నాటకంలో పంచసంధులు

  • 735 Views
  • 5Likes
  • Like
  • Article Share

కావ్యేషు నాటకం రమ్యమ్‌’, ‘నాటకాంతంహి సాహిత్యమ్‌’, ‘నాటకాంతం కవిత్వమ్‌’.. అంటూ నాటక రచనను ఉత్కృష్ట సాహితీ సృష్టిగా సంభావించారు సంస్కృత పండితులు. తెలుగులో మహాభారత ఆవిర్భావానికి ముందే భారతావనిలో రూపక కళ ఉన్నత శిఖరాలు అధిరోహించింది. తెలుగునాట దేశిపద్ధతిలో యక్షగాన రూపక ప్రక్రియలు ఉన్నాయి కానీ, పందొమ్మిదో శతాబ్దం ఉత్తరార్ధం వరకు మన భాషలో నాటకాలు వెలువడలేదు. పోటీ పరీక్షల్లో భాషా సాహిత్యాల్లో భాగంగా నాటక సాహిత్యం మీద ప్రశ్నలు తారసపడతాయి. ఈ నేపథ్యంలో నాటక లక్షణాలు, దశరూపక భేదాలను పరిశీలిద్దాం.
నాటకం
‘నట’ ధాతువు నుంచి పుట్టింది. ‘లోక వృత్తానుకరణం నాటకం’ అన్నారు. లోకం పోకడలకు నాటక ప్రదర్శన అద్దంపడుతుంది. నాటకం అభినయ ప్రధానమైంది. ఈ అభినయం నాలుగు రకాలు.. ఆంగికాభినయం, వాచికాభినయం, ఆహార్యాభినయం, సాత్త్వికాభినయం.
      ప్రాచీన గ్రీసుదేశంలో మృతవీరులకు శ్రద్ధాంజలులు అర్పించే క్రతువు నుంచి నాటకాలు (రూపకాలు) పురుడు పోసుకున్నాయి. సంస్కృత రూపకాలు కూడా అదే మాదిరిగా ప్రాచీన వీరపూజ కార్యకలాపాల నుంచి పుట్టి వికసించాయని డా।। రిజ్వే అభిప్రాయపడ్డారు. ప్రకృతిలో కనిపించే పరివర్తనలనే ప్రాచీన భారతీయులు మూర్త రూపంగా ప్రదర్శించారని, అదే నాటకాల (రూపకాల) ఆరంభమన్నది డా।। కీధ్‌ ఆలోచన. సంస్కృత రూపకాలు బొమ్మలాట నుంచి ఉద్భవించాయన్నది డా।। పిశెల్‌ భావన. హుల్‌ట్చ్‌ లాంటి విమర్శకులదీ ఇదే అభిప్రాయం. గ్రీకు రూపకాల ప్రభావంతో సంస్కృత రూపకాలు ఆవిర్భవించాయని డా।। వేబర్, డా।। విండిష్‌ పేర్కొన్నారు.  
రూపక భేదాలు
ఆంగ్లభాషలోని ‘డ్రామా’ అనే పదానికి ‘రూపకాన్ని’ మనవారు సమానార్థకంగా వాడారు. నటులు ఆయాపాత్రల రూపాలను ఆరోపించుకుని అభినయిస్తారు కాబట్టి దానికి రూపకం అనే పేరు వచ్చింది. రూపక భేదాల్లో ‘నాటకం’ ఒకటి. కానీ, నేడు ‘రూపకం’ ప్రాచుర్యంలో లేదు. ‘నాటకం’ పద వినియోగమే ఎక్కువ. రూపక భేదాలు పది.. నాటకం, ప్రకరణం, భాణం,  ప్రహసనం, డిమం, వ్యాయోగం, సమవాకారం, వీథి, అంకం, ఈహామృగం. 
