విలక్షణ సాహితీ కిర్మీరం ‘కొండూరి’

  • 519 Views
  • 18Likes
  • Like
  • Article Share

    వి.స్వ‌రాజ్య ల‌క్ష్మి

  • విజ‌య‌వాడ‌
  • 9390888558
వి.స్వ‌రాజ్య ల‌క్ష్మి

అనేక వేదాంత ర‌చ‌న‌ల‌కు స‌ర‌ళ వ్యాఖ్యానాలు వెలువ‌రించారు. అధ్యాప‌కులుగా ప‌నిచేస్తూనే శిల్ప‌క‌ళా ర‌హ‌స్యాల‌ను వెలుగులోకి తెచ్చారు. బుద్ధుడు, క్రీస్తు, మ‌హ్మ‌దు ప్ర‌వ‌క్త‌ల జీవ‌కారుణ్య భావాన్ని కావ్యాల్లో  అందించారు. ప్రాచీన సాహితీ విలువ‌ల‌ను విల‌క్ష‌ణ‌శైలిలో అందించిన కొండూరి వీర‌రాఘ‌వాచార్యుల జీవ‌న ప్ర‌స్థాన‌మిది.
‘‘శిల్పసాహిత్యములు నాకు జీవగఱ్ఱలు
ఔపనిషద వనాలు విహారవీధులు
ఈ చరాచరాత్మక జగద్ధితము వ్రతము
వడుపు మిటు నాదు జీవితనాటకమ్ము’’.

