ముద్దబంతి పూలుపెట్టీ...

  • 1207 Views
  • 2Likes
  • Like
  • Article Share

    భావన

  • హైదరాబాదు
  • 9848036760
భావన

చందమామ రావే... జాబిల్లి రావే... అని పాడుకుంటూ ఆకాశంలోంచి చందమామ దిగి రావాలని ఆకాంక్షించే చిన్నారులే అందరూ..! అయితే వెన్నెల తేరులో విహరించే ‘చలువరేడు’ మన పిల్లల కోసం మాత్రం ‘బండెక్కి రావా’లనీ, వస్తూ వస్తూ ‘బంతిపూలు తేవాలనీ’ పాడుకుంటున్నాం. అంటే, ఆ బంతిపూల సౌందర్యం ఎంత గొప్పదో విడిగా చెప్పనక్కర్లేదు.
‘కలువ’లను పోలిన కళ్లు, ‘సంపెంగ’ వంటి ముక్కు, ‘గులాబీ’ రంగు పెదవులు, ‘సన్నజాజి’ లాంటి నడుము... ఇలా స్త్రీ శరీరంలోని ఒక్కో భాగాన్ని ఒక్కో పువ్వుతో పోల్చి వర్ణించారు మన కవులు. కానీ, ‘యువతుల లావణ్యాన్ని ఆసాంతం’ ఒక్కమాటలో చెప్పాలంటే మాత్రం దాన్ని ‘ముద్దబంతి’ సొగసుతోనే పోలుస్తారు.
      ‘ముద్దబంతి నవ్వులో మూగబాసలూ’ అంటూ ముదిత నవ్వులో దాగున్న ముగ్ధ సౌందర్యాన్ని చిత్రించారు సినీకవులు. అదే సమయంలో ‘ముద్దబంతి పూవులో మూగకళ్ల వూసులు’ కూడా దాగున్నాయంటూ ఆ పువ్వుకు ఉండే గాంభీర్యాన్నీ చెప్పారు. బంతిపూలను లావణ్యానికి, రమ్యతకు, రసికతకు పర్యాయపదంగా వాడటం కవులు నేర్చుకుంటే, ఏ వాక్యంలో పొదిగినా ఇట్టే ఒదిగిపోయే ‘జానుతనాన్ని’ బంతిపూలు అలవరచుకున్నాయేమో అనిపిస్తుంది.
      చిరుచిరు చలికాలంలో నీలి నింగి కింద, పుడమిని ఆకుపచ్చగా మారుస్తూ పెరిగిన బంతి మొక్కలు, హఠాత్తుగా భూమికి పసుపుపచ్చని రంగు వేస్తాయి. మునుపెన్నడూ ఎరగని సౌందర్యాన్ని మన కంటి ముందు నిలిపి అపార పారవశ్యంలోకి నెట్టేస్తాయి.
      పలువర్ణాల్లో దొరికే బంతిపూలు నారింజ మొదలు, ముదురు, లేతపసుపు వర్ణాల్లో ఎక్కువగా లభిస్తాయి. పర్వదినాల్లో గుమ్మానికి అలంకారమయ్యే మామిడి కొమ్మకు నేస్తమై, పండగల్లో పలుజాతుల పూలకు ఆప్తమై... మన గుండెల దారులదాకా వచ్చేసరికి, చేమంతికి ‘దోస్తీ’యై వివిధ అనుభూతులను మనముందు ఉంచుతాయి బంతిపూలు. మన దేశానికి పునాదులు, మన జీవితాలకు ఆసరాలు - మన పల్లె సంస్కృతులు. ఆ పల్లె సంస్కృతిని మొత్తాన్నీ ఓచోట రాశిగా పోస్తే, అందునా ‘వాసి’గా నిలబడేది కచ్చితంగా బంతిపూల సౌందర్యమే.
బంతీ పూవంటీ బావనివ్వవే..
