తళతళ మెరిసే సందమామల్ని... వాకిల్నిండా ఆరబోసి...

  • 187 Views
  • 83Likes
  • Like
  • Article Share

    డా।। పగడాల నాగేందర్‌

  • కవి, విమర్శకులు,
  • హైదరాబాదు
  • 9849872230
డా।। పగడాల నాగేందర్‌

‘ఒక్క సిరాచుక్క లక్ష మెదళ్లకు కదలిక’ అన్నారు కాళోజీ. తెలంగాణ ఉద్యమ సమయంలో ఈ మాట ‘అక్షరాలా’ రుజువైంది. గాయపడ్డ జాతి గుండెలను తడిమిన కవిత్వం కోట్లమందిని కదిలించింది. విరివిగా వెలువడ్డ వచన కవితలు, పాటలు ఉద్యమాన్ని ఊరూరికీ తీసుకెళ్లాయి. తెలంగాణ ప్రాంతీయ చైతన్యంతో ఉప్పొంగిన ఈ కవితాసృష్టి తెలుగు సాహితీ చరిత్రలో ఓ ఉజ్వలఘట్టం.
వెయ్యేండ్లపైన
నడుస్తున్న తెలంగాణ సాహిత్య చరిత్ర ఎన్నో గాయాల్ని చవిచూసింది. ఆంధ్రప్రదేశ్‌ ఏర్పడ్డాక కూడా తెలంగాణ ప్రాంత కవులు, రచయితలు,  ప్రజలు- తమ ప్రాంత సాహిత్యం, భాష, సంస్కృతులు తీవ్ర వివక్షకు గురవుతున్నట్లు గుర్తించారు. అయితే, 1969 తెలంగాణ ఉద్యమం నాటి తెలుగు సాహిత్యం మీద చూపిన ప్రభావం స్వల్పమే. కానీ, నివురుగప్పిన నిప్పులా ఉంటూ 1990 దశకం మధ్యలో మళ్లీ రాజుకున్న ఉద్యమం మాత్రం సమకాలీన తెలుగు సాహిత్యం మీద గాఢమైన ముద్ర వేసింది.  
కారణాలేవైనా తొంభైల నాటికే తెలంగాణ ప్రాంత సామాజిక, సాంస్కృతిక జీవితం మొత్తం విచ్ఛిన్నమైంది. ఒకవైపు వ్యవసాయంలో వాణిజ్య ధోరణులు ప్రబలాయి. నీళ్లు లేక వ్యవసాయం కుప్పకూలింది. సరళీకృత ఆర్థిక విధానాల నేపథ్యం, ప్రపంచీకరణలు తెలంగాణ వాసుల్ని మరింత దెబ్బతీశాయి. బతుక్కి భద్రత లేకుండా పోయింది. నిరుద్యోగం విశ్వరూపం దాల్చింది. తెలంగాణ ప్రాంతంలో పుట్టిన ఏ కవీ, రచయితా ఈ వాస్తవాలనుంచి తప్పించుకోవడం సాధ్యం కాలేదు. ‘తెలంగాణ’ ప్రమాదపుటంచుల్లో ఉన్న వాస్తవం కళ్లముందు స్పష్టంగా కనిపించేసరికి రాజకీయ, సామాజిక రంగాల్లో తెలంగాణ నినాదం తిరిగి తలెత్తింది. ఇది ఆందోళనగా మొదలై, ఉద్యమంగా రూపాంతరం చెందింది. ఈ నేపథ్యమే ఇక్కడి ప్రాంతీయ అస్తిత్వవాద కవిత్వానికి, సాహిత్యానికి పునాది వేసింది. 
      ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తి, ఆచార్య చేకూరి రామారావులాంటి భాషా శాస్త్రవేత్తలు, భాష తొలిరూపం మాండలికమే అని చాటిచెప్పారు. ‘తెలంగాణ భాష’ను ‘మాండలికం’ అన్నా, దాన్ని గౌరవించాలని చెప్పారు. కానీ, ఆ గౌరవం ఆచరణలో నిలబడలేదు.  అందుకే తెలంగాణలో భాష విషయంలో సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమం తలెత్తింది. దాంతో తెలుగు భాష మరింత మనోహరంగా విస్తరించింది. 
తమదైన శైలిలో
తెలంగాణ కవులు 1990ల తర్వాత ప్రాంతీయ చైతన్యంతో కవిత్వం రాయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా పాటలు రాసినవాళ్లు తెలంగాణ జీవద్భాషను తమ రచనల్లో అద్భుతంగా ఆవిష్కరించారు. ఈ క్రమంలో తెలంగాణ కవిత్వానికి తనదైన శైలీ సంవిధానం ఏర్పడింది. తెలంగాణ మాండలికంలో విరివిగా కవిత్వం రాసే వందల మంది కవులు ముందుకు వచ్చారు. కొన్ని దశాబ్దాలపాటు సాహిత్య గౌరవాన్ని పొందని ‘తెలంగాణ మాండలికం’, ఇవాళ తెలుగు సాహిత్యంలో మేలిమి అంశమైంది. ‘తెలంగాణ మాండలికమే కవిత్వ భాష’ అన్నంత స్థాయిలో కవులు కవిత్వం రాస్తున్నారు.
      తెలుగు భాషను సుసంపన్నం చేసే కవిత్వ నిర్మాణ పద్ధతులను, శైలిని ఈ కవులు కొత్తగా సమకూర్చుకున్నారు. ఇలా వచ్చిన తెలంగాణ ప్రాంత కొత్త కవులకు మొదట ‘పొక్కిలి’, తర్వాత ‘మత్తడి’ కవితా సంకలనాలు ప్రాతినిధ్యం వహించాయి. మలిదశ తెలంగాణ ఉద్యమంలో భాగంగానే ‘మునుం’ కవితా సంకలనం వచ్చింది. ఈ మూడు సంకలనాలు తెలంగాణ సాహిత్య చైతన్యానికి, కవిత్వ శైలికి అద్దం పట్టాయి. 
మన గోస మన భాషలో...
ప్రాంతీయ చైతన్యం తీసుకొచ్చిన అతిపెద్ద మార్పు తమ అనుభవాన్ని తమదైన శైలిలో, తమదైన భాషలో రాయాలన్న సంకల్పం కవుల్లో, రచయితల్లో బలీయం కావటం. తమ మూలాల్లోకి వెళ్లి తమదైన పద్ధతిలో, తమదైన భాషలో మాట్లాడటం. ఈ క్రమంలో తెలంగాణ కవిత్వం కొత్త సొగసుల్ని సంతరించుకుంది. కవిత్వ నిర్మాణంలో మౌఖిక పద్ధతులు ప్రవేశించాయి. తెలంగాణ సామెతలు, పలుకుబళ్లు, నుడికారం కవిత్వంలో వ్యక్తమయ్యాయి. ఎరుక చెబుతున్న రీతిన కవిత్వం చెప్పే పద్ధతిని అనుసరించారు. ఉక్రోశం ఆపుకోలేక శాపనార్థాలు పెట్టే ఆడవాళ్ల కంఠస్వరాన్ని అనుసరించి కొందరు కవిత్వం చెప్పారు. ప్రాంతీయ స్పృహ ఇచ్చిన కొత్త చైతన్యం కారణంగా అప్పటివరకు మామూలు పద్ధతుల్లో కవిత్వం చెప్పినవారు సైతం మాండలిక భాషలో కవిత్వం రాయడం అలవరచుకున్నారు.
      నందిని సిధారెడ్డి, సుంకిరెడ్డి నారాయణరెడ్డి, దేశపతి శ్రీనివాస్, వేముగంటి మురళీకృష్ణ, జూలూరి గౌరీశంకర్, సిద్ధార్థ, నాళేశ్వరం శంకరం, మునాస వెంకట్, సి.కాశీం, జూకంటి జగన్నాథం, అన్నవరం దేవేందర్, పగడాల నాగేందర్, దాసరాజు రామారావు, దాస్యం లక్ష్మయ్య, ఉదారి నారాయణ, మునిమడుగుల రాజారావు, పొన్నాల బాలయ్య, వఝల శివకుమార్, సిద్దెంకి యాదగిరి, వనపట్ల సుబ్బయ్య, గోపగాని రవీందర్, యెన్న ఉపేందర్, అంబటి వెంకన్న, వేముల ఎల్లయ్య, చిత్రం ప్రసాద్, తిమ్మనబోయిన వాసు, స్కైబాబ, షాజహానా, అనిసెట్టి రజిత, కందుకూరి దుర్గాప్రసాద్, బోధనం నర్సిరెడ్డి, గౌస్‌ మొహినొద్దీన్, బండారు శంకర్, మోతుకూరి అశోక్‌కుమార్, అన్వర్, తైదల అంజయ్య, కాసుల లింగారెడ్డి, ఒద్దిరాజు ప్రవీణ్‌కుమార్, హరగోపాల్‌ తదితరులు తెలంగాణ నేలనుంచి ప్రభావవంతమైన వచన కవిత్వం రాస్తున్నారు. వీళ్లంతా తమ విలక్షణమైన స్వరాలతో, వైవిధ్యమైన శైలులతో తెలంగాణ ప్రాంతీయ కవిత్వాన్ని సంపద్వంతం చేశారు. 
తొలినాళ్ల ధిక్కార స్వరం
మలిదశ తెలంగాణ ఉద్యమంలో, ప్రాంతీయ అస్తిత్వానికి సంబంధించిన స్పష్టత తొలిసారి ‘నా తెలంగాణ’ దీర్ఘకవితలో కనిపిస్తుంది. దీన్ని జూలూరి గౌరీశంకర్‌ 1996లో రాశారు. తర్వాత సుంకిరెడ్డి నారాయణరెడ్డి, గుడిహాళం రఘునాథం, కె.శివకుమార్‌ రాసిన దీర్ఘకవిత ‘నల్లవలస’ (1997) స్పష్టంగా ప్రాంతీయ చైతన్యాన్ని ప్రతిఫలించింది. ‘‘ఆకాశవాణి నీది/ పత్రిక నీది/ గాత్రం నీది/ చలనచిత్రం నీది/ నాయకులు మీరే ప్రతినాయకులు మీరే!/ నువు చెలామణి చేసిన/ పత్రికల పదజాలమెక్కడిది?/ ముద్రించిన వ్యావహారిక పదకోశంలో/ నా వ్యవహారమేది?’’ అని నిలదీస్తూ... తెలంగాణ భాషా సంస్కృతులను ఎలా ధ్వంసం చేశారో సూటిగా చెప్పారు. 
      ‘‘ఎన్ని ఎకరాలుంటేమి?/ నేల ఎంగిలి నాలుకంత గాదు...,/ కాల్వలు కండ్లల్ల తొవ్వి/ మట్టి మీన - పొగగొట్టాలు పొడుస్తున్నారు/ నెత్తిమీద మబ్బుల్లేవు/ కాళ్లకింద కాల్వల్లేవు’’ అంటూ నీళ్లూ, కాల్వలూ లేని తెలంగాణ నేలను హృదయ విదారకంగా చిత్రించారు మునాస వెంకట్‌ తన ‘వర్జి’లో. పక్కా పాతబస్తీ కవి ఆశారాజు, హైద్రాబాదు సంస్కృతిని తన కవిత్వంలో ఇమిడ్చారు. ‘‘ఇరానీ చాయ హైద్రాబాద్‌కి తీపిగుర్తు/ ఒక కప్పు ఇరానీ చాయ/ మిత్రున్ని కౌగిలించుకున్న తృప్తి...,/ నన్ను నగరం నుంచి గానీ,/ నగరాన్ని నా నుంచిగానీ విడదీయడం కష్టమే’’ అంటూ, తెలంగాణ సంస్కృతిలో హైద్రాబాదు ఇరానీ చాయ్‌ మమేకమై పోవడాన్ని అద్భుతంగా వర్ణించారు. 
భాషలో మట్టివాసన
వస్తువేదైనా సరే అతి సులభంగా, సహజంగా తెలంగాణ పదజాలాన్ని, కవిత్వంగా మలచడంలో నందిని సిధారెడ్డిది బలమైన శైలి. ‘‘సందులో మూల మలుగుతుంటే,/ అబ్బ! ఎండుచేపల వాసన ఎంత కమ్మగా సోకుతుందనీ.../ తళతళ మెరిసే సందమామల్ని/ వాకిల్నిండా ఆరబోసి/ ఒకామె నేరుపుతూ ఉంటుంది/ వలలు సిద్ధం చేస్తూ/ మళ్లా సమరానికి తయారువాళ్లు/ సందులోంచి నడుస్తున్నంతసేపూ/ నాకు అచ్చం బతుకుతున్నట్టుంటుంది’’ అంటూ మెదక్‌ జిల్లా సిద్ధిపేట దృశ్యాలను, ఓ కళాతపస్విలా ప్రపంచానికి చూపించారు సిధారెడ్డి.
      నిజాం పాలనలో- దొరల గడీల్లో చీకటిమయమై, చిధ్రమైన తెలంగాణ జీవితాలెన్నో! మార్‌పాకకు చెందిన చిత్రం ప్రసాద్‌ తన ‘స్వేచ్ఛ’ కవితలో ఓ జీతగాడికి జరిగిన అన్యాయాన్ని హృద్యంగా చెప్పారు. శాపనార్థాలు పెట్టే గ్రామీణ మహిళల కంఠస్వరాన్ని అద్భుతంగా అనుకరించారు. ఈ ప్రాంత స్థానికత, సహజత్వం, తాజాదనం ఈ కవిత్వంలో కనిపిస్తాయి. ‘‘ఆడి పెయిమీద బొగ్గల్ని కన్నీళ్లతో కడిగి/ కనుగుడ్లతో కాపిందాన్నే కాని/ ఈసమెత్తు మాట అననైతి గదమ్మా/ మా సాపెన్లు గూడ పెదిమ పెగలవు తల్లీ!/ మేం పిల్లికన్నా పిరికోల్లమమ్మా!/ దొర్సానమ్మా!... / గయాల్నె అసలు సంగతి చెబితే/ అదిరిచ్చో బెదిరిచ్చో అద్దునుంచుకుందు గదమ్మా!/ మీ పనిలబెట్టి పాపం కొనుక్కొంటినేం తల్లీ!/ ... / మీ మతి మా మీద పడ్డా/ మా మతి మీ మీద పడ్డా/ సిచ్చ మాకేనమ్మా!’’ అంటూ రాశారాయన. ఇందులో ‘మా సాపెన్లు కూడా పెదిమ పెగలవు’, ‘పలుగురాళ్లు పుటం పెట్టి పానం కాపాడుకున్నదాన్ని తల్లి’, ‘అదిరిచ్చో, బెదిరిచ్చో అద్దునుంచుకుందు గదమ్మా’ లాంటి సామెతలు, నుడికారాల్లో తెలంగాణ యాస స్పష్టంగా కనిపిస్తుంది. ఇలాంటి స్థానికత తెలంగాణ కవిత్వశైలిలో ఓ భాగం.
విధ్వంస చిత్రాలు
వృత్తులు దెబ్బతిని పూర్తిగా ధ్వంసమైన తెలంగాణ పల్లెల్ని అద్భుతంగా రూపుకట్టించారు వరంగల్‌ జిల్లాకు చెందిన పొట్లపల్లి శ్రీనివాసరావు. ‘‘పల్లె బతుకంతా ఆగమాగమయ్యింది/ అలుకు జల్లి ఎర్రమన్నలికి/ సందెకస్స దీసిన దిగుట్ల దీపం/ కొండెక్కి పోయింది’’ అంటూ ఈ ప్రాంత జీవద్భాషలోనే బాధను వ్యక్తీకరించారు. ‘‘ఊరు ఊరంతా ఇంపుసొంపుగా లేదు/ ఇరిగిపోయిన పెంట పొనుక/ తూట్లుపడ్డ వడ్ల బోరెం/ కూలిపోయిన పిడికెల కుచ్చె/ చెదలు పట్టిన పాతగుమ్మి/ పగిలిపోయిన కూరాటికుండ’’ అని ఛిద్రమైన తెలంగాణ పల్లె దీనస్థితిని వర్ణించారు అన్నవరం దేవేందర్‌. ఆయన కరీంనగర్‌ వాసి.
      తెలంగాణలోని కొన్ని ప్రాంతాల ప్రజలకు ఫ్లోరిన్‌ నీళ్లే గతి. ఈ  సమస్యను ఈ ప్రాంత కవులు మనసు మీదికి తీసుకుని కవిత్వం రాశారు. ‘‘జలం కాటేసిన ఊరది/ జలం గరళమై/ నమ్మి తాగిన వారిని/ నిలువునా ముంచేసిన ఊరది’’ అంటూ, ఆచార్య ఎన్‌.గోపి తీవ్ర ఆవేదనను వ్యక్తం చేశారు. ‘‘విషమై పారుతున్న పాతాళగంగ/ కాల్లొంకర, కండ్లొంకర/ పసి పోరగాండ్లయినా పండ్లిగిలిస్తే/ నల్లనిగారలు’’ అంటూ నల్లగొండ జిల్లాకు చెందిన కాసుల ప్రతాపరెడ్డి తన ‘సక్క’ కవితలో వాస్తవ దృశ్యాలను కళ్లకు కట్టారు.  
      ఇక్కడి కొన్ని ప్రాంతాల్లో నక్సలైట్‌ ఉద్యమం బలంగా వేళ్లూనుకుంది. భిన్న వర్గాల మధ్య పరస్పర హననం ఉద్ధృతంగా సాగింది. ఈ వాస్తవం తాలూకు హింసాపూరిత పార్శ్వం, ఇక్కడి వచన కవిత్వంలో ప్రతిఫలించింది. అణచివేతకూ, నిర్బంధానికీ వ్యతిరేకంగా రచనలు వచ్చాయి. తెలుగు సాహిత్యంలో ఇదో ప్రధాన సమస్యగా చిత్రితమైంది. 
      ‘‘తెలంగాణ పల్లెల కన్రెప్పల మీద ఆవగింజంత కునుకు లేదు,/ ఏ క్షణాన ఏ సవ్వడో? ఏ క్షణాన ఏమౌతుందో?/ అంతా మొగులైనట్టు మెదళ్లు మొద్దుబారిన దృశ్యం!/ తాట్లో తాగుతున్నట్టు పల్లె తాగుతున్న ప్రకంపనాలు’’ అంటూ తెలంగాణ గ్రామాల వాస్తవ స్థితిని కళ్ల ముందుంచారు ఏలేశ్వరం నాగభూషణాచార్య. ‘‘మా వూరికి దావఖాన ఎప్పుడొస్తదో అడగం/ నల్లాలెప్పుడొస్తయో అడగం/ మా వూరికి బడెప్పుడొస్తదో బస్సెప్పుడొస్తదో అడగం/ వ్యానెప్పుడొస్తదో చెప్పండి/ మీ రాజభటులెప్పుడొస్తరో చెప్పండి’’ అంటూ ఇక్కడి పల్లెల్లో ఉండే భయానక వాతావరణాన్ని విప్పి చెప్పారు అలాజీపూర్‌ కిషన్‌.
ఇక్కడి మట్టిమాటలతోనే... 
తెలంగాణ సమస్యలను చిత్రించడంతోపాటు, ఈ ప్రాంత యాసను కవులు బలంగా వాడుకున్నారు. ఎవరూ ఊహించని జీవితం తాలూకు సంఘటనలను తిరుగుబాటుతో ముడిపెట్టి, వచన కవిత్వం చెప్పటం ఓ వినూత్న శైలి. విమర్శకులను, పాఠకులను ఆశ్చర్యచకితుల్ని చేసే శైలిలో తెలంగాణ ప్రాంత కవిత్వం వచ్చింది.
      ‘‘మా పంట భూమిలో/ మేమే ఉమ్మెత్త పువ్వులమై పూస్తున్నాం’’ అన్నారు మునాస వెంకట్‌. ‘ఉమ్మెత్త పువ్వులు’ తెలంగాణలో బాగా ప్రాచుర్యంలో ఉన్న పదబంధం. వ్యర్థంగా పూసే పూలని అర్థం. ఇలాంటి పదాలతో వచన కవితకు ఓ ప్రత్యేకశైలిని సమకూర్చారు వెంకట్‌. తెలంగాణ రైతు గోసను ‘దాలి’ కవితలో సుంకిరెడ్డి అద్భుతంగా ఆవిష్కరించారు. ‘‘గింజల్ని దాయలేమనే గదరా?/ మా కల్లాలు కళకళ్లాడగానే/ ధరల చీటి పాతాళానికి పడేసేది?/ పిర్రలు కరగకుండా పైసలకు పీటముడి వేసే/ ఈ తెలివెక్కడిదిరా మీకు?/ మట్టిపెళ్లలు నా అరచేతుల్లో కాయలు గాస్తేనే/ మీ చేతులు రాతలు నేర్చింది?/ రోళ్లు పగిలే రోహిణి కార్తెండలో/ నేను తుకతుక ఉడికితేనే/ నీడపట్టున మీరు కౌటిల్యులయ్యింది’’ అంటూ ఈ ప్రాంత నుడికార భాషతో ప్రశ్నించే శైలి ఈ కవిత్వంలో కనిపిస్తుంది.
      బాధలను, కన్నీళ్లను, సంప్రదాయాలను కవిత్వంలో వ్యక్తీకరించాల్సి వచ్చినప్పుడు పదజాలం సరిపోక పడే తండ్లాట నుంచి ఈ కవులంతా బయటపడ్డారు. తెలంగాణ పదజాలంతో కొత్త కవితా వాక్యాలనూ, ఆధునిక అభివ్యక్తినీ సాధించారు. నిలదీసి ప్రశ్నించే శైలిలో తెలంగాణ కవులు కవిత్వం రాశారు. ‘యాది- మనాది’లో అల్లం నారాయణ కవితాశైలి ఇక్కడి మట్టివాసనతో కలిసి పరిమళిస్తుంది. ‘‘కన్నబిడ్డలు పాలకేడుస్తున్నరు/ కడగొట్టు బిడ్డలు పాలకేడుస్తున్నరు/ నీళ్లెయి/ ఎటు మళ్లినయ్‌/ ఆధునిక దేవాలయం ఎవరికి పంటకాలువ?/ కన్నబిడ్డను వదిలి గోదారి/ పరాయి బిడ్డకు పాలిస్తున్న తల్లి...’’ అంటూ ఆయన చెప్పిన కవిత్వం ఈ శైలికో మచ్చుతునక. 
      ప్రజల జీవద్భాషలో, ప్రజల మౌఖికశైలిలో ఉండే శక్తి ముందు, ఏ కృత్రిమ కవిత్వాలూ నిలవవని తెలంగాణ కవులు తేల్చి చెప్పారు. అనుభవం, అనుభూతి, ఇక్కడి మట్టివాసనను కవిత్వంలో ఆవిష్కరించేందుకు ఈ ప్రాంత మాండలిక భాషే ముఖ్య ఆధారమని ఈ కవులు నిరూపించారు. 
తెలంగాణ ఉద్యమంలో పాట
అక్షరాస్యులు కానివారినీ కదిలించేటట్లుగా మలిదశ ఉద్యమంలో ‘పాట’ ప్రముఖ పాత్ర పోషించింది. ఉద్యమం వెనకబడిన ప్రతి సమయంలోనూ పాటలే దానికి ప్రాణం పోశాయి. నిజానికి మొదటి నుంచీ తెలంగాణ నేల దేశీ కవిత్వాన్ని సొంతం చేసుకుంది. తెలంగాణ పల్లెల్లోని జానపద గీతాల శైలిని వామపక్ష ఉద్యమాలు సొంతం చేసుకుని, ఇక్కడ ఉద్యమ పాటలకు ప్రాణం పోశాయి. 1990ల నాటి తెలంగాణ పల్లెల వాస్తవ పరిస్థితుల్ని ఆ పల్లె ప్రజల భాషలో బలంగా చెప్పింది పాటలు రాసిన కవులే. గద్దర్, గూడ అంజయ్య, గోరటి వెంకన్న, అందెశ్రీ, జయరాజ్, సారంగపాణి, కోదాటి శ్రీనివాస్, అంబటి వెంకన్న, దేవరకొండ భిక్షపతి తదితరులు తెలంగాణ గుండెల్ని సూటిగా తాకేలా పాటలు రాశారు. తొంభైల తర్వాత వచ్చిన తెలంగాణ ప్రాంత దళితకవులు పాటలోకి భాషా సంప్రదాయాలను, నుడికారాలను, యాసను ఓ వెల్లువలా తీసుకొచ్చారు.
      ‘‘అమ్మ తెలంగాణమా! ఆకలి కేకల గానమా’’ అంటూ గద్దర్‌ పాడిన పాట ప్రఖ్యాతం. తెలంగాణ పల్లె ధ్వంసం అయిన తీరును గోరటి వెంకన్న ‘‘పల్లె కన్నీరు పెడుతుందో’’ పాటలో కళ్లకు కట్టారు. పల్లెలు మారిపోవడం, శతాబ్దాలుగా వస్తున్న ఆచారాలు, సంస్కృతులు ధ్వంసం కావడం, వాటితో ముడిపడ్డ మానవీయ బంధాలు ఛిద్రం కావడంలోని విషాదాన్ని ప్రతిభావంతంగా చిత్రించారు. పాలమూరు ప్రజల కరవు వలసల వేదనను తన పాటలలో బలంగా ప్రతిబింబించారు. ‘‘మన్ను పుయ్యని మట్టి ముద్దల సన్నచీమల పుట్టలున్నవి/ సున్నం ఊడిన గోడలకు బల్లిగుడ్లే తెల్లంగున్నవి/ సాలెపురుగు లల్లిన పరదాలే! - ఈ పేదవాళ్లకు/ దేవుడిచ్చిన దోమతెరలాయే’’ అంటూ వెంకన్న దుఃఖపు జీరగొంతుతో పాడినప్పుడు, గుండె లోతుల్లో కలుక్కుమనని మనిషి ఉండడు. 
      అందెశ్రీ ‘‘కొమ్మ చెక్కితె బొమ్మరా! కొలిసి మొక్కితె అమ్మరా!’’ పాటలోని ‘‘గ్రామముల కాపాడనిపుడు, గ్రామదేవతలు వెలిసెనిచ్చట’’ లాంటి పాదాలు తెలంగాణ సాంస్కృతిక పునరుజ్జీవన ఉద్యమానికి పాదులు వేశాయి. ‘‘జై తెలంగాణ, జైజై తెలంగాణ’’ పాటలో అందెశ్రీ రాసిన ‘‘పోతనదీ పురిటిగడ్డ, రుద్రమదీ వీరగడ్డ/ గండర గండడు కొమురం భీముడే నీ బిడ్డ/ కాకతీయ కళాప్రభల కాంతిరేఖ రామప్ప,/ గోల్కొండ నవాబుల గొప్ప వెలుగె చార్‌మినార్‌’’ లాంటి కవితా పాదాలు ఉద్యమాన్ని ఉర్రూతలూగించాయి.
      దేశపతి శ్రీనివాస్, సుద్దాల అశోక్‌తేజ లాంటి కవి గాయకులు స్వయంగా రాయడమేగాక, ప్రజల్లో పాడి పాటకు ప్రాణప్రతిష్ఠ చేశారు. విమలక్క, తేలు విజయ, స్వర్ణక్క, నిర్మల, మాభూమి సంధ్య, మధుప్రియలాంటి గాయనీమణులు ఉద్యమ సమయంలో జనంలో తిరిగి పాటకు విశేష ప్రాచుర్యం కల్పించారు. మలిదశ తెలంగాణ ఉద్యమంలో వచ్చిన పాటలు తెలుగు సాహితీ సంపదను మరింత పెంచాయి. తెలంగాణ జీవద్భాషకు వన్నె తెచ్చాయి. ఇక్కడి సంస్కృతి, భాషా సౌందర్యాలను ప్రపంచానికి చాటి చెప్పాయి. 

* * *

      ఇలా మలిదశ తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ప్రాంతీయ చైతన్యం.. సాహితీ సృజన వికాసానికే కాదు, తెలుగు సాహిత్యం వికసించడానికీ, భిన్నశైలిలో వచన కవిత్వం రావడానికీ దోహదపడింది. కవులకు కొత్త చూపునిచ్చింది. మరోవైపు తెలంగాణ కవిత్వాన్ని సంపద్వంతం చేసింది నిర్దిష్టత, స్థానికతలే. వెల్లువెత్తిన ప్రాంతీయ చైతన్యం, తెలంగాణ ప్రాంతీయ దృక్పథ వచన కవిత్వం ప్రత్యేక శైలిని సాధించడానికి ఉపకరించింది.


వెనక్కి ...

మీ అభిప్రాయం