చిన్న వయసులోనే ఆ సర్వేశ్వరుని ప్రార్థించి తన అభీష్టాన్ని నెరవేర్చుకున్న ‘‘దర్శనాచార్య’’ ‘‘కళాప్రపూర్ణ’’ కొండూరు వీరరాఘవాచార్యులు పండితలోకానికి చిరపరిచితులు. ఆయన రచనలు విశ్వనాథ, వేటూరి ఆనందమూర్తి, ఆర్‌.ఎస్‌.సుదర్శనం, ఆచార్య తూమాటి దోణప్ప మొదలైన పండిత ప్రకాండుల ప్రశంసలందుకొన్నాయి. తెనాలి వి.యస్‌.ఆర్‌ కళాశాలలో 1952 నుండి 1972 వరకు ఆంధ్రోపన్యాసకులుగా పనిచేశారు. అధ్యాపకులుగా పనిచేస్తూనే పలు రాష్ట్రాలలో పర్యటించి అక్కడి శిల్ప సంపదను గురించి లోతైన విశ్లేషణ చేశారు. ఆ అనుభవంతో ‘‘శిల్పకళాక్షేత్రాలు’’ అనే రచన తో శిల్ప చిత్రకళా రహస్యాలను వెలుగులోచి తెచ్చారు. బహుకుటుంబీకులైన ఆయన తన కర్తవ్యాలను నిర్వహిస్తూనే వివిధ ప్రాంతాలను దర్శిస్తూ అక్కడి జనజీవన స్థితిగతులను గమనిస్తూ, అనేక విషయాలను అవగాహన చేసుకొంటూ, అనేక బృహద్గ్రంథాలను వెలువరించారు. వాటిలో రామాయణ, భారత, భాగవతాలను గురించి మూడు కావ్యాలు, అమరావతి అనే పద్యకావ్యం, మన గురుదేవుడు పేరిట వీరబ్రహ్మంగారి చరిత్ర, శ్రీ వీరబ్రహ్మ సుప్రభాతం, శ్రీసిద్దప్ప చరిత్ర, నాగర ఖండము, మాఘ మహాత్మ్యము, మిత్రసాహస్రి, తత్వసాధన, ఆత్మదర్శనము, యోగదర్శనము, శిల్పదర్శనము, ఋగ్వేద దిగ్దర్శనము, ఋగ్వేద రహస్యాలు, యజుర్వేద దర్శనము (1,2,3, భాగములు) అధర్వవేద దర్శనము అనబడే దార్శనిక గ్రంథాలు, జక్కనాచార్యుని చరిత్ర, మోహనాంగి (శ్రీకృష్ణదేవరాయల పుత్రికగాథ), లేపాక్షి అనే చారిత్రక నవల అనేవి వీరి రచనల్లో కొన్ని. అనేక దర్శనకావ్యాలు రచించటం వలననే ‘‘దర్శనాచార్య’’ అనే బిరుదుకు అర్హులయ్యారు.
రాజాస్థానాల్లోనూ వేదాంత ప్రసంగాలు
ఆచార్యులు వారు అనేక రేడియో ప్రసంగాలతో పాటూ నాటికలు కూడా రచించారు. 1931 మార్చి 31 వ తేదీన అతి చిన్న వయసులోనే మైసూర్‌ మహారాజు ‘‘జయచామరాజ వడయార్‌’’ ఆచార్యుల వారిని తమ ప్యాలెస్‌కు ఆహ్వానించి,  వేద వేదాంతోపన్యాసాలు, పురాణ ప్రవచనాలు ఏర్పాటు చేయించి సత్కరించారు. ప్రతి ఏటా మైసూరు మహారాజా వారితో పాటు శ్రీకాళహస్తి మహారాజావారు కూడా దసరా పర్వదినాలలో ఆచార్యులను ఆస్థానానికి పిలుపించుకుని ఉపన్యాసాలు ఏర్పాటు చేసి సన్మానించటం అనేది కొంతకాలం సాగింది. 
      భారత స్వాతంత్రోద్యమంతో ఆచార్యుల వారికి ప్రత్యక్ష సంబంధం ఉంది. తత్వానందస్వామి, మళయాలస్వామి వంటి తత్వజ్ఞులతో సాన్నిహిత్యం ఏర్పరచుకున్నారు. వారితో కలిసి తత్వప్రచారంలో భాగంగా దేశమంతా విస్తృతంగా పర్యటించారు. 1939లో నిరంజనశాస్త్రితో పరిచయం ఏర్పరుచుకుని ‘‘నిరంజన విజయం’’ రచించారు. ఆసియా ఖండాన్ని తమ ప్రేమ త్యాగాలతో ప్రభావితం చేసిన బుద్ధుడు, ఏసు క్రీస్తు, మహమ్మదుల జీవిత చరిత్రలను ‘‘ఆసియా జ్యోతులు’’అనే పద్యకావ్యం రచించారు. ఆచార్యులవారు రచించిన లేపాక్షి, కళారాధన, మోహనాంగి వంటి చారిత్రక నవలలు కన్నడంలోకి అనువదింపబడి మైసూరు యూనివర్సిటీలో ఉపవాచకాలుగా ఉన్నాయి. ఆంధ్రరాష్ట్రంలో ముఖ్యంగా  శ్రీ వేంకటేశ్వర, ఆంధ్ర, ఉస్మానియా విశ్వవిద్యాలయాల్లో వీరి రచనలను పాఠ్యాంశాలుగా నిర్ణయించారు. 
      వివిధ పత్రికల్లో వీరి వేదవేదాంత, శిల్ప సాహిత్య వ్యాసాలు అనేకం ప్రచురించబడ్డాయి. భారతి మాసపత్రికలో కూడా వీరి సాహిత్య వ్యాసాలు అనేకం చోటుచేసుకున్నాయి
సాహితీ మిత్రులతో సహవాసం
రాఘవాచార్యులు విశేషకృషి చేసిన రచనలలో వేదదర్శనాలు ఎన్నదగినవి. సామాన్యులకు కూడా తేలికగా అర్థమయ్యే రీతిలో వేద విజ్ఞానాన్ని ప్రచారం చేయడంలో వీరి రచనాశైలి ప్రత్యేకమైంది. 
విశ్వనాథ, సంజీవదేవ్, ఆర్‌.ఎస్‌.సుదర్శనం, రాయప్రోలు, ఇంద్రగంటి, కొండవీటి వెంకట కవి వంటి కవి దిగ్గజాలు ఆచార్యులవారికి ఆప్తమిత్రులు. వెంకటకవి రచనలు చేస్తున్న తొలిదశలో ఆచార్యుల వారిని సంప్రదించి కొన్ని సలహాలు, సూచనలు తీసుకునేవారు. శ్రీరాంభుజంగరాయ శర్మ, వి.వి యల్‌ నరసింహారావు, జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ ఆచార్యులవారికి అత్యంత సన్నిహితంగా ఉండేవారు. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధులు వావిలాల గోపాలకృష్ణయ్య కి ఆచార్యులవారంటే పరమ ప్రీతి. ప్రముఖ మాస్టర్‌ సి.వి.వి. యోగ గురువు శార్వరి స్వయానా మేనల్లుడు. 
      పాత్రికేయులు ఆనందవర్ధన ఆచార్యులవారి ఏకైక పుత్రుడు. ప్రస్తుతం వారు కూడా కీర్తిశేషులే. సాధారణంగా కవి పండితులెవరైనా సరస్వతీ పుత్రులే కానీ లక్ష్మీపుత్రులు కారు. 
విద్యాదదాతి వినయం
వినయాద్యాతి పాత్రతాం
పాత్రత్వాద్ధ నమాప్నోతి
ధనాద్ధర్మం తతఃసుఖం