నాటకం: దశరూపక భేదాల్లో నాటకం ప్రధానమైంది. ఇందులోని కథ అంటే ఇతివృత్తం ప్రసిద్ధమైందై ఉండాలి. నాయకుడు ధీరోదాత్తుడు. అంగిరసం (ప్రధాన రసం).. శృంగారం లేదా వీరరసం. కానీ, భవభూతి ‘ఉత్తర రామచరిత్ర’ నాటకంలో అంగిరసం కరుణం. కొంతమంది విమర్శకులు దాన్ని విప్రలంభ శృంగారంగా గుర్తించారు. నాటకంలో 5- 10 అంకాలుండాలి. ప్రతి అంకంలో నాయకుడు లేదా నాయిక కనిపించాలి. ఒకే సమయంలో రంగస్థలం మీద నాలుగైదు పాత్రల కన్నా ఎక్కువ ఉండరాదు. ప్రతి అంకంలోనూ ప్రత్యక్షంగా కాని, పరోక్షంగా కాని నాయకుడికి సంబంధించిన ఇతివృత్తమే ప్రదర్శితమవ్వాలి. కావ్యాల్లో నాటకం రమ్యమైంది. ఆ నాటకాల్లో ‘శాకుంతలం’ ఉన్నతమైంది. ఈ నాటకంలో చతుర్థాంకం విశిష్టమైందన్నది పెద్దలమాట. 
ప్రకరణ: ఇందులో ఇతివృత్తం ఉత్పాద్యం. అంటే, కల్పిత ఇతివృత్తం అని అర్థం. నాటికలో మాదిరిగానే ప్రకరణంలో కూడా ఇతివృత్తం తేలికగా ఉంటుంది. 5- 10 అంకాలుంటాయి. ధీరశాంతుడైన రాజవంశీయుడు/ వైశ్యుడు/ మంత్రి కుమారుడు/ బ్రాహ్మణుడు నాయకుడిగా ఉంటాడు. నాయిక కులీనురాలు కానీ, వేశ్యాస్త్రీ కానీ, ఇద్దరూ కానీ కావచ్చు. అంగిరసం శృంగారం. నాటకంలా ప్రకరణం ఉదాత్త గంభీరం కాకుండా సామన్య జీవితానికి సంబంధించి ఉంటుంది. నాటకంలో లాగానే నాంది, ప్రస్తావన, సంధి, సంధ్యంగాలన్నీ ఉంటాయి. శూద్రకుడి ‘మృచ్ఛకటికం’ ప్రకరణ భేదానికి ఉదాహరణ.
భాణం: ఇతివృత్తం ఉత్పాద్యం. ఒకే ఒక అంకం, ఒకే పాత్ర ఉండాలి. అంగిరసం శృంగారం లేదా వీర రసం. ఉన్న ఒక్క పాత్ర రంగస్థలం పైకి వచ్చి తన అనుభవాలను కానీ, ఇతరుల వల్ల అనుభూతమైన ధూర్త చరిత్రనుగానీ వర్ణించి చెబుతుంది. ఆకాశభాషణం సాయంతో  సంభాషణ జరుగుతూ ఉంటుంది. ఇది ఏకపాత్రాభినయం లాంటిది.
ప్రహసనం: ఇతివృత్తం కల్పితం. అంగిరసం హాస్యం. ఒకటి లేదా రెండు అంకాలుంటాయి. నాయకుడు.. రాజు/ బ్రాహ్మణుడు/ సన్యాసి/ విటుడు. మిగతా పాత్రలుగా భిక్షకులు, విటులు, వేశ్యలు, సేవకులు తదితరులుంటారు. ఉదాత్త గంభీరమైన నాటకాలు గ్రీకు విషాదాంత నాటకాలకు దగ్గరగా ఉంటే.. ప్రకరణ, ప్రహసన రూపకాలు గ్రీకు హాస్య నాటకాలను పోలి ఉంటాయి.  
డిమం: ‘డిమ’ ధాతువుకి సంఘాతం అని అర్థం. ఇందులో నాయకుల సంఘాతం జరుగుతుంది కాబట్టి ఆ పేరు వచ్చింది. ఇందులో కథ ప్రసిద్ధమైంది. గంధర్వ, యక్ష, రాక్షస, నాగాదిమర్త్యేతర జాతులకు చెందినవారు; భూతప్రేత, పిశాచాదులు కలిపి మొత్తం 16 పాత్రలు ఉండవచ్చు. ఇంద్రజాలం, మాయ, సూర్యచంద్ర గ్రహణాది దృశ్యాలు, యుద్ధం లాంటివి ఇందులో కనిపిస్తాయి.  
వ్యాయోగం: కథ ప్రసిద్ధమైంది.. ఒక్కరోజులో జరిగిన సంఘటన అయ్యి ఉంటుంది. స్త్రీల కన్నా పురుష పాత్రలు ఎక్కువ. వీరం లేదా రౌద్రం ప్రధాన రసంగా ఒకే ఒక అంకం ఉండే ‘వ్యాయోగం’లో నాయకుడు ధీరోదాత్తుడు.  
సమవాకారం: ఇతివృత్తం ప్రసిద్ధం కానీ, కల్పితం కానీ కావచ్చు. 12 నాయక పాత్రలుంటాయి. వీరంతా పురాణ ప్రసిద్ధ పురుషులు. అంగి రసం వీరం. కథ దేవదానవులకు సంబంధించిందై ఉంటుంది. క్షీరసాగర మథనం లాంటి ఇతివృత్తం దీనికి తగింది.
వీథి: ఇతివృత్తం కల్పితం. నాయకుడు ధీరోదాత్తుడు. ఒకే ఒక అంకం, ఒకటి లేక రెండుపాత్రలుంటాయి. అంగి రసం శృంగారం.
అంకం: ఈ రూపక భేదంలో ఒకే ఒక అంకం ఉంటుంది. ఇతివృత్తం ప్రసిద్ధమైంది. అంగి రసం కరుణం. దీనికే ‘ఉత్సృష్టాంకం’ అని కూడా పేరు. స్త్రీ రోదనం ప్రధానంగా ఉంటుంది.
ఈహామృగం: ‘ఈహా’ అంటే కోరిక. నాయిక అలభ్యమైనా, మృగతృష్ణతో నాయకుడు ఆమెను కోరుకుంటాడు కాబట్టి దీనికి ‘ఈహామృగం’ అనే పేరు వచ్చింది. ఇతివృత్తం కొంత ప్రసిద్ధం, కొంత కల్పితం. అంకాలు నాలుగు. నాయకుడు ధీరోదాత్తుడు. అంగి రసం శృంగారం.  
ఈ పది రూపక భేదాలతో పాటు ఉపరూపక భేదాలూ ఉన్నాయి. ‘సాహిత్యదర్పణం’లో విశ్వనాథుడు పేర్కొన్న 18 ఉపరూపక భేదాలివి.. నాటిక, తోటకం, సట్టకం, సంలాపకం, ప్రేంఖణం, ప్రకరణం, ప్రస్థానకం. నాట్యరాసకం, రాసకం, ఉల్లాప్యం, విలాసిక, శ్రీగదితం, శిల్పకం, గోష్ఠి, కావ్యం, దుర్మల్లిక, హల్లీసకం, బాణిక.
అర్థోపక్షేపకాలు: నాటకంలో రంగస్థలం మీద ప్రదర్శించడానికి వీలు లేనివి అర్థోపక్షేపకాల్లో సూచితమవుతాయి. ఇవి అయిదు.
విష్కంభం: జరిగిన, జరుగుతున్న, జరగబోతున్న కథాంశాలను రెండు పాత్రల ద్వారా సూచించడం. ఇది రెండు రకాలు.. శుద్ధ విష్కంభం, మిశ్ర విష్కంభం. రెండు మధ్యమ పాత్రలుండి సంస్కృతంలో మాట్లాడితే శుద్ధం. ఓ నీచపాత్ర, ఓ మధ్యమపాత్ర ఉండి ప్రాకృతంలో మాట్లాడితే మిశ్రం.
ప్రవేశికం: నీచపాత్రలతో కూడిన ప్రవేశం.
చూళిక: అంటే, ఆకాశభాషణం. 
అంకాస్యం: పూర్వ అంకం చివరలో ఉన్న పాత్రలతో తర్వాతి అంకార్థం వ్యక్తమవడం. 
అంకావతారం: పూర్వాంకంలోని పాత్రలతో ఉత్తరాంకంలోని కథ సూచితమై, తర్వాత అంకంలో కూడా వారే ప్రవేశించడం. 
అర్థప్రకృతులు: నాటక కథను విస్తరింపజేసేవి. ఇవి కూడా అయిదే. 
బీజం: మొదట్లో కథ కొద్దిగా ఉండి, తర్వాత క్రమక్రమంగా కథా విస్తరణ కార్యసాధనకు హేతువయ్యేది. 
బిందువు: అల్పప్రయోజనాన్ని సాధించి, విస్మరణకు గురైన బీజాన్ని జ్ఞప్తికి తెచ్చేది.
పతాక: కథకు బలంగా ఉండి తుదివరకు విస్తరించి పతాకంలా రాబోయే కథను సూచించేది.
ప్రకరి: పతాకలా కాకుండా కొంత దూరం మాత్రమే వ్యాపించే కథ. 
కార్యం: నాటకం ప్రధాన ఫలాన్ని నెరవేర్చేది.
కార్యావస్థలు: కవి కార్యావస్థలను అర్థప్రకృతుల్లో ఏ భాగంగా ఏ కార్య దశను నిబంధించాలో ఆ దిశగా కథను నడుపుతాడు. ఇవి కూడా అయిదు రకాలు.  
ఆరంభం: ‘నేను సాధిస్తాను’ అనే నాయకుడి ఉత్సాహంతో కూడిన పూనిక.
ప్రయత్నం: నెరవేరాల్సిన కావ్యం సిద్ధించనప్పుడు రెట్టించిన ఉత్సాహంతో చేసే యత్నం.
ప్రాప్త్యాశ: సిద్ధించాల్సిన ఫలం చేకూరుతుందో లేదో అనే శంకతో కార్యఫలం అనిశ్చితం కావడం.
నియతాప్తి: కార్యసాధనకు గల అవరోధాలు తొలగిపోవడంతో కార్యసిద్ధి తప్పక నెరవేరుతుందనే నమ్మకం.
ఫలాగమం: ఆశించిన ఫలం, సంపూర్ణంగా లభించడం.
పంచ సంధులు
ఇతివృత్త విభాగాన్ని సంధి అంటారు. ఇతివృత్తంలో పంచ సంధులుంటాయి. హేతువులు, కార్యావస్థలు కలిపి ఇవి ఏర్పడతాయి.
ముఖసంధి: బీజం+ ఆరంభం. నానా ప్రయోజనాలకు, రసాలకు హేతువయ్యే బీజ సముత్పత్తి.
ప్రతిముఖ సంధి: బిందువు+ ప్రయత్నం. బీజ ప్రకాశనం.
గర్భసంధి: పతాక+ ప్రాప్త్యాశ. ముఖసంధిలో వ్యక్తమైన బీజం, ప్రతిముఖ సంధిలో లక్ష్యాలక్ష్యం కాగా దృష్టినష్టమైన బీజాన్ని మళ్లీ మళ్లీ అన్వేషించడం.  
అవమర్శ సంధి: ప్రకరి+ నియతాప్తి. ప్రసిద్ధమైన బీజార్థాన్ని గురించి చేసే పర్యాలోచనం.
నిర్వహణ సంధి: కార్యం+ ఫలాగమం. నాయికా నాయకుల అభిలాష ఫలించడం.
ఈ పంచ సంధులతో కూడినదే నాటకం.
 


వెనక్కి ...

మీ అభిప్రాయం