తెల్లచీర కట్టుకున్నదెవరికోసము

  • 608 Views
  • 0Likes
  • Like
  • Article Share

    శైలేష్‌ నిమ్మగడ్డ

  • హైదరాబాదు
  • 9652333226
శైలేష్‌ నిమ్మగడ్డ

జంట కట్టిన మనసులు జోడుగుర్రాలైనప్పుడు వలపు హద్దులు చెరిగిపోతాయి. కోరికల తేరుమీద కోడె వయసుల ప్రయాణం ప్రారంభమయ్యాక దేహాల మధ్య దూరాలు తరిగిపోతాయి. ఏకమైన హృదయాల సాక్షిగా ఒకరి ఆశలు మరొకరి కళ్లలో ప్రతిఫలిస్తాయి. 
      ఇదీ సందర్భం! దీనికి పాట రాయమంటే మిగిలిన వారు ఎలా రాసి ఉండేవారో తెలియదు కానీ, ‘మనసుకవి’ ఆత్రేయ మాత్రం మల్లెపువ్వంతటి స్వచ్ఛమైన సాహిత్యాన్ని అందించారు. వలచిన మనసులోని మమతల వెచ్చదనమంతా మేనుకు తాకి మురిపించడమే శృంగారమనే ఆ పాట... తెలుగు సినీ యుగళగీతాల తోటలో విరిసిన పారిజాతపుష్పం. ఇంతకూ ఆ పాట ఏంటంటే... 
అ: తెల్లచీర కట్టుకున్నదెవరికోసము
మల్లెపూలు పెట్టుకున్నదెవరికోసము
ఆ: తెల్లచీర కట్టినా మల్లెపూలు పెట్టినా
కల్లకపటమెరుగని మనసుకోసము
మనసులోని చల్లని మమతకోసము
అ: దాచుకున్న మమతలన్ని ఎవరికోసము
ఆ: దాపరికం ఎరగని మనిషికోసము
అ: దాగని యవ్వనం ఎవరికోసము
ఆ: దాచుకుని ఏలుకునే మనిషికోసము
అ: పొద్దంతా కలవరింత ఎవరికోసము
ఆ: నిద్దురైనా రానీని నీకోసము
అ: నింగి నేల కలిసినది ఎందుకోసమూ
ఆ: నీవు నన్ను చేరదీసినందుకోసము
ఇద్దరు: నేల మీద ఒక్కరై సాగిపోదుము
నింగిలోన చుక్కలై నిలిచిపోదమూ...

