సూర్యుడే సెలవని... అలసిపోయేనా!

  • 311 Views
  • 22Likes
  • Like
  • Article Share

    మనీష పరిమి

  • యర్రగొండపాలెం, ప్రకాశం జిల్లా manishaparimi70@gmail.com
మనీష పరిమి

తెల్లతెల్లవారుతోంది. పచ్చని చెట్లూచేమల మధ్య దోర మామిడిపండల్లే కనిపిస్తున్నాడతను. నులి వెచ్చని కాంతిరేఖలను నలుమూలలా ప్రసరిస్తున్నాడు. బంగారు వర్ణంలో మెరుపులీనుతూ లోకమంతా వెలుగు నింపే ఆ భాస్కరుడు సంధ్యవేళకు తానూ అలసిపోయానంటూ పడమటి కొండల వెనక్కి వెళ్లి దాక్కుంటాడు. అస్తమించే రవి కనువిందు చేసే సమయమది. నిప్పుల కొలిమి లాంటి సూర్యుడు మంచు దుప్పటి కప్పుకున్నట్టు, మెల్లగా కొండకోనల చుట్టూ అలముకుంటున్న చీకట్లలో ఏ మాత్రం శోభ తగ్గదు. వేడి ఆవగింజంతైనా తగలదు. అందుకే అందమైన ఈ సూర్యాస్తమయ సమయాన్ని వర్ణించని ప్రాచీన కవులు అరుదు!
పగటిపూట
ఎంత వేడిగా ఉన్నా సంధ్యవేళకి చల్లగా మారి, ఆ నీలి ఆకాశంలో ఎర్రని బింబం కనువిందు చేస్తుంది. సూర్యశతక కర్త దీన్ని మనోహరంగా వర్ణించాడు. ఈ శతకంలో 102 శ్లోకాలుంటాయి. అన్నీ సూర్యుణ్ని వర్ణించేవే. మయూరుడు రాసిన వీటిని శ్రీనాథుడు తెలుగులోకి అనువదించాడు. ‘‘ద్వీపే యోస్తాచలోస్మిన్భవతి ఖలు సవివాపర త్రోయాద్రి’’- మన దేశంలో సాయంత్రం అయితే మరో ఖండంలో సూర్యోదయం అవుతుంది. ఇక్కడ రాత్రయితే అక్కడ ఎండ కాస్తుంది. దీన్ని శ్రీనాథుడు ‘‘ఒక దీవి నేకొండ ఉదయాద్రియై దొలచు’’ అంటాడు. ‘‘శాతఃశ్యామాలతాయాః..’’ అనే శ్లోకాన్ని ‘‘చిరుసాన పట్టించి, చికిలి చేయించిన గండ్రగొడ్డలి నిశా గహన లతకు’’ అంటూ తెనిగించాడు కవిసార్వభౌముడు. చీకటి అనే లతను నరకడానికి వాడే గొడ్డలట ఆ రవి. అయితే అంతటితో ఆపక ఇంకాస్త కలిపి చెప్పాడు శ్రీనాథుడు. ఆ తీగను గహన (పాపం) లతగా అభివర్ణించాడు. అలాగే, భాగవతంలో అస్తమిస్తున్న దినకరుణ్ని ఇలా వర్ణించాడు పోతన...  
గగనారణ్యచరాంధకార గజమున్‌ కాలాహ్వయ వ్యాధుడ 
చ్చుగ బట్టన్‌ గమకించి, మచ్చిడుటకై చూతాంకురశ్రేణిచే
నొగిగల్పించిన కందుకం బనగ సూర్యుండంత వీక్షింపగా
దగె మందప్రభతోడ బశ్చిమ మహాధాత్రీ ధరేంద్రంబునన్‌

