నాన్నలే కథానాయకులు

  • 335 Views
  • 0Likes
  • Like
  • Article Share

    చెంగల్వ బొడ్డపాటి రామలక్ష్మి

  • తెలుగు అధ్యాపకులు, విజయవాడ.
  • 9490696950

సృష్టిలో ఎంతో అపురూపమైనదీ, అద్భుతమైనదీ తండ్రీ పిల్లల అనుబంధం. సంతానం ఉజ్వల భవితకోసం అనుక్షణం పరితపిస్తూ, ఎదిగిన పిల్లలను చూసి గర్వంతో మురిసిపోయే నాన్నలు ఎంతమందో! అందుకే నాన్న అంటే ప్రేమ, నాన్న అంటే వాత్సల్యం, నాన్న అంటే బాధ్యత, నాన్న అంటే రక్షణ, మొత్తానికి నాన్న అంటే భరోసా. తెలుగు సాహిత్యంలో ముఖ్యంగా కథల్లో పిల్లల పెంపకంలో నాన్న పాత్రను విభిన్న రూపాల్లో చిత్రించారు. మచ్చుకు కొన్ని పాత్రల పరిచయం ఇది...
కాలస్వభావాన్ని
బట్టి తండ్రీ పిల్లల అనుబంధం మారుతూ వస్తోంది. ఒకప్పటి సమాజంలో నాన్నంటే పిల్లలకు భయం. ఇప్పుడు ఓ మంచి స్నేహితుడు. చాలామంది తండ్రులు పిల్లల అభివృద్ధి కోసం ఎన్నో వ్యయప్రయాసలకు ఓర్చుకుని, ఎన్నో త్యాగాలు చేస్తారు. అలాంటి మంచితండ్రి పాత్రకు ఉదాహరణ... కాళ్లకూరి నారాయణరావు ‘వరవిక్రయం’ నాటకంలోని పుణ్యమూర్తుల పురుషోత్తమరావు పాత్ర. తన కుమార్తెలు కాళింది, కమలల్లో చిన్నతనం నుంచే చక్కటి వ్యక్తిత్వాన్ని వికసింపజేసిన వ్యక్తి ఆయన. అలా తండ్రి సంస్కరణ భావాలు, ఆదర్శాలు పిల్లలకూ అబ్బాయి. కట్నం లేని పెళ్లి చేయాలన్న ఆదర్శం ఆయనది. తండ్రి మనసు తెలుసుకున్న కమల డబ్బిచ్చి తెచ్చుకున్న భర్తకు దాస్యం చేయడం కంటే పెళ్లే చేసుకోకుండా రాట్నం తిప్పుకుంటూ బతకడం మంచిదంటుంది. వెంటనే కాళింది కూడా చెల్లెలి స్ఫూర్తితో కట్నమిచ్చి పెళ్లి చేసుకోనని ప్రతిజ్ఞ చేస్తుంది. పిల్లలు తన ఆదర్శాల బాటలో నడవటానికి ప్రయత్నించడం పురుషోత్తమరావుకు ఆనందాన్నిస్తుంది. కాళింది వరకట్న వివాహాన్ని వ్యతిరేకించలేక ఆత్మార్పణ చేసుకుంటే, కమల అదే సంబంధం చేసుకుని మామ లింగరాజుకు బుద్ధి వచ్చేలా చేస్తుంది. ఉన్నతాశయాలు గల తండ్రి పెంపకంలో పెరిగిన ఆమె వాటిని ఆచరణలో పెట్టి చూపిస్తుంది. పిల్లలకు సంస్కారాన్ని, ఆత్మగౌరవాన్ని, ధీశక్తిని ఇచ్చిన తండ్రిగా పురుషోత్తమరావు ఈ నాటకంలో కనిపిస్తాడు.
