అందం.. ఆనందం... అక్షరాల్లో అమృతం!

  • 2220 Views
  • 19Likes
  • Like
  • Article Share

    గార రంగనాథం

  • విశ్రాంత ప్రధానోపాధ్యాయులు
  • రాజాం, శ్రీకాకుళం జిల్లా
  • 9885758123
గార రంగనాథం

భావకవిత్వమైనా, అభ్యుదయమైనా... మరేదైనా సరే, కవిత్వం అంటే అందంగా ఉండాలి. మనిషికి ఆనందం కలిగించాలి అన్నది దేవరకొండ బాలగంగాధర తిలక్‌ ఉద్దేశం. అందుకే ‘నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు’ అని అందంగా అభ్యుదయ కాంక్షను వ్యక్తం చేశారు. తిలక్‌లోని కాల్పనికత, అభ్యుదయ స్పృహ రెండూ జంటగా సాగుతూ... ఆయన మానవతా వాదాన్ని చాటుతూ తెలుగు సాహితీ లోకంలో కీర్తిపతాకను ఎగరేసిన కవితా సంకలనం ‘అమృతం కురిసిన రాత్రి’.  
తిలక్‌ పద్యకావ్యంతో
తన సాహితీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు. వచన కవిత్వంతో వాఙ్మయ శిఖరాన్ని అధిరోహించారు. సంస్కృత సమాసాల ఆడంబరంతోపాటే అలతి అలతి తెలుగు పదాలూ ఆయన రచనల్లో దర్శనమిస్తాయి. తెలుగు కవితాసతి తలమీద వచన కవితా కిరీటాన్ని ధరింపజేసిన తిలక్‌ 1921 ఆగస్టులో పశ్చిమగోదావరి జిల్లా మండపాకలో జన్మించారు. తొలిరచన ‘ప్రభాతము- సంధ్య’ పద్య సంకలనం అచ్చయ్యేనాటికి తిలక్‌ వయసు 17 ఏళ్లే. గోరువంకలు కవితా సంకలనం, సుశీలపెళ్లి, సుప్తశిల, సాలెపురుగు నాటకాలు, సుచిత్ర ప్రణయం నాటిక, తిలక్‌ కథలు ప్రచురితం అయ్యాయి. వ్యాసాలు కూడా రాశారు. 1944లో బొంబాయి ‘అఖిల భారత అభ్యుదయ రచయితల మహాసభ’లో పాల్గొన్నప్పటి నుంచి ఆయన ఆలోచనా ధోరణిలో మార్పు కనిపిస్తుంది. 1966లో తిలక్‌ మరణం తర్వాత ఆయన కవితలు సంకలనంగా వచ్చాయి. దానికి పీఠిక రాస్తూ ‘అమృతం కురిసిన రాత్రి’ అనే పేరు పెట్టింది కుందుర్తి. దీనికి 1969లో ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ, 1970లో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలు లభించాయి.
అక్షరాలు అందమైన ఆడపిల్లలు
నాకును నీకు మైత్రి ఒకనాటిది కాదు కృతాంతమందు వా
ల్మీకుల శోకమందు మిథిలేశుని పట్టి విషాదమ
దాకృతి దాల్చెగాక మరి నవ్య శిరీష మృదుత్వ మీహృదిన్‌
ఏ కలలెన్ని దగ్ధమయి యీ పొడి బూడిద కొండలై చనెన్‌

      ఈ పద్యం చదివితే తిలక్‌ రచన సాగించిన తొలి నాళ్లలోనే ఆయన హృదిలో నవ్యశిరీష మృదుత్వం ఉందని, దాన్ని కవిత్వంలోకి ప్రవహింపచేశారని తెలుస్తుంది. పద్యాన్ని ఎంత హృద్యంగా చెప్పగలరో అవగతమవుతుంది. కవిత్వాన్ని ప్రియురాలిగా భావించి ఈ పద్యాన్ని రాశాడన్నారు ఆరుద్ర.
