ఆకలి ఊదే నాదస్వరం

  • 261 Views
  • 20Likes
  • Like
  • Article Share

    సాహితీ స్రవంతి

కరోనా మహమ్మారి విశ్వవ్యాపితం అయిపోయాక ఎక్కడి వాళ్లు అక్కకికే పరిమితమైపోయాక కూడు మాత్రం కాళ్ల దగ్గరకి ఎలా వస్తుంది! బతకాలి. ప్రాణాలు నిలుపుకోవాలి. శరీరమనేది ఉంటే పరిస్థితులకు ఎదురీదవచ్చు. బతికున్నా సుఖములు పొందవచ్చు అన్నారు పెద్దలు. దొరికింది తింటూ ఉసురు నిలుపుకుంటే మున్ముందు మంచి రోజులు రాకపోవా! అని ఆశగా చూసేది బీదా బిక్కీ మత్రమే కాదు భాగ్యవంతులు కూడా. బతుకులో ఆశాకిరణం కోసం వెతుకుతూ సరికొత్త వేకువ కోసం ఎన్ని పోరాటాలు చేస్తున్నారో!
ముప్పదిమూడు కోట్ల
దేవతలు నిత్యం పూజలందుకునే ఈ దేశంలో భాగ్యవిహీనుల ఆకలి ఎలా తీరుతుందీ అంటూ వాపోయారు ఆనాడు జాషువా. పితృ దేవతలకీ, దేవతా ప్రతిమలకీ నైవేద్యం మాటెలా ఉన్నా కడుపుకి గెంజి నీళ్లు దొరకడమే కష్టమైపోతున్న గడ్డు రోజులివి. ఆకలి మనిషిని నిర్వీర్యం చేస్తుంది. కడుపుకింత పెట్టలేని బతుకు బతకడానికే బరువనిపిస్తుంది. కాయో కసరో తిని ప్రాణాలు నిలపుకోవడం భారమనిపిస్తుంది. కనికరించి ఇంత ముద్ద పెట్టగల కరుణామయులు ఎక్కడుంటారో వెళ్లి అర్థించే పరిస్థితి కోసం మనసు ఆరాటం పడుతుంది.
      కడుపు పట్టుకుని కన్నవాళ్లను కళ్లముందు నిలుపుకుని వందల మైళ్లు నడుచుకుంటూ పోయే శరణార్థుల ఆకలిని తడిమే మానవత్వం ఏదీ! అనే ప్రశ్న ఒకవైపు. ఎండకు ఎండి వానకి తడిసి, ఆకలికి జడిసి ఎక్కడ పరుగాగిపోతే అక్కడే నేలకొరిగిపోయే ఆకలి వ్యధలు ఇంకా ఎంతకాలమనే ఆలోచన మరోవైపు. వడివడిగా అడుగులు పడాలంటే కడుపునిండా తినాలి. అది ఏదైనా, ఎలాంటిదైనా తినవలసివని అయితే చాలు.. కాస్త ప్రాణాలు నిలబెట్టేవైతే చాలు. ఆకలి కూడా ప్రకృతి వైపరిత్యం లాంటిదే! ప్రాణం పోతుందనీ తెల్సినప్పుడు తెచ్చిపెట్టుకున్న హోదాలూ, హూందాతనాలూ.. కట్టుబాట్లు అర్థరహితమైపోతాయనీ, మనిషి లోతుల్లో ఎక్కడో అట్టడుగున పడిఉన్న మానవత్వమొక్కటే దీపాంకురమై వెలుగు నిస్తుందనే సంగతి ఇప్పుడు కాదు కొన్ని వందల ఏళ్ల కిందటే మనిషికి అనుభవంలోకొచ్చింది.
ఆకొన్న కూడే అమృతం 
దూరప్రయాణం చేస్తున్న వటుడికి మార్గ మధ్యంలో ఆకలి వేసింది. ఒక గ్రామంలో అన్నం కోసం అర్థించాడు. ఎక్కడా అన్నం పుట్టలేదు. సుశీల అనే ఇల్లాలి ఇంటిముందు నిలబడి ‘‘భవతీ! భిక్షాందేహీ!’’ అని చేయి చాచాడు. ‘‘ఇంటాయన ఊళ్లోలేడు. తినడానికి ఇంట్లో ఏమీ లేదు. గంటలో వండి పెడతాను కాస్త ఓర్చుకుంటావా నాయనా!’’ అందా ఇల్లాలు. ‘‘అమ్మా! ఈ ఆకలి బాధకు తాళలేకపోతున్నాను.. నువ్వు వండేంత వరకూ ఆగలేను. పులిసినదో, అడుగంటినదో, కనీసం చల్ది అన్నమైనా సరే తెచ్చిపెట్టు తల్లీ!’’ అన్నాడా వటుడు.
‘‘చూస్తూ చూస్తూ చల్దన్నం ఎలా పెట్టనూ! క్షణంలో వంట చేసేస్తాను. తిని మీరు వెళ్లవలసిన చోటుకి వెళ్లిపోదురుగానీ’’.. అని వంటకి సిద్ధపడుతుండగా... ‘‘ప్రయాణ సమయంలో ఎవరు పెట్టినా తినాలి. వాళ్లూ వీళ్లూ అనీ, అదీ ఇదీ అని కాకుండా దొరికింది తినాలి. ఇక ఆలస్యం చేయకమ్మా! కాసింత అన్నమూ.. ఒకొన్ని నీళ్లూ తీసుకొచ్చి పెట్టు!’’ అంటూ.. మరొక విలువైన  మాటంటాడా సమయంలో.. 
తరుణి! క్షుధాతురాణాం
నరుచిర్నచ కాలమనుచు నరులాడుటలో
నరసి వివేకింపందగు
తెరువరులకు బాయసంబు తిరిసిన గలదే! 