      దీనికి భిన్నంగా కనిపించే పాత్ర ‘కన్యాశుల్కం’లోని అగ్నిహోత్రావధాన్లు. కన్యాశుల్కం వివాహాలు జరిగిన కాలంలో తండ్రులకు ఆడపిల్లలంటే డబ్బు సంపాదించే సాధనాలుగా కనిపించేవారు. అలాంటి తండ్రే అగ్నిహోత్రావధాన్లు. తన పెద్ద కూతురు బుచ్చమ్మను కాటికి కాళ్లు చాపుకున్న పండుముసలికి ఇచ్చి పెళ్లి చేస్తాడు. వితంతువై పుట్టిల్లు చేరిన బుచ్చమ్మకు భర్త ఆస్తి కలిసి వస్తుంది. పెద్దకూతురు బతుకు అలా అయిపోయిందన్న పశ్చాత్తాపం కన్నా, ఆస్తి వచ్చిందన్న ఆనందమే ఎక్కువగా ఉంటుంది అగ్నిహోత్రావధాన్లులో. పైగా చిన్న కూతురు సుబ్బమ్మను కూడా వృద్ధుడైన లుబ్ధావధాన్లకిచ్చి చేయాలనుకుంటాడు. కూతుళ్ల భవిష్యత్తుపట్ల మమకారం లేకుండా డబ్బే ప్రధానమని భావించే తండ్రిగా కనిపిస్తాడు అగ్నిహోత్రావధాన్లు.
ఎందుకు పారేస్తాను నాన్నా
కథల విషయానికి వస్తే, ఎంతోమంది రచయితలు తమ కథల్లో నాన్న పాత్రలను విలక్షణంగా చిత్రించారు. వాటిలో  ప్రముఖంగా కనిపించేది, చాసో ‘ఎందుకు పారేస్తాను నాన్నా’ కథ. ఇందులో ప్రధాన పాత్ర పేరు కృష్ణుడు. అతనికి బాగా చదువుకోవాలని కోరిక. తండ్రికేమో స్తోమత లేక బడి మాన్పించేస్తాడు. తోటి పిల్లలు బడికి వెళ్తుంటే, తండ్రి ఆజ్ఞ మేరకు చుట్టలు తెచ్చేందుకు బయలుదేరతాడు కృష్ణుడు. అప్పుడు బడి ముందునుంచి వెళ్తూ తన పరిస్థితికి ఎంతో బాధపడతాడు. చివరికి చుట్టలు తీసుకోకుండానే ఇంటికి వెళ్తాడు. దాంతో తండ్రిలో మార్పు వస్తుంది. తాను చుట్టలు మానుకుని కొడుకును చదివించాలనుకుంటాడు. కొడుకు భవిష్యత్తు కోసం వ్యసనాన్ని వదులుకున్న కృష్ణుడి తండ్రిది ఉదాత్తమైన పాత్ర.
      ఇప్పుడైతే వృద్ధాశ్రమాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి గానీ, ఓ పాతికేళ్ల కింద ఉద్యోగరీత్యా తల్లిదండ్రులు కొడుకులకు దూరంగా ఉన్నా, విశ్రాంత జీవితం పిల్లల దగ్గరే గడిపేవాళ్లు. కొడుకు, కోడలు, మనవలు, మనవరాళ్లతో హాయిగా జీవించేవాళ్లు. కొంతమంది మాత్రం అక్కడ ఇమడలేక, తమ మాటకు విలువలేక, తమను చులకనగా చూస్తుంటే భరించలేనివాళ్లూ ఉండేవాళ్లు. ఇలాంటి జీవితాల మీద కూడా కథలు బాగానే వచ్చాయి. చాగంటి తులసి ‘వడదెబ్బ’ కథ ఆ కోవలోదే. పదవీ విరమణ చేసిన ఓ తండ్రి కొడుకు ఇంటికి వస్తూ, తను ప్రాణప్రదంగా చూసుకునే పాత పడక్కుర్చీనీ తెచ్చుకుంటాడు. ముసలాయనతో పాటు కుర్చీ కూడా కొడుకు కోడళ్లకు ఆటంకంగా తోస్తుంది. ఇక తండ్రికి ఆ ఇంట్లో ఏమీ తోచదు. మనవడికి ట్యూషన్‌ చెబుతానంటే, కోడలు అనవసర విషయాల్లో జోక్యం చేసుకోవద్దంటుంది. అప్పుడా తండ్రి పడే బాధ వర్ణనాతీతం. తను నిప్పులాంటి మనిషి. ఆఫీసులో ఆయనంటే అందరికీ హడల్‌. అలాంటిది ఇప్పుడు తనకు విలువలేదు. ఓరోజు ఆయన ఎండనపడి ఇంటికి వచ్చేసరికి, పడక్కుర్చీ స్థానంలో సోఫా కనిపిస్తుంది. గది అందం చెడిపోతుందని కోడలే తన కుర్చీని వీధి అరుగు మీద పారేయించిందని తెలుసుకుంటాడు. అప్పుడు వెర్రికోపంతో సోఫాని లాగేసి పడక్కుర్చీని తెచ్చి వేసుకుంటాడు. ‘నీ కొంపలో ఉంటే నా కుర్చీ అందమే పోతుంది’ అంటూ ఆయాసపడుతూ ప్రాణాలు వదిలేస్తాడు. వీధిలోవాళ్లు ముసలాయన వడదెబ్బకు చనిపోయాడనుకుంటారు. అలా కొడుకు నీడలో వృద్ధాప్యాన్ని గడుపుదామని వచ్చి నిరాదరణకు గురైన ఓ తండ్రి కథ ఈ ‘వడదెబ్బ’.
