మానవత్వం పరిమళించిన చోట

  • 51 Views
  • 0Likes
  • Like
  • Article Share

    సాహితీసుధ

ఒంటరిగా నడిచిపోతున్న పాంథుడికి దీపం కంటే మరొక పాంథుడు మరింత ధైర్యాన్నిస్తాడు అన్న తిలక్‌ చెప్పిన మాట అక్షరాల నిజం. కష్టకాలమొచ్చినప్పుడు ఆత్మస్థైర్యంతో పాటూ మరో మనిషి సాయం కూడా అవసరమే. అప్పుడే మనిషి శక్తిమంతుడవుతాడు. నియమాలూ, నిబంధనలూ, గౌరవ ప్రపత్తులు, ఆస్తి అంతస్తులు ఇవన్నీ మనిషి సాయం ముందు దిగదుడుపేనని అంతర్జాతీయ కథానికల పోటిలో ద్వితీయ బహుమతి పొందిన పాలగుమ్మి పద్మరాజు గాలివాన కథానిక ఇదే మాట రుజువు చేస్తోంది.
కరోనా
వల్ల ఇప్పుడు ప్రపంచమంతా ఏకమైతే కావొచ్చు. ఖండాలొక్కటైపోయి భయంతో పెద్దపెట్టున ఏడ్చి మొత్తుకోవడం నిజమైతే కావొచ్చు. ఎవరింట్లో వాళ్లు గడపదాటకుండా మూకుమ్మడి పోరాటం చేసినా చేయవచ్చు. మంచిదే! ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే కరోనా దేశంలోకి ప్రవేశించేసరికి ప్రజలంతా ఒక్కచోటలేరు. చెట్టుకొకరు పుట్టకొకరుగా చెదిరిపోయి ఉన్నారు. పిల్లలెక్కడో దూరంగా అమ్మానాన్నలు చేరుకోలేనంత ఎడంగా చిక్కుకుపోయి.. సొంతఊరు వెళ్లే దారికోసం వెతుకుతున్నారు. బాధలొచోట... బంధువులొకచోట. అందరూ ఉన్నా ఎవరికి ఎవరూ ఏమీకాని ఒంటరితనంలో ఇంకొంతమంది. జలుబొచ్చినా.. జ్వరమొచ్చినా అమ్మానాన్న పక్కనుంటే బావుణ్ణు అనుకుంటూ అయినదానికీ కానిదానికీ నా అన్నవాళ్ల కోసం ఆరాటపడిపోయే సున్నిత మనస్కుల హృదయవేదన ఈ కరోనా కాష్టకాలంలో మనిషిని మరింత కుంగదీస్తోందన్నది ఎవరూ కాదనలేని నిజం. ఊరుదాటడానికి వీలులేదు. నానా అవస్థలూ పడి వెళ్లారే అనుకోండి మళ్లీ తిరిగొచ్చే దారి లేదు. హోమ్‌ క్వారంటైన్‌ పేరుతో మాస్కుతో నోరు నొక్కుకుని రోజులు గడపాలి అక్కడ!  కష్టకాలంలో కన్నవాళ్లు దగ్గరుంటే అదో ధైర్యం. వేయి ఏనుగుల బలం కూడా. ఒంటరిగా ఉంటే కరోనా ఏంటీ ప్రతీక్షణం కూడా కాష్మోరాలా బయపెట్టి చంపుతుంది. అసలు మనిషింత సున్నితంగా ఎందుకు మారిపోయాడు! వర్షానికి తడవడానికి జడిసిపోతాడు. ఎండపొడ సోకితే ఎండుటాకులా రాలిపోతానేమో అని భీతిల్లిపోతాడు. చలికాలపు కోతకి నిలువునా వణికిపోతాడు. సాధారణ జలుబుకీ, జ్వరాలకీ చీడపట్టినట్టు బెంగతో చిక్కి సగమైపోతున్నాడు. ఆధునికత మనిషినెందుకింత కుంగదీస్తోందీ! ప్రకృతిలో జీవించడమంటే ప్రకృతి శక్తులతో సమాగమించడం కదా! వరదలూ, ఉప్పెనలూ, కరవు కాటకాలూ, మహమ్మారులూ ఇవన్నీ ప్రకృతి నుంచి ఉత్పన్నమైనవే అని నమ్ముతున్నప్పుడు మనిషి ఎందుకు జడిసిపోవాలి! వాటి నుంచి దూరంగా ఎందుకు పారిపోవాలి! 
      ఆత్మస్థైర్యంతో ఒంటరితనంలోనూ ఉన్నతంగా నిలబడగలిగితే.. సంకల్పశక్తి ప్రకృతి సిద్ధమైన ఔషధంగా మనిషిలోపల పనిచేస్తుంది   నియమాలు, నిబంధనలూ ఒక్కగాలివానకే కూలిపోతుంటే బోరుగా ఏడుస్తున్నాడు. మొత్తం జీవితమే ముగిసిపోయినట్టు విలవిల్లాడిపోతున్నాడు.    ప్రకృతిముందు మానవ మేధ అర్థరహితమైపోతుందని ఒకటికాదు వేల ఘటనలు రుజువు చేశాయి. ఆకురాలు కాలాలెన్నొ గుర్తుచేశాయి. ఎన్నో ప్రకృతి విలయాలు స్మృతిచిహ్నాలుగా మిగిలాయి. అలాంటప్పుడు మనిషి నిజంగా దేనికోసం ఆరాటపడాలి! ఆత్మస్థైర్యంతో ముందుకు సాగటం ఒక్కటేకాదు మానవసాయం కూడా అవసరమే. అప్పుడే మనిషి శక్తిమంతుడవుతాడు. అంతేకాని నియమాలూ, నిబంధనలూ, గౌరవ ప్రపత్తులు, ఆస్తి అంతస్తులు ఇవేవికాదని అంతర్జాతీయ కథానికల పోటిలో ద్వితీయ బహుమతి పొందిన పాలగుమ్మి పద్మరాజు గాలివాన కథానిక హెచ్చరిస్తోంది.
