తెలుగు మాధ్యమమూ ఉండాలి

  • 882 Views
  • 9Likes
  • Like
  • Article Share

ప్రభుత్వ బడుల్లో ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో మాత్రమే విద్యాబోధన జరపాలని ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నిర్ణయించడం మీద నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం తన ఉత్తర్వులను ఉపసంహరించుకుని తెలుగు మాధ్యమాన్ని కూడా కొనసాగించాలని వివిధ రంగాల ప్రముఖులు తమ వాణి వినిపిస్తున్నారు. 
మాతృభాషలో
విద్యాబోధన వల్ల విద్యార్థికి పాఠ్యాంశం సమగ్రంగా అర్థమవుతుంది. నైపుణ్యాలు పెరుగుతాయి. మాతృభాష వినయ విధేయతల్నీ అందిస్తుంది. పరభాష పవనాలు వీయడానికి కిటికీలు తీసి ఉంచొచ్చు. కానీ, మాతృభాషను విస్మరిస్తే ఆ గాలిలో కొట్టుకుపోతాం. మేధావులు, పండితులు తెలుగు భాష బలోపేతానికి నడుం బిగించాలి. తెలుగు భాష వైభవాన్ని నలుదిశలా చాటి చెప్పాలి.  - చంద్రబోస్, సినీగేయ రచయిత


తెలుగు మాధ్యమంలోనే ప్రాథమిక విద్య ఉండాలి. నేను తెలుగు మాధ్యమంలోనే చదువుకున్నాను. దానివల్ల కలిగిన వికాసం నా ఉన్నత విద్యకు, అత్యున్నత విద్యాసంస్థల్లో ప్రవేశానికి తోడ్పడింది.   - లక్ష్మీ సలీం, ప్రముఖ ప్లాస్టిక్‌ సర్జన్, విజయవాడ


ప్రాంతీయ భాషలో బోధనను తొలగించి మరీ ఆంగ్ల విద్యను ప్రోత్సహించాల్సిన అవసరం లేదు. ప్రస్తుత పరిస్థితుల్లో బడుల్లో పూర్తి ఆంగ్ల విద్య ఆమోదం కాదు. ఉపాధ్యాయులకు విస్తృత స్థాయిలో పునశ్చరణ, శిక్షణ ఇవ్వకుండా ఇలాంటివి ప్రవేశపెడితే అభాసుపాలు కావాల్సిందే. దేశంలో విదేశీయుల పాలన కారణంగా ఆంగ్లమనేది ఇక్కడ భాగంగా మారి ఉండొచ్చు. అలాగని విద్యలో దానికి అధిక ప్రాధాన్యం ఇవ్వక్కర్లేదు. తక్కువా చేయనక్కర్లేదు. ప్రాథమిక స్థాయిలో మాతృభాషను కొనసాగిస్తూ అవసరమైన చోట అంచెలంచెలుగా ఆంగ్ల విద్యను ప్రవేశపెడితే ఇబ్బంది ఉండదు. - ఆచార్య రామ్‌పునియాని, ఐఐటీ- బాంబే 


ప్రాథమిక విద్య మాతృభాషలోనే ఉండాలనే విషయమై అంతర్జాతీయ స్థాయిలో ఏకాభిప్రాయం ఉంది. దీన్ని అమలు చేయమని ఐక్యరాజ్యసమితి విద్యా, విజ్ఞాన, సాంస్కృతిక సంస్థ (యునెస్కో) ఎప్పటి నుంచో ఆయా దేశాలను కోరుతోంది. కానీ, ప్రపంచంలో 40 శాతం మందికి తమకు అర్థమయ్యే లేదా చదవగలిగే భాషలో విద్య లభించడం లేదు. ఎక్కడైనా ప్రాథమిక విద్య అమ్మభాషలో ఉండాలనేది సహజసూత్రం. పుట్టిన పిల్లాడికి తల్లిపాలు పట్టాలా లేదా వాడి నోట్లో పిజ్జా-బర్గర్‌ కుక్కాలా అనే విషయంలో ఎవరికీ సందేహం రాకూడదేమో! తెలుగు మాధ్యమంలో చదివిన విద్యార్థులకు ఉన్నత విద్యాసంస్థల ప్రవేశాల్లో, రాష్ట్ర ప్రభుత్వ కొలువుల్లో ప్రాధాన్యం ఇవ్వాలనే వాదనలోనూ బలముంది. ఈ విషయంలో ఇతర రాష్ట్రాల విధానాలను పరిశీలించాలి.  - ఈదర రవికిరణ్, ఐఆర్‌ఎస్‌ అధికారి


