భాషా శాస్త్రమే భద్రిరాజు జీవితం!

  • 280 Views
  • 0Likes
  • Like
  • Article Share

    డా।। చింతపల్లి సత్యనారాయణ

  • తెలుగు శాఖాధిపతి, ఆర్‌వీవీఎన్‌ కళాశాల, అమరావతి.
  • 9866805870
డా।। చింతపల్లి సత్యనారాయణ

భద్రిరాజు కృష్ణమూర్తి... పేరు చెప్పగానే గుర్తుకువచ్చేది భాషాశాస్త్రమే. తెలుగు మధ్య ద్రావిడ కుటుంబ భాష అని నిరూపించిన భద్రిరాజు... భాషాశాస్త్ర పరిశోధనల్లో మకుటం లేని మహారాజు. తెలుగులో వృత్తి మాండలికాలే తప్ప కుల మాండలికాలు లేవని రుజువుచేసిన ఘనతా ఆయనదే. వ్యవసాయ, చేనేత వృత్తి మాండలిక పదకోశాలూ భద్రిరాజు సంపాదకత్వంలోనే రూపుదిద్దుకున్నాయి. ప్రకాశం జిల్లా నుంచి ఫిలడెల్ఫియా వరకూ సాగిన ఆయన ప్రస్థానం... భావితరాలకు స్ఫూర్తిదాయకం.
భద్రిరాజు
కృష్ణమూర్తి 1928 జూన్‌ 19న ఒంగోలులో జన్మించారు. తల్లిదండ్రులు భారతమ్మ, సుబ్రహ్మణ్యం. కృష్ణమూర్తి తండ్రి ఒంగోలు జిల్లా కోర్టులో గుమాస్తా. ఆయన ప్రాథమిక విద్య ఒంగోలులో సాగింది. పాఠశాల స్థాయిలోనే భాషా సాహిత్యాల పట్ల అభిమానం ఏర్పడింది. చిన్ననాటనే ఆయన పద్యాలు రాయడం మొదలుపెట్టారు. కుటుంబ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రం కావడంతో, కృష్ణమూర్తిని వాళ్ల నాన్న ఏదో ఒక ఉద్యోగంలోకి దించాలని ప్రయత్నించారు. కలెక్టర్‌ ఆఫీసులో ఖాళీలు ఉన్నాయని దరఖాస్తు పెట్టించారు. మౌఖిక పరీక్షలో కృష్ణమూర్తి కలెక్టర్‌తో పై చదువులకు వెళ్ళే కోరిక ఉందనడంతో ఆ ఉద్యోగం ఆయనకు దక్కలేదు. దాంతో 1943లో గుంటూరు హిందూ కాలేజీలో ఇంటర్‌లో చేరారు. రెండో ప్రపంచయుద్ధం వల్ల ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని తాత్కాలికంగా గుంటూరుకు మార్చారు. అప్పుడు కృష్ణమూర్తి బియ్యే ఆనర్స్‌ చదివేందుకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో చేరారు. డిగ్రీలో ఆయన ఐచ్ఛికాంశం తెలుగు సాహిత్యమే.
      సాహిత్యం పుస్తకాలతో నేర్చుకోవచ్చు. కానీ భాషాశాస్త్ర అధ్యయనం మాత్రం గురువు ద్వారానే సాధ్యం. అందుకే కృష్ణమూర్తి భాషను ప్రధానాంశంగా స్వీకరించారు. ఈ దశలోనే తొలితరం భాషావేత్త గంటిజోగి సోమయాజి పరిచయమయ్యారు. ఆయన రాసిన ‘ఆంధ్ర భాషా వికాసము’ శుద్ధప్రతిని రూపొందించడంలో పాలుపంచుకున్నారు భద్రిరాజు కృష్ణమూర్తి. ఆర్థికంగా ఇబ్బందిగా ఉన్నా, అనువాదాలు చేసి, ట్యూషన్లు చెప్పుకుని 1948లో బియ్యే ఉత్తీర్ణులయ్యారు. ఈలోపు తండ్రి ఆరోగ్యం క్షీణించింది. తప్పనిసరి పరిస్థితిలో గుంటూరు హిందూ కాలేజీలో ట్యూటర్‌గా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించారు. తర్వాత 1949లో ఆంధ్ర విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో కృష్ణమూర్తికి ఉద్యోగం వచ్చింది. అక్కడ గంటిజోగి సోమయాజి, దువ్వూరి వేంకటరమణశాస్త్రి, కె.వి.ఆర్‌.నరసింహం, పింగళి లక్ష్మీకాంతం లాంటి ఉద్దండులైన పండితుల సాహచర్యం ఆయన జీవితాన్ని మలుపుతిప్పింది.
