కాలానికి ముందుమాట గురజాడ బాట

  • 690 Views
  • 0Likes
  • Like
  • Article Share

    ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

  • కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత
  • అనంతపురం
  • 9440222117
ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి

"కవీ ప్రవక్తా ఎల్లప్పుడూ కాలం కంటే ముందు ఉంటారు". తన అసంపూర్ణ నవల 'సౌదామిని'లో కవి పాత్రతో గురజాడ చెప్పించిన ఈ వాక్యం గురజాడకే చక్కగా అన్వయిస్తుంది. గురజాడ కాలం సమాజం చలనశీలమవుతున్న దశ. ఆ చలనాన్ని రచయితగా గురజాడ వేగవంతం చేయటానికి  కృషి చేశారు. పాతకు వీడ్కోలు చెబుతూ కొత్తకు ఆహ్వానం పలికే ప్రయత్నమే ఆయన "కొత్త పాతల మేలు కలయిక". ఈ భావం భాషకు భావుకతకు సంబంధించింది మాత్రమే కాదు. వ్యవస్థకు కూడా సంబంధించినది. అందుకే గురజాడ జన్మించి నూటయాభై ఆరు సంవత్సరాలు గడిచినా ఆయనింకా తెలుగు సాహిత్యంలో, సమాజంలో చిరంజీవిగా ఉన్నారు.