ఆంగ్ల మాధ్యమం మాత్రమే ఉండేలా ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం తగదు. తెలుగు మాధ్యమాన్నీ కొనసాగించాలి. గ్రామీణ ప్రాంత బళ్లలో పూర్తిస్థాయిలో ఉపాధ్యాయులే లేరు.  - ఇళ్ల వెంకటేశ్వరరావు, ఎమ్మెల్సీ, ఆంధ్రప్రదేశ్‌


72 ఏళ్ల స్వాతంత్య్ర భారత దేశంలో సాధించిన అక్షరాస్యత అరకొరే. మాతృ భాషలోనే సాధించలేనిది ఇక ఆంగ్ల మాధ్యమంలో ఎలా కుదురుతుంది? ఎస్సీ, ఎస్టీ గురుకులాల్లో ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టిన తర్వాత మధ్యలో బడి మానేసిన వారి సంఖ్య పెరిగింది.  - అట్టాడ అప్పలనాయుడు,  ప్రముఖ రచయిత, శ్రీకాకుళం జిల్లా


మాతృభాషలో ప్రాథమిక విద్యాబోధన సాగితేనే విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. రాజ్యాంగం సైతం అదే చెబుతోంది. సంస్కృతి, భావ వ్యక్తీకరణ లను పిల్లలు మాతృభాష ద్వారానే తెలుసుకోగలుగుతారు. ఉపాధికి తెలుగు అడ్డుగా ఉందని చెప్పడం సబబు కాదు.  - నందివెలుగు ముక్తేశ్వరరావు, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, తిరుపతి


తెలుగు మాధ్యమం గురించి రెండు రాష్ట్రాల్లో విస్తృతంగా చర్చ జరుగుతోంది. ప్రభుత్వం మాదే కాబట్టి ఏమైనా చేస్తామనే ధోరణిలో పాలకులున్నట్లు కనిపిస్తోందే తప్ప ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవట్లేదు. 1964లో ఏర్పాటైన అధికార భాషా సంఘం ఎవరికో ఒకరికి అధ్యక్ష బాధ్యతల్ని అప్పగించడానికే పనికొచ్చిందిగానీ, భాషకు ప్రయోజనం చేకూర్చలేకపోయింది. - డా।। కె.వి.రమణాచారి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారు


అమ్మభాషలోనే విద్యాబోధన జరగాలి. దీని వల్ల పిల్లల్లో విషయావగాహన పెరుగు తుంది. విద్య కేవలం ఉద్యోగాల కోసం కాదు, విజ్ఞానం కోసమని గుర్తించాలి.   - పాకలపాటి రఘువర్మ, ఎమ్మెల్సీ


నిర్బంధ ఆంగ్లమాధ్యమ నిర్ణయం మీద ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పునరాలోచించాలి. ఈ జీవోను వ్యతిరేకించే ఏ ఒక్కరూ సర్కారు బడుల్లో ఇంగ్లీషు మీడియం వద్దనడం లేదు. తెలుగు మాధ్యమంలోనూ బోధన కొనసాగించాలని కోరుతున్నారు. తెలుగు మాధ్యమాన్ని రద్దు చేస్తే పీడిత కులాల అభివృద్ధికి ఆటంకం కలుగుతుంది. తెలుగు, ఆంగ్ల మాధ్యమాలను కొనసాగిస్తే విద్యార్థులు వారి ఆసక్తి మేరకు నచ్చిన దాన్ని ఎంపిక చేసుకుంటారు.  - దుడ్డు ప్రభాకర్, రాష్ట్ర అధ్యక్షులు, కుల నిర్మూలన పోరాట సమితి


రాష్ట్ర ప్రభుత్వం ఆర్భాటంగా ఆంగ్ల మాధ్యమాన్ని ప్రవేశపెట్టడం వెనుక కుట్ర ఉంది. బడుగు, బలహీన వర్గాల పిల్లలకు ఏ మాధ్యమంలో చదువుకోవాలో ఎంచుకునే హక్కు లేకుండా చేయడం దారుణం. దీంతో విద్యార్థులు బడి మధ్యలో మానేసే ప్రమాదం ఎక్కువ. విద్యార్థుల శ్రేయస్సు దృష్ట్యా ప్రభుత్వం రెండు మాధ్యమాలనూ సమాంతరంగా కొనసాగించాలి.  - కె.ఎస్‌.ఎస్‌.ప్రసాద్, యూటీఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు, కడప