      తెల్లచీర కట్టుకుని, మల్లెపూలు పెట్టుకుని వెన్నెల రాతిరేళ చెలికాడి కోసం తోటలో ఎదురుచూస్తుంటుంది కృష్ణకుమారి. ఆమె మనసు వీణను మృదుమధురంగా మీటుతూ వస్తారు అక్కినేని. ‘అంతస్తులు’ (1965) చిత్రంలోని ఈ సన్నివేశం కోసం ఆత్రేయ కలం వినిపించిన కవనమిది. మహదేవన్‌ బాణీ, ఘంటసాల, సుశీలమ్మల గాత్రం దీనికి ప్రాణం పోశాయి.  
      కథ ప్రకారం కథానాయకుడి మనసులో పాత పగల సెగలేవో ‘నిగూఢం’గా రగులుతూ ఉంటాయి. వాటిని చల్లార్చడానికి ఈ రాత్రే ముహూర్తమని తన స్నేహితుడితో చెప్పి మరీ వస్తాడు అతడు తోటకి. కథానాయికకు ఈ విషయాలేవీ తెలియదు. ఆమె అతణ్ని ప్రేమించింది. మనస్ఫూర్తిగా నమ్మింది. ఆ నమ్మకంతోనే తను కరిగిపోతుంది. గీత సాహిత్యంలోని ‘ఆమె’ పలుకుల్లో ప్రతిధ్వనించేదీ ఆ నమ్మకమే.  ఇది కథానుసారం రాసిన గీతమైనా... మనసు మనసును ప్రేమిస్తే తప్ప, ఆ మనసులోని మమతను నమ్మితే తప్ప సరసాల బండి పట్టాలకెక్కదనే సార్వజనీన భావాన్ని పొదవుకుంది. అందుకే దీనికంతటి ప్రత్యేకత. 
      తెల్లచీర, మల్లెపూలు... తొలిరేయి తీపిగుర్తులు. వాటిని ధరించడంలో ఆమె ఆంతర్యాన్ని చిలిపిగా ప్రశ్నించాడు అబ్బాయి పల్లవిలో. తన మనసులోని స్వచ్ఛమైన ప్రేమకు సంకేతంగా మేనును తెల్లచీరతో సింగారించిందని తెలిసినా కావాలనే అడిగాడు. మదిని మత్తెక్కిస్తున్న ఊహలకు ప్రతీకగా సిగలో మల్లెపూలు తురిమిందని తెలుస్తున్నా రెట్టించడానికి అడిగాడు. ఆమె ఏమని బదులిస్తుందో తన నోటితోనే విందామనుకున్నాడు. తనూ తక్కువేం తినలేదు. బదులిచ్చింది... తన వ్యక్తిత్వానికి అద్దంపట్టేలా! 
      ‘కల్మషం ఎరగని నీ మనసును ప్రేమించాను. అది కురిపించే మమతల వర్షంలో తడిసి ముద్దవుతున్నాను. స్వచ్ఛమైన నీ ప్రేమకు నేనిచ్చే కానుకలే ఈ తెల్లచీర, మల్లెపూలు’ అంది.   అంతగా నమ్మింది మరి. నిజమైన ప్రేమకు కల్లాకపటాలు ఉండవు. అలా ప్రేమించే మనసు భాగస్వామి మీద అంచనాలకందని ఆప్యాయతను కురిపిస్తుంది. భాగస్వామి ప్రేమలోని ఆ నిజాయితీయే ఆమెను కదిలిస్తుందని, శృంగార శిఖరారోహణ దిశగా అడుగులు వేయిస్తుందన్నది కవి భావం. 
      తుమ్మెదకోసం పుప్పొడిని దాస్తుంది పువ్వు. ఆ తుమ్మెద తనను వెతుక్కుంటూ వచ్చి పలకరించే వరకూ అలా ఎదురుచూస్తూనే ఉంటుంది. ఇక్కడ ఆమె కూడా అలాగే దాచిపెట్టింది తన ప్రేమని. మరి దాన్ని ఎవరికి పంచిస్తావన్నాడు కథానాయకుడు. లోపల ఒకటి ఉంచుకుని పైకి మరోలా ప్రవర్తించే వాళ్లకైతే కాదు అంది ఆమె. అద్దంలాంటి మనసున్న నీకే నా మమతలను అర్పిస్తానంది. వాస్తవానికి కథానాయకుడి నిజస్వరూపానికి ఆమె భావనలు విరుద్ధం. అతని ప్రేమ నాటకం అన్న విషయం తెలియకుండానే... అబద్ధాల పునాదుల మీద అనుబంధాల కోటలు నిలబడవని, ప్రేమికుల మధ్య దాపరికాలు ఉండకూడదని ఆమె అన్యాపదేశంగా చెప్పింది. ‘నువ్వు అలాంటి దాగుడుమూతలు ఆడటం లేదు కాబట్టి నా ప్రేమామృతాన్ని నీకే పంచిస్తున్నా’నని అంది. ఇక ‘దాచుకుని ఏలుకోవడం’ అంటే జాగ్రత్తగా కాపాడుకోవడం. భద్రంగా చూసుకోవడం. ‘నన్ను నువ్వు అలా చూసుకుంటావనే నమ్మకం ఉంది. అందుకే నాకు నేనుగా నీ ఒడిలో వాలిపోతున్నాను’ అంటూ సిగ్గులొలికించింది తర్వాత. పెళ్లిపీటల మీద రెండు జీవితాలను ముడివేసే సందర్భంలో వినపడే ‘ధర్మేచ, అర్థేచ, కామేచ, మోక్షేచ నాతిచరామి’కి ఆత్రేయ తేటతెలుగు అనువాదమే ఈ ‘దాచుకుని ఏలుకోవడం’! 