మన సాహిత్యంలో అలతి అలతిగా సుదతి సొగసును వర్ణించిన బంతిపూల పాటలు కొన్నయితే, జానపద గీతాల్లో వర్ణించిన ముద్దబంతి పూలు మాత్రం గాఢంగా మన గుండెను హత్తుకుంటాయి. ముఖ్యంగా పూలకు, ప్రకృతికి, రుతువులకి సంబంధించి మనం జరుపుకునే పండగలన్నీ మన సంస్కృతికి పట్టుకొమ్మలు. అలాంటి పండగలైన బొడ్డెమ్మ, బతుకమ్మ పాటలు, సంక్రాంతి నాటి గొబ్బిళ్ల పాటలన్నింటా బంతిపూలు కొలువుతీరి కనబడతాయి.
      ‘బంతీయ పూసింది బంతీయ కాసింది...’ అంటూ సాగే బతుకమ్మ పాటలు మొదలు, ‘బంగారు ముగ్గులు వేసి గొబ్బీయల్లో - ఆ ముగ్గుల మీద బంతిపూలు గొబ్బీయల్లో’’, ‘‘సుబ్బీ గొబ్బెమ్మ సుబ్బణ్నీయవే... బంతీ పూవంటీ బావనివ్వవే...’’ లాంటి సంక్రాంతి పాటల నిండా బంతిపూల సంరంభమే...
పల్లె సంస్కృతిలో, జానపదుల సంప్రదాయంతో ఎంతో అవినాభావ సంబంధం ఏర్పరచుకున్న బంతిపూలలో ఎన్నో రంగులు, రకాలు! ముద్దబంతి, రెక్కబంతి, కారబ్బంతి, నూకబంతి అంటూ తీరొక్క వర్ణంతో మెరిసిపోయే ఈ పూలు మన ముంగిళ్లలో కళకళలాడుతూ కనువిందు చేస్తాయి.
      పేదింటి గుమ్మానికి పేరిస్తే రంగురంగుల ముత్యాల సరాల్లా, గొప్పింటి వాకిట అలంకరిస్తే రమణీయ హారాల్లా... శోభలీనడం తప్ప మరోటి తెలియని స్వచ్ఛమైన పూబోణి మన బంతి పూరాణి. ‘పూజకు బంతిపువ్వు పనికిరాద’ంటూ దూరం పెట్టినా... ‘స్వామి కడగంటి చూపు సోకినా చాలు’ అనుకుంటూ మందిరాన్ని అంటిపెట్టుకుంటాయి. దేవుడి పాదాలు చేరకపోయినా ఫర్వాలేదు అనుకుంటూ, మనుషుల్లోనే ఆ రూపాన్ని చూసుకుంటాయి. మనతో చెలిమిచేస్తూ మనల్ని నవ్వించీ, కవ్విస్తున్నాయి.
      అందుకేగా శృంగార రసాన్ని ఆవిష్కరించేందుకు ‘బంతీ చామంతీ’ ముద్దాడుకోవడాన్ని చూపిస్తే, ‘సింగారించుకున్న సరసాన్ని’ సిగ్గూ పూబంతులతో నింపుకున్నాం. ‘బావాబావా బంతీపువ్వా’ అంటూ బావ కోసం పాడినా, మల్లెపూల రాణి కోసం ‘బంతిపూల పారాణి’ని కోరినా ముద్దబంతి పూలకు, మొగలిరేకులకు పొత్తు కట్టిపెట్టినా... అన్నింటా ఒదిగిపోయే స్నేహబాంధవి మన ‘ముగ్ధబంతి’.