తెలుగు మాధ్యమాన్ని రద్దు చేసే అధికారం ప్రభుత్వానికి లేదు. పోరాటాలు చేసైనా తెలుగు భాషను కాపాడుకుంటాం. అమ్మ భాష అభివృద్ధి కోసం పక్కనున్న తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలను చూసైనా ప్రభుత్వం కళ్లుతెరవాలి.  - పీవీఎస్‌ మాధవ్, ఎమ్మెల్సీ
ప్రాథమిక స్థాయిలో మాతృభాషలోనే బోధన జరగాలి. ప్రభుత్వం బలవంతంగా ఆంగ్లాన్ని రుద్దడం సరికాదు. మాతృభాష అంతరిస్తే ఆ ప్రభావం సంస్కృతి మీద పడుతుంది. ప్రభుత్వ నిర్ణయం వల్ల తెలుగు, ఉర్దూ భాషలకు తీవ్ర నష్టం జరుగుతుంది. పాఠశాలల్లో ఉపాధ్యాయుల ఖాళీలను భర్తీ చేయకుండా, ఆంగ్ల మాధ్యమం మీద వారికి శిక్షణ ఇవ్వకుండా దీన్ని ఎలా అమలు చేస్తారు?  - మహ్మద్‌ రఫీక్, జమాతే ఇస్లామీ హింద్‌ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షులు


పాఠశాలల్లో తెలుగు మాధ్యమాన్ని తీసేస్తామనే అధికారం ఏ ప్రభుత్వానికీ లేదు. మాధ్యమాన్ని ఎంచుకునే అవకాశం విద్యార్థుల తల్లిదండ్రులకు ఇవ్వాలి. అసలు ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్లంలో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు పూర్తిస్థాయిలో ఉన్నారా?   - సోము వీర్రాజు, ఎమ్మెల్సీ


ఆంగ్ల మాధ్యమానికి సమాంతరంగా తెలుగు మాధ్యమాన్ని పాఠశాలల్లో కొనసాగించాలి. ముందుగా విద్యావ్యవస్థలో చేయాల్సిన మార్పులు, సంస్కరణల మీద దృష్టిసారించాలి. ఆంగ్లం అర్థం చేసుకునే స్థాయిలో విద్యార్థులున్నారా? అర్థమయ్యే రీతిలో సులభంగా ఉపాధ్యాయులు బోధించగలరా?  - నక్కా ఆనందబాబు, మాజీ మంత్రి


ఇంగ్లీషు నేర్చుకుంటేనే ఉద్యోగాలు వస్తాయని చెప్పడంలో అర్థం లేదు. బాల్యంలో మాతృభాషలో చదువుకోకుంటే ఏ రంగంలోనూ రాణించలేం.  - సామల రమేష్‌బాబు, కన్వీనర్, మాతృభాషా పరిరక్షణ వేదిక


మాతృదేశాన్ని, అమ్మభాషను విస్మరించటం ఆత్మద్రోహంతో సమానమన్న జాతిపిత మహాత్మా గాంధీ మాటల్ని నిరంతరం మననం చేసుకోవాలి. మాతృభాషలోనే ప్రాథమిక విద్యాభ్యాసం జరగాలన్న విద్యావేత్తల సూచనలు, జాతీయ విద్యావిధాన నిర్ణయాలను ఆంధ్ర  ప్రభుత్వం వెంటనే అమల్లోకి తేవాలి.  - ‘పద్మశ్రీ’ తుర్లపాటి కుటుంబరావు, అనుభవజ్ఞులైన పాత్రికేయులు, విజయవాడ


జీవో నం. 81ని తక్షణమే ఉపసంహరిం చుకోవాలి. 1 నుంచి 5వ తరగతి వరకు అన్ని యాజమాన్యాల పరిధిలో తెలుగు మాధ్యమాన్ని తప్పనిసరి చేయాలి.  - ఆదిశేషయ్య, రాష్ట్ర భాషోపాధ్యాయ సంస్థ నాయకులు, అనంతపురం


