బోల్తాపడే శాల్తీల్లారా!

  • 28 Views
  • 0Likes
  • Like
  • Article Share

    సురా

ఏప్రిల్‌ మాసం వస్తే చాలు.. వెర్రిబాగులవాళ్లం అయిపోడానికి సరదా చూపిస్తాం. అవ్వకూడదని కీచక ప్రతిజ్ఞలు చేస్తుంటాం. కానీ ఎక్కడో ఫూలవుతాం. ఒక్కోసారి ఫూలైనట్లు తెలియదు కూడా. ఇంతకీ కీచక ప్రతిజ్ఞ అన్నానేంటా అని అనుమానం వచ్చిందా? ఫూలైపోయి బలైపోయిన తొలి అమాయక రాక్షసగుణ బలశాలి అతడు. అతగాడి పేరిట ఇలా ఒక్కరోజు వాడగలిగే జాతీయం సృష్టిస్తే తప్పేముంది? మళ్లీ అమాయకుడు అని అన్నందుకు సంశయాత్మకంగా చూస్తారేమో.. అసలు ప్రేమా పెళ్లీ లేకుండా ఫూలైపోయాడుగా పాపం. మరి అమాయక రాక్షసగుణ బలశాలి అంటే తప్పేమీ కాదుగా!
      పూర్తిగా కన్నెత్తి చూస్తే చంద్రుడు కాలిపోతాడేమో అన్నంత క్రౌర్యం కీచకుడిది. కానీ మాలిని తాను వస్తానని మాటిచ్చిన సాయంత్రం ఆ చంద్రోదయానికి కీచకుడి కళ్లు హిమ తటాకాలై ఎదురుచూశాయి. వెన్నెల ఏదీ.. మరికొంచెం ఒలికించు అని అతని రోమాలు పులకరించిపోతూ ఆ చంద్రుణ్ని అర్థించే ఉంటాయి. నిజానికి చంద్రుడూ చుక్కలూ కీచకుణ్ని చూసి ఎంత భీతిల్లాయో మరి! అంతా పూలమాలలు కట్టి అందించే పరిచారిక మాలిని మాయోపాయం. కీచకుడి మీదికి వెర్రివీచిక పారించింది. మదనతాప బడబాగ్ని మీద పసందైన పాయసం సేవించే సమయానికి ఎదురుచూడమని చెప్పి వలలుడినే వలగా విసిరింది. 
      కీచకుడు ఫూలైంది ద్రౌపదితో మాత్రమేనా అంటే కాదు. భీముడు కూడా తన నటనాపటిమతో అతణ్ని వెర్రిబాగులవాణ్ని చేశాడు. అంటే భార్యాభర్తల చేతిలో ఏకకాలంలో ఫూలైనవాడు కీచకుడు. ఫూల్స్‌ డే పెట్టుకుంటే కీచక వధ రోజునే పెట్టుకోవాల్రా అన్నంత సానుభూతి కీచకుడి మీద వచ్చేస్తుంది కదా. 
      అసలు కీచక వధలో మరికొన్ని పాత్రలు వెర్రిబాగుల చూపులు చూశాయి తెలుసా. అవే కీచకుడి శయ్య పక్కనున్న మధుపాత్రలు. భీముడితో పోరాటం అంటే అవి ఏ మూలకో ఎగిరి పడతామని ఊహించుకుని ఉంటాయి. కానీ ఆ యుద్ధంలో ఏ పాత్రనూ కీచకభీములు ముట్టుకోలేదు. హోరెత్తించే భీకర శబ్దాలను తానే వినిపించాల్సి ఉందని తలచిన వాయుదేవుడు కూడా బోల్తాపడ్డట్టే. ఆ యుద్ధంలో చీమ చిటుక్కుమన్న శబ్దం కూడా రాలేదు. మాలినితో పాటు ఉన్న ప్రత్యక్షసాక్షి అయిన వాయుదేవుడు అలా చూస్తూ నిశ్చేష్టుడైపోయి ఉంటాడు. అరుపులు లేవు.. భీకర ఘాతాలు లేవు.. అంతా మల్లయుద్ధపు పట్లు, కాళ్లూ చేతులూ తిప్పుకుంటూ వెనక్కేసి నులుముకోవడాలు, మెలివేయడాలు, నరాలు దొరకబుచ్చుకుని అదిమిపట్టి ముడివేయడాలు, కండరాల పెకలింపు లాంటి యుద్ధ నైపుణ్యాల ప్రదర్శనే. అక్కడ భీముడు వంటవాడు కాబట్టి, రెండే చేతుల్తో ఓ వంద కిలోల చపాతీపిండి కలిపినట్టే సాగిందా యుద్ధం! అందుకే వాయుదేవుడు కూడా ఫూలైనట్టే. 
      మనం ఏప్రిల్‌ ఒకటో తేదీనే ఫూల్స్‌డే అనుకుంటాం. ఒక్క రోజే చేసుకుంటాం. కానీ విరాట పర్వం అంతా ఒకరినొకరు బోల్తా కొట్టించుకోవడమే. భలే తమాషాగా ఉంటుంది. అదో బోల్తాపర్వం అనొచ్చు. 
      ఎవరినైనా ఫూల్‌ని చేసినప్పుడు పుట్టే ఆనందంలో లవలీశమైనా పైశాచికత్వం ఉండకపోదు. ఆ పైశాచికత్వం దశాంశమానంలో బిందువుకు ఎడమపక్కన సున్న ఉన్నట్టుగా ఉంటే అందం. మించితే ప్రమాదం. 