      అనే ఆర్యోక్తిని మూలాధారంగా మనుగడ సాగించిన బహుకుటుంబీకులు రాఘవాచార్యులు. తన వద్దకు వచ్చే పేదవారికెందరికో తన ఇంట వారాల భోజనాలు ఏర్పాటు చేసి వేద విజ్ఞానాన్ని బోధించిన సద్గురువులు. తెనాలిలో యలవర్తి ఆంజనేయశాస్త్రి వేద పాఠశాలను మొదటిగా తన ఇంటిలోనే ప్రారంభించిన వేదగురువులు. ఆ తరువాత యలవర్తి ఆంజనేయశాస్త్రి వితరణతో ఆ పాఠశాల దిన దిన ప్రవర్ధమానమై ఈనాడు నలభై నుంచి యాభై మంది విద్యార్థులతో ఉచిత భోజన వసతితో, వేద విద్యను అందరికీ అందించే స్థాయికి చేరి పలువురి మన్ననలు పొందింది. అక్కడ శిక్షణ పొందిన విద్యార్థులు ఈనాడు రాష్ట్రం నలుచెరుగులా పురోహితులుగా, వాస్తు సిద్ధాంతులుగా బతుకు బాట సాగిస్తున్నారు.

సత్కారాలు - సన్మానాలు
      రాఘవాచార్యులు పలు సంస్థలనుంచి గౌరవ సత్కారాలు పొందారు. భారత ప్రభుత్వం జీవితకాల గౌరవ పారితోషికంతో గౌరవించింది. ఆంధ్రవిశ్వకళాపరిషత్‌ 1972లో కళాప్రపూర్ణ బిరుదుతో సత్కరించింది. కాశీ విశ్వవిద్యాలయం ‘‘విద్యాధురీణ’’తో సన్మానించింది.
సాహిత్య దర్శనము, తత్వసూక్తులు, విశ్వకర్మ పురాణము, విశ్వకర్మవిశ్వరూపం అనేవి ఇతర రచనలు. ఇంతటి ఖ్యాతి గడించిన ఆచార్యుల వారు పరీధావి నామ సంవత్సరం (26-9-1912) భాద్రపద శుక్ల పౌర్ణమి గురువారం కోటేశ్వరాచార్యులు, పార్వతమ్మలకు జన్మించారు. స్వయం కృషితో ఎదిగి ఎలాంటి ఒడిదుడుకులు, వాదవివాదాలు ఎరుగక, వేదవేదాంత దర్శనాచార్యునిగా, సద్గురువుగా, మహామనీషిగా సహస్త్ర చంద్రదర్శనం చేసి సంపూర్ణ జీవితాన్ని అనుభవించి, భావనామ సంవత్సర పుష్యమీ బహుళ తదియ, గురువారం (19-1-1995)నాడు శివైక్యం చెందారు. వీరి మరణానంతరం కుటుంబ సభ్యులు ‘‘కొండూరు వీరరాఘవాచార్యుల ధర్మనిధి’’ ని ఏర్పాటు చేసి తెనాలి త్రిపురనేని శాఖాగ్రంథాలయంలో ప్రతి ఏటా కవి పండితులలో స్మారకోపన్యాసాన్ని చేయిస్తూ సత్కరిస్తున్నారు. కేంద్రసాహిత్య అకాడమీ 2012 సెప్టెంబరు 26, 27 తేదీలలో ఆచార్యుల వారి శత జయంతి నాడు తెనాలిలో పండిత సదస్సులు, సన్మానాలు ఏర్పాటు చేయటం సాహితీలోకానికి, ఆయన చేసిన సేవకు లభించిన అపురూప గౌరవం. తిరుమల తిరుపతి దేవస్థానం ఆచార్యులవారి రచనలను దేవస్థానం తరపున ముద్రించడానికి ముందుకురావడం విశేషం.
ఏ మహానియునికి శిల్ప సాహిత్యములు 
       జీవగఱ్ఱలై నిలిచెనో
ఏ పుంభావ సరస్వతికి ఉపనిషద్వనాలు
       విహార వీధులైతోచెనో
ఏ మహాత్మునికీ చరాచరాత్మక జగత్తు హితమే
      వ్రతమయ్యెనో
ఏ కళారాధకుని ఇంట సాహిత్య ప్రసూనంబులు
      గుభాళించెనో
ఏ కళాప్రపూర్ణుని ఇంట సాహితీ ప్రభ
     వెల్గులు చిమ్మెనో
ఏ గురుదేవుని హృదయాన మనగురుదేవుని చరిత్ర
     రూపుదిద్దుకొనెనో
ఏ సాహితీమూర్తి వాగ్దేవి మందిరాన
     కవన తోరణాలల్లెనో
ఏ దర్శనాచార్య ప్రతిభతో ఆత్మదర్శన యోగదర్శన
    శిల్ప కళాక్షేత్రాలు దర్శింపబడినవో 
ఏ పండితోత్తముని పాండితీ ప్రకర్ష
    ఆంధ్రభారతి మోమున దరహాసమద్దెనో 
అట్టి మహనీయునికంజలి ఘటింతు భక్తిమీర


వెనక్కి ...

మీ అభిప్రాయం