భాషాశాస్త్రం వైపు 
ఆనర్స్‌ పూర్తవడంతో పరిశోధన దిశగా వెళ్దామనుకున్నారు భద్రిరాజు. ఆయన ఉద్దేశం తెలుసుకున్న గంటిజోగి సోమయాజి ‘తెలుగు క్రియా ధాతువులు- పుట్టు పూర్వోత్తరాలు’ మీద పరిశోధన చేయమని సూచించారు. ‘ఏదో ఒక మార్గంలో వెళ్లకుండా, కొత్తమార్గం కనుక్కున్న వాడే మంచి పరిశోధకుడు’ అన్న జె.బి.కె.హాల్డేన్‌ మాటలు భద్రిరాజు పరిశోధనకు మార్గదర్శకంగా నిలిచాయి. పరిశోధన నిమిత్తం పూణె, మద్రాసు విశ్వవిద్యాలయాలకు వెళ్లి సమాచారాన్ని సేకరించారు. కాలిఫోర్నియా విశ్వవిద్యాలయం ఆచార్యులు ఎమెనోను ఎయిర్‌ మెయిల్‌ద్వారా సంప్రదించేవారు. ఆక్స్‌ఫర్డ్‌ ఆచార్యులు థామస్‌ బరో విశాఖకు వచ్చినప్పుడు ఆయనతో చర్చించారు. ఆంధ్ర, ఒడిశా సరిహద్దుల్లో ద్రావిడ భాషలు చాలా ఉన్నాయనీ, వాటికి వ్యాకరణం రాయాలని కృష్ణమూర్తితో చెప్పింది బరోనే. దాంతో కృష్ణమూర్తికి భాషాశాస్త్రం మీద ఆసక్తి పెరిగింది. దీన్ని అబ్బూరి రామకృష్ణారావుతో చెబితే... ఆయన ‘ఒక కొత్తభాషను కనుక్కోవటం, దానికి వ్యాకరణం రాయటం పద్యం రాయటం కన్నా గొప్పపని’ అన్నారట. ఆ సలహా మేరకు తన శక్తిసామర్థ్యాలన్నీ భాషాశాస్త్రం మీదే కేంద్రీకరించారు కృష్ణమూర్తి. తెలుగు ధాతువులకు సోదర శబ్దాలను కనుక్కొనేందుకు ఇరవైకి పైగా ద్రావిడ భాషల నిఘంటువులు సేకరించారు. దీనివల్ల 1260 తెలుగు ధాతువుల్లో ప్రతివర్ణానికీ పూర్వదశల్ని తులనాత్మకంగా నిరూపిస్తూ, వాటి చరిత్రను పరిశీలించారు. 
      ఆనాటికి మూలభాష పునర్నిర్మాణ విధానం శాస్త్ర రూపం పొందలేదు. అలాంటి దశలో కొద్ది జీతంతోనే సంసార పోషణ చేస్తూ పరిశోధన పూర్తిచేశారంటేనే భద్రిరాజు పట్టుదల ఎంతటిదో తెలుస్తుంది. ఇంతలో ఫుల్‌బ్రైట్‌ స్కాలర్‌షిప్‌తో అమెరికాలో భాషాశాస్త్రం అధ్యయనం చేసేందుకు ప్రకటన వెలువడింది. అప్పుడు జరిగిన ఇంటర్వ్యూలో... కృష్ణమూర్తి ఇచ్చిన సమాధానం ఆయన వ్యక్తిత్వానికి దర్పణం. పరీక్షకులు ఆయన వ్యాపకాల గురించి అడిగితే, సమాధానంగా తనకు విసుగ్గా ఉన్నప్పుడల్లా ఏదో ఒక భాష వ్యాకరణం చదువుతానన్నారు కృష్ణమూర్తి. అదే ఆయన అమెరికా యానానికి అవకాశం కల్పించింది. భాషాశాస్త్రం (లింగ్విస్టిక్స్‌) అనే పదం అంతవరకు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎవరికీ పరిచయం లేదు. దాంతో ఆయనను సెలవుమీద అమెరికా ఎలా పంపించాలని ఆలోచించారు. చివరికి అప్పటి విశాఖ కలెక్టర్‌ జె.పి.ఎల్‌.గ్విన్‌ విశ్వవిద్యాలయం ఉపకులపతి వాసిరెడ్డి శ్రీకృష్ణకు సర్దిచెప్పడంతో, కృష్ణమూర్తికి వెయ్యి రూపాయల ఆర్థిక సాయంతోపాటు, రెండేళ్లపాటు కుటుంబ పోషణకు సగం జీతం ఇచ్చేందుకూ అంగీకరించారు. అలా ఫిలడెల్ఫియాలో భాషాశాస్త్ర పరిశోధనలు చేశారు. భారతీయ భాషా సమస్యల మీద పరిశోధన వ్యాసం సమర్పించారు. అదే సమయంలో న్యూయార్క్‌లో రాక్‌ఫెల్లర్‌ ఫెలోషిప్‌ సాధించి ఎమ్మే పరీక్షకు రిజిష్టర్‌ చేసుకున్నారు. ఫిలడెల్ఫియాలో సిద్ధాంత పత్రం కూడా అప్పుడే సమర్పించారు. మిషిగన్‌ విశ్వవిద్యాలయంలో వేసవికాలం భాషాశాస్త్రం కోర్సుకి దరఖాస్తు చేసుకొని క్రెడిట్‌ సంపాదించుకున్నారు.
