ఉగాది రాణీ... స్వాగతం! సుస్వాగతం!!

  • 25 Views
  • 0Likes
  • Like
  • Article Share

ఉగాది అంటే వసంత రుతువు ప్రారంభ దినం. శిశిరంలో ఆకురాల్చి మోడువారిన చెట్లు మళ్లీ కొత్త చిగుళ్లు తొడుగుతాయి. ప్రకృతి ఆకుపచ్చ అందాలతో మెరిసిపోతుంటుంది. అందుకే ఉగాది అనగానే ఏదో తెలియని ఉత్సాహం తొణికిసలాడుతుంది. ఇది ఏటా కనిపించేదే. అయితే మనిషి జీవితం కూడా శిశిర వసంతాల సంగమం. తన చేతలవల్ల అయితేనేమి, తనకు సంబంధంలేని సంఘటనల వల్ల అయితేనేమి మనిషి అప్పుడప్పుడూ మోడువారుతుంటాడు. జీవితానికి వెలుగునిచ్చే వసంతం కోసం ఎదురుచూస్తుంటాడు. ఈ క్రమంలో- గడిచిన కాలం ఎలాగో గడిచిపోయింది... రాబోయే రోజులన్నా బాగుండాలని కోరుకోవడం సహజమే. అదే కొత్త ఏడాది రాబోతుంటే ఆ కోరిక ఇంకా అధికమవుతుంది. వచ్చే ఏడాదైనా సమస్యల నిశిని దాటించే వెలుగు కాగడా కాకపోతుందా అన్న ఆశే... ఉగాదిని మనసారా ఆహ్వానింపజేస్తుంది. మధురకవి జాషువా కూడా ఇదే ఆశతో... ఆలోచనతో ఉగాదిని ఆహ్వానించారు. మరి ఇంతకూ ఆయన కోరుకున్న ఆ వసంతం ఏంటి?
      ఇరవయ్యో శతాబ్దం తొలి యాభై ఏళ్లలో ప్రపంచమంతా ఒకరకమైన సంక్షోభం. రెండు ప్రపంచ యుద్ధాలు జరిగాయి. రష్యా, చైనాల్లో విప్లవాలు వచ్చాయి. భారతదేశం బ్రిటిష్‌ పాలనలో అతలాకుతలమైంది. గతకాలపు ఈ చెడును మనిషి ఆంతరంగిక ప్రవృత్తితో ముడిపెడుతూ, జాషువా ‘కొత్తయేడు’ శీర్షికతో ఓ మూడు పద్యాలు రాశారు. ‘శోభకృత్‌’ (1963) నామ సంవత్సరాన్ని ఆహ్వానిస్తూ రాసిన ఈ పద్యాలు నాటి వార్షికపత్రిక ‘గుంటూరు పత్రిక’లో ప్రచురితమయ్యాయి.
చనియెన్‌ పెక్కు యుగాదులీవరకు విశ్వక్షోణి పాలించి, చి
క్కని దౌష్ట్యాంధ తమస్సులో వెలుగు రేఖల్‌ దిద్దగాలేక వినూ
తన సంవత్సర దీధితుల్, కలుషితాత్మల్‌ శుద్ధిగావించి, పూ
యని చిత్తంబులకున్‌ వసంత ఋతు మర్యాదల్‌ ప్రసాదించుతన్‌
ఎండిన తోటలెల్ల ననలెత్తి, త్వ దాగమనంబు చేత బ్ర
హ్మాండము పుష్ప హాస మధురాస్యము దాల్చె యుగాది రాజ్ఞి! మా
గుండెలలోన దాగిన యగోచర కల్మషముల్‌ హరించి మా
యెండిన జీవితాలు ఫలియించ శుభోదయముల్‌ ఘటింపవే!
ఈ మనుజాళి నేలికొని యేగిన ప్రాతయుగాదులందు సాం
గ్రామిక ఘోషలన్‌ కలుష కార్య పిపాసల కాలి దగ్ధమై
ధూమము జిమ్ము మా హృదయ తోయజ పుష్పములం దుగాది రా
జ్ఞీమణి! శాంతి సౌఖ్యముల నింపుము పెంపుము ప్రేమసస్యమున్‌

      మనిషికి మంచి ఆలోచనలు ఉంటాయి. కొన్నిసార్లు పాపపు ఆలోచనలూ ఉంటాయి. మంచి వాటివల్ల ప్రజానీకానికి మేలు జరిగినట్లే... పాపపు ఆలోచనల వల్ల కీడు జరగడమూ సహజమే. ఇలాంటి ఆలోచనల వల్ల వ్యక్తిగత, సమాజగత స్థాయుల్లో జరుగుతున్న అనర్థాలను అరికట్టగలిగే చైతన్యాన్ని మోసుకురమ్మని ఆ ‘ఉగాది రాణి’ని అర్థించారు జాషువా. కొత్త సంవత్సర కాంతులు దుర్మార్గమనే చిమ్మ చీకటిలో వెలుగు రేఖలను దిద్దకుండానే, కలుషితమైన మా ఆత్మల్ని శుద్ధి చేయకుండానే, మా మనసులలో వసంత రుతుధర్మాన్ని ప్రసాదించకుండానే ఎన్నో ఉగాదులు వచ్చి వెళ్లిపోయాయి. నీ రాకవల్ల ఎండిన తోటలు కొత్త చివురులు మొగ్గ తొడిగి ఈ విశ్వమంతా పూల నవ్వులాంటి మధురమైన ముఖాన్ని దాల్చింది కదా! అలానే మా గుండెల్లో దాగిన కల్మషాలను హరించి, మోడువారిన మా జీవితాలు ఫలవంతమయ్యేలా శుభోదయాలను ఇవ్వు. ఆ పాత ఉగాదుల్లో ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఎంతో ధన మాన ప్రాణ నష్టం జరిగింది. ఆ పాపపు కాంక్షలో కాలిపోయి పొగ చిమ్ముతూన్న మా హృదయ కమలాల్లో శాంతి సౌఖ్యాలను నింపు. ప్రేమపైరును పెంచు ఓ ఉగాది రాణీ! అని కొత్త ఉగాదిని ఆహ్వానించారు జాషువా. అవును మరి... జీవితం నిత్యవసంతమవ్వాలంటే మంచి ఆలోచనలనే చివుర్లు నిత్యం మొగ్గతొడుగుతుండాలి. నిజానికి మనిషిలోని ఆ నిష్కల్మషత్వమే లోకాన్ని ‘పచ్చ’గా ఉంచుతుంది. జాషువా కోరుకునే వసంతం ఆ నిష్కల్మషత్వమే! 


వెనక్కి ...

మీ అభిప్రాయం