ఆ చైతన్యమే శ్రీరామరక్ష

  • 259 Views
  • 1Likes
  • Like
  • Article Share

    డా।। కె.ఎల్‌.వి.ప్రసాద్‌

  • హనుమకొండ, వరంగల్లు.
  • 9866252002
డా।। కె.ఎల్‌.వి.ప్రసాద్‌

అనుకోకుండా గాయపడినా, అంతులేని ఆశ్చర్యమేదో మదిని ముంచేసినా మన నోటినుంచి అప్రయత్నంగా వెలువడే మాట.. అమ్మా! అంత గొప్పదనం అమ్మలో ఉంది కాబట్టే ఆమెను అన్ని సందర్భాల్లోనూ తలచుకుంటాం. మరి అమ్మ తర్వాత అంతగా ప్రేమించాల్సింది అమ్మభాషనే కదా. కానీ, భాష విషయం వచ్చేసరికి మనం మనసులు మార్చుకుంటున్నాం, మార్గం వేరంటున్నాం! ఇలా ఎందుకు జరుగుతోంది? తెల్లదొరల పాలనలోనూ మనవాళ్లు తెలుగును నిర్లక్ష్యం చేయలేదు. ఎస్‌ఎస్‌ఎల్‌సీ నుంచి ఇంటర్‌ వరకూ తెలుగు మాధ్యమంలో చదువుకున్నప్పటికీ ఆ తరంవాళ్లు ఇంజినీర్లు, డాక్టర్లు కాకపోలేదు. ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అయినవాళ్లూ ఉన్నారు. ఇవాళ విదేశాల్లో ఉంటూ, తమ ప్రతిభా పాటవాలతో మాతృభూమికి పేరుతెస్తున్న తెలుగుబిడ్డల్లో చాలామంది అమ్మభాషా మాధ్యమంలో చదువుకుని ఉన్నతస్థాయికి ఎదిగినవారే!
      చరిత్ర ఇంత ఘనంగా ఉన్నా, వర్తమానం అగమ్యగోచరంగా మారిపోయింది. తెలుగువాళ్లకు మాతృభాష మీద అయిష్టత పుట్టుకొచ్చింది. తెలుగులో చదువుకుంటే తమ పిల్లలకు భవిష్యత్తు ఉండదన్న దురభిప్రాయానికి వచ్చేశారు. నిజానికి ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్‌ వరకూ నేను చదువుకుంది తెలుగు మాధ్యమంలోనే. ఆ తర్వాత ‘దంతవైద్యం’ ఆంగ్లంలో చదవడానికి, నా తెలుగు పునాది అడ్డు కాలేదే! పైపెచ్చు తెలుగు- ఇంగ్లిష్‌ల మీద సమానస్థాయిలో పట్టుపెంచుకునే నైపుణ్యాన్నీ అందించింది. నేడు ఉన్నత విద్యకోసం చైనా, రష్యా, జర్మనీ, జపాన్‌లకు వెళ్తున్న మన విద్యార్థులు మొదట ఆయా దేశాల మాతృభాషలను ఎందుకు నేర్చుకోవాల్సి వస్తోంది? ఈ విషయాన్ని అర్థం చేసుకుంటే, మనభాషకు మనమే పొగపెట్టుకోవడం ఎంత అర్థరహితమో తెలుస్తుంది. ఆయా దేశాల వాళ్లు తమ చిన్నారులకు తమవైన భాషల్లోనే విద్యాబుద్ధులు నేర్పిస్తున్నారు. అక్కడికి వెళ్లే మనవాళ్లకూ తమ భాషలను నేర్పుతున్నారు. మరి వాళ్లను చూసి మనం నేర్చుకోలేమా? 
నైపుణ్యాలు కావాలంటే...
తెలుగును అభివృద్ధి చేయడం, తెలుగును రక్షించుకోవడం అంటే ఆంగ్లాన్ని నిర్లక్ష్యం చేయమని కాదు. అమ్మభాషగా తెలుగుకు ఇవ్వాల్సిన ప్రాధాన్యాన్ని ఇవ్వాలి. ప్రాథమిక స్థాయిలో అమ్మభాషలో చదువుకుంటే పిల్లల్లో నైపుణ్యాలు పెరుగుతాయన్న విజ్ఞానవేత్తల మాటలను ఆలకించాలి. ఆంగ్లాన్ని ఓ సబ్జెక్టుగా మాత్రమే బోధించాలి. కావాలనుకుంటే, ఆ పైస్థాయిలో పిల్లలు ఏ భాషా మాధ్యమంలోనైనా చదువుకునే వెసులుబాటు ఉండాలి. అంతేతప్ప అంతా ఆంగ్లం మయం చేసేస్తే నైపుణ్యాలు లేని తరం తయారవుతుంది. ప్రజలకు ఉపయోగపడే అంశం చర్చకు వచ్చినప్పుడు, మేధావులు నిస్వార్థంగా పాలకులకు సలహాలు ఇవ్వాలి. అప్పుడే జాతికి మంచి జరుగుతుంది. 
      ఇక తెలుగు పాఠ్యాంశాల ఎంపిక మరో ముఖ్యాంశం. భాషపట్ల నవతరంలో ఆసక్తి పెంపొందేలా పాఠ్యాంశాలను ఎంపికచేయాలి. ప్రేమ, నీతి, శాంతి, సేవాగుణాలకు పట్టంకట్టే సాహిత్యాన్ని పిల్లలకు చేరువ చేయాలి. అలాగే, రెండు రాష్ట్రాల్లో పరిపాలన నుంచి రోజువారీ వర్తక వ్యాపారాల వరకూ అన్నిచోట్లా అధికార భాషగా తెలుగు అమలు కావాలంటే తప్పనిసరిగా కొన్ని చర్యలు తీసుకోవాలి. నవతరానికి వివిధ రూపాల్లో అమ్మభాషను చేరువ చేయడానికీ ఈ చర్యలు అవసరమే. అవి... 
      తెలుగు భాషాభివృద్ధికోసం రెండు రాష్ట్రాల్లోనూ ప్రత్యేకంగా ఓ మంత్రిత్వశాఖను ఏర్పాటుచేయాలి. ముఖ్యంగా ఇది మరే ఇతర శాఖకూ అనుబంధంగా ఉండకూడదు. పరిపాలన, బోధన, మాట్లాడే భాషగా తెలుగును అభివృద్ధి చేయడంకోసమే ఇది పనిచేయాలి. క్రమం తప్పకుండా అన్ని స్థాయుల్లోనూ కచ్చితమైన సమీక్షలు జరగాలి. 
      రెండు రాష్ట్రాల్లోనూ పరిపాలన అంతా తెలుగులోనే జరగాలి. ఉత్తర ప్రత్యుత్తరాలు, ఆదేశాల జారీ... ఇలా అన్నింటికీ అమ్మభాషనే వినియోగించాలి. రెండు రాష్ట్రాల మధ్య రాతకోతలు కూడా తెలుగులోనే కొనసాగాలి. 
ప్రాథమిక విద్య నుంచి ఇంటర్‌ వరకు తెలుగు మాధ్యమంలో బోధనను ప్రోత్సహించాలి. గణితం, సామాన్యశాస్త్రం, సాంఘిక శాస్త్రాలకు సంబంధించి తెలుగు బోధనా వనరులను అభివృద్ధి చేయాలి. 
      తెలుగు మాధ్యమంలో చదువుకున్న వాళ్లకు ప్రభుత్వోద్యోగాల నియామకాల్లో ప్రాధాన్యమివ్వాలి. దీనికి సంబంధించి రెండు రాష్ట్రాల్లోనూ నిర్దిష్ట ఉత్తర్వులివ్వాలి. 
      ఇంటర్మీడియట్‌లో ఎక్కువ మార్కులకోసం సంస్కృతం, ఇతర భాషలను ఎంచుకునే పద్ధతి పోవాలి. ఆయా భాషలు తీసుకున్న వాళ్లు సంబంధిత లిపుల్లోనే పరీక్షలు రాసేలా చూడాలి. 
      అధికారుల నుంచి చట్టసభలకు పోటీపడే అభ్యర్థుల వరకూ అందరికీ తెలుగులో స్పష్టంగా మాట్లాడటం, చదవడం, రాయడం రావాలి. ఆమేరకు నియమావళి రూపొందించి, అమలు చేయాలి.  
మన సాహిత్యాన్ని ఇతర భాషల్లోకి తీసుకెళ్తున్న అనువాద రచయితలను ఏటా సత్కరించాలి. అలాగే, వివిధ శాస్త్రాలకు సంబంధించిన పుస్తకాలను తెలుగులోకి అనువదిస్తున్న వారినీ సముచితంగా గౌరవించాలి. 
      ఇలా కొన్ని పటిష్ఠమైన నిర్ణయాలు తీసుకుని, వాటిని చిత్తశుద్ధితో అమలు చేసినప్పుడే మన భాష నిలబడగలుగుతుంది. అయితే ఇది ప్రజలు, పరిపాలకుల సమష్టి భాగస్వామ్యంతోనే సాధ్యమవుతుంది. ఆమేరకు తెలుగునాట చైతన్యం వెల్లివిరిసిన నాడే తెలుగుకు మంచి రోజులు వస్తాయి.


వెనక్కి ...

మీ అభిప్రాయం