      పండు వెన్నెల్లో విరహోత్కంఠితలా ఉందామె. మనసైన మనిషికోసం వేయికన్నులతో ఎదురుచూస్తోంది. ఆమెను మరింత కవ్విస్తూ ‘ఎవరికోసమో ఈ కలవరింతలూ’ అంటూ దీర్ఘాలు తీస్తున్నాడు అతడు. ‘ఎటు చూస్తే అటు నువ్వే. నీ ఆలోచనలతో నాకు నిద్ర పట్టడం లేదు మహాప్రభూ... నీకోసమే అభిసారికనయ్యాను’ అన్నది ఆమె మాటల్లోని సాధారణ అర్థం. కానీ, కవ్వింతల అల్లరికి కౌగిళ్ల ఖైదు తప్పదంటారు కదా! దానిప్రకారం ‘నా బాహువుల్లో నిన్నో ఖైదీని చేస్తా’నని గుంభనంగా చెబుతోందామె.
      మమతలు వలపుల పూలై విరిసినప్పుడు నింగీ నేలా ఒకటవుతాయంటారు దాశరథి. రెండు అస్తిత్వాలు... రెండు జీవితాలు... రెండు మనసులు... ప్రేమతో ఒక్కటవుతాయి. అప్పటివరకూ ఎవరి అస్తిత్వం వారిదే. ఒకరు భూమి అయితే మరొకరు ఆకాశం.    మిన్నుకు మేఘమే మనసు అనుకుంటే... పుడమి గుండెల్లోని ప్రేమ సంద్రం దాన్ని ఆప్యాయతతో నింపుతుంది. మురిసి మెరిసిన మేఘం తిరిగి చినుకు రూపంలో తన ప్రేమను ఒలకబోస్తుంది. నింగి, నేలను కలిపే ఆ చినుకు మాదిరిగానే ప్రేమ రెండు మనసులను ఒక్కటి చేస్తుంది. ఇలా మనం ఒక్కటవడానికి కారణమేంటని అడుగుతున్నాడు అబ్బాయి. ‘నువ్వు నన్ను చేరదీయడం వల్లే నాకు ఈ అదృష్టం దక్కింది’ అని బదులిచ్చింది అమ్మాయి. అలా తనను తాను తగ్గించుకుంది. అది అబ్బాయి అహాన్ని సంతృప్తిపరుస్తుంది. ప్రేమించినవాడి ఆనందమే కదా ఏ అమ్మాయి అయినా కోరుకునేది! కథ ప్రకారం చూస్తే, అబ్బాయి జమీందారు బిడ్డ. అమ్మాయిది సాధారణ నేపథ్యం. అంతస్తుల్లో భూమ్యాకాశాలంత భేదం. కానీ, ప్రేమతో ఒకటయ్యారు. పెద్దింటి ‘పెద్దబ్బాయి’ (చిత్రంలో అక్కినేని పేరు) తనని ‘పెద్ద మనసు’తో దగ్గరికి తీశాడని నమ్ముతున్న అమ్మాయి ఇంతకుమించి ఏమనగలదు?  
      అతను అడగాలనుకున్నవన్నీ అడిగేశాడు. ఆమె చెప్పడమూ పూర్తయింది. ఇక కాలాన్ని వృథాచేయడం అనవసరం- అబ్బాయి ‘దృష్టి’లోనూ, అమ్మాయి ‘తన్మయత్వపు తలపు’ల్లోనూ! అందుకే ఇద్దరి గళాలూ ఒక్కటయ్యాయి. ఉన్నంత కాలం ఒకటిగా ఉందాం... ఆ ప్రేమే మనల్ని చిరంజీవులను చేస్తుందని ఒకరికొకరు చెప్పుకున్నారు. ఒకరిలో ఒకరు కలిసిపోయారు. 
      కథకు అనుగుణంగా పాట రాస్తూనే, సరసానికి సరైన వేదిక ఎప్పుడు అమరుతుందో చెప్పారు ఆత్రేయ. అప్పుడైనా, ఇప్పుడైనా, ఎప్పుడైనా ఎదుటివ్యక్తి ప్రేమలోని నిజాయితీయే ఇవతలి వ్యక్తిని కదిలిస్తుంది. మనస్ఫూర్తిగా జతకలుపుతుంది. భాగస్వామి మీద ఆ నమ్మకం లేనప్పుడు శరీరాలు ఒక్కటైనా మనసులు రెండుగానే మిగిలిపోతాయి. అప్పుడది యాంత్రికం తప్ప అమలిన శృంగారం అవదు. అదే మనసులు కలిసిన వేళ తనువులు దగ్గరైతే ‘సంతృప్తి’... పెదవులపై చిరునవ్వై మెరుస్తుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం