సీతమ్మ మాయమ్మ

  • 421 Views
  • 4Likes
  • Like
  • Article Share

    కడయింటి కృష్ణమూర్తి

  • విశ్రాంత ఏఈ, ఎలక్ట్రిసిటీ
  • గోవా
  • 9422846926
కడయింటి కృష్ణమూర్తి

ఆనాటికి మా సీతమ్మకు కేవలం రెండేళ్లు. అసలు మా సీతమ్మ పేరు ‘సీత’. మేం పల్లెటూరి వాళ్లం కదా. అందుకని మా సీత ‘సీతమ్మ’ అయింది. అప్పటికి మా సీతమ్మకి నడవటం వచ్చిందిగానీ, ఇంకా తప్పటడుగులే. ఎంత ముద్దుగా నడిచేదో! ఆ ముద్దు మాటలు, అమాయకమైన ముఖం, చిరునవ్వులు మరేదో లోకంలోకి తీసుకెళ్లేవి. మా సీతమ్మ పెరుగుతూ వస్తుంటే మా సంతోషాలూ అధికమవుతూ ఉండేవి.      
      అమ్మానాన్నల దగ్గర తను ఎన్ని గారాలు పోతుందో! ‘‘నాన్నా, అమ్మకేమీ తెలియదు’’ అని నాన్నతో జెప్పి, ‘‘అమ్మా నాన్నకస్సలేమీ రావు’’ అని అమ్మతో అంటుంది. ‘‘ఎక్కడనేర్చావు ఇన్ని విద్యలు’’ అంటే ‘‘నీ దగ్గరే’’ అని అమ్మతో ఉన్నప్పుడు ఆమెతో, నాన్నతో ఉన్నప్పుడు నాన్నతో చెబుతుంది. కిలకిలా నవ్వుతుంది. 
      ‘‘అమ్మా, పాలు’’ అని ఆజ్ఞ జారీ చేస్తుంది. తీరా పాలు వచ్చాక ‘‘నాన్నా’’ అంటుంది. అంటే, ‘తాగించు’ అని అర్థం. నాన్న నవ్వుకుంటూ పాలు తాగిస్తాడు. పాలు తాగి ‘‘అమ్మా’’ అంటుంది. అమ్మ దగ్గరికి రాగానే చీర కొంగుకు మూతి తుడుచుకుంటుంది. ‘‘మీ నాన్న అక్కడే ఉన్నారుగా?’’ అంటే, ‘‘నాన్న బట్టలు మాసిపోవూ?’’ అంటుంది. ఆ తర్వాత ముగ్గురి మధ్యా నవ్వులే నవ్వులు. ఏది ఏమైనా మా సీతమ్మ ఎప్పుడూ నాన్న పక్షమే! సీతమ్మ ‘‘జనకజ’’. అంటే జనకుడి కుమార్తె. రామయ్య ‘కౌసల్యా సుప్రజ’. అంటే కౌసల్య కుమారుడు. ఎంతైనా ఆడపిల్లకు నాన్న, మగపిల్లాడికి అమ్మతో చేరిక ఎక్కువ.
      ఆడపిల్లంటే ఎన్ని సంబరాలు, ఎన్ని వేడుకలు, ఎన్ని అలంకారాలు! ఏ పేరంటానికెళ్లినా అమ్మ ఒళ్లోనే కూర్చుంటుంది సీతమ్మ. ‘‘ఇంకా చిన్నపిల్లవా అమ్మ ఒళ్లో కూర్చున్నావు?’’ అని ఎవరైనా అంటే, అమ్మను మరింత పొదువుకుని కూర్చుంటుంది. అమ్మకు బొట్టు పెడితే ‘‘నాకో’’ అంటుంది. అమ్మకు గంధం పూస్తే తానూ మెడ ఎత్తి చూపుతుంది. అమ్మ కాళ్లకు పసుపు పూస్తే తానూ పావడా కుచ్చిళ్లు ఎత్తి పట్టుకుంటుంది. అక్కడి అందరి ముత్తయిదువల్లోకీ సీతమ్మే పెద్ద ముత్తయిదువలా కనిపిస్తుంది. 
      ఇంటికి రాగానే నాన్న ఒళ్లో చేరి పేరంటం ముచ్చట్లన్నీ చెబుతుంది. నాన్న ‘‘అలాగా!’’ ‘‘ఔనా!’’, అంటూ ఆశ్చర్యం ప్రకటించాలి. లేకపోతే అలుగుతుంది. మా సీతమ్మ ఇంట్లో వుంటే ఎన్ని ఊసులో. అందుకే కాబోలు రామ భక్తుడైన త్యాగరాజు కూడా ‘‘సీతమ్మ మాయమ్మ’’ అంటారు. ఆ సీతమ్మ కూడా మా సీతమ్మ లాగేనట. ఊసులన్నీ తండ్రితోనేనట.
      ఆ సీతమ్మకు పెండ్లి చేయాలన్న సంకల్పం కలిగిందట జనకుడికి. ఆ విషయం సీతమ్మ చెవిన కూడా పడ్డదేమో? అప్పటి నుంచీ, నాన్నని వదలకుండా పట్టుకు తిరుగుతూ ఉందట. ‘‘ఎందుకమ్మా అస్తమానమూ అలా నాన్న పంచె పట్టుకుని తిరుగుతావు?’’ అనడిగితే ‘‘పెళ్లయితే అత్తారింటికి వెళ్లిపోతానుగా’’ అందట.
      తల్లి కూడా ఒకింటి నుంచే వచ్చింది కాబట్టి కూతురు అత్తారింటికి వెళ్లిపోతుందంటే ఎలాగో ఓర్చుకుంటుంది. కానీ, తండ్రి ఎలా తట్టుకుంటాడూ!? బయటికి ఏడ్చేవాళ్లకి సానుభూతి ఉంటుంది. మరి లోపల ఏడ్చేవాళ్లకో...?
      జనకుడు మహా తత్వవేత్త. అంత సులభంగా తన తల్లిని అత్తారింటికి పంపించేస్తాడా? అందుకే చిన్న పరీక్షే పెట్టాడు. ‘మా ఇంట్లో పురాతన విల్లొకటుంది. దాన్నెక్కుపెట్టండి. మా అమ్మాయినిచ్చేస్తాను’ అని. ఆ మాటతో సీతమ్మ తల్లి సుమేధమ్మ కొంచెం ఊపిరిపీల్చుకుంది. ఆ విల్లెక్కు పెట్టేవాడొచ్చేదాకా తన చిట్టితల్లికి ఇంకొన్ని సంబరాలు చేసుకోవచ్చుననుకుంది. 
      రాముడు, సుగుణాభిరాముడు, కౌసల్యా సుప్రజా రాముడు, కోదండరాముడు, కైకేయీ నయనాభిరాముడు... సీతారాముడవడానికి వచ్చాడు. అయ్యాడు. అయినా సీతమ్మ జనకుని చంకలోనే ఉంది. అప్పటికామె వయసు ఆరేళ్లేగా! నాన్న ముఖం తన వైపునకు తిప్పుకుంటూ తననే చూడమంటోంది. జనకుడికేమీ కనిపించడంలేదు. తన కంటికీ సీతమ్మకూ మధ్య నీటి గోడ! ఇటుకల గోడయినా కూలుతుందేమోగానీ ఈ నీటి గోడ మాత్రం పగలడంలేదు. జనకుణ్ని చూసి వశిష్ఠుడూ, విశ్వామిత్రుల కళ్లలో కూడా ఒక నీటి తెర. సీతా కల్యాణం చూడటానికి వచ్చిన వారందరిదీ ఇదే పరిస్థితి. అక్కడున్న పెద్ద ముత్తయిదువలు కల్పించుకుని ఆ నీటి గోడలను ద్రవీభవింపజేేశారు. సీతమ్మ దశరథుడికి కోడలయ్యింది.
      ఇప్పుడు దశరథుడి కళ్లలో నీటితెర. ఇన్నాళ్లకు తన ఇంట ఓ ఆడపిల్ల తిరగాడబోతోంది. పట్టు పావడా, పరికిణీ, ఇంత పొడుగు జడ, చేతులకు గాజులు, చిరు మువ్వల పట్టీలు ఘల్లు ఘల్లు మంటూ సీతమ్మ రామయ్య వెంట నడుస్తూ ఉంటే ముచ్చటపడి చూస్తున్న తన దొంగ చూపుల్ని ఎవరయినా చూస్తారేమోనన్న బెరుకు. దాన్ని ఊహించుకుంటూ తెల్లని గుబురు మీసాల్లోంచి అతను చిందిస్తున్న చిరునవ్వులు బయటపడటం లేదు. కానీ కళ్లు చెబుతున్నాయి.
      ‘‘నన్నొక్కసారి నాన్నా అని పిలవరా’’ అని సీతమ్మనడగాలని ఎన్నోసార్లు ప్రయత్నించాడు దశరథుడు. కానీ, ఎలా అడగాలో తెలియలేదు. ఎవరైనా వింటే నవ్వుతారేమో? కౌసల్యా సుమిత్రలు ఆట పట్టిస్తారేమో? అన్నీ అనుమానాలే. అయితే, ఈ కోరిక సంగతి కౌసల్యకు తెలుసు. ఆమె ఒకసారి జనకుడితో మీ అమ్మాయిని మావారు బాగా చూసుకుంటారు అని చెప్పే సందర్భంలో ‘‘ఏషా రఘుకుల మహత్తరాణాం వధూః, అస్మాకం తు దుహితైవ’’ అని దశరథుడు అంటూ ఉంటాడని చెప్పింది. అంటే ‘‘రఘుకులంలోని మహనీయులందరికీ జానకి కోడలు, నాకు మాత్రం కూతురు’’ అని అర్థం. ఈ సంగతి అక్కడున్న కంచుకికి కూడా తెలిసినట్లుంది. ‘‘అవును మహారాజా. మా రాజుగారికి తన పిల్లలందరిలోకీ రాముడు మహా ఇష్టుడు. కానీ కోడళ్లలో మాత్రం సీత అంటే కూతురంత ఇష్టం’’ అన్నాడు కౌసల్య వాదానికి బలం చేకూరుస్తూ. ఈ రమణీయ ఘట్టం ఉత్తర రామచరితంలో కనిపిస్తుంది. 
      దశరథుడు ఎన్ని రాచకార్యాల్లో మునిగి ఉన్నా, మధ్యలో ఏదో పని కల్పించుకుని సీతమ్మను చూడ్డానికి వచ్చేవాడట. తన పని తాను చూసుకుంటూ యథాలాపంగా అడిగినట్లు ‘‘సీతమ్మకు పాలు పట్టావా?’’ అని కౌసల్యను అడిగేవాడట. ‘‘మీ కోడలుగారు ఇక్కడుంటే కదా, ఇవ్వడానికి. ఆమెగారికి ఆ కైకమ్మ ఇల్లే పొద్దస్తమానమూనూ, ఆమెతో బాటూ రామయ్యా అక్కడే...’’ ఆమె మాట పూర్తవకుండానే అదే పరుగున కైక మందిరానికి వెళ్లేవాడట దశరథుడు. 
      ‘రామయ్య ఎప్పుడూ పిన్నమ్మా అని కైక కొంగు పట్టుకునే తిరిగేవాడు ఇంతకు మునుపు. ఇప్పుడు పెళ్లయింది గదా. కోడలైనా నా దగ్గరుంటుంది, ఆమె కైనా చిన్నచిన్న సేవలు చేసుకుందామను కుంటే ఏదీ! ఏకంగా ఇద్దరూ అక్కడే’ కౌసల్య ఇంకా గొణుగుతూనే ఉంది. సపత్ని మీద ఈర్ష్య ఇప్పుడు కలిగింది ఆమెలో.
      అక్కడ కైక ఒడిలో కూర్చుని ఆమె పైట చెంగు మెలిపెడుతూ, మంగళ సూత్రాలతో ఆడుకుంటూ, ముద్దుముద్దు మాటలు చెబుతూ, పాలు కొద్ది కొద్దిగా గిన్నెలోంచి లోటాలోకి పోసిస్తూ ఉంటే తాగుతూ రామయ్య కేసి చూస్తూ చిరునవ్వులు చిందిస్తూ, అమాయకంగా కళ్లార్పుతూ ఉన్న సీతమ్మను చూశాడు దశరథుడు. కళ్లు మిలమిలలాడాయి. మనసు ఆనందంతో గంతులేసింది. ఇదివరకైతే దశరథుడు రాగానే కైక గబగబా లేచివెళ్లి భర్తకు స్వాగతం పలికేది. ఇప్పుడు కూర్చున్న ఆమె లేవడం కూడా లేదు.