‘గురజాడ’గా ప్రసిద్ధుడైన గురజాడ వేంకట అప్పారావు 1862 సెప్టెంబర్‌ 21న పుట్టారు. 1915 నవంబర్‌ 30న మరణించారు. ఆయన జీవించింది 53 ఏళ్ళే. భారతదేశాన్ని ఆధునిక దేశంగా రూపొందించడానికి అవసరమైన మేధావులు, కశాకారులు, ఉద్యమకారులు పందొమ్మిదో శతాబ్దంలో పుట్టారు. వాళ్ళే రాజారామమోహనరాయ్, మహాదేవ గోవింద రనడే, మహాత్మాపూలే, నారాయణగురు, బి.ఆర్‌.అంబేద్కర్, కందుకూరి వీరేశలింగం పంతులు, సామినేని ముద్దునరసింహంనాయుడు, భాగ్యరెడ్డివర్మ, రవీంద్రనాథ్‌ ఠాగూర్, హరినారాయణ ఆప్టే, బంకించంద్ర చటర్జీ వంటి వాళ్ళు. వీళ్ళతో పాటే మన దగ్గర గురజాడ అప్పారావు కూడా పుట్టారు. పుట్టిన కొన్నాళ్ళకే తండ్రిని పోగొట్టుకున్న గురజాడ ఇతరుల పెంపకంలో పెరిగి, చదువుకొని, విజయనగరం జమీన్‌దారీలో అనేక రకాల ఉద్యోగాలు చేస్తూ రచయితగా ఎదిగారు. జమీన్‌దారీలో ఉద్యోగం, అనారోగ్యం, వీటి మధ్య పరిమితంగానే రాయగలిగారు.
      గురజాడ రాసింది మూడు నాటకాలు. కన్యాశుల్యం, కొండుభట్టీయం, బిల్హణీయం. వీటిలో చివరిరెండూ అసంపూర్ణాలు. అయిదు కథలు: దిద్దుబాటు, మెటిల్డా, పెద్దమసీదు, మీపేరేమిటి?, సంస్కర్త హృదయం. కొన్ని కవితలు: ముత్యాల సరాలు, పూర్ణమ్మ, కన్యక, కాసులు, థామస్‌ పితియస్, లవణరాజుకల, దేశభక్తి, మనిషి, దించులంగరు, లంగరెత్తుము మొదలైనవి. వాటిలో సుభద్ర, సారంగధర వంటివి ఉన్నాయి. గురజాడ ఒక నవల రాయాలని కూడా సంకల్పించారు. దానిపేరు ‘సౌదామిని’. రాయలేదు. మద్రాసు విశ్వవిద్యాలయంలో సెనెట్‌ సభ్యుడిగా ఉంటూ, విద్యార్థులు పరీక్షలు రాయడంలో వ్యావహారిక భాషను అమోదించనందుకు నిరసనగా ‘అసమ్మతి పత్రం’ రాశారు. కొన్ని వ్యాసాలు వెలువరించారు.
      మూఢ నమ్మకాలకు, మూఢాచారాలకు వ్యతిరేకంగా ఆంగ్ల విద్య చదువుకున్న రాజారామమోహనరాయ్, మహాత్మాపూలే వంటి వాళ్ళు నడుపుతున్న సంఘసంస్కరణోద్యమాన్ని సమర్థిస్తూ రచనలు చేశారు గురజాడ. స్త్రీలకు చదువు లేకపోవడం, బాల్య వివాహాలు, వితంతు వ్యవస్థ, కాలం చెల్లిపోయిన విద్యా వ్యవస్థ, అర్థం కోల్పోయిన వివాహ వ్యవస్థ, సారం కోల్పోయిన మత వ్యవస్థ, శాస్త్రీయత లోపించిన సాంఘిక వ్యవస్థ, అస్పృశ్యతా దురాచారం, మత వైషమ్యాలు, వేశ్యా సమస్య వంటి అనేక సామాజిక రుగ్మతలను ఖండిస్తూ, వాటి నిర్మూలనావశ్యకతను నొక్కి చెబుతూ గురజాడ సాహిత్యాన్ని సృష్టించారు.
      పురాణ కథలనే మళ్ళీ మళ్ళీ రాస్తూ సాహిత్యమంటే అక్షరాల గారడీగా మారిపోయిన సమయం అది. అప్పుడు సాహిత్యంలో సమకాలీన జీవితాన్ని ప్రతిబింబించాలని, సమాజం మారడానికి సాహిత్యం తోడ్పడాలని గురజాడ భావించారు. ‘‘వాస్తవిక జీవితం నుంచి సమకాలిక ఇతివృత్తాన్ని స్వీకరించి దానిని తెలుగున వాడుక భాషలో నాటకంగా రూపొందించాను’’ అని ఆయనే రాసుకున్నారు. సామినేని ముద్దు నరసింహం నాయుడు, కందుకూరి వీరేశలింగం పంతులు సాగిస్తున్న సంఘ సంస్కరణోద్యమానికి సమానంగా తాను సాహిత్య సంస్కరణను ప్రారంభించారు. నూతన భావాల వ్యాప్తికి నూతన ప్రక్రియలు అవసరమని భావించి కథానికా ప్రక్రియకు, నాటక లక్షణానికీ ఆధునికత జోడించారు. కవితా రచనలోనూ నూతన ఒరవడిని ప్రవేశపెట్టారు. పూర్తి చేసి ఉన్నట్లయితే ‘సౌదామిని’ అనే ఆధునిక నవల తెలుగు సాహిత్యానికి లభించి ఉండేది.