      ఇక అమృతం కురిసిన రాత్రి గురించి... 1941లోనే- అంటే కవిత్వం రాస్తున్న తొలి రోజుల్లోనే ‘నా కవిత్వం’ కవితలో... నా అక్షరాలు కన్నీటి జడులలో తడిసే దయా పారావతాలు/ నా అక్షరాలు ప్రజాశక్తుల వహించే విజయ ఐరావతాలు/ నా అక్షరాలు వెన్నెలలో ఆడుకొనే అందమైన ఆడపిల్లలు అన్నారు తిలక్‌. మొదటి పంక్తిలో తన రచనలు ప్రేమ, జాలి, దయవంటి గుణాలతో తడుస్తాయని, రెండో పాదంలో ప్రజల పక్షాన ఉండి, ప్రజా విజయ గాథల్ని మోస్తాయని చెప్పారు. ఇది అభ్యుదయ సూచిక. మూడో పంక్తిలో... వెన్నెలలో ఆడుకొనే అందమైన ఆడపిల్లలు అనడంలో అర్థం తిలక్‌ రచనల అంతిమలక్ష్యం సౌందర్య భావనే. రస నిష్యందమే పరమావధి అన్న తిలక్‌ చివరి వరకూ ఆ మార్గంలోనే నడిచారు. 
      అదే కవితలో... ‘గాజు కెరటాల వెన్నెల సముద్రాలూ/ జాజి పువ్వుల అత్తరు దీపాలూ/ మంత్రలోకపు మణి స్తంభాలూ/ నా కవితా చందనశాలా సుందర చిత్రవిచిత్రాలు’ అంటారు. ఇందులో తన కవిత్వతత్త్వాన్ని ఆయా అందమైన కవితా వస్తువుల సూచనతో అందంగా ఆవిష్కరించారు. ‘నవకవిత’లో కవిత్వం ఎలా రాయాలో చెప్పారు ఇలా...  
కవిత్వం అంతరాంతర జ్యోతిస్సీమల్ని బహిర్గతం చెయ్యాలి
విస్తరించాలి చైతన్యపరిధి
అగ్ని జల్లినా, అమృతం కురిసినా
అందం, ఆనందం దాని పరమావధి

భావ కవిత్వం రాసినా, అభ్యుదయ కవిత్వం రాసినా కవిత్వం పరమావధి అందం, ఆనందమే. ఇది తిలక్‌ కవిత్వానికీ వర్తిస్తుంది. అందుకే ఆయన కవిగా అమరులయ్యారు. ఇంతటి ఉన్నత భావాలు ఉన్నవాడు కనుకనే ‘త్రిమూర్తులు’ కవితలో ప్రాచీన కవులను, భావకవులను, అభ్యుదయ కవులను కూడా మెత్తమెత్తగా తిట్టిపోశారు. ‘అధునాతన భావుకులు స్వప్నభుక్కులు’ అని విమర్శిస్తారు భావకవుల్ని ‘కఠినోపనిషత్‌’లో.
భావకవితా కుసుమాలు
అనుభూతివాదం, కాల్పనికత, ఆత్మాశ్రయత్వం, ఊహాసుందరి కోసం విలపించడం, స్మృతి కవిత్వం... భావకవిత్వ ముఖ్య లక్షణాలు. తిలక్‌లోని భావకవిత్వం గురించి చెప్పాలంటే... ‘ప్రాతఃకాలం’ కవితలో ఆశా కుంతల ధ్వాంతములో నవసి ఇలపై వ్రాలిన అలరువా/ అప్సరాంగనా సఖీ చిరవిరహ నిద్రా పరిష్వంగము విడ/ ఉడుపథమున జారిన మంచు కలవా? అని ఉత్ప్రేక్షిస్తారు. తెల్లవారుజాము వర్ణన ఇది. దిక్కు అనే స్త్రీ దట్టమైన కేశాలలో చిక్కుకొని అలసిపోయి భూమిమీద రాలిన పుష్పానివా? విరహంతో అప్సరస నిద్రను వదిలించుకోగా నక్షత్ర వీధిలో జారిపోయిన మంచు కలవా? అంటారు.