      ఎందుకంటే ఒడిలో సీతమ్మ, కాళ్ల దగ్గర రామయ్య. సీతమ్మ కైక చీరకొంగు మెలిపెడుతూ కబుర్లు చెబుతూ ఉంటే, రామయ్య కైకమ్మ కాలి పట్టీలూ, మట్టెలు కదిలిస్తూ వాటి చిరుసవ్వడి వింటున్నాడు. వారి ఆనందానికి హద్దుండదు, కైకేయి ఓపికకి దరీ ఉండదు. పరిచారికలు ఎంతమంది ఉన్నాసరే, రామయ్య సీతమ్మల సేవ తనదే. పిల్లలు పుట్టిన తర్వాత భార్యకు భర్త మీద శ్రద్ధ కొంచెం తగ్గుతుందని అంటారు. కానీ ఇక్కడ కోడలు వచ్చిన తర్వాత తగ్గింది. కాదు కాదు, బాగా తగ్గింది. అది గుర్తొచ్చి దశరథుడు గుబురు మీసాల్లో నుంచి గుంభనంగా నవ్వుకున్నాడు. ‘‘సీతమ్మ.... మా..యమ్మ’’ అని మనసారా అనుకున్నాడు. 
      ఆ లోగా సీతమ్మకి పొలమారింది. దశరథుడు ఒక్క పరుగున కైకేయి వద్దకు వచ్చి ‘‘అలాగేనా పిల్లకు పాలు తాగించేది. నిదానంగా తాగించలేవా? చూడు, బిడ్డకు పొరబోయింది’’ అని గద్దించాడు. అంతటితో ఆగక, ‘‘రేపటి నుంచి నన్ను పిలువు. నేను తాగిస్తాను. తెల్సిందా?’’ అన్నాడు కోపంగా. అదేం కోపమో కైకకు తెలుసు. పెదవి దాటనీయని నవ్వు నవ్వుకుంది. 
      అలా పన్నెండేళ్లు గడిచిపోయాయి. మరో విధంగా మరో పన్నెండున్నరేళ్లు దాటిపోయాయి. సీత రాముణ్ని అంటిపెట్టుకునే ఉంది. ఆమె అమాయకత్వమూ ఆమెనంటిపెట్టుకునే ఉంది. లేకపోతే దాదాపు మూడు పదుల వయసున్న సీతమ్మకు ‘బంగారు లేళ్లు ఉంటాయా?’ అన్న అనుమానం రావాలి కదా. రాకపోతే పోయింది. తెచ్చి పెట్టమని మారాం చేస్తుందా? పైగా మరో ప్రతిపాదనా చేసింది. ‘‘మనమిట్టి లేడిఁ గనినా/ మని చెప్పిన నమ్మరెవ్వ రసలీ లేడిం/ గొని చని, కనక మృగంబం/ చును జెప్పుచు, నమ్మనపుడు చూపింపవలెన్‌’’ అని అంది రాముడితో. కవి సమ్రాట్‌ విశ్వనాథ సత్యనారాయణ ‘రామాయణ కల్పవృక్షం’లో కనిపిస్తుందీ దృశ్యం. ప్రాణంగా ప్రేమించే అర్ధాంగి కోరికని రాముడు కాదనలేక పోయాడు. ఆ తర్వాత! సీతమ్మ అమాయ కత్వం బంగారు లేడితోబాటే మాయమైపో యింది. అమాయకత్వం ఉన్నంత వరకు సీతమ్మ మాయమ్మలాగా ఉంది. అది మాయమయ్యే సరికి మా సీతమ్మ సీతమ్మవారు అయింది. ఇక పూజలే!


వెనక్కి ...

మీ అభిప్రాయం