ముద్దబంతి పూచేనులే 
బావామరదళ్ల సరసాల మధ్య ఒదిగిపోయిన బంతిపూలు కొన్నయితే, ప్రేమకు ఆరాధనకూ ప్రతీకగా నిలిచిన ముద్దబంతులు మరికొన్ని. ‘ముద్దబంతి పూలుపెట్టీ మొగలి రేకులు జడను చుట్టీ’ అంటూ ‘కలసి ఉంటే కలదు సుఖం’ చిత్రం కోసం కొసరాజు రాసిన పాటను ఎన్నిసార్లు విన్నా తనివి తీరదు. ఆత్మ సౌందర్యాన్ని మించిన భూషణాలు లేవంటూ సాగే దీని పల్లవే ‘ముద్దబంతి’ పూలతో మొదలవుతుంది. ఇక ‘కదలడు-వదలడు’లోని ‘ముద్దులొలికే ముద్దబంతి’... సినారె కలం నుంచి జాలువారిన చక్కని సరదా గీతం. అయితే, వీటికి ముందే 1953లోనే దేవులపల్లి కృష్ణశాస్త్రి, చిత్తూరు నాగయ్య సొంత సినిమా ‘నా యిల్లు’ చిత్రం కోసం ఎన్నో అందమైన పాటలు రాశారు. వాటిల్లో గొబ్బిళ్లపాట ‘ముద్దబంతి ముగ్గుల్లో ముద్దియలుంచే గొబ్బిళ్లు’ ప్రఖ్యాతం.
      ఇక జంధ్యాల చిత్రం ‘ముద్దమందారం’లోని వేటూరి పాట ‘ముద్దుకే ముద్దొచ్చే మందారం’... ఆసాంతం చెలిసొగసును వర్ణిస్తుంది. అందుకే అందులోనూ ‘బంతిపువ్వా పసుపు తాను పారాణి’ అంటూ రాశారు కవి. ‘దళపతి’ చిత్రం కోసం ‘రాజశ్రీ’ ఎన్నో మధురమైన పాటలు అందించారు. వాటిలోనూ ‘ముద్దబంతి పూచేనులే... తేనెజల్లు చిందేనులే...’ అంటూ అక్షరాల్లోంచే మన మీద బంతిపూల పుప్పొడి చల్లారు. ‘చామంతి పువ్వుకు    బంతిపూల మేడ కట్టడం’ నుంచి ‘బంతిపూల జానకిని అత్తారింటికి పంపడం’ వరకూ ముద్దబంతుల మీద సినీ కవుల అభిమానం కొనసాగుతూనే ఉంది. 
అందం... ఆరోగ్యం
సంవత్సరంలో ఒక్కో రుతువును ఒక్కో పూవు సొంతం చేసుకున్నట్టే, బంతిపూవు శీతాకాలానికి నెచ్చెలి అయింది. అందుకే చలికాలం బంతిపూల సాగుకు అనువైన వాతావరణం. చల్లని వాతావరణంలో వరసగా వచ్చే పండగ సంబరాల్లో, బంతిపూల పాత్ర బహుప్రత్యేకం. బతుకమ్మ పండగతో మొదలై, ఒక్కొక్క పువ్వై దీపావళి కాంతుల్లో దివ్వై, గొబ్బెమ్మల మధ్యన నవ్వై వెలిగిపోతూంటాయి బంతిపూలు.
      బంతిపూలకు బాహ్య సౌందర్యంతోపాటు, లోపల ఎన్నో ఔషధీ గుణాలూ ఉన్నాయి. అల్సర్లు, ఎన్నో చర్మసంబంధమైన సమస్యలతోపాటు, క్యాన్సర్‌ను నివారించే లక్షణాలు దీనికి ఉన్నాయంటున్నారు శాస్త్రవేత్తలు. మొత్తానికి ఇలా బంతిపూలు మనకు ఆరోగ్యాన్ని, ఆనందాన్నీ పంచుతున్నాయి.
      కొమ్మకు పూసిన కూసిన్ని రోజుల్లోనే విస్తరించీ, మనల్ని వరించీ, మన సరదాలను తమ సౌందర్యంతో స్పృశించీ, వాడిపోయాక కూడా మరో బంతిపూల వనాన్ని తయారు చేసుకునేందుకు మనకు అవకాశాన్ని కల్పిస్తాయి. ఆ నేలరాలిన బంతిపూలే... మళ్లీ హేమంతం వచ్చేసరికి ఏనుకుని, గుమ్మం ముంగిట ఎదిగి అందరికీ ఆహ్వానం పలుకుతూ వాకిటపువ్వులై నవ్వుతాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం