కొత్త రచయిత తత్తరననన....

  • 126 Views
  • 4Likes
  • Like
  • Article Share

    చెర్రీ

  • మార్కాపురం, ప్రకాశం జిల్లా

మగ పిల్లాడికి పురిటినొప్పులేంట్రా అంట్లవెధవ’’ అని తిడతారు మా బ్రిటిష్‌ పంతులు, అదే ఇంగ్లీషు పంతులు. రచయిత పడే బాధని పురిటినొప్పులంటారని ఆయన ఎరగరేమో! ఈ రచయిత గురించి ఆలోచించడానికి కారణం మా తెలుగు మాస్టారు. ఆయనకీ ఓ పేరుపెట్టుకున్నాం, అది ఆంధ్రమే కానీ... ఆవకాయ్‌. అంత కమ్మగా ఉంటాయి ఆయన పాఠాలు. మా ఆవకాయ్‌ని ఆవకాయ్‌ అంటే ఏదో ఎకసెక్కాలాడుతున్నాం అనుకుంటారు. అసలే పండితుడు.
       ఓసారి కాలేజీలో నేనిచ్చిన ఉపన్యాసానికి బహుమానంగా తాను రాసిన ‘భరనభభరవ’ పద్యాల పుస్తకం ఇచ్చారు. అది చూసి నా మొహం ‘నజభజజజర’. క్లాసులో మిత్రులంతా ‘సభరనమయవ’. అంటే గొల్లుమన్నారని చెప్పక్కరలేదనుకుంటా! అది గమనించిన గురువు గారు...
     ‘‘ఒరే రచన చేయడమంటే పత్రికల్లో సినిమా వార్తలు చదివినంత సులభం కాదురా అన్నాడు’’ (ఏ టీకొట్టు దగ్గరో మమ్మల్ని పసిగట్టి ఉంటాడు) పౌరుషంతో ‘ఓస్‌ నేనూ రచయితనే’ అన్నా బడాయిగా. రాసేవాడు రచయితే కదా! 
     ‘‘ఆహా!’’ అనే పదాన్నే, నేన్నమ్మను అనేంతగా పలికి, ‘‘ఇంతకీ ఏం రాస్తావు నాయనా’’ అన్నారు. 
     రోజు డైరీ రాస్తా! అది చాలదూ! ఆ మాటతో ఇక నాతో వాదనకొస్తే ఒట్టు.
     ఊసుపోక ఆయనిచ్చిన పుస్తకం చదవడం మొదలుపెట్టా. దాంతో నాకూ రచనలు చేయాలన్న దుర్బుద్ధి పుట్టింది. వెంటనే బజారుకెళ్లి బాగాపేరున్న పెన్ను కొన్నాను. అదైతేనే ఆలోచన పదును పెరుగుతుందని నమ్మకం.
     నాలాంటి వాళ్లని ఔత్సాహికులంటారని ఓ మిత్రుడు బిరుదిచ్చాడు (అప్పటికది బిరుదులాగే భావించాలి). సిరివెన్నెలగారన్నట్లు ఏదైనా మొదలుపెట్టేముందు... ఎలా! అన్న ప్రశ్న వస్తుంది. అప్పుడు పడే అవస్థ అంతాయింతా కాదు. దాన్నే పురిటినొప్పులన్నారు. తాపీ ధర్మారావు ‘కృత్యాద్యవస్థ’ అన్నారు. ఆయన ఎన్ని రచనలు చేసినా పడని బాధ, తన స్వీయచరిత్రకి పడ్డారట. నన్నడిగితే సులభంగా రాయగలిగేది ఆత్మకథే. మనసులేనివాడికి కూడా ఆత్మనేది ఒకటి ఉంటుందిగా, దాన్ని గురించి తోచింది రాసుకోవచ్చు. నచ్చితే అచ్చుకి, లేదంటే మచ్చుకి!
     జాషువా సైతం ‘ఫిరదౌసి’కి ఇలాంటి గొప్ప మథనమే చేశారు.. అంటే జాషువా అని కాదు. ‘గజినీ’ కావ్యం రాయడానికి ఫిరదౌసికవి చేసిన మేధోమథనం కవికోకిల కలంనుంచి దర్శించామని.  
అతడారాతిరి కన్ను మూయక తదీ
య స్వప్న వృత్తాంతమ
ద్భుతమైనన్‌ దలపోయుచుండె...
                               