      గిడుగు రామమూర్తి పంతులు నడిపే వ్యావహారిక భాషోద్యమాన్ని గురజాడవారు సమన్వయించుకున్నారు. సమకాలీన ప్రజల జీవితాన్ని వస్తువుగా చేసుకొని, వాళ్ళ భాషలో, వాళ్ళ బాణీలో వాళ్ళ కోసమే సాహిత్యాన్ని సృష్టించారు. తొలినాళ్ళలో గురజాడ ఆంగ్లంలో రాయడం ప్రారంభిస్తే శంభుచంద్రముఖర్జీ అనే ఆంగ్ల పత్రిక సంపాదకుడు తెలుగులో రాయమని సలహా ఇచ్చారు. దీంతో ఆయన తెలుగులో రచనకు పూనుకొని ప్రజా రచయిత అయ్యారు. మొదట్లో పద్యాలు రాసినా, తర్వాత ఆయన ‘ముత్యాలసరాలు’ గేయ ఛందస్సును తన కవిత్వానికి వాహికగా చేసుకున్నారు. 3+4 మాత్రల నిర్మాణంగల ముత్యాలసరం పాడటానికి, చదువుకోడానికి లయాత్మకంగా ఉంటూ, పాఠకులను బాగా ఆకర్షిస్తుంది. గురజాడ ప్రారంభించిన ముత్యాలసరాలను తెలుగు కవులు అనేక ప్రయోగాలతో ఇప్పటికీ కొనసాగిస్తూనే ఉన్నారు.
      విజయనగర ప్రాంతానికి చెందిన గురజాడ అక్కడ విభిన్న సామాజిక వర్గాలు మాట్లాడే భాషలో నాటకాలు, కథానికలు రాశారు. ఎవరు ఎలా మాట్లాడితే వాళ్ళ సంభాషణలను అలా రాశారు. ‘కన్యాశుల్కం’ నాటకంలో బయట సమాజంతో సంబంధంలేని వెంకమ్మ, బుచ్చమ్మ వంటి వాళ్ళకు ఒక భాషను, బయటి సమాజంతో సంబంధం గల వెంకటేశానికి మరో భాషను ఉపయోగించారు. అలాగే మునసబు, పోలిశెట్టి, అసిరిగాడు వంటి బ్రాహ్మణేతర పాత్రలకు ఇతర రకాల భాషను ఉపయోగించారు.
      ప్రజల భాషకు సాహిత్య గౌరవం కల్పించిన ఘనత గురజాడదే. ఆ ఒరవడిలో నేటి రచయితలు తమ తమ ప్రాంతాల భాషను సాహిత్యంలో ధారాళంగా ఉపయోగిస్తున్నారు. తన వ్యావహారిక తెలుగును చదివితే రైతులు మేల్కొంటారని ధైర్యంగా చెప్పారు గురజాడ. మాతృభాషను మన జీవిత చిత్రణకు ఎంత శక్తిమంతంగా ఉపయోగించుకోవచ్చో గురజాడ రుజువు చేశారు. కన్యాశుల్కం నాటకంలో, కథానికల్లో గురజాడ రత్నాల వంటి తెలుగు మాటలను ఉపయోగించి మన భాష శక్తి సామర్థ్యాలను జాతికి చాటి చెప్పారు. తెలుగు భాషలోని సౌందర్యాన్ని విభిన్న భావాభివ్యక్తిని ఆ భాషలో గల అవకాశాలను ఆయన ప్రదర్శించారు. ఏ ప్రాంతం వాళ్ళైనా గురజాడ ఉపయోగించిన తెలుగు భాషను చదివి అదే విధంగా భాషను తమ రచనల్లో ఉపయోగించుకుందామని ఉబలాట పడకమానరు. వస్తువులో, భాషలో, శైలిలో 12వ శతాబ్దంలోనే విప్లవం ప్రటించిన కవి పాల్కురికి సోమనాథుడైతే, 19 - 20 శతాబ్దాలలో ఆ పని చేసింది గురజాడ. 
      సమాజంలో 98 శాతం ప్రజలకు చదువులేని కాలంలో నాటకమైతే అందరికీ అర్థమౌతుందని గురజాడ నాటకాలు రాశారు. జాతికి తలవంపులు తెచ్చే కన్యాశుల్కం వివాహాల దుష్ఫలితాలను ఎండగడుతూ కన్యాశుల్కం నాటకం రాశారు. అందులోనూ వేశ్యా వ్యతిరేక ఉద్యమకారుల అశాస్త్రీయ ఆలోచనలను ఎత్తి చూపుతూ మధురవాణి పాత్రను సృష్టించారు. ఆంగ్లవిద్య అందించిన మంచికి ప్రతినిధిగా సౌజన్యారావు పంతులును, చెడుకు ప్రతినిధిగా గిరీశాన్ని సృష్టించారు. సమాజంలోని విభిన్న వాస్తవాలకు ప్రతినిధులుగా పాత్రలను సృష్టించారు. నూరేళ్ళు దాటినా ఆ నాటకానికి నేటికీ ప్రాసంగికత ఉండటానికి కారణం అదే. 
      శృంగార రసపోషణకు వ్యావహరిక భాష సరిపోదని వాదించే సంప్రదాయవాదులకు సమాధానంగా బిల్హణీయం రాశాడు. బాల్య వివాహ దురాచారాన్ని కళ్ళకు కడుతూ పూర్ణమ్మను, స్త్రీ పురుష సంబంధాలలో డబ్బును, పురుషుల పెత్తనాన్ని నిరసిస్తూ ‘కాసులు’నూ, స్త్రీలపై పురుషులు చేసే దౌర్జన్యాన్ని విమర్శిస్తూ ‘కన్యక’నూ రచించారు. తోకచుక్క కనిపిస్తే దేశానికి అరిష్టం అనే అంధ విశ్వాసాన్ని పూర్వపక్షం చేస్తూ ‘ముత్యాలసరాలు’ రాశారు. మనిషిని విస్మరించి మనిషి చెక్కిన శిల్పాలను పూజించడాన్ని అధిక్షేపిస్తూ ‘మనిషి’ కవిత రాశారు. నిజమైన స్నేహాన్ని ‘డామన్‌ పితియస్‌’ కవితలో ఆవిష్కరించారు. కులాంతర, స్థాయీ అంతర వివాహాల్ని ప్రోత్సహిస్తూ ‘లవణరాజు కల’ రాశారు. సమాజంలో మంచి చెడులను తప్ప సుఖాలను చూడరాదని నూరేళ్ల క్రితం ప్రబోధించారు. అస్పృశ్యతను ‘అధర్మ ధర్మం’ అన్నారు.
      స్త్రీలు చదువుకుంటే చెడిపోరని, చెడిపోతున్న, తప్పుడు బాట పట్టిన మగవాళ్ళను సరిదిద్దుకొని, కుటుంబంలో వచ్చే సమస్యలను నాగరికంగా పరిష్కరించుకుంటారని ప్రతిపాదిస్తూ ‘దిద్దుబాటు’ కథనూ, పురుషుడు స్త్రీని ఎంత క్రూరంగా మానసికంగా హింసిస్తాడో చూపెడుతూ ‘మెటిల్డా’ కథనూ రాశారు. మనిషికి మతం కన్నా బÅౌతిక జీవితమే ముఖ్యమంటూ ‘పెద్దమసీదు’ కథను, మతం భక్తి పరిధిని దాటి స్వార్థ పరుల చేతిలో ఆయుధంగా మారిన వైనాన్ని ‘మీపేరేమిటి’ కథగాను రాశారు. వేశ్యా సమస్య నిర్మూలన కోసం వేశ్యలనే నిర్మూలించే అశాస్త్రీయతను ఎత్తి చూపుతూ ‘సంస్కర్త హృదయం’ కథను రాశారు. నిజానికి గురజాడ ఈ కథను ‘స్టూపింగ్‌ టు రైజెస్‌’ పేరున ఇంగ్లిషులో రాశారు. ఆయన మరణానంతరం అవసరాల సూర్యారావు ‘సంస్కర్త హృదయం’గా తెనిగించారు. 
      గురజాడ సాహిత్యమంతా ఒక ఎత్తయితే ఆయన రాసిన ‘దేశభక్తి’ కవిత ఒక్కటే ఒకెత్తు. గురజాడ రాసిందంతా సంఘ సంస్కరణ సాహిత్యమైతే ‘దేశభక్తి’మాత్రం రాజకీయ కవిత. దేశభక్తి అంటే ప్రకృతిని, ప్రకృతిలో మతాన్ని కలిపి మనల్ని మనం పొగడుకోవడంకాదని, దేశభక్తి అంటే మనిషిని మనిషి ప్రేమించడం, మంచిని పెంచడమని గురజాడ ప్రబోధించారు. మనిషి శారీరకంగా మానసికంగా ఆరోగ్యంగా ఉన్నప్పుడు దేశం బాగుంటుందని, అన్ని మూలల నుంచి జ్ఞానాన్ని సంపాదించి దేశి సరుకులతో దేశాన్ని సుసంపన్నం చేయమన్నారు. జాతులు మతాలతో సంబంధం లేకుండా ప్రజలు అన్నదమ్ముల్లా కలిసి జీవించాలన్నారు. ప్రజలు సాటి మనిషి కోసం సొంతలాభాన్ని కొంత త్యాగం చెయ్యమన్నారు. శ్రమతో దేశం సుభిక్షం కావాలన్నారు. ఇదీ గురజాడ ప్రబోధించిన ప్రతిపాదించిన ‘దేశభక్తి’. భారతీయుల దేశభక్తి గీతాల్లోకెల్లా గురజాడ ‘దేశభక్తి’ ఉదాత్తమైంది, ఉన్నతమైంది. 
      రచయిత ఒక సమస్యను తీసుకొని  రచన చేస్తే, కొంతకాలానికి ఆ సమస్య పరిష్కారమైనా ఆ రచనకు విలువ నిలిచేట్టు ఎలా రాయాలో గురజాడను చూసి నేర్చుకోవాలి. ‘కన్యాశుల్కం’ సమస్య ఇవాళ లేకపోయినా, ఆ నాటకానికి ఇంకా విలువ ఉండటానికి కారణం గురజాడ రచనావిధానం, చేసిన వ్యాఖ్యలే కారణం.
      గతంలో కూరుకు పోకుండా గతంలోని కొంచెం మంచిని స్వీకరించి అడుగు ముందుకు వెయ్యాలని ప్రబోధించారు గురజాడ. ఆయన ముందుచూపునకు ప్రతి తెలుగు వ్యక్తీ నమస్కరించాలి. చీకట్లోంచి వెలుగులోకి నడవాలంటే గురజాడ సాహిత్యాన్ని కూలంకషంగా చదవాలి.


