ఉజ్వల తెలుగు తేజం మన ప్రకాశం

  • 286 Views
  • 1Likes
  • Like
  • Article Share

    సాహితీసుధ

‘‘రండిరా ఇదె కాల్చుకోండిరా యని నిండు
గుండెలిచ్చిన మహోద్దండమూర్తి
పట్టింపు వచ్చెనా బ్రహ్మంతవానిని
గద్దించి నిలబెట్టు పెద్దమనిషి
తనకి నామాలు పెట్టిన శిష్యులను గూడ
ఆశీర్వదించు దయామయుండు
సర్వస్వము స్వరాజ్య సమర యజ్ఞమునందు
హోమమ్మొనర్చిన సోమయాజి
అతడు వెలుగొందు ముక్కోటి ఆంధ్రజనులు
నమ్మికొల్పిన ఏకైక నాయకుండు
మన ప్రకాశము మన మహామాత్యమౌళి
సరిసములులేని ఆంధ్ర కేసరి యతండు’’

 అని టంగుటూరి పై కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి చెప్పిన పద్యం ఆంధ్రకేసరి నిండు వ్యక్తిత్వాన్ని పట్టిచూపుతుంది. జీవితంలో ఎదిగిన వాళ్లు, గొప్ప నాయకులుగా కీర్తింపబడినవాళ్లు తమ జీవితకాలంలో ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నారో, ఎలాంటి ముళ్ల దారిని ఎంచుకున్నారో వారి అత్మకథలే చెబుతాయి.. ఆయా కాల పరిస్థితులు, జీవన స్థితిగతులు, ఆలోచనల ప్రభావాలు వారికి గొప్పతనాన్ని తెచ్చిపెడతాయి. అలా చిన్ననాటనే ఎన్నో కష్టాలను ఎదుర్కొని, ఎన్నో ఢక్కాముక్కీలు తిని, స్వయంశక్తితో రాష్ట్రజనుల మన్ననలు పొంది, అచంచల దీక్షాబలంతో ఆంధ్రరాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా తెలుగువారి మదిలో సుస్థిర స్థానం సంపాదించుకున్న టంగుటూరి ప్రకాశం పంతులు వర్ధంతి సందర్భంగా వారి బాల్య జీవితాన్ని స్మరించుకునే ప్రయత్నమిది.
ధగా ధగా వెలగాలంటే భగభగా మండిపోవాలి
ప్రకాశం పంతులు 1872 లో కనపర్తి గ్రామంలో మేనమామల ఇంట్లో జన్మించారు. అప్పుడే దేశంలో ధాత కరువు వచ్చి ప్రజలు అల్లల్లాడిపోతున్నారు. టంగుటూరు, వల్లూరు, వినోదరాయుడు పాలెం గ్రామాలతోనే వీరి బాల్య జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. చిన్ననాటనే తండ్రి చనిపోవడంతో ప్రకాశం జీవితంలో కష్టాలు మొదలయ్యాయి. గంపెడు సంసారాన్ని ఈదడం కోసం తల్లి పడ్డ శ్రమ అంతా ఇంతా కాదు. ఒంగోలు లో కోర్టులూ, కార్యాలయాలు ఎక్కువ కాబట్టి అక్కడ ఉపాధి దొరుకుతుందని భోజన హొటల్‌ పెట్టడానికి నిశ్చయించుకుంటుంది. ఆ రోజుల్లో అన్నం అమ్ముకుని జీవనం సాగించేవారిని పూటకూళ్లవాళ్లు అని చులకనగా చూసేవారు. ఎన్ని అవమానాలు ఎదురుకానీ తలకాచుకుని పిల్లల్ని ప్రయోజకుల్ని చేస్తే అనతికాలంలోనే కష్టాలు గట్టెక్కుతాయని భావించేదా తల్లి. ఇంత వయసులో ఈవిణ్ని కష్టపెడుతున్నానే అని ప్రకాశం మదన పడేవారు. తల్లి పడుతున్న కష్టాన్ని చూసి చలించిపోయేవారు. అసలే చిన్నతనం. ఆకతాయి పిల్లలతో తిరుగుళ్లు. కొంతకాలంపాటూ ఆటపాటలతో కాలక్షేపం చేసిన ప్రకాశానికి బాధ్యత తెలిసొచ్చింది. మేనమామ పొలంలో మంచెమీద నిలబడి కావలి కాచేవారు. తీరికవేళల్లో నాటకాలు ఆడేవారు. ఇంగ్లీషు చదువుల ప్రాభవం అప్పుడే మొదలైంది. ప్రకాశాన్ని మిడిల్‌ స్కూల్లో చేర్పించింది తల్లి. అయినా పిల్లల చదువులకీ, తిండికీ డబ్బు కరవు అలాగే ఉండేది. ఎంత శ్రమించినా దారిద్య్రం వెక్కిరించేది. సంపన్నుల ఇళ్లల్లో వారాలు చేసుకుని చదువుకొనసాగించారు ప్రకాశం. నాగరాజు సూర్యనారాయణరావు అనే తెలుగు ప్లీడరును అడిగీ పిల్లాడికి కావలసిన డబ్బు ఇప్పించేది ఆ తల్లి. 