     హాయిగా నిద్రపోక ఇలా శ్రమించారు కాబట్టే గొప్ప కావ్యం రచించారనుకోండి! ఆ మహామహులకే తప్పలేదు మనమెంతని నేనూ ధైర్యం చెప్పుకున్నా. ఏం రాద్దామా అని బాగా ఆలోచించిన తర్వాత ఓ విషయం అర్థమైంది. పద్యం రాయడం కన్నా గద్యం రాయడం మిన్న అని. మళ్లీ గద్యంలో కథలు రాద్దామా అంటే ఈ కుర్ర ప్రేమకథలు మనకు బొత్తిగా అర్థంకావు. రాస్తే జనం కష్టాలను, శ్రీశ్రీ ‘మీకోసం కలంపట్టి రాస్తున్నా’ అన్నట్లు మనం బడుగుల గొంతుకావాలి. సమస్యలమీద రాయాలి. దానికీ ధైర్యం చాల్లేదు. తీవ్రత ఉండాల్సింది పదంలో కాదూ హృదయంలో అని తెలిసి ఆ ప్రయత్నం విజయవంతంగా విరమించా. 
     ఏదేమైనా ఈ రోజుల్లో సమస్యలు ఎక్కువగానే ఉన్నాయి. పల్లెల్లో జనం వైఫై లేకుండా బతుకుతున్నారని జాలిపడిపోయే నాయకులని చూస్తే రాయ‘బుద్ధి’ కావాల్సిందే! ఈ విధంగా ఆలోచించగా వచ్చింది... ఆలోచన కాదు, కడుపునొప్పి. సరిగ్గా మంచి ఆలోచనొచ్చే సమయానికి ఎవరో ఒకరు పిలవడం ఏదో ఒక పని అప్పజెప్పడం. దాంతో రచన మళ్లీ మొదటికొస్తుంది. కొన్నిసార్లు రచన సగం కట్టిన ఆనకట్టలా మధ్యలోనే ఆగిపోతుంది. ఇది తెలిస్తే, నేను కళవళలము గల కవినని జాషువా మొట్టికాయలేసినా ఆశ్చర్యంలేదు. 
     ఇక సమస్యలేమున్నాయని తరచి చూస్తే తెలుగే సమస్యల్లో ఉన్నట్లు కనిపించింది. ఆదరణ కోల్పోతున్న భాషకన్నా సమస్యేముంటుంది? అందుకే దానిమీదే రాద్దామని వేలికి కలం కట్టుకున్నా. అయినా సాధ్యం కాక వదిలేశా. కాలం రైలుబండిలా సాగిపోయింది. ఇంకొన్నాళ్లుంటే ఆ తృష్ణే చచ్చిపోయుండేది, చాలామంది కాని రచయితల్లా. అలాంటి తరుణంలో తేనెతుట్టెని చిన్నరాయి కదిపినట్టు నా భాషాభిమానాన్ని ఓ చిన్న సంఘటన కదిపింది. అంతే! ఇక నా రచనావధానం మొదలైంది.
     మనకు తెలిసిన, పరిచయమైందే రాయాలంటాడు రచనలో కిటుకులు చెప్పే ఓ పెద్దాయన. నేనూ ఆయన్నే అనుసరించా, ప్రతీ ఔత్సాహికునికి మల్లే. మా ఎదురింటి పిల్లాడు పొద్దున్నే తెలుగులో నవ్వుతూ కాన్వెంటుకి వెళ్లాడు. సాయంత్రం ఆంగ్లంలో ఏడ్చుకుంటూ వచ్చాడు. ఏంట్రా అంటే... ‘‘ఇకనుంచి ఆంగ్లంలోనే తినాలి, తాగాలి, వాగాలట’’ అన్నాడు ఏడుస్తూనే. బడికెళ్లగానే బడితెపుచ్చుకొని, తెలుగుని