గురజాడ తన కాలంకన్నా ముందు నిలబడిన రచయిత. ‘ఆధునిక మహిళలు చరిత్రను తిరిగి రచిస్తారు’ అని చెప్పారు గురజాడ. అప్పటి నుంచి మహిళలు ఆ ఉద్యమంలోనే ఉన్నారు. మధ్య యుగానికి చెందిన వేమన, వీరబ్రహ్మం వంటి వాళ్ళు ఏర్పరచిన పూర్వ రంగాన్ని     స్వీకరించి, ఆధునిక విద్య ద్వారా లభించిన నూతన సంస్కారానికి అన్వయించుకొని, విజ్ఞానాత్మకమైన శాస్త్రీయమైన భారతదేశ నిర్మాణానికి గురజాడ సాహిత్య పునాది వేశారు. ఆయన కోరుకున్న ఆధునిక భారతదేశం ఇంకా పుట్టవలసే ఉంది కాబట్టి ఆయన సాహిత్యాన్ని మనం ఇంకా ఇంకా చదవాలి. 


జీవితంలో ఎంత వైవిధ్యం వుంది! ఎంతటి తీవ్రగమనం వుంది! నేటి జీవితం పుష్కలమైన అనంతమైన గాథలతో నిండి వుంది. అయినా, దానిని మన రచయితలు దర్శించరు. అభిరుచి, గుణదోష నిశ్చయ జ్ఞానము వున్న రచయిత ఒక కావ్యాన్ని రచియిస్తున్నప్పుడు అతని సృజన, విమర్శనాత్మక శక్తులు రెండూ కుడి ఎడమలుగా ఆ కావ్యసృష్టిని కొనసాగిస్తాయి. భావ, భావోద్వేగ పాత్ర సన్నివేశాదులను మేధ సృష్టిస్తూవుంటే వాటికి విమర్శనాత్మక శక్తి గీటుపెట్టి కొన్నిటిని స్వీకరిస్తుంది. కొన్నిటిని తిరస్కరిస్తుంది. ప్రతిభాక్షేత్రం ఒక టంకసాల వంటిది. రచయిత సృష్టించేవి, అందు తయారయే నాణెముల వంటివి. టంకసాల తయారుచేసిన నాణెములు చెల్లునో చెల్లవో మోగించి చూసినట్లు వీటిని విమర్శనాత్మక శక్తి ఉపాదేయములగునో కావో పరీక్షిస్తుంది. - గురజాడ


వెనక్కి ...

మీ అభిప్రాయం