొకరు తుడుచుకుంటారు. స్వచ్ఛమైన మనసులు ఒకటవుతాయి. స్టేషన్లో గంటమోగుతుంది.
ఒకరికి ఒకరు
చేనేత భారతీయతకు చిహ్నం. కానీ, నేతన్నల బతుకుల్లో అప్పుడూ ఇప్పుడూ వెతలే! నేతపనిలో కష్టం ఎక్కువ.. ఫలితం తక్కువ. లక్ష్మయ్య లాంటి అవకాశవాదులకు తరుగేలేదు. ఇక సంఘాల పేరిట జరిగే మోసాలకు అమాయకులు బలవుతూనే ఉంటారు. అప్పటికన్నా ఇప్పుడు వస్తున్న సామాజిక పరిణామాలు, యంత్రాల ప్రాముఖ్యంతో ఈ రంగంలో ఉన్నవారికి ఇబ్బందులు ఇంకా ఎక్కువవుతున్నాయి. మరమగ్గాల నుంచి తీవ్రపోటీ ఎదురవుతోంది. చేనేతలో కొత్త కొత్తవి నేర్చుకుని ఈ పరిశ్రమను ముందుకు తీసుకువెళ్లాలనుకునే యువతకు ప్రతీక చంద్రయ్య. తగిన ప్రోత్సాహం, సాయం ఉంటే వీరు ఈ రంగంలో రాణించగలరు. 
      యాభై వసంతాలకు పైబడిన ‘ముత్యాల పందిరి’ నవల ఇప్పటికీ ఎప్పటికీ పాఠకుల హృదయాలలో పచ్చగా ఉండిపోతుంది. ఎందుకంటే కథాంశం ఇప్పటికీ సమకాలీనమే. అంతేకాదు, జానపదుల పాటలు, పిల్లల ఆటలు, అందమైన బాల్యం, సహజ సుందరమైన మాండలిక భాష పఠితలను ఆ వాతావరణంలోకి తీసుకువెళ్లి నిలబెడుతుంది. పాత్రల సంభాషణలే కాకుండా రచయిత కథనం కూడా తెలంగాణ మాండలికంలో ఉండటం ఈ నవల ఇంకో ప్రత్యేకత. ‘‘లచ్మయసేటు అందర్లెక్కకాదు, నేతగాండ్లకు మంచిగ దరాబుత పొద్దుకాల పన్చేపిచ్చుకుంటాడు. ఆ ఇద్దెవాని సొంతమే! అట్లనే ఏలు కమాయించినాడు. ఉయ్యాలవాడల ఎన్మిదిలోతుల మిద్దె ఇల్లు కట్టిపిచ్చిండు. అండ్లనె దలకనం కోసానికి ఏర్పాటుగ పెద్ద ఆర్ర కట్టెపిచ్చిండు... మాటగిట్ట తీస్కనెటోండ్లు, తీర్పయినంక సనుగులు గిట్ట దెచ్చి ఇచ్చె టోండ్లూ అందరాడికే వస్తారు’’.. ఇలా సాగిపోతుంది కథనం. తెలంగాణ తెలుగుకు మరింత అందాన్నిచ్చే ఉర్దూ పలుకుబడులు కూడా ఈ నవలలో విరివిగా కనిపిస్తాయి. రచయిత పరిశోధనా దృష్టి, విశ్లేషణా శక్తికి దర్పణం లాంటిదీ నవల. అంతేకాదు, భాషా పరిశీలన పట్ల ఆసక్తిని, నేత పరిశ్రమ పట్ల అవగాహనను కలిగించే అరుదైన రచన ఇది.


వెనక్కి ...

మీ అభిప్రాయం