      ‘నువ్వులేవు నీ పాట వుంది’ కవితలో స్త్రీ పురుషుల ప్రేమను వర్ణిస్తారు. ‘పండిన మొగలిపొత్తి వంటి పరిమళం గల ప్రారంభం యౌవనం’ అంటారు. చంద్రికా స్నపిత సంగీతాన్ని వింటున్నానంటారు. ‘నీవు’ కవితలో- ‘నీవు కలసి త్రాగని నేను త్రాగు మధుపాత్ర యన్నదియు లేదు. నా నిదురించు శయ్యాగృహమ్ము నీవు లేక- నాకు పచ్చి శూన్యమ్ము’ అని రాస్తారు. వసుధైక గీతంలో ‘మధ్యధరా సముద్రతీర తరుచ్ఛాయ మధ్యాహ్నాన వేళ- నీ స్నిగ్ధ కపోల తల్పాన ముద్దిడిన ప్రియసఖుడ్ని నేను’ అంటూ ప్రేమైక గీతాన్ని ఆలపిస్తారు. ‘విరహోత్కంఠిత’, ‘నువ్వులేవు నీ పాట వుంది’ తదితర కవితలు భావ కవిత్వానికి పరాకాష్ఠలు.
అభ్యుదయమూ అందంగానే...
ఉన్నది ఉన్నట్లుగా జనం సమస్యలను ప్రతిబింబించడం, సమస్యలకు పరిష్కారం చూపించడమే అభ్యుదయ కవిత్వం అనుకొనే రోజుల్లో అభ్యుదయ భావనను చిత్ర వర్ణశోభితం చేసినవారు తిలక్‌. అందుకే ఆరుద్ర ‘‘నాకు తిలక్‌ కవిత్వం ‘కలవారి కోడలు కలికి కామాక్షి’లాగ కనపడుతుంది. ఒంటినిండా కాల్పనికోద్యమం కన్నవారు పెట్టిన పాతనగలు, అభ్యుదయోద్యమం అత్తవారు చేయించిన కొత్తనగలూ పెట్టుకొన్న ‘చిన్నమ్మ’లాగ సింపుల్‌గా ఉండటానికి ప్రయత్నిస్తూ ఘనంగా గలగల్లాడుతుంది’’ అంటారు. 
      ‘నీడలు’లో ‘సంఘపు కట్టుబాట్లకు రక్షకభటులు/ శ్రీమంతుల స్వేచ్ఛా ప్రవర్తనకు భాష్యకారులు’ మధ్య తరగతివాళ్లు అంటారాయన. ‘సీఐడీ రిపోర్ట్‌’లో గుమాస్తా ‘సుఖమంటే ఏమిటి?’ అని అడిగాడట. ‘ఈ సందేహం పెరిగి పెద్దదవకుండా అతడు మరణించడమే దేశానికి రక్ష’ అని ఆ ఫ్యాక్టరీ యజమాని ఆలోచనను- వర్గ దృక్పథాన్ని చిత్రీకరిస్తారు. ‘మురికికాల్వ మీద ముసలితనం మీద/ మృషా జగతి మీద మహోదయం వికసించదు’ అంటూ... ‘సంప్రదాయ భీరువుకీ, అస్వతంత్ర వితంతువుకి- వసంతం లేదు/ సాహసి కానివాడు జీవన సమరానికి స్వర్గానికి పనికిరాడు’- అని ‘శిఖరారోహణ’లో స్తబ్ధమై నిద్రాణమై ఉన్న సమాజాన్ని మేల్కొలుపుతారు. మహోదయం కోసం సాహసించమంటారు.
      శిక్షాపత్రం కవితలో, ‘న్యాయం తన భయంకర ఛత్రం విప్పినప్పుడు/ ధర్మం కత్తుల బావుటా ఎగురవైచినపుడు/ గత చరిత్రలు నక్షత్రాలై కన్నీరు కార్చినపుడు/ భావి మైదానంలో మీకోసం/ విద్యుత్‌ రజ్జులతో వురి వుచ్చులు! వురి వుచ్చులు...’ అంటూ వర్తకులకు, ప్రభుత్వాధ్యక్షునికి, స్వార్థజీవికీ ఉచ్చులు బిగిస్తారు. ‘ప్రార్థన’లో సామాన్యులకు కనీస అవసరాలు తీరి, వారిపై కాస్త ప్రేమ చూపిస్తే చాలని ప్రార్థిస్తారు. ‘ముసలివాడు’ కవితలో కూడా ముసలివానిని ‘అరిగిపోయిన జోడు’గా, ముసలమ్మను ‘విధి లిఖించిన వెర్రిచిత్రము’గా అభివర్ణిస్తారు. అలా తన మానవతా దృక్పథానికి, అభ్యుదయ భావనకు కవితాగంధం అద్దారు.
యుద్ధ వాతావరణ చిత్రణ
యుద్ధ వాతావరణం, అది చేసే విధ్వంసం, వినాశనాన్ని అయిదారు కవితలలో సుదీర్ఘంగా రాశారు తిలక్‌. రెండో ప్రపంచ యుద్ధం, విశాఖపట్నం ఆయనను ప్రభావితం చేసి ఉంటాయి. ‘పిలుపు’ కవితలో ‘ధాత్రీ జనని గుండెలమీద యుద్ధపు కొరకంచుల యెర్రని రవ్వలు’ అని యుద్ధ జ్వాలల గురించి ఆవేదన చెందుతారు. ‘సైనికుడి ఉత్తరం’లో ‘మీటనొక్కితే పేలే ఓ యాంత్రిక స్టేన్‌గన్‌’లా తయారయ్యాను, నా వ్యక్తిత్వాన్ని కోల్పోయాను’ అని ఓ సైనికుడి హృదయాన్ని ఆవిష్కరిస్తారు. నిద్రించిన సైనికుల గురకను చచ్చిన జీవుల మొరతో పోల్చడం ఆసక్తికరం. ఇంకా... నేనిదివరకటి నేను కాను/ నాకు విలువల్లేవు/ నాకు అనుభూతుల్లేవు/ చంపడం, చావడం/ మీసం దువ్వటం లాంటి అలవాటయ్యింది అనడం... ఆయనలో యుద్ధం అంటే ఉన్న విముఖతకు పరాకాష్ఠ. 
      ‘వెళ్లిపోండి - వెళ్లిపోండి’ కవితలో ‘ఇప్పటివరకు యుద్ధాల్లో ఎంతోమంది సైనికులు చనిపోయారు. వాళ్ల సమాధుల్ని, శవాల్ని వెతక్కండి’ అంటూ యుద్ధంలో అమరులైన వాళ్ల స్త్రీల వేదనను కవిత్వీకరించారు. ‘లయగీతం’లో బాంబుదాడులను ‘పరుగులెత్తు యమదూతల/ పదధ్వనుల ప్రతిధ్వనులు’గా పేర్కొన్నారు. ‘మనిషి మేధ మనిషి గుండె విడిపోయిన ఆనవాలు/ భస్మీకృత ధాత్రి మీద కశ్చిన్మూర్ఖుని తుదివ్రాలు’ అని యుద్ధాన్ని నిర్వచిస్తారు.
      ఈ కావ్యంలో ‘తపాల బంట్రోతు’ కవిత- ఒక సంఘటనను చిత్రీకరిస్తుంది. పొగడ్తకు తగిన వ్యక్తుల జాబితా కవి ఇస్తూనే పోస్ట్‌మాన్‌ పొగడ్తకు ఏమాత్రం తగడు అంటారు. అలా అని అతణ్ని స్వభావోక్తిలో వర్ణిస్తారు. ఇంతలోనే ఒక ప్రియురాలిని ప్రవేశపెడతారు. ఆమె దేశాంతరగతుడైన ప్రియుడి లేఖ గురించి ఎదురుచూస్తూ ఉంటుంది. పోస్ట్‌మాన్‌ కోసం ఎదురు చూస్తున్న ఆమె కళ్లు విచ్చిన కలువల్లా, చూపులు ముళ్లలా తీక్షణంగా ఉన్నాయంటారు. కానీ ఉత్తరం రాలేదని చెప్పడానికి బదులు చిరునవ్వు విసిరి వెళ్లిపోతున్న అతని వెనుక విచ్చిన రెండు కల్హార సరస్సులు అన్నారు. ఉత్తరం రాకపోయేసరికి ఆమె కళ్లలో నీరు. అవి సరస్సుల్లా మారాయి. తేటతెల్లని ఆమె కళ్లు ఎరుపెక్కాయి. కల్హారాలుగా మారాయి. కల్హారమంటే చెంగలువ. చెంగలువ రేకులు తెల్లగా ఉండి మధ్యన ఎరుపుచార ఉంటుంది. నీటితో నిండి ఎరుపెక్కిన తెల్లని కళ్లను కల్హార సరస్సులుగా చిత్రీకరించడం అద్భుతం! అదే కవిత చివర ‘ఉత్తరం ఇచ్చి నిర్లిప్తుడిలాగా వెళ్లిపోయే నిన్ను చూసినపుడు తీరం వదలి సముద్రంలోకి పోతూన్న ఏకాకి నౌక చప్పుడు’ అని తపాలా బంట్రోతు వెళ్లడాన్ని... తీరాన్ని విడిచి నిర్లిప్తంగా వెళ్లిపోయే నౌకతో పోల్చడంలో ఉపమాన వైభవం శిఖరారోహణ చేస్తుంది. 
భాషా వైదుష్యం
‘రాజమండ్రి’ కవితలో ‘రాత్రివేళ రాజమండ్రి గౌతమీ జలాల్లో కొన్ని వేల విద్యుత్‌ దీపాలు ప్రతిఫలిస్తాయి. ఎవరీవిడి ధమ్మిల్లంలో యిన్ని కాంతి లతాంతాల్ని తురిమారు’ అని ఆశ్చర్యపోతారు. అదే కవితలో రాజమండ్రి ‘వృద్ధ నరపతి సార్వభౌముల కృద్ధ లోచన గోళనిర్గత శాసనాబద్ధయై, రుద్ధయై, ముగ్ధయై’ ఉందని చెబుతారు. సంస్కృత పద భూయిష్ఠమైన దీర్ఘసమాసంతో ముగిస్తారు. ఇందులోనే రాజమండ్రిని నాట్యం చేసి అలసిపోయిన ‘వేలుపు సానిలాగ’ ఉందంటారు. వేలుపుసాని అచ్చ తెలుగు పదం. మరోవిషయం... తిలక్‌లోని కవితాత్మ ఒకస్థాయి దాటి వెళ్లగానే ‘మృదుమాధ్వీ పదలహరీ తరంగ మృదంగ విలసద్భంగీ మనోహరాలౌ కావ్యాలు’ అని సుదీర్ఘ సమాసాలు వేస్తుంది. నాలుగైదు చిన్నచిన్న కవితా పంక్తులు చెప్పి ఒక్కసారిగా ‘చలి తుపాను వీచివీచి అలరు తోట వాడిపోవు, పొలిమేరల మంటలేచి పూరిగుడిసె కాలిపోవు’ అని పూర్తి చేస్తారు. 
      ‘లయగీతం’లో- ‘శప్తధాత్రి నిర్జనమై స్మశానమై పరచుకొనెను/ సుప్త దేవదేవ హృదయ సృఙ¥్నళము లెగిరి పడెను’... ఇలా రెండేసి పాదాలతో ముగింపులు, కవిత్వాన్ని తారస్థాయికి తీసుకుపోయే సందర్భాలు లెక్కకుమిక్కిలిగా తిలక్‌ కవిత్వంలో చూడవచ్చు. ‘అదృష్టాధ్వ గమనం’లో ‘నీహార ప్రతి సీరల మధ్య/ నీరవ నదీతీరాల వద్ద/ నిరస్త తరుశాఖల క్రింద’ పాదాల్లో పద్యాల వాసన కనిపి స్తుంది. శ్రీశ్రీ కాదేదీ కవిత కనర్హమన్నట్టు ... స్త్రీ కస్తూరి బొట్టును చదలచుక్క, నెమలిరెక్క, అరటిమొక్కతో పోల్చారు.