      ‘‘క్షధాతురాణాం న రుచి ర్న కాలః’’ ఆకలి రుచి ఎరుగదు. దానికో సమయం అంటూ ఉండదు. దొరికినది తినాలి. పాదచారి బిచ్చమెత్తుకుంటూ పాయసం దొరకాలని ఆశ పడటం ఎంత వెర్రితనం! అమ్మా! నువ్వు ఇప్పుడు పెట్టినా అన్నమే పురోడాశం (యజ్ఞ ప్రసాదం) నాకు. 
      ‘‘ప్రయాణ తొందరలో ఉన్నాడు. వండి పెట్టేదాకా ఆగనంటున్నాడు’’ అనుకుంటూ... ఆ ఇల్లాలు ఉన్నదే తెచ్చిపెట్టింది. ఒక్కమెతుకైనా మిగలకుండా తినడమే కాకుండా ఇంకా కుండ అడుగున మెతుకులేమైనా ఉన్నాయేమో ఊచ్చి తీసుకురా తల్లీ! కాస్త తిన్నానేమె క్షుద్బాధ మరింత రెట్టింపయ్యింది అన్నాడా వటుడు. ఆకలి బాధ ఎంత దుస్సహమైందో తెలిపే ఈ సుశీలోపాఖ్యానం తెనాలి రామకృష్ణ కవి రాసిన పాండురంగ మాహాత్మ్యంలోది.
అన్నం పరబ్రహ్మస్వరూపం
      ఎవరు ఎన్ని వేషాలేసినా పొట్టకూటికోసమే కదా! సకల జీవులు అన్నం వల్లనే బతుకుతున్నపప్పుడు ఆకలిలోనూ అన్నంలోనూ పరమాత్మను దర్శించాలి. అన్నానికి అంటు లేదు. ప్రకృతి ఇచ్చే ఈ మహాప్రసాదాన్ని ప్రజలంతా కలిసి భుజించవచ్చు అనుకోవాలి తప్ప అన్నం తినేకాడ ఎడమెహం పెడమెహాలెందుకూ అని మంద బుద్ధులను గట్టిగానే మందలించారు కాలజ్ఞాన కర్త పోతులూరి వీర బ్రహ్మం.
అన్నమయములైనవన్నీ జీవమ్ములు
కూడులేక జీవకోటిలేదు
కూడు తినేడికాడ కులభేదమేలకో
కాళికాంబ హంస కాళికాంబ

      సకల జీవరాశులు అన్నంతోనే మనుగడ సాగిస్తున్నాయి. అన్నం లేకపోతే ఏ జీవీ బతకలేదు. జీవుల మనుగడకి ఆధారభూతమైన ఆహారం విషయంలో హెచ్చు తగ్గులెందుకూ అంటూ బ్రహ్మం చెప్పిన మాటలు ఈ కాలానికీ వర్తిస్తాయి.
      ‘ఆకలి ఊదే నాద స్వరానికి ఆడకతప్పదు మనిషి’ అంటాడు గణేశ్‌ పాత్రో ఆకలిరాజ్యం సినిమాలో. ఒక్కరోజు అన్నం లేకపోతే  విలవిల్లాడిపోతాం?అలాంటిది రోజులు తరబడి కూడులేనోళ్ల పరిస్థితి ఏంటీ! ఆకలేసి కేకలేసినోళ్ల పక్కన ఒక్క క్షణం నిల్చుంటే వాళ్ల ఆకలి కేకలు సముద్రపు అలలకు మించి ఘోషిస్తాయి. దేశాభివృద్ధికి పేదరికం గొడ్డలిపెట్టు అనీ, పేదరికం - నిరూద్యోగం కవలలనీ, వాటి సత్వర నిర్మూలనే తమ లక్ష్యమని నాయకులు ఉద్ఘోషిస్తుంటారు. అయినా ఆకలి అనే విష జ్వరం దేశాన్ని పట్టి పీడిస్తూనే ఉంటుంది. అభివృద్ధి పధకాలు బీదలకు ఆమడదూరంలో ఉంటున్నాయి.
‘‘ఒక్క నిరుపేద ఉన్నంత వరకూ
ఒక్క మలినాశ్రుబిందు వొలిగినంత వరకూ
ఒక్క శుష్కస్తన్య సన్నిధిని క్షుదార్తి నేడ్చు పసిపాప

ఉన్నంతవరకూ’’ శాంతి కలగదన్నాడు తిలక్‌. ఆర్థిక అసమానతలు సాంఘిక రుగ్మతలు దేశ పురోగతికి ప్రతిబంధకంగా మారుతున్నాయనీ, ప్రపంచంలోని పేదదేశాలతో పోలిస్తే దేశం మరింత దిగనాసిగా ఉందని గణాంకాలు చాటుతున్నా, ఎన్ని ప్రజా సంక్షేమ పధకాలు ప్రవేశ పెట్టినా పరిస్థితులు మారడంలేదు. ఆకలి చావులు, పసిపిల్లల ఆకలి కేకలు ఇంకా వినిపిస్తున్నాయి .ఈ ఇనుపగజ్జెల మోత దేశానికి కొత్తేమీకాదనీ, నా జీవితకాలంలో అనుభవించాల్సినంత దారిద్య్రం అనుభవించానంటారు శ్రీశ్రీ. ‘‘1930 నుంచి 1940 దాకా నేను చాలా అవస్థలు పడ్డాను. ఆ దశాబ్దంలోనే నా మహాప్రస్థానం గీతాలన్నీ రాశాను. అదో భయంకరమైన దశాబ్దం. దాన్ని హంగ్రీ థర్టీస్‌ అంటారు చరిత్రకారులు. కొంపెల్ల జనార్థనరావు మాటల్లో చెప్పాలంటే అవి లోక ప్రవృత్తినంతటినీ కలవరపరచిన ఆర్థిక మాంద్యం రోజులు’’ అంటారు తన ఆత్మకథలో.
‘‘ఎండకాలం మండినప్పుడు
గబ్బిలం వలె క్రాగిపోలేదా
వానకాలం ముసిరిరాగా
నిలువు నిలువునా నీరుకాలేదా
శీతకాలం కోతపెట్టగ
కొరడు కట్టీ
ఆకలేసి కేకలేశానే’’.
అంటూ ఆనాడు విశాఖపట్నం వీథుల్లో ఆకలితో..శ్రీశ్రీ పడిన అగచాట్లన్నీ ఈ కవితలో ధ్వనిస్తాయి.
      బతకడం కోసం, జీవితమంతా పోరాటం చేసినవాళ్లంతా పేదరికాన్ని ఈసడించుకోలేదు. అసలు ఆ పేదరికం పారిపోవడానికి మార్గాలేంటో అన్వేషించారు. దాని ఆయువు పట్టు ఎక్కడుందో పట్టుకుని చదువు అనే ఆయుధంతో పోరాడి గెలిచారు అలా జీవితాంతమూ బతుకుపోరు సల్పిన జ్ఞానపీఠ పురస్కార గ్రహీత రావూరి భరద్వాజ తనను ఆవహించిన ఆకలి భూతం గురించి ఇలా చెప్తారు  ‘‘ఆకలి, దరిద్రం మనిషికి ఇవి రెండూ శత్రువులే. ఆకలంటే ఏమిటో దరిద్రం అంటే ఎలా ఉంటుందో బహుశా నాకు తెలిసినంతగా ఎవరికీ తెలీదనుకుంటాను. నా రచనల్లోని పాత్రలు కూడా ఆకలి, దరిద్రంతో పెనుగులాడుతూ, పోట్లాడుతూ కనిపిస్తాయి. నేలవిడిచి సాము చేయకుండా వాస్తవ జీవితాన్ని అక్షరబద్ధం చేశాను’’ అని చెబుతారు.
      జీవితంలో ప్రతి ఒక్కరినీ ఆకలి, ఆవేదన అనేవి పలకరిస్తూ ఉంటాయి. రాహువులా కొన్ని రోజులపాటూ మసకేస్తాయే కానీ మొత్తం జీవితాన్నే చీకటి చేయలేవు. కాలంలో రుతువుల మాదిరి బతుకులోకి కూడా కలిమిలేములు సరిజోడుగా వస్తాయి. కావడికుండల్లా సమతూకంలో సరిచేసుకుని పోవాలి. మందగించక ముందుకడుగెయ్‌ వెనకబడితే వెనకేనోయీ.. అంటూ క్రియాశీలకంగా మార్పుకోసం, సరికొత్త జీవన వికాసం కోసం ప్రయత్నం చేసినప్పుడే ఆకలి తోకముడుస్తుంది. లేదూ ఒకానొక దీర్ఘకాలిక రుగ్మతలా వెంటాడుతూనే ఉంటుంది.


వెనక్కి ...

మీ అభిప్రాయం