మనిషికి మనిషే ఆదరువు
రావుగారు గొప్ప వేదాంతి. తనకుతాను విధించుకున్న నియమాలు, సిద్థాంతాల వల్ల జీవితం గురించి అమితమైన ఇష్టంతో మాట్లాడతారు. ఉపన్యాసాలిస్తారు. ఇప్పుడు రైలు ప్రయాణం చేస్తున్నది కూడా ఒకచోట ఉపన్యాసం ఇవ్వడానికే. మనిషి నడవడిని దిద్దడానికి కొన్ని నియమాలు ఉండాలని రావుగారి అభిప్రాయం. కోరికలు ఆత్మను బంధించేంత బలంగా ఉండకూడదని కూడా అంటారాయన. పేదవాళ్లంటే జాలిలేకపోలేదు కాని బిచ్చమెత్తుకోవడం తప్పు అని ఆయన నిశ్చతాభిప్రాయం. ఉన్నట్టుండి గాలివాన పెరిగిపోయింది. పెట్టెలో ఒక్కసారిగా చీకటి అలుముకుంది. తడిసిన బట్టలతో బిచ్చగత్తె రావుగారున్న పెట్టెలోకి వచ్చేసింది. అందరూ తలో ఒకటి ఇచ్చారు రావుగారు తప్ప. రావుగారు దిగవలసిన స్టేషను వచ్చేసరికి గాలివాన మరీ ఎక్కువైపోయింది. సామాను దించుకోలేక అవస్థ పడుతుంటే బిచ్చగత్తే సాయం చేసింది రావుగారికి. ఊళ్లోకి వెళ్లే మార్గంలేక, మరో గత్యంతరం లేక రావుగారు స్టేషనులోనే ఉండిపోయేందుకు నిశ్చయించుకున్నారు. గాలివాన ఎక్కువైపోతోంది. ఆ చీకటి గదిలో ఏదో ఆకారం ఉన్నట్టు తోచి టార్చి వేసిన రావుగారికి బిచ్చగత్తె గదికి ఒక మూలగా కూర్చుని ఉన్నట్టు కనిపించింది ఒకరు కాదు ఇద్దరున్నం కదా భయపడకండి అని ధైర్యం చెప్పిందా మనిషి రావుగారిని చూసి. గాలి తీవ్రతకి తలుపుకి అడ్డంగా పెట్టిన బల్లలూ కుర్చీలూ చెల్లాచెదురైపోయాయి. రావుగారు భయంతో బిచ్చగత్తెని కౌగిలించుకున్నారు. తర్వాత తను చేసిన పనికి నొచ్చుకున్నారు. ఏదో నియమాన్ని కట్టుతప్పినట్టు అనిపించింది రావుగారికి. అయినా చలికి వణికిపోతున్నారు. ఆ పరిస్థితుల్లో బిచ్చగత్తె రావుగారిని దగ్గరికి తీసుకుంది. తన రొమ్ముల దగ్గరిగా అతన్ని హత్తుకుంది. ఆ కౌగిలింతలో సంకోచాలేవీ లేవు. ఆయన మనసులో ప్రళయమంతటి మధన జరుగుతోంది. ఆ వెచ్చదనం ఆయనకి ప్రాణావసరం. ఆ     సమయంలో ఆమె తన పిల్లలకోసం బాధపడింది. ఒక మానవ హృదయంలోంచి వెలువడిన వేదన వింటుంటే ఆయన మనసులో గోడలన్నీ మటుమాయమైపోయాయి. కొద్ది క్షణాల తర్వాత రావుగారికి నిద్రపట్టింది.
      గాలివాన తగ్గింది. మెలకువ వచ్చి చూసేసరికి బిచ్చగత్తె కనిపించలేదు. టిక్కెట్ల గది కూలిపోయింది. ఆ గది శిథిలాలకింద చచ్చిపడి ఉంది బిచ్చగత్తె. తనకు ఆత్మస్థైర్యాన్ని, శాంతిని, గాలివానకి తట్టుకోగల శక్తిని ఇచ్చిన మూర్తి అక్కడ పడిఉండటం చూసి రావుగారు తట్టుకోలేకపోయారు. తన భార్యగానీ, పిల్లలు గానీ ఈమె వచ్చినంత దగ్గరగా రాలేదని చిన్నపిల్లాడిలా ఏడ్చారు, ఆమె నుదుటిని ముద్దుపెట్టుకున్నారు రావుగారు. విలువలు, ధర్మచింత, వేదాంతం అన్నీ త్యజిస్తాను ఈ వ్యక్తికి మళ్లీ ప్రాణం పొయ్యిగలిగితే అని అనుకున్నారు. క్రమశిక్షణ, నియమాలు, విలువలు అన్నీ కూడా మానవాతీతమైన శక్తులు విజృంభించినప్పుడు అర్థరహితమైపోతాయని రావుగారికే కాదు మనందరికీ అనుభవానికొస్తుంది ఈ కథ చదివితే.కథ చదివితే.


1952లో న్యూయార్క్‌ లోని హెరాల్డ్‌ ట్రిబ్యూన్‌ వారు నిర్వహించిన ప్రపంచ కథానికల పోటీలో ద్వితీయ బహుమతికి ఎంపికైన కథానిక ఇది.

 

 


వెనక్కి ...

మీ అభిప్రాయం