      సాధారణంగా, అమెరికాలో పీహెచ్‌డీకి నాలుగేళ్లు పడుతుంది. కృష్ణమూర్తి మాత్రం రెండేళ్లలోనే పరిశోధన పూర్తిచేశారు. 1957లో డాక్టరేటు పట్టా అందుకున్నారు. ఈ సిద్ధాంత పత్రంలోనే తెలుగు మధ్య ద్రావిడ భాష అని శాస్త్రీయంగా రుజువు చేశారు. అక్కడినుంచి ఇంగ్లాండ్, ఐర్లాండ్‌ దేశాలకు వెళ్లి అక్కడి భాషలను, మాండలికాలను పరిశీలించారు. 1956లో భారతదేశానికి తిరిగి వచ్చి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఆచార్యులుగా చేరారు. అప్పటినుంచే భాషాశాస్త్రాన్ని ప్రధానాంశంగా తీసుకునే విద్యార్థుల సంఖ్య పెరగసాగింది.
మాండలికాల సేకరణ
అమెరికా నుంచి వచ్చాక, భాషాశాస్త్రంలో భద్రిరాజు పాండిత్యానికి గుర్తింపుగా ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ సభ్యత్వం లభించింది. సమకాలీన భాష మీద పరిశోధనలు చేయించటం, వాటి ఆధారంగా సమగ్ర తెలుగు కోశాన్ని నిర్మించటం లక్ష్యంగా వృత్తి పదకోశాల నిర్మాణానికి ఒక ప్రణాళిక తయారు చేయమని అకాడమీ ఆయనకు సూచించింది. దాంతో తెలుగునాట వాడుకలో ఉన్న వ్యవసాయ వృత్తి పదకోశం రూపకల్పనకు పూనుకున్నారు. ఈ కృషిలో చేకూరి రామారావు, లింగుట్ల కోనేటప్ప, తూమాటి దొణప్పల సహకారం తీసుకున్నారు. నాలుగేళ్లలో వ్యవసాయ వృత్తిపదకోశం పూర్తయింది. 600 పుటల ఈ గ్రంథం ఓ అపూర్వమైన ప్రయత్నమని అప్పట్లో ప్రశంసలు వచ్చాయి. అకాడమీ సభ్యుడుగా ఉన్నప్పుడే, అబ్బూరి రామకృష్ణారావు, దివాకర్ల వేంకటావధానితో కలిసి తిక్కన పదప్రయోగ కోశ రూపకల్పనలో పాలుపంచుకున్నారు కృష్ణమూర్తి. ఈ ప్రయత్నంలోనే తెలుగులో కుల మాండలికాలు లేవు, వృత్తి మాండలికాలు ఉన్నాయని నిరూపించారు. ఇదే సమయంలో కొండదొరల భాష మీద పరిశోధన చేసి, ‘కొండ ఆర్‌ కుబి: ఎ ద్రవిడియన్‌ లాంగ్వేజ్‌’ను ప్రచురించారు.
      భద్రిరాజు 1960- 61 మధ్య కాలిఫోర్నియా విశ్వవిద్యాలయంలో బోధించేందుకు సెలవు మీద వెళ్లారు. అక్కడ ఉన్నప్పుడే ఉస్మానియా విశ్వవిద్యాలయం ఉపకులపతి డి.ఎన్‌.రెడ్డి, ఉస్మానియాలో భాషాశాస్త్ర శాఖ ఏర్పాటుచేస్తున్నాం, మా దగ్గరికి రండి అని కృష్ణమూర్తిని ఆహ్వానించారు. ఈలోపు శ్రీవేంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగుశాఖలో రీడర్‌గా ఖాళీ ఉందని ప్రకటన రావడంతో అమెరికా నుంచి వచ్చేశారు. తర్వాత అదే సంవత్సరంలో ఉస్మానియాలో భాషాశాస్త్ర ఆచార్యులుగా నియమితులయ్యారు. భారతదేశంలో చాలా చోట్ల భాషాశాస్త్ర శాఖలు మొదలయ్యేందుకు నాంది ఇదే. 1971- 74లో ఉస్మానియా ఆర్ట్స్‌ కళాశాల ప్రధానాచార్యులుగా ఎన్నో సంస్కరణలు అమలుచేశారు. 1974లో ఆస్ట్రేలియా వెళ్లి, అక్కడి ఆదిమభాషలకు, ద్రావిడభాషలకు సంబంధం లేదని తేల్చిచెప్పారు. 1981, 82 సంవత్సరాల్లో రష్యా, జపాన్‌ దేశాల్లో పర్యటించారు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయం ఉపకులపతిగా ఏడేళ్లపాటు ఆ విశ్వవిద్యాలయం అభివృద్ధికి కృషిచేశారు. 