ప్రాథమిక స్థాయిలో మాతృభాషలో విద్యను బోధించడం వల్ల పిల్లల్లో భావవ్యక్తీకరణ, సృజనాత్మకత శక్తులు ఇనుమడిస్తాయి.  పరిసరాల విజ్ఞానం, గణితం, మనోవిజ్ఞాన శాస్త్రాలను పూర్తిస్థాయిలో అర్థం చేసుకోగలరు. చైనా, రష్యా, జపాన్, కొరియా లాంటి దేశాల్లో మాతృభాషలోనే బోధన జరుగుతోంది.  - పి.రవిప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఏపీ ఉపాధ్యాయ సంఘం


దేశంలో బహుభాషలు సంస్కృతి, సంప్రదాయాల నడుమ విద్యను వైవిధ్యంగా తీర్చిదిద్దుతున్నాయి. మాతృభాషలో బోధన వల్ల చిన్నతనం నుంచే విద్యార్థికి అవసరమైన జ్ఞానం లభిస్తుంది.  - ఆచార్య ఎల్‌.రామమూర్తి, మైసూరు


తెలుగు భాష వల్లనే ఈ ప్రపంచంలో మనకు మనదైన గుర్తింపు లభిస్తోంది. అమ్మభాషని పరిరక్షించుకోవడం ప్రతీ తెలుగు వ్యక్తి కర్తవ్యం. - గిరిబాబు, చలనచిత్ర నటుడు


చిన్నారుల సర్వతోముఖాభివృద్ధికి మాతృభాషలో విద్యాబోధన దోహదపడుతుంది. వీలైనన్ని ఎక్కువ భాషలు నేర్పించడం తప్పు కాదు. అయితే మాతృభాషను విస్మరించడం ఏమాత్రం తగదు. వార్తలు అందించడంతో పాటు తమ మాతృభాషకు సరైన ప్రోత్సాహం అందించడాన్ని ప్రాంతీయ మీడియా సంస్థలు బాధ్యతగా భావించాలి. ప్రస్తుతం పార్లమెంటులో కూడా సభ్యులను వారి మాతృభాషలో మాట్లాడేలా ప్రోత్సహించడం ప్రారంభించాం. ఇతర సభ్యులు వినాలంటే అనువాదం అందుబాటులో ఉంది. కోర్టు, ప్రభుత్వ కార్యాలయాలు, ఆయా శాఖల్లో స్థానిక భాష ఉంటేనే అందరికీ అర్థమవుతుంది. 

- ఎం.వెంకయ్యనాయుడు, భారత ఉపరాష్ట్రపతి


భాష, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు తెలుగు; వృత్తిలో రాణించడానికి ఆంగ్లం అవసరం అనేదే మా పార్టీ విధానం. ఆంగ్లం వద్దని మేమెక్కడా పేర్కొనలేదు. మాతృభాష తెలుగును కాపాడాలని చెప్పాం. తెలుగు మాధ్యమాన్ని కొనసాగిస్తూనే పురపాలక పాఠశాలల్లో సమాంతరంగా ఆంగ్ల బోధన ప్రవేశపెడుతూ 2017లో నిర్ణయం తీసుకున్నాం. 2018-19లో ఆదర్శ పాఠశాలలు, ఇతర ప్రాథమిక పాఠశాలల్లో తెలుగు మాధ్యమానికి సమాంతరంగా ఆంగ్ల మాధ్యమాన్ని అమలు చేయాలని ఉత్తర్వులిచ్చాం. 

- నారా చంద్రబాబునాయుడు, ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి


విద్యాహక్కు చట్టం-2009లోని సెక్షన్‌ 29(2) ప్రకారం బోధనా భాష సాధ్యమైనంత ఆచరణాత్మకంగా, పిల్లల మాతృభాషలో ఉండాలి. దీని ప్రాధాన్యం గురించి జాతీయ పాఠ్యాంశ చట్టం-2005 స్పష్టంగా చెబుతోంది. భాషా విధానం అమలులో కేంద్ర ప్రభుత్వానికి మైసూరులోని భారతీయ భాషల కేంద్ర సంస్థ సాయం అందిస్తుంది. జాతీయ విద్యావిధానం రూపకల్పనపై కసరత్తు జరుగుతోంది. ప్రస్తుతం అది ముసాయిదా దశలో ఉంది.  1968, 1986ల్లో రూపొందించిన విధానాల ప్రకారమూ ప్రాథమిక విద్యాభ్యాసం మాతృభాషలో ఉండాలి. ప్రస్తుత విధానమూ ఆ కోణంలోనే ఉంటుంది. అప్పుడే అది ఫలవంతమవుతుంది. 