నాలుకమీంచి జీర్ణాశయంలోకి తరిమేశారట ఓ పంతులమ్మ. కొన్నాళ్లాగితే పూర్తిగా జీర్ణమవుతుందిలే అనుకున్నారు కాబోలు. మా ఆవకాయ్‌లాంటి గురువులు ఇప్పటి పిల్లలకి దొరకాలంటే సాధ్యమేనా! ఇదే నాకు సరకైంది. సరకంటే అంగారక గ్రహంనుంచి రాదు, చుట్టూ ఉన్న జీవితాల్లోంచీ, వ్యక్తుల్లోనుంచీ వస్తుందని తెలిసిందా రోజు. 
     ఇక ఆ పిల్లాడు పొద్దున్నే టూత్‌బ్రష్‌ ఎక్కడంటే, కాదూ ‘దంతధావన చీపురు’ అనమని సలహా పడేశా. పేస్టుని ‘పళ్లపాకం’ అనమన్నా. ఇంకా నయం కుంభీపాకం అనలేదు. కసురుకుంటాడు వాట్సాప్పారాయణం చేసే స్నేహితుడు. తెలుగులో పలకరిస్తే ‘‘పాతంతరం, కొత్తంతరం లేకుండా ఆ పలకరింపేమిటీ, హాయ్‌ డూడ్‌ అనలేవూ...!’’ అని విసుక్కున్నాడు. వాట్సప్‌కి కూడా తెలుగులో ‘ఏంట్రోయ్‌’ అన్న పేరెలా ఉంటుందీ అని తెలుగీకరించా. తెలుగే అంతర్జాతీయ స్థాయికి ఎదిగి... అమెరికా వాళ్లూ, ఫ్రాన్స్‌ వాళ్లూ తెలుగే శరణం గచ్ఛామి అంటూ మన బడుల్లో విద్యార్థులవుతారు చూడమంటూ జోస్యం చెప్పా. మొత్తానికి ఆ పిల్లాడిలో తెలుగుని బతికించా. ఇదంతా యథాతథ]ంగా కాగితానికెక్కించా. ఈ దెబ్బతో ఆనాటి మా గురువుగారికి నాపై ప్రేమ ఉప్పొంగిపోతుందనిపించింది. ఈ రచన పత్రికల్లో అచ్చయి నాకు ప్రశంసలూ, ప్రముఖ సంస్థల సన్మానాలూ, బిరుదులూ తలుచుకోగానే భవిష్యత్‌ బీభత్సంగా కనిపించింది! 
     రచనని ఎవరికన్నా చూపిస్తే కాపీ కొట్టేసి పేరు తెచ్చుకుంటారన్న భయంతో, భద్రంగా మడిచి సరాసరి పత్రికకే పోస్టుచేశా. రెండువారాల తర్వాత ఆ ఉత్తరం క్షేమంగా తిరిగొచ్చింది. నా కల మాయమైన తెలుగక్షరాల్లా కనబడలేదు మరి. నా ప్రాణం ఉసూరుమంది. అప్పటినుంచీ విక్రమార్కునిలా ఈ రచనతో దండయాత్ర చేస్తూనే ఉన్నా. అది బేతాళుడిలా తిరిగొస్తూనే ఉంది. నాకు అచ్చొచ్చిన ‘పదో’సారి కూడా తిరిగొచ్చింది. ఇక లాభంలేదని మా ఎదురింటోడికి ఇంగ్లీషు బోధ చేసిన పంతులమ్మ పేరున పంపించాను. 
     ఆహా!!! దెబ్బకి అచ్చయిపోయింది. ‘సత్కవి ధరింపరాని వేషములు గలవె?’’ అని ఊరికే అన్నారా! ఆ ఉత్సాహంలో మరో కావ్యరచనకి పూనుకున్నాను. ఈసారి ఏ ‘కావ్య’కన్యక వరమందిస్తుందో...!


వెనక్కి ...

మీ అభిప్రాయం