      పరిశోధన వ్యాసంగాన్ని పరిపాలనా బాధ్యతల్ని వైరుధ్యం లేకుండా నడిపిన అతికొద్ది విద్యావేత్తలలో ఆయన ఒకరు. ఆయనకు శిష్యవాత్సల్యం ఎక్కువ. ఇప్పుడు భాషాశాస్త్ర బోధనలో ఉన్న ఎంతోమంది ఆచార్యులు ప్రత్యక్షంగానో, పరోక్షంగానో ఆయనకు శిష్యులే. తెలుగు అధ్యాపకుడిగా వృత్తి జీవితం ప్రారంభించి భాషాశాస్త్ర రంగంలో అంతర్జాతీయ స్థాయికి ఎదిగి సమున్నతమైన స్థాయిని అందుకున్న కృష్ణమూర్తి తన 84వ ఏట, 2012 ఆగస్టు 11న మరణించారు. విద్యారంగంలో ఆయన కృషికి ఎన్నో పురస్కారాలు దక్కాయి. 
      పద్యంతో సాహితీ ప్రస్థానం ప్రారంభించిన భద్రిరాజు కృష్ణమూర్తి పేరు భాషాశాస్త్రానికి చిరునామాగా నిలిచిపోయింది. అమెరికా, ఇంగ్లాండు, రష్యా, ఆస్ట్రేలియా, జపాన్‌ దేశాల్లో వివిధ భాషాశాస్త్ర సదస్సుల్లో పాల్గొన్న ఆయన తెలుగుభాషను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ‘కంటికి కనురెప్ప ఎలాగో, మనిషికి భాష అలాంటిది. మనో నేత్రానికి బయటి ప్రపంచాన్ని చూపించేదీ, బయటిప్రపంచానికి మనో నేత్రాన్ని దర్శింపజేసేదీ భాషే’ అని మనిషి జీవితంలో భాష పాత్రను ఘంటాపథంగా చాటిన భద్రిరాజు కృష్ణమూర్తి జీవితం ఆదర్శప్రాయం.
భాషాశాస్త్ర సర్వస్వాలు
భాషాశాస్త్ర అధ్యయనం, అధ్యాపనంలోనే యావజ్జీవితం గడిపిన భద్రిరాజు కృష్ణమూర్తి తెలుగు, ఆంగ్ల భాషల్లో భాష మీద కొన్ని గ్రంథాలు రాశారు. వాటిలో ఆక్స్‌ఫర్డ్‌ విశ్వవిద్యాలయం ముద్రించిన ‘కంపారటివ్‌ ద్రవిడియన్‌ లింగ్విస్టిక్స్‌: కరెంట్‌ పర్‌స్పెక్టివ్స్‌’, కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయం ముద్రించిన ‘ద్రవిడియన్‌ లాంగ్వేజెస్‌’లు ముఖ్యమైనవి. ఇక ఆయన రాసిన ‘తెలుగు వెర్బల్‌ బేసెస్‌’ అయితే ద్రావిడ భాషల అధ్యయనానికి మైలురాయిలాంటిది. జేపీఎల్‌ గ్విన్‌తో కలిసి ఆంగ్లంలో ‘ఎ గ్రామర్‌ ఆఫ్‌ మోడ్రన్‌ తెలుగు’ గ్రంథాన్ని రాశారు. ఆయన అక్షరసేద్యంలో ‘భాష- సమాజం- సంస్కృతి’, తెలుగు భాషాచరిత్ర(సంపాదకత్వం) పుస్తకాలూ ప్రధానమైనవే. ద్రవిడియన్‌ లాంగ్వేజెస్‌ పుస్తకమైతే, ఇప్పటివరకు గణనలోకి వచ్చిన 26 ద్రావిడ భాషల విజ్ఞాన సర్వస్వం. ఇక ‘భాష- సమాజం- సంస్కృతి’ ఏమో భాషపట్ల కనీస అవగాహన ఉన్నవాళ్లకైనా భాషాశాస్త్రం గురించి అర్థమయ్యేలా రాసిన పుస్తకం. ఇవేకాకుండా వివిధ పత్రికలకు ఆంగ్లం, తెలుగు భాషల్లో వ్యాసాలు కూడా రాశారు భద్రిరాజు కృష్ణమూర్తి.


వెనక్కి ...

మీ అభిప్రాయం