విదేశీమోజులో విస్మరణ
ఈ రోజుల్లో అమెరికాకు వెళ్లడం పక్కూరి ప్రయాణమంత సులువైపోయింది. సాంకేతిక పరిజ్ఞానం వల్ల ప్రపంచం కుగ్రామంగా మారింది. ఎంతదూరంలో ఉన్నా అంతర్జాలంలో అనుసంధానమవుతున్నారు. ఈ ఎడబాటు వారిని బాధించడం లేదు. అయితే సాంకేతికత ఇంతగా లేనప్పుడు పిల్లలు విదేశాలకు వెళ్తున్నారంటే తల్లిదండ్రులకు ఏదో వెలితి. అబ్బాయి అమెరికాకు వెళ్లటమంటే అమ్మాయి అత్తవారింటికి వెళ్లటానికి మించిన బరువుగా భావించేవాళ్లు అమ్మానాన్నలు. ఇలాంటి ఇతివృత్తంతో వచ్చిన కథే జీడిగుంట రామచంద్రమూర్తి రాసిన ‘పిచ్చితండ్రి’.
      జగన్మోహనరావు తన ఇద్దరు కొడుకులను బాగా చదివించాడు. పెద్దబ్బాయి ఎంబీబీఎస్‌ అయ్యాక, అమెరికాలో ఎమ్మెస్‌ చేసేందుకు వెళ్తానంటాడు. జగన్మోహనరావుకు ఇష్టం లేకపోయినా అందరి సంతోషం చూసి మిన్నకుండిపోతాడు. కొడుకు విమానం ఎక్కుతుంటే కన్నీటి పర్యంతమైనా, నెమ్మదిగా అలవాటు పడతాడు. ఇంతలో రెండోవాడు కూడా అమెరికా వెళ్తానంటాడు. ఇది చూసిన ఎదురింటాయన ఏ తండ్రికీ ఇలాంటి పరిస్థితి ఎదురు కావద్దనుకుంటాడు. కానీ, తనకూ ఆ స్థితి వస్తుందని ఊహించడు. తన కొడుకు శంకరం విదేశంలో ఉద్యోగానికి వెళ్తున్నప్పుడు విమానాశ్రయానికి వెళ్లలేక, గుడికి వెళ్లి కొడుకు త్వరగా తిరిగి రావాలని ప్రార్థిస్తాడు. విషయం తెలిసిన శంకరం తండ్రితో ఫోన్లో విమానాశ్రయానికి ఎందుకు రాలేదని ప్రశ్నిస్తాడు. తర్వాత ఆయన గుడికి వెళ్లి ఈసారి కొడుకు తిరిగి రావాలని కాకుండా, శంకరమూ నాన్నయ్యాక అతని పిల్లలు విదేశాలకు వెళ్లొద్దని ప్రార్థించటం కథలో కొసమెరుపు.