      కాలం అనే వ్యాధుడు (బోయవాడు).. ఆకాశమనే అరణ్యంలో తిరిగే చీకటి అనే ఏనుగును పట్టుకోవడం కోసం వెతుకుతుంటే, దానికి మత్తుమందు పెట్టేందుకు పూనికతో తయారుచేసిన మామిడి చిగుళ్లముద్ద ఏమో! అన్నట్టుగా సూర్యుడు పడమటి కొండ మీద కాంతి తగ్గి కనిపిస్తున్నాడట. ఏనుగు చిగురాకులు మేస్తుంది కాబట్టి వాటిని మత్తు మందుతో కలిపి నూరి బంతి అంత ముద్ద చేసి పెట్టిన్నట్టుందట ఆకాశంలోని ఆ ఎర్రని సూర్యబింబం.
‘ఉత్తర హరివంశం’లో నాచన సోమన సూర్యాస్తమయాన్ని అనేక విధాలుగా వర్ణించాడు. ఉగ్రసేనుడు, వసుదేవుడు హిడంబాసురుడి నోటిని చూసి భయపడి పారిపోతారు. బలరాముడు ఆ రాక్షసుణ్ని ఎదిరించి, ముష్ఠియుద్ధంలో కొండ లాంటి వాణ్ని చేతుల్తో ఎత్తి గిరగిర తిప్పి విసిరేస్తాడు. రాక్షస వీరులు అవమాన భారంతో తొలగిపోతారు. అప్పుడు సూర్యాస్తమయం అవుతుంది. అదెలాగుందంటే.. 
కడపంగ రాకున్న కాలఖడ్గముచేత 
బగలింటి తల నేల బడినయట్లు 
సాయంతనం బను జాలరి జలధిలో 
బచరింప వల డిగ బాఱినట్లు
పొడవైన యాకాశ భూరుహంబున సంధ్య 
గోయంగ గొల త్రెవ్వి కూలినట్లు
చరమదిగ్బేతాళ కరమున వరుణుడు 
గడి వెట్ట బొల పొట్ట నడగినట్లు

      కాలం అనే కత్తితో పగలు అనే వ్యక్తి తల తెగి నేలపై పడినట్లుంది. సాయంకాలం అనే బెస్తవాడు పడమటి సంద్రంలో చేపల కోసం వేసిన గుండ్రని వల నీట మునిగిపోయినట్లుంది. ఆకాశం అనే చెట్టు నుంచి సంధ్యాదేవి అనే దేవత కోయగా రాలిపడ్డ పళ్లగుత్తిలాగుంది. పశ్చిమ దిక్కులో భేతాళుడి చేతిలో వరుణుడు పెట్టిన మాంసం ముద్ద వాడి పొట్టలో ఒదిగినట్లుందట! పొద్దుగూకే వేళలో ఈ వెలుతురుదొర ఇంకా ఎలా ఉంటాడో చూడాలంటే ఎర్రన ‘హరివంశం’లోకి వెళ్లాలి..  
క్రుంకుగుబ్బలి పారకి కొప్పరించి
పట్టజాలక వైచిన బ్రద్దపరికి 
బాటి యగుచు, ముగుర పొత్తు పళ్లెరంబు
భానుమండల మంత జూపట్టదయ్యె

      క్రుంకు గుబ్బలి అంటే సూర్యుడు అస్తమించే పర్వతం. గుబ్బలి అనే వీరుడు ఉప్పొంగిపోయి చేతిలో పట్టజాలక, జారవిడిచిన డాలును పోలినట్లుందట సూర్యబింబం. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉమ్మడి భోజన పళ్లెంలాగా ఉండి అంతలోనే మాయమైందట. ‘యయాతి చరిత్రం’లో పొన్నకంటి తెలగనార్యుడు సూర్యాస్తమయాన్ని ఇలా వర్ణిస్తాడు..
సరగ మిన్నను కమ్మరి సంజ కొలిమి
బెట్టుగా గాల్చి, బంగారు చుట్టువాలు
బదును వెట్టగ గొనిపోయి పట్టలేక
విడిచెనన బ్రొద్దు పడమటికడలి మునిగె