- రమేష్‌ పోఖ్రియాల్, కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి


ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగు మాధ్యమం తప్పనిసరిగా కొనసాగించాలి. ఆంగ్ల మాధ్యమంలో చదివితే ప్రతిభ పెరిగి ఉపాధి అవకాశాలు ఎక్కువ అవుతాయని కొంతమంది చేస్తున్న వాదన సరైంది కాదు. 

- శ్రీనివాసరావు, సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు


 

మాతృభాషను నిర్లక్ష్యం చేస్తే సాధించిన అభివృద్ధికి అర్థంలేనట్లే. ఐక్యరాజ్య సమితి 2019ని అంతర్జాతీయ స్వదేశీ భాషల సంవత్సరంగా ప్రకటించింది. కనుమరుగయ్యే స్థితిలో ఉన్న భాషలను పరిరక్షించుకోమనే దానర్థం. ఒక భాష అభివృద్ధి అనేది ఒక వ్యక్తి సమగ్ర అభివృద్ధికి భూమిక అని 150 ఏళ్ల క్రితమే ఆధునిక హిందీ పిత భారతేందు హరీష్‌చంద్ర పేర్కొన్నారు. దీన్ని బట్టి మాతృభాష మీద అవగాహన లేకుండా ఒక వ్యక్తి ఎదుగుదల అసాధ్యమని అర్థమవుతుంది.  

- నరేంద్ర మోదీ, భారత ప్రధాని


ఆంగ్లాన్ని వద్దని ఎవరూ చెప్పట్లేదు. కానీ, తెలుగు మృతభాష కాకుండా ఏం చర్యలు తీసుకుంటారో చెప్పాలి. మాతృభాషను, మాండలికాలను సంరక్షించాల్సిన ప్రథమ బాధ్యత ప్రభుత్వానిదే. భాష లేనిదే సంస్కృతి లేదు. మన మనుగడకు జీవనాధారమైన నదులను మనం చేతులారా విషమయం చేస్తున్నాం. మాతృభాష మూలాలను మనమే నరికేసుకుంటున్నాం. ఇది బాధాకరం. అధికరణ 350ఎ కింద తెలుగు కోసం డబ్బు తీసుకొని, ఆంగ్లం కోసం ఖర్చు పెడతారా? మాతృభాషను వదిలేస్తే సొంత రాష్ట్రంలోనే పరాయి వ్యక్తులుగా మిగిలిపోయే పరిస్థితి వస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉత్తర్వులు సైతం వారి భాషల్లోనే వెలువడుతుంటే ఇక్కడి పాఠశాలల్లో తెలుగు లేకుండా చేయడం దారుణం. రాష్ట్రంలోని 1481 ఉర్దూ, 32 హిందీ, ఒక బెంగాలీ, 41 కన్నడ, 197 ఒడిశా మాధ్యమ పాఠశాలల జోలికి వెళ్లకుండా.. 45,244 తెలుగు బడుల్లో బోధనను ఎందుకు ఆంగ్ల మాధ్యమంగా మారుతున్నారు? ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెడితే అద్భుతాలు జరిగిపోతాయని ప్రభుత్వం ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపిస్తోంది. వీధి బడుల్లో చదువుతున్న నన్ను మా అమ్మానాన్నలు నెల్లూరులో ఆంగ్ల మాధ్యమంలో ఇంటర్‌ చేర్పించడం వల్ల అర్థంకాక చదువే మానేశా. 

- పవన్‌కల్యాణ్, జనసేన అధ్యక్షులు


మాతృభాషలో విద్యాబోధన ద్వారా పిల్లల మేధ వికసిస్తుందని శాస్త్రీయంగా రుజువైంది. చిన్న వయసులోనే పిల్లల మీద ఆంగ్లాన్ని రుద్దితే వారి మానసిక వికాసం మీద ప్రభావం పడుతుంది. ఇంగ్లండ్, ఫ్రాన్స్, రష్యా, ఇటలీ, స్పెయిన్‌ లాంటి చాలా దేశాలు మాతృభాషలోనే విద్య బోధిస్తున్నాయి. ప్రపంచంలోని సుమారు ఆరువేల భాషల్లో తెలుగు తొలి 20 స్థానాల్లో ఉంది. ఈ భాషను కాపాడుకోవాలి. 

- ఆచార్య గణేష్‌.ఎన్‌.డెవీ, ప్రముఖ భాషా శాస్త్రవేత్త 


 


వెనక్కి ...

మీ అభిప్రాయం