జనకుడ అన్నమాచార్యుడ విచ్చేయవే

  • 40 Views
  • 5Likes
  • Like
  • Article Share

    చింతలపల్లి హర్షవర్ధన్‌

  • గట్టుఇప్పలపల్లి, మహబూబ్‌నగర్‌ జిల్లా
  • 9014897030
చింతలపల్లి హర్షవర్ధన్‌

యజ్ఞం చేసి పితృరుణం తీర్చుకోవాలంటారు పెద్దలు. పితరులను స్మరించుకునే సనాతనమైన ఈ క్రతువు ఈనాటికీ దేశమంతటా ఏదోరూపంలో అమలవుతూనే ఉంది. పాటతో ప్రపంచాన్ని పావనం చేసిన అన్నమయ్యను  కొడుకు పెద తిరుమలయ్య శ్రాద్ధానికి సంకీర్తనా రూపంలో ఎలా ఆహ్వాచించాడో.. శ్రాద్ద కర్మలోని విశేషాలని పాటలో ఎలా నిక్షిప్తం చేశాడో విశ్లేషించే ప్రయత్నమిది.
హిందువుల
ఆచారాలలో మరణించిన పెద్దలను స్మరించుకుంటూ పితృ కర్మలను నిర్వహించడం ఒకటి. దీనినే పితృయజ్ఞం అని, పితృరుణం అని పేర్కొంటారు. సాధారణంగా మనిషి మరణించిన తర్వాత పన్నెండు రోజులపాటు నిత్యకర్మ, ఆ తర్వాత ఏడాదిపాటు ప్రతీ నెలా మరణించిన తిథిని అనుసరించి మాసికం, చివర్లో చనిపోయిన తిథి వచ్చే రోజున సాంవత్సరికం (సంవత్సరీకం), అటుపైన ప్రతీ ఏటా పెద్దలు మరణించిన తిథినాడు ‘తద్దినం’ జరుపుతారు.
      తద్దినాన్నే ఆబ్దికం, శ్రాద్ధం అనీ పిలుస్తారు. ఇందులో భాగంగా తండ్రి, తాత, ముత్తాతలను (పితరులు అంటే వీళ్లే) స్మరించుకుంటూ పిండప్రదానం చేస్తారు. దీనికి సంకేతంగా మూడు అన్నం ముద్దలను నివేదిస్తారు. కొన్ని కుటుంబాలలో అయితే బ్రాహ్మణులకు భోజనం పెట్టడం ద్వారా తమ పితృదేవతలను సంతృప్తి పరిచినట్లుగా భావిస్తారు. ఇక తద్దినం అని ప్రత్యేకంగా చేయని కుటుంబాలలో ప్రతీ ఏటా భాద్రపదమాసం కృష్ణపక్షంలో ‘పితృపక్షం’ పేరుతో ఈ క్రతువును నిర్వహిస్తారు. వీటిలో మహాలయ అమావాస్య ప్రత్యేకమైంది.
      మనిషి ఆచరించాల్సిన యజ్ఞాల్లో పితృయజ్ఞం ఒకటి. పెద్దలను స్మరించుకునే ఆచారం ఒక్క భారతదేశంలోనే కాదు వివిధ దేశాలలో ఏదో ఒక రూపంలో ఉనికిలో ఉంది. ఇది మామూలుగా అందరూ చేసే తతంగం అని ఒక సంకీర్తనాచార్యుడైన కొడుకు పరమపదించిన సంకీర్తనాచార్యుడైన తన తండ్రిని శ్రాద్ధానికి ఆహ్వానించాలంటే ఏం చేస్తాడు? అంటే సాధారణమైన క్రతువులతో పాటు సంకీర్తన రూపంలో తండ్రిని పిలుస్తాడు కదా! అయిదువందల ఏళ్ల కిందట పెద తిరుమలాచార్యుడు తన తండ్రి అన్నమాచార్యులను ఆబ్దికానికి ఆహ్వానించేందుకు 
సంకీర్తననే సాధనంగా ఎంచుకున్నాడు మరి!
దినము ద్వాదశి నేడు తీర్థ దివసము నీకు
జనకుడ అన్నమాచార్యుడ విచ్చేయవే।।
అనంత గరుడ ముఖ్యులైన సూరిజనులతో
ఘన నారదాది భాగవతులతో
దనుజ మర్దనుడైన దైవ శిఖామణి తోడ
వెనుకొని యారగించ విచ్చేయవే।।
వైకుంఠాన నుండి యాళువారల లోపలనుండి
లోకపు నిత్యముక్తులలోన నుండి
శ్రీకాంత తోడనున్న శ్రీవేంకటేశు గూడి
యీకడ నారగించ నింటికి విచ్చేయవే।।
సంకీర్తనము తోడ సనకాదులెల్ల బాడ
పొంకపు శ్రీవేంకటాద్రి భూమి నుండి
లంకె శ్రీవేంకటగిరి లక్ష్మీవిభుడు నీవు
నంకెల మా యింటి విందులారగించవే।।
      తనజన్మకు, తనవృద్ధికి, తనపాండిత్య గరిమకు కారకుడైన తండ్రి, అన్నమయ్య పట్ల పెద తిరుమలయ్య ఎంత ‘శ్రద్ధ’ చూపుతున్నాడో వ్యక్తికరించే సంకీర్తన ఇది. అసలు శ్రాద్ధం అంటేనే శ్రద్ధగా చేసేది అని అర్థం. అన్నమయ్య బహుళ ద్వాదశి నాడు వైకుంఠం చేరుకున్నాడని ఈ సంకీర్తన తెలియజేస్తోంది. అందుకే ఎత్తుగడలోనే ‘దినము ద్వాదశి నేడు తీర్థ దివసము నీకు/ జనకుడ అన్నమాచార్యుడ విచ్చేయవే’ అని తండ్రిని శ్రాద్ధపు విందుకు ఆహ్వానిస్తున్నాడు పెద తిరుమలయ్య. ఇందులో ‘తీర్థ దివసము’ అంటే ఆబ్దికం జరిగే రోజు - అంటే తర్పణాలు (తీర్థం అంటే నీళ్లు అని సాధారణ అర్థం) విడిచే దినం అని అర్థం. ఇక అన్నమయ్య పెద తిరుమలయ్యకు కేవలం జన్మనిచ్చిన తండ్రి మాత్రమే కాదు, ఆచార్యుడు కూడా! అందుకే ‘జనకుడ - ఆచార్యుడ’ అన్న రెండు పదాలూ ప్రయోగించాడు.
      మరి అన్నమయ్యను విచ్చేయమన్నాడు సరే! అయితే ఆ విచ్చేయడం మాత్రం ఒక్కడిగా కాదు సుమా! అనంతుడు, గరుత్మంతుడు (విష్ణువుకు తల్పంగా ఒకరు, వాహనంగా ఇంకొకరు అంటిపెట్టుకొని ఉంటారు)
      మొదలైన సూరిజనులు; నిరంతరం నారాయణ నామస్మరణం చేసే నారదుడు మొదలైన గొప్ప విష్ణుభక్తులు; వీళ్లందరితోపాటు దనుజమర్దనుడైన దైవశిఖామణి అంటే సాక్షాత్తూ విష్ణుమూర్తే అయిన శ్రీవేంకటేశ్వరుడితో కలిసి తన ఇంట భోజనం అరగించేందుకు రమ్మని పిలుస్తున్నాడు పెద తిరమలాచార్యుడు. సూరిజనులు అంటే అనుక్షణం విష్ణుమూర్తిని అంటిపెట్టుకుని ఉండేవాళ్లని అర్థం.
      అన్నమయ్య పరమ భాగవతుడు. దేహం విడిచిపెట్టిన అనంతరం భాగవతులు - విష్ణుభక్తులు వైకుంఠాన్ని చేరుకుంటారన్నది విశ్వాసం. అందుకే వైకుంఠం నుంచి, పన్నెండు మంది ఆళ్వారులలోంచి, జనన మరణ చక్రం నుంచి విముక్తి పొంది పరమపదం చేరుకున్న ‘నిత్యముక్తుల’లోంచి శ్రీకాంత (లక్ష్మీదేవి) తోడుగా ఉన్న శ్రీవేంకటేశ్వరుడితో కలిసి విందు ఆరగించేందుకు తండ్రిని విచ్చేయమంటున్నాడు పెద తిరుమలయ్య.
      నవవిధ భక్తిమార్గాలలో ‘కీర్తనం’ ఒకటి. ఈ మార్గంలోనే అన్నమయ్య వేలాది సంకీర్తనలు రచించి అలమేలు మంగపతిని అర్చించి తరించాడు. అందుకే వైకుంఠంలో ఉన్న సనకాది ముఖ్యులు సంకీర్తనలు ఆలపిస్తూ ఉంటే, శ్రీవేంకటాద్రి భూమి నుంచి శ్రీవేంకటగిరి లక్ష్మీవిభుడితో (వేంకటేశ్వర స్వామితో) కలిసి నీవు మా ఇంటి విందులు ఆరగించేందుకు విచ్చేయవయ్యా అని వేడుకుంటున్నాడు తిరుమలయ్య.
      ఇక్కడ ‘శ్రీవేంకటాద్రి భూమి’ అంటే వైకుంఠం అంటే మరొకటి కాదు అది తిరుమలే అని రూఢి పరచడమే. బ్రహ్మాండంలో వేంకటాద్రికి సమానమైన స్థానం మరొకటి లేదంటారు కదా! అన్నమయ్య కూడా ‘కట్టెదుర వైకుంఠం’ అన్నది తిరుమలను ప్రస్తుతిస్తూనే కదా!
      ఇలా తన తండ్రి శ్రాద్ధ కర్మ రోజు తాను విందుగా పెట్టే భోజనాన్ని ఆరగించేందుకు అన్నమయ్యను - దైవశిఖామణి, వేంకటగిరి లక్ష్మీవిభుడైన శ్రీవేంకటేశ్వరుడు (విష్ణుమూర్తి), ఇంకా స్వామి పరివారంతోపాటు ‘విచ్చేయవే’ అని ముమ్మూర్లు సభక్తికంగా వేడుకుంటున్నాడు పెద తిరుమలాచార్యులు. పరమపదించిన సంకీర్తనాచార్యుడైన తండ్రిని, ఆయన ఆబ్దికం నాడు ఇంటి విందు ఆరగించేందుకు రమ్మంటూ సంకీర్తనతోనే ఆహ్వానించడం గొప్ప విషయం కదా! తండ్రికి ఒక కొడుకు ఇంతకంటే ఎక్కువగా ఇంకేం గౌరవం ఇవ్వగలడు?
      జోహారు అన్నమయ్యా!
      జోహారు పెద తిరుమలయ్యా!!


వెనక్కి ...

మీ అభిప్రాయం