      ఒకసారి మిడిల్‌ స్కూల్‌ పరీక్షకోసం మూడు రూపాయలు కట్టవలసివస్తే తల్లి దగ్గర పైసా లేదు. పాతికమైళ్ల దూరంలో ఉన్న బావగారి ఊరు నడిచివెళ్లిపోయారు ప్రకాశం. ఆ రోజుల్లో బంధువుల ఇళ్లకి వెళ్లాలంటే నడక తప్ప మరోమార్గం ఉండేదికాదు. నడక గురించి చెప్తూ ప్రకాశం తన ఆత్మకథలో ఇలా అంటారు ప్రకాశం ‘‘ ఆనాటి నడక సత్తువే ఇప్పటికీ బలిష్టంగా ఉంచిందని నా నమ్మకం’’. బావ దగ్గరినుంచి ఎలాంటి సాయం అందలేదు కాని తల్లే తనదగ్గరున్న పట్టుబట్ట తాకట్టు పెట్టి మూడు రూపాయలు తెచ్చిచ్చింది. 
      చిన్నతనంలో ప్రకాశానికి ఒక కోరిక ఉండేది. లాంగుకోటుతో ధర్జాగా తిరిగే ప్లీడర్లను చూసీ ఎలాగైనా ప్లీడరు అవ్వాల్సిందేనని మనసులో బలంగా అనుకున్నారు. అందుకోసం ఒక లాంగ్‌ కోటు కూడా కుట్టించుకున్నారు. 
     రాజమండ్రి వచ్చిన తర్వాత చిన్ననాటి ప్రకాశం పై చాలా ప్రభావాలు పనిచేశాయి. మిషన్‌ స్కూల్లో పంతులుగా ఉన్న ఇమ్మానేని హనుమంతరావు నాయుడు సంరక్షణలో సరికొత్త రాజమండ్రిని చూశారు. నాటకాలు ప్రదర్శించారు. నాటక సమాజాల్లో చురుగ్గా పాల్గొన్నారు. ముఠా తగాదాల్లో కూడా తలదూర్చి కొంత అలజడిని కూడా సృష్టించారు. చిన్ననాట ప్రకాశం ఎదుర్కొన్న దారిద్య్రం, ప్లీడరు చేయాలనే తలంపు, మెండి పట్టుదల, తనమీద తనకు గల అచంచల విశ్వాసం, మద్రాసులో సైమన్‌ కమీషన్‌ ని బహిష్కరిస్తూ ‘‘దమ్ముంటే కాల్చుకోండిరా’’ అంటూ.. తుపాకులకు ఎదురునిలిచిన సాహసం ప్రకాశాన్ని ఆంధ్రకేసరిని చేశాయి. కందుకూరి వీరేశలింగం పంతుల సాహచర్యం కొత్త ఆలోచన శక్తికి నారుపోసింది. ముఖ్యమంత్రిగా కీలక నిర్ణయాలు తీసుకోవడంలో వీరి దార్శనిక దృష్టి, సమయస్ఫూర్తి ఆంధ్రజనులకు అనుసరణీయాలయ్యాయి. తన యావదాస్తినీ ప్రజోద్యమ వికాసానికి దారబోసిన ప్రకాశం అవసానంలో చాలా అవస్థలు పడ్డారు. ప్రకాశం జీవితంలోని విశేషాలనూ, అప్పటిదేశ పరిస్థితులనూ, ప్రజల ఆలోచనలను తెలియజేసే ‘నా జీవిత యాత్ర’ అనే ఆత్మకథ ఈనాటికి సరికొత్త ప్రేరణశక్తికి మూలాధారంగా ఉంది. తెలుగువారి ఉన్నతికోసం జీవితాన్ని వ్యయం చేసిన ప్రకాశం 1957 మే 20 న ఈ లోకాన్ని విడిచిపెట్టారు.


‘‘ప్రకాశం గారు తమ జీవితకాలంలోనే భారత స్వాతంత్య్రం సిద్ధించడం, సర్వతంత్ర, స్వతంత్ర, గణతంత్రంగా ప్రకటించడం, ప్రత్యేకాంధ్రరాష్ట్రం ప్రాప్తించటం అన్నీ స్వయంగా చూసి, ఏళ్లు నిండిన పండు వయసులో పరిపూర్ణ గౌరవాలతో పరమపదించారు’’ 

- భారత రాష్ట్రపతి వరహగిరి వెంకటగిరి (‘నా జీవితయాత్ర’ ముందుమాటలో)


వెనక్కి ...

మీ అభిప్రాయం