కూరలో కరివేపాకు కాదు
పిల్లలు జీవితంలో నిలదొక్కుకునేందుకు నిరంతరం శ్రమిస్తాడు నాన్న. తాను ఉద్యోగ జీవితం నుంచి విరమించుకున్నాక పిల్లల దగ్గర శేష జీవితాన్ని ప్రశాంతంగా, సంతోషంగా గడపాలనుకుంటాడు. కొంతమంది నాన్నల విషయంలో ఈ కల నిజమైనా, మరికొంతమంది విషయంలో నిజం కాకపోవచ్చు. అలా నిరాదరణకు గురైన నాన్నల కథలూ వచ్చాయి.
      గోనుగంటి మురళీకృష్ణ ‘ద్వితీయ బాల్యం కథలో ప్రధాన పాత్ర కృష్ణమూర్తి గది వరండాలో ఉంటుంది. కోడలు ఇంటికి తాళం వేసి, మామ గదిలో భోజనం పెట్టి వెళ్లిపోతుంది. కొడుకు అంతకుముందే ఆఫీసుకు వెళ్లిపోతాడు. ఇంటికి వచ్చాక వాళ్ల పనుల్లో వాళ్లు ఉంటారు తప్ప కృష్ణమూర్తితో మాట్లాడరు. మనవడు చింటూకు తాత దగ్గరికి రావాలంటే భయం. ఎందుకంటే కృష్ణమూర్తి ఎదురుగా ఎవరో ఉన్నట్లు ఊహించుకుని, చేతులు తిప్పుతూ తనలో తనే మాట్లాడుకుంటూ ఉంటాడు. చిన్ననాటి విషయాల్ని తలుపుతోనో, కాకులతోనో చెబుతుంటాడు. తండ్రి పరిస్థితి చూసి కొడుకు, కోడలు మానసిక వైద్యుడి దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు డాక్టర్‌ వాళ్లతో, కృష్ణమూర్తి తీవ్రమైన డిప్రెషన్‌లో ఉండి డెలీరియం దశకు వచ్చారు. తీరని కోరికలు, మనోవ్యథ, తనలో తను మాట్లాడుకోవడం ఈ వ్యాధి లక్షణాలు. ఇది తగ్గాలంటే, కుటుంబ సభ్యులంతా కృష్ణమూర్తితో ఆత్మీయంగా మాట్లాడాలని, సెలవు రోజు అందరూ కలిసి ఎక్కడికైనా వెళ్లాలని సూచిస్తాడు. ఇప్పుడు చాలా కుటుంబాల్లో ఉన్న సమస్యే ఇది.
పిల్లల ముందు లక్ష్యాలు
చిన్నతనంలో తమ ఆసక్తులు, అభిరుచులు నెరవేర్చుకోలేకపోయిన తండ్రులు, పిల్లల ద్వారా వాటిని తీర్చుకోవాలనుకోవడం సహజం. పిల్లల ప్రతిభ ద్వారా సమాజంలో పేరు, గుర్తింపు తెచ్చుకోవాలని అనుకోవటమూ సహజమే. కానీ, తమ పిల్లల్లో ఎలాంటి నైపుణ్యాలు ఉన్నాయో గమనించకుండా, బలవంతంగా వారిపై మోయలేని భారాన్ని వేసి, ఒత్తిడిని పెంచటం ఎంతవరకు సమంజసం! విహారి కథ ‘బతకనివ్వండి’ ఇలాంటిదే.
      నిండా ఎనిమిదేళ్లు లేని కూతురు శ్రీలత మీద తండ్రికి కోటి ఆశలు! రికార్డులు సాధించాలి. ఒలింపిక్స్‌లో కీర్తి ప్రతిష్ఠలు తేవాలి. ఈ శ్రీలత దరిదాపుల్లోకి ఏ అమ్మాయీ రాకూడదు. దీనంతటికీ కారణం తన చిన్నతనపు ఆకాంక్షలు. ఇప్పుడవన్నీ కూతురు ద్వారా తీర్చుకోవాలనుకుంటాడు. అందుకని, శ్రీలతకు ఇష్టం లేకున్నా, బలవంతంగా పోటీలకు సిద్ధం చేయిస్తూ ఉంటాడు. ఇది తన ప్రతిష్ఠకు సంబంధించిన అంశం అంటాడు. ఆ అమ్మాయికి జ్వరం వచ్చినా లెక్కచేయడు. భార్య మాటకు విలువనివ్వడు. కానీ, కూతురి బాధ చూడలేక, భర్త ఆఫీసుకి వెళ్లాక మానవ హక్కుల సంఘాన్ని సంప్రదిస్తుంది శ్రీలత తల్లి. కూతుర్ని తీసుకుని తన పుట్టింటికి చేరుతుంది. ఇలాంటి తండ్రులు మన చుట్టూనే ఎంతోమంది ఉన్నారు.