      మయుడి అనితరసాధ్యమైన నిర్మాణ చాతుర్యం సుయోధన సార్వభౌముణ్ని  బోల్తా కొట్టించింది. ఆనాటి ద్రౌపది నవ్వు దుర్యోధనుడి గుండెల్లో ఏప్రిల్‌ మాసపు ఒకటో దినాన్ని పచ్చ పొడిపించినంతగా బాధపడ్డాడు. హ్హు.. ఆ నవ్వు అతన్ని ఎంత వెర్రివాణ్ని చేయకపోతే పాండవులను అడవుల పాలు చేస్తాడూ? మాయా జూదంతో మహామహులను సైతం ఆటకట్టిస్తాడూ?
      ఏదేమైనా ఫూలైన వాడు ఫూలు చేయక మానడు.. ఫూలు చేసినవాడు ఫూలవ్వకా తప్పదు. ఏప్రిల్‌ ఒకటిన ఏదో తప్పించుకున్నా.. జీవితంలో మాత్రం ప్రతీకార నాదం ప్రతిఫలిస్తుంది. ఫూలును చేస్తుంది.
      వామనుడి పాదం బలిచక్రవర్తిని బురిడీ కొట్టించింది. అటు కృష్ణుడు కురుక్షేత్రంలో అందించిన నిరాయుధ సౌజన్యానికి యావత్‌ కురుసామ్రాజ్యం ఫూలైంది. సత్యహరిశ్చంద్రుణ్ని పరీక్షించడానికి వసిష్ఠ విశ్వామిత్రులు అతని జీవితంతో ఆటలాడటంలో ఆంతర్యం తెలిసిందే. పాపం.. హరిశ్చంద్రుడు అంతా నిజమని నమ్మి, భార్యాపిల్లలతో నానా బాధలూ పడి, చివరికి నక్షత్రకుడి ముందు కూడా ఎంత చులకన అయిపోయాడో! అంతా ముగిశాక హరిశ్చంద్రుడికి గొప్ప కీర్తిప్రతిష్ఠలు లభించాయనుకోండీ. ఏదో ఊరట.
      ఇక మారీచుడి మాయలో పడి సకలగుణాభిరాముడు భంగపడ్డాడనే చెప్పాలి. కథ ప్రకారం అక్కడ రాముణ్ని మాయచేశారు. సీతమ్మ రావణుడి వేషాన్ని పసిగట్టలేకపోయింది. వాలి సుగ్రీవుడి సమరోత్సాహాన్ని తెలుసుకోలేకపోయాడు.. రావణుడు ఆంజనేయుడి ప్రతాపాన్ని అంచనా వేయలేకపోయాడు. అంతా మాయ వలలో పడటమే.. బోల్తాపడటమే.. పడినా తిరిగి లేవాలని తేరుకోవాలని చెబుతాయా పురాణ కథలన్నీ. 
      కలియుగంలో కథల సంగతా.. ప్రతీ క్షణం మనిషి ఫూలవుతాడు.. ఫూలుని చేస్తాడు. ఇప్పుడు మీరు పీల్చే గాలి స్వచ్ఛమైంది కాదు. మీరు అనుకుంటున్నారంతే. ఇక్కడే ఫూలైపోయారు. కొనే ప్రతి వస్తువూ తన ధరతో మిమ్మల్ని ఫూల్‌ చేసేదే. పెళ్లికి ముందు మగాళ్ల వయసులు, ఆడాళ్ల మేకప్పులు ఒకరినొకరు బురిడీ కొట్టించుకునేవే. పిల్లలకు కట్టే ఫీజులు, వాళ్లకు వచ్చే మార్కులు అవాక్కయ్యేలా చేసేవే. 
      అక్షయ తృతీయ లాంటి పండగల నాడు బంగారం కొనాలన్న మాటలు, డిస్కౌంట్లూ, ప్రకటనలూ సామాన్యుడి నుదుటన ఏప్రిల్‌ ఫూల్‌ అని స్టిక్కరేసేవే. ఉగాది నాటి మహాకవుల కవితాగానాలు, పుస్తకావిష్కరణలు, సన్మానాలు, శాలువాల ప్రహసనాలు.. అద్భుత పుస్తక సమీక్షలు అర్ధజ్ఞానులను వెర్రెత్తించేవే. 
      హెల్మెట్టు లేని ప్రయాణాలు, ఇన్స్యూరెన్సు లేని వాహనాలు, ద్విచక్రవాహనం మీద తూలుతూ త్రయప్రయాణాలు.. ఇలాంటివి రక్షణవ్యవస్థను ఫూల్‌ చేస్తున్నామనుకునే వారి ప్రయత్నాలు. కానీ ఫూలయ్యేది చివరికి వాళ్లే! 
      ఇక ఓటరును దేవుడు అనీ.. నీ ఓటు నాకు వరం.. నీ రూటు నాకు స్వర్గం అనీ  నవజాత రాజకీయనాయకులు కూడా చెబుతారు. సామాన్యులు ఆ మాటల్ని విని పోలింగ్‌కేంద్రం ముందు ఫూలవ్వడానికి పొద్దున్నే నిలుచుంటారు అమాయకంగా. అసామాన్యులు ఉంటారు.. వారికి పులిహోరా పుల్లనిధారా ఉంటే చాలు. ఫూలవ్వడానికి వారిలో కనపడేంత స్వచ్ఛత ఎక్కడా చూడలేం. చెప్పాలేగానీ, ఇంకా బోలెడు ప్రహసనాలున్నాయి..
ఏప్రిల్‌ ఒకటి వస్తోంది. 
బోల్తాపడ్డవాళ్లు లేవండి.. లేచి ఉన్నవాళ్లు బోల్తాపడ్డానికి సిద్ధంగా ఉండండి! 


వెనక్కి ...

మీ అభిప్రాయం