      ఈ కవితా సంకలనంలో ‘క్షితిజరేఖ’ మూడుసార్లు, పాడుబడ్డ ఇల్లు అనే అర్థంలో ‘పాడిల్లు’ అని రెండుసార్లు, ‘పుండ్రేక్షు కోదండం’ రెండుసార్లు వాడటాన్ని బట్టి చూస్తే తిలక్‌కూ కొన్ని అభిమాన పదాలున్నాయేమో అనిపిస్తుంది. అలాగే రూపక, ఉపమ, స్వభావోక్తి అలంకారాలను విరివిగా వాడి రచనకు అందాల్ని పొదిగారు. ‘ఈ రాత్రి’ శీర్షికతో రెండు కవితలు, వానకురిసిన రాత్రి, అమృతం కురిసిన రాత్రి, రాత్రివేళ- కవితల నుంచి ఆయన రాత్రి వేళల్లో కవితలు రాసేవారేమో అనిపిస్తుంది. ‘‘ఒక నిశార్ధ భాగంలో నక్షత్ర నివహగగనం/ ఓరగా భూమ్మీదకు వొంగి ఏదో రహస్యం చెబుతూన్న వేళ/ ఒంటరిగా నా గదిలో నేను మేల్కొని రాసుకుంటుంటాను’’ అని ఆయనే చెప్పుకున్నారు. రాత్రిని- ‘చెరచబడ్డ జవ్వని విడివడిన పృథు శిరోజ భారంలాగా ఈ నిశీధం’ అంటారు తిలక్‌.
      ప్రాచీన సాహిత్యాన్ని ఆపోశనపట్టి అతినవ్య సాహిత్యాన్ని సృష్టించిన తిలక్‌... భావకవితా క్షేత్రంలో మొలకెత్తి, అభ్యుదయ కవితాకాశాన్ని చుంబించారు. సంస్కృతం, తెలుగు పదాలు, దీర్ఘ సమాసాలు, అలతి పదాలు, అలంకారాలు, పదబంధాలు, కొత్త ప్రతీకలతో భావ- అభ్యుదయ కవిత్వాల్ని రసరమ్యంగా ఆవిష్కరించారు. అమృతం కురిసిన రాత్రిని అమృతవాహినీ సదృశంగా తీర్చిదిద్దారు. అభ్యుదయ కవిత్వానికి సాహితీ సౌందర్యాన్ని జోడించారు. 


తిలక్‌లో మానవతావాదం, అభ్యుదయం కలగలిసి మధ్య తరగతి, కింది తరగతి జనుల దీనహీన స్థితులను చిత్రీకరించేలా చేశాయి. ‘ఆర్తగీతం’ ఒక్కటే ఓ కావ్యం. మనదేశంలో గల దైన్యాన్ని, హైన్యాన్ని రూపు కట్టించింది. నేటి దారిద్య్రాన్ని చూసి తనయెడద మోడైందని చెప్పాడు. అందులో... ఒక్క నిరుపేద ఉన్నంతవరకు/ ఒక్క మలినాశ్రు బిందు వొరిగినంత వరకు/ ఒక్క ప్రేగు ఆకలి కనలినంత వరకు/ ఈ సిగ్గులేని ముఖాన్ని చూపించలేను - అని ఆవేదన చెందుతారు. దీనజనోద్ధరణకు ఆయన మనసు పడిన ఆరాటాన్ని కళ్లకు కడుతుంది ఈ కవిత.


‘‘తిలక్‌ నవ భావామృత రసధుని, సమకాలిక సమస్యలకు స్వచ్ఛ స్పాటిక ఫలకం- కవితాసతి నొసట నిత్య రస గంగాధర తిలకం’’           - శ్రీశ్రీ
 


వెనక్కి ...

మీ అభిప్రాయం