      ఇక ఎం.కె.సుగుణరావు రాసిన ‘నాన్నడైరీ’ అభ్యుదయ భావాలతో నడచిన కథ. తనకు పుట్టబోయేది ఆడబిడ్డని తెలిసి, బంధువులందరూ వద్దంటుంటే ఆ బిడ్డకు విద్యాబుద్ధులు చెప్పించటానికి, ఆ బిడ్డ చక్కని భవిష్యత్తు కోసం తర్వాత సంతానమే వద్దనుకుంటాడా తండ్రి. కడుపులో ఉన్నది ఆడబిడ్డని తెలిసి పాశవికంగా భ్రూణహత్యలకి పాల్పడుతున్న వారికి కనువిప్పు కలిగించే కథ ‘నాన్నడైరీ’. ఇందులో అమ్మాయి అనూరాధ రజస్వల అయినప్పుడు ఆ తండ్రి ‘ఆడపిల్ల జీవితంలో ప్రకృతి సహజంగా వచ్చే మార్పునకు అట్టహాసాలెందుకు’ అంటాడు. బంధువులు, ఇంట్లోవాళ్లు ఘనంగా వేడుక చేద్దామంటే, ఆ ఖర్చు కూతురికి ఉపయోగపడేలా చేద్దామనుకుంటాడు. ఇకనుంచీ ఎంతో జాగ్రత్తగా ఉండాలని కూతురికి హితవు చెబుతాడు. నిజానికి ప్రతి తల్లి, తండ్రీ చేయాల్సిందీ ఇదే.  తననందరూ పిసినారి అంటున్నా పట్టించుకోడా తండ్రి. తన తపనంతా బంగారు తల్లి భవిష్యత్తు కోసమే. నాన్న ఊళ్లో లేనప్పుడు డైరీ చదివి తనపై నాన్నకు గల వాత్సల్యానురాగాలకు చలించిపోతుంది అనూరాధ.
      వై.సి.పి.రెడ్డి ‘పరువు ప్రతిష్ఠలు’, మా గోఖలే ‘ముత్తాయి కూతురు’ కథలు తమ కూతుళ్ల మీద తండ్రులకు గల అపారమైన ప్రేమను వ్యక్తం చేస్తాయి. అక్రమ వ్యాపారాలు, అన్యాయార్జన చేస్తూ పట్టుబడి, జైలుకు వెళ్లబోతూ, కూతురి మాటలతో పరివర్తన చెందిన ఓ తండ్రి కథ ముద్దంశెట్టి హనుమంతరావు రాసిన ‘గెలుపు’. ఆయనదే మరో కథ ‘సద్వినియోగం’ పదవీ విరమణ చేసిన తండ్రి సమయస్ఫూర్తిని విశదపరుస్తుంది. ఎంతో ముందుచూపుతో ముకుందరావు, పదవీ విరమణ సమయంలో వచ్చిన మొత్తాన్ని బ్యాంకులో దాచుకుంటాడు. ఇంటికి వచ్చాక కొడుకు, కోడళ్ల మనోభావాలు, ఆశలు చూసి తను చేసినపని మంచిదే అనుకుంటాడు. 
      పిల్లల పెంపకంలో నాన్న పాత్ర ఎంత కీలకమైందో, అంత క్లిష్టమైంది. పిల్లలను ప్రేమిస్తూ, వాళ్లతో స్నేహంగా మెలుగుతూ, వారికి మితిమీరిన చనువివ్వకుండా, మరీ కట్టడి చేయకుండా, వాళ్ల మనసును తెలుసుకుంటూ, వారి ఎదుగుదలకు దోహదపడాలి. అందుకే పిల్లల దృష్టిలో నాన్నంటే నిజంగా ఓ ‘కథానాయకుడే’!


వెనక్కి ...

మీ అభిప్రాయం