      ఆకాశం అనే కమ్మరి, సాయంసంధ్య అనే కొలిమిలో బంగారు చక్రాయుధాన్ని బాగా కాల్చాడు. అదప్పుడు ఎర్రగా కణకణలాడుతోంది. దానికింక పదునుపెట్టాలి. అందుకు ముందుగా నీళ్లలో ముంచి చల్లార్చాలి. అటుపైని ఆకురాతితో రుద్దడమో ఏదో చెయ్యాలి. ఇలా పదునుపెట్టుకోవడం కోసమని దాన్ని తీసుకెళ్తూ, కొంతదూరం వెళ్లాక పట్టుకోలేక పట్టుకారు కూడా వేడెక్కిపోయిందేమో విడిచిపెట్టేశాడా అన్నట్టుగా పడమటి రవిబింబం కిందకి జారిపోయింది. దినరాజు అలా తన కర్తవ్యాన్ని ముగించుకుని సెలవు తీసుకుంటున్నాడట! 
రాముడున్నాడుగా.. నేనెందుకు!
ఉదయించిన భాస్కరుడు అస్తమించక మానడు. మరి రావణ సంహార సమయాన్ని ఓసారి గుర్తుచేసుకుంటే.. సూర్యభగవానుడికి అమిత భక్తుడు రావణాసురుడు. కానీ అయోధ్యరాముడి సతి సీతాదేవిని అపహరించి చేయరాని పాపం చేశాడు. రావణ చెర నుంచి సీతను తప్పించేందుకు శ్రీరాముడు వానర సైన్యాన్ని వెంటబెట్టుకొచ్చాడు. పగలనక, రాత్రనక ఆ యుద్ధం భీకరంగా సాగింది. ఆ సమయంలో భానుడు తన భక్తుడైన రావణుడికి తోడుగా నిలిచాడా! ఏకపత్నీ వ్రతుడు, నీతిమంతుడు, సుగుణశీలి అయిన శ్రీరామునికి సాయంగా నిలుస్తాడా! అన్న సందిగ్ధ సందర్భాన్ని గోన బుద్ధారెడ్డి రంగనాథ రామాయణంలోని ఈ పద్యం వివరిస్తుంది..
అంచిత కఠినపుంఖాస్త్రాంశుతతుల 
ముంచి, రావణుని తమోగుణం బణప
భీమప్రతాప సంస్ఫీతుడైయున్న
రాముడే చాలు దుర్వారు డన్మాడ్కి 
ఘనతరంబ తన కరములు ముడిచి
వనజాప్తు డపరదిగ్వనధిలో మునిగె

      శ్రీరాముడు వానరసైన్యంతో, వానర నాయకులతో యుద్ధభూమికి చేరాడు. లంకలో ఉన్న రాక్షసజాతిని గడగడలాడి స్తున్నాడు. వానరులకు, రాక్షసులకు ఘోరంగా ద్వంద్వ యుద్ధం జరిగింది. యుద్ధభూమిలో తెగిపడిన అవయవాలతో భయంకరంగా ఉంది. రాక్షస స్త్రీలు గగ్గోలు పెడుతున్నారు. అప్పుడు సూర్యాస్తమయ మైంది. ఆ సమయంలో సూర్యుడు తన వంశం వాడూ మహా వీరుడూ అయిన రాముడొక్కడు చాలు ఆ రావణుణ్ని సంహరించడానికి అని విశ్రాంతి తీసుకున్నాడట! రావణుడిలోని పాపపు గుణాన్ని అణచివేయడానికి అజేయుడైన రాముడొక్కడు చాలు. మంచితనం, తగిన కాఠిన్యం కలిసిన రామచంద్రుడి బాణాలకు రావణుడు దాసుడవుతాడని తలచిన సూర్యుడు గొప్ప సైన్యంగా ఉన్న తన కిరణాలను వెనక్కు తీసుకున్నాడట. అదీ దినరాజు అలసిన వేళ!
      సూర్యుని రథానికి ఏడు గుర్రాలుంటా యని ప్రతీతి. తూర్పు కొండల మీద నుంచి ప్రయాణం ప్రారంభించింది మొదలు, ఆ గుర్రాలు అలుపెరగక పరుగెడుతూనే ఉన్నాయి. సాయంకాలం అయ్యేసరికి వాటికి దాహం వేసింది. అప్పటికి పశ్చిమ దిక్కుకు చేరుకున్నాయి. ఎదురుగా సముద్రం కనిపించింది. ఆ నీరు తాగడం కోసం ఆ గుర్రాలు సూర్యరథాన్ని వేగంగా లాక్కుపోయాయా! అన్నట్టుగా ఆ సాయం కాలం సూర్యబింబం పడమటి దిక్కున వాలిపోయిందంటాడు ‘పరమయోగి విలా సం’లో తిమ్మ నృపాలుడు. ఇలా ఎందరో కవులు సూర్యాస్తమయం చుట్టూ అందమైన ఊహలల్లారు. ఎవరికి నచ్చిన రీతిలో వారు ఆ సుమనోహర ప్రాకృతిక దృశ్యానికి భాష్యం చెప్పారు. లోకబాంధవుడైన భాస్కరుడి మీద మన కవుల ప్రేమను తెలిపే ఈ పద్యాలన్నీ అక్షరామృతపు సిరిసోనలే!


వెనక్కి